గణేశ పురాణము - ఉపాసనా ఖండము
19 – కమలాపుత్ర వర్ణనం
అప్పుడు భృగుమహర్షి ఆ తరువాతి కథాక్రమాన్ని సోమకాంతుడితో యిలా కొనసాగించాడు.
భృగువు:
“ఓరాజా! బ్రహ్మవద్దనుంచి పై కథావృత్తా౦తాన్ని అంతావిన్న వ్యాసుడు ఇంకాయిలా పరిప్రశ్నచేశాడు.
వ్యాసుడు:
“ఓసృష్టికర్తా! పరమ శుభదాయకములూ, మంగళప్రదములూ ఐన గణేశభగవానుని లీలలను, మాహాత్మ్యమునూ ఎంతవిన్నా తనివి తీరటం లేదు! పాపహరమూ, సకలాభీష్టప్రదమూ ఐన గణేశుని గాధను యింకా వినగోరుతున్నాను“ అన్న కృష్ణద్వైపాయనుడైన వ్యాసమునీంద్రునితో బ్రహ్మ యిలా అన్నాడు.
బ్రహ్మ:
“ఓ వ్యాసమునీంద్రా! దేవతలందరి పూజలను ప్రధముడిగా అందుకునే పరమ శుభాకరములైన వరద వినాయకుడి లీలవిశేషాలను నీ అభీష్టం మేరకు వివరంగా తెలియజేస్తాను శ్రద్ధతో ఆలకించు!
పూర్వం విదర్భదేశాన్ని భీముడు అనేరాజు పరిపాలిస్తూoడేవాడు. అతడు మహాబల పరాక్రమసంపన్నుడు. అనేకమంది రాజులను తన శౌర్యపరాక్రమములచేత వశంచేసుకుని వారిని సామంతులుగా చేసి వారు చెల్లించే కప్పం స్వీకరిస్తూ ‘కౌండిన్య’మనే పేరుగల నగరాన్ని రాజధానిగా చేసుకొని పాలించేవాడు. ఆ రాజుకు బ్రహ్మాండమైన సైన్యం సర్వసన్నద్ధమై ఉండేది. దానధర్మములయందు వితరనకలిగి అడిగినవారికి లేదనకుండా యిచ్చే ఆయనను ఆశ్రయించి అనేకమంది వేదపండితులైన బ్రహ్మణులు జీవించేవారు.
ఆరాజుకు చారుహాసిని అన్న పేరుగల సకల సౌందర్యసద్గుణ శోభితురాలూ, మహాపతివ్రతాయైన భార్యఉండేది. ఏలోటు లేకుండా సకల సంపదలూ అనుభవిస్తూన్న ఆ రాజదంపతులకు రాజ్యభోగాలు ఎన్ని అనుభవిస్తూన్న సంతానయోగం మాత్రం కలుగలేదు. ఆరాజు పుత్రసంతానాన్ని కోరి అనేక పూజలూ, వ్రతాలూ,దానధర్మాలూ ఆచరించినా ఏమాత్రం ఫలితం లేకపోయింది. ఎంతకాలం నిరీక్షించినా తమకు సంతానం కలిగే సూచనలేమీ కనిపించక, దిగులుతో కృశించసాగాడు. చివరకి తన మంత్రులైన మనోరంజనుడు, సుమంతులను పిలిచి వారికి రాజ్యభారాన్ని అప్పగించి, బ్రాహ్మణులయొక్క ఆశీస్సులను తీసుకొని స్వస్తిపుణ్యావచన పూర్వకంగా అనేక దానధర్మాలు నిర్వర్తించి అరణ్యాలకు బైలుదేరాడు. ఒక క్రోసుదూరo వరకూ సకల పరివారమూనూ తన వెంటరానిచ్చి, ఆతర్వాత వారిని వీడ్కొని పత్నీసహితుడై అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అలా చాలాదూరం నడిచాక అక్కడ ఒకచోట పెద్ద సరోవరాన్ని చూశాడు. రమణీయంగాఉన్న ఆ ప్రకృతి సోయగం ఎంతో నాయనానందకరంగా ఆహ్లాదజనకంగా ఉండటమూ, ఆ సరస్సుకు సమీపంలోనే ఒక ఋషియొక్క ఆశ్రమం ఉండటాన్ని చూచాడు. రాజు ఆ ఆశ్రమంలోనికి ప్రవేశించి దర్భాసనంపై ఆసీనుడై శిష్యగణములు వేదాధ్యయనం చేస్తుండగా దివ్యతేజస్సుతో వెలుగొందుతున్న విశ్వామిత్రమహర్షిని దర్శించాడు. భయవినయాలతో ఆ మహర్షి పాదాలకు సాష్టాంగ నమస్కారము ఆచరించి ఆ దంపతులు ఎదుట నిలిచారు. ఆ మహర్షి భూతభవిష్యత్ వర్తమానములు అన్నీ తెలిసిన త్రికాలజ్ఞుడూ సర్వజ్ఞుడై ఉన్నప్పటికీ ఏమీ తెలియనివానిలాగా ఆ రాజునిలా ఆశీర్వదించాడు!
విశ్వామిత్రుడు:
‘శుభమస్తు! సద్గుణసంపన్నుడైన సత్పుత్రుడు నీకు చిరకాలంలో కలుగగలడు! నీవేవరవో నీయొక్క వివరాలను నాకు తెలియజేయి! నీవెక్కడినుండి వస్తున్నావు? నీనివాసమెక్కడ? ఎందుకని ఇలా అరణ్యంలో సంచరిస్తున్నావు? ఈ వివరాలు ముందు నాకు చెప్పు. నీ బాధానివారణకు పాప నాశనమునకు మార్గం తెలుపుతాను!” అంటూ మందహాసం చేశాడు.
అప్పుడు భీముడనే ఆరాజు తన యావద్వృత్తాoతాన్నీ యిలా తెలియచేశాడు.
భీముడు:
“ఓ మునివర్యా! విదర్భదేశంలోని కౌండిన్య నగరానికి ప్రభువునై పరిపాలిస్తున్న నాపేరు భీముడు! ఈమె నాభార్య చారుహాసిని! పుత్రాసంతానం నిమిత్తం ఎన్నిపూజలు వ్రతాలు చేసినా ఆమె కడుపు పండలేదు! పూర్వజన్మలో ఏమిపాపం చేసినందువల్లనో మాయింట పాపాయి పారాడలేదు! ఆచింత మమ్మల్ని ఎంతగానో క్రుంగదీసింది. అందుకని విరక్తులమై రాజ్యాన్ని వీడి అరణ్యాలలో తిరుగుతూ, మీ ఆశ్రమానికి రావటం జరిగింది. మహామహిమాన్వితమైన మహాత్ముల దర్శనం అనంత ఫలప్రదమూ, సద్యఃఫలాన్నిచ్చేదీను! తమ అమోఘ ఆశిస్సులు తప్పక ఫలిస్తాయి! ఐనా, నాపూర్వజన్మ దుష్కర్మ ఎలాంటిది? దానికి పరిహారమేమిటి? కృపాసింధువైన తమరు సర్వజ్ఞులేకాదు --- త్రికాలదర్శికూడా! నాయందు దయవుంచి ఆ వివరాలు, ప్రాయశ్చిత్త విధానమూ తెలియజేసి నన్ను కృతార్థుడిని చేయండి!” అంటూ ప్రాధేయపడ్డాడు.
బ్రహ్మ:
“ఓ వ్యాసమునీoద్రా! ఆ మాటలకు విశ్వామిత్రుడిచ్చిన ప్రతివచనం ఏమిటో శ్రద్ధగా ఆలకించు! అంటూ చతుర్ముఖుడు భీముడనే రాజు యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని విశ్వామిత్రుడు చెప్పినది యావత్తూ వ్యాసమునీoద్రునికి యిలా వివరించసాగాడు.
భీముడనే రాజుయొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని విశ్వామిత్రుడు వివరించటం
విశ్వామిత్రుడిలా చెప్పసాగాడు :
విశ్వామిత్రుడు:
“ఓరాజా! నీవు పూర్వజన్మలో ధనగర్వం, ఐశ్వర్యమదంచేత, తరతరాలుగా మీ వంశంలో కులదేవతగా అర్చించబడుతున్న ఆ గజాననుడి పూజను గర్జించి, నీ కులధర్మమును విడిచివేశావు. మీ పెద్దలుమాత్రం సదాచారులై, వేద శాస్త్రపురాణాలలో చెప్పబడిన ధర్మములన్నీ చక్కగా తెలుసుకొని అనుష్టించినవారే! వారు శ్రద్ధాభక్తులతో ఆ గజాననుణ్ణి నిత్యం ఆరాధించేవారు. అటువంటి వంశపారంపర్యమైన సత్సాంప్రదాయాన్ని వీడటంవల్లనే నీవు ఈజన్మలో సంతాన హీనుడవైనావు.
ఇంకో ముఖ్యవిషయంకూడా చెబుతాను విను! నీకు ఏడుతరాలకు ముందు మీవంశంలో వలభుడనే పేరుగలవాడు రాజుగా ఉండేవాడు. ఆతడు సౌందర్యోపేతుడు, సద్గుణవంతుడు! ధనవంతుడైన ఆతనికి చాలాకాలానికి ఒక శిశువు జన్మించాడు. ఆ పిల్లవాడికి పుట్టుగ్రుడ్డి, మూగ, చెవిటిఅయి శరీరమంతా వ్రణాలతోనూ దుర్గంధభూయిష్టమై ఉండేది. మరుగుజ్జులా ఉన్న ఆ వికృత శిశువునుచూసి ఆతని తల్లియైన కమలయెుక్క దుఃఖానికి అంతే లేకపోయింది!
కమల:
‘ఇటువంటి సకల దోషయుతుడైన తనయుడు ఉండటంకన్నా నిస్సంతుగా వుండటమే శ్రేష్టం! ఈ వికృతుడైనట్టి పిల్లవానివల్ల సంతాపమే కానీ సంతోషమెక్కడది? ఇక ఇటువంటి వికృతరూపుడైన శిశువును లోకులకెలా చూపించగలను? దైవమా! నాకు, ఈతడికి చావైనా రావటం లేదే!’ అంటూ గుండెలవిసిపోయేలా ఏడవసాగింది!
ఆ రోదనను విని సూతికాగృహంవద్దకు పరుగెత్తివచ్చిన ఆమె భర్తయైన మహారాజు ఆమెను యిలా ఓదార్చసాగాడు.
వలభుడు:
‘ఓ దేవీ! నీవు యిలా దుఃఖింపవద్దు! కష్టములైనా, సుఖాలైన ‘కర్మ ననుసరించే సంప్రాప్తిస్తాయి! మనిషియొక్క భవిష్యత్తంతా వాడు గతంలో సముపార్జించుకున్న సుకృత, దుష్కృతాలను అనుసరించే వుంటుంది! కనుక ఓప్రియా! నీవు ఈపిల్లవాడి గురించి దుఃఖించవద్దు. వీడి దుష్కర్మ అనుభవించటం పూర్తవగానే, వీడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు కాగలడు! దుష్కర్మనివారణకై చేయవలసిన దేవతాపూజలు, తీర్థయాత్రలు, చేయవలసిన మంత్రానుష్టానమూ, వాడవలసిన ఔషదాలనూ వాడి మన ప్రయత్నం మన౦ శక్తివంచనలేకుండా – చేద్దాం! కనుక ఓదేవీ! ఈ శిశువుకి ప్రస్తుతం చేయవలసిన పరిచర్యలన్నీ చేయి!” ఇలా భర్తచేత సముదాయించబడిన ఆరాణి దుఃఖాన్ని అణుచుకుని,ఇష్టసఖులతోకూడి ఆ బాలుడికి స్నానాదికాలు చేయించి శుభ్రపరచింది. ఆ రాజుకూడా శిశువు పుట్టినప్పుడు చేయవలసిన జాతకర్మను నిర్వర్తించి, భ్రాహ్మణులందరికీ భూరి దానధర్మాలనిచ్చి పూజించి ఆ భూసురుల ఆశీస్సులను పొందాడు !
Chapter 19 complete
