గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

45 – శివస్య వరదానం

ఈ కథనాన్ని అంతటినీ శ్రద్ధగా వింటున్న సత్యవతీనందనుడు, ఇలా అడిగాడు.

వ్యాసుడు:

“ఓ చతురాననా! సర్వజనుల విఘ్నాల అంధకారాన్ని పారద్రోలే అవిఘ్నకరుడనే సూర్యుడు, ఆ భక్తవత్సలుడు ప్రత్యక్షమై శంభునికి ఏయే వరాలను ప్రసాదించాడు? శివుడేమేం వరాలను అర్థించాడు? ఆ వివరం చెప్పవలిసింది!” అన్న ఈ మాటలకు బ్రహ్మ ఇలా చెప్పసాగాడు.

బ్రహ్మ:

“భక్తవత్సలుడైన గజవదనుడు చెప్పిన అనుగ్రహ వచనాలకు శివుడిలా ప్రత్యుత్తరమిచ్చాడు. ‘ఓ గజాననా! నిన్ను దర్శించడంచేతనే నా పదినేత్రాలూ ధన్యతచెందాయి! పరమ పావనములైన నీ పాదారవిందాలకు ప్రణమిల్లడంతో నా ఐదుశిరస్సులూ ధన్యతచెందాయి. నిన్ను స్తుతించడంచేత నా జిహ్వకూడా ధన్యమైంది!

సమస్త సృష్టీ, అందులోని పంచస్థూలభూతాలూ, సూక్ష్మభూతములూ, గంధర్వ, యక్ష, భూతసంఘాలూ, బ్రహ్మ, ఇంద్ర రుద్రాదులూ వీరితోపాటూ సమస్త చరాచర జగత్త౦తా నీవల్లనే సృష్టించబడుతుంది!

బ్రహ్మగా రజోగుణ ప్రభావంతో సమస్త సృష్టినీ రచిస్తున్నదీ, సత్వగుణం ఉద్దీపించగా, స్థితికర్తగా జగద్రక్షణాభారం వహిస్తున్నదీ, చివరికి అంత్యములో తమఃస్వరూపుడవై రుద్రుని అంశగా యావత్ సృష్టిని లయం చేస్తున్నదీ, ఆద్భుతమైన నీ లీలావిభూతేతప్ప అన్యమేమి కాదు!

వాస్తవానికి నీవు గుణాతీతుడవు! ఎట్టి కోరికలూ లేనివాడవు! సాక్షిస్వరూపుడవై సకల జీవులలోనూ అంతర్యామివై ప్రవర్దిల్లుతావు. సకల మంత్రాలకు ముందుగా నీ స్వరూపమైన ప్రణవమే ఉచ్చరించబడును గాక! ఏ కారణంవల్ల నీవు సకల గణములకూ అధిపతివో, ఆ కారణంచేతనే నీవు గణేశుడవని ప్రసిద్దుడవవుదువుగాక!

ఓ దేవా! ఎవరైతే తమ సకల కార్యముల ఆరంభంలో నిన్ను స్మరిస్తారో వారి సర్వకార్యములూ నిర్విఘ్నమౌనుగాక! ఎట్టివారికైనా నిన్ను స్మరించనిదే కార్యములు సానుకూలం కావు!

ఓ గజాననా! శైవులు, శాక్తేయులు, వైష్ణవులు, సౌరమతస్థులు ఎవరికైనా శుభాశుభాది లౌకిక, వైదిక కర్మారంభాములలో ముందుగా నీవు అర్చించతగినవాడవు!

సకల జీవులకు కలిగే సమస్త శుభాలకూ కూడా నీవే అధిపతివి! మంగళకరుడవు. మంగళస్వరూపుడవు! నీ భక్తులకు సకల మంగళములూ కలుగజేసేవాడవు! ఓ దేవా! అజ్ఞానంతో ముందుగా నిన్ను అర్చించకుండా యుద్ధం చేయబూనడం వల్లనే దైత్యునివద్ద ఘోరంగా పరాజితుణ్ణైనాను!

నీ చరణారవిందాలకు మొక్కనిదే, నిన్ను స్మరించనిదే జయం కలగడమన్నది అసంభవం! అందుచేత అవిధ్యనూ, విఘ్నాంధకారాన్ని పోగొట్టే భాస్కరా! నాయొక్క సమస్త అపరాధాలను క్షమించి నాకు విజయాన్ని అనుగ్రహించు!

నిన్ను విముఖులై తమ కార్యారంభంలో అర్చించి సేవించని వారు జడులై, దరిద్రులౌతారు! ఎవరికైతే నీ చరణాలపట్ల తరగని అనురక్తి ఉంటుందో, వారే సకలకార్య సిద్ధినీ, ఐశ్వర్యాన్నీ కరతలామలకంగా పొందగలరు!

ఈ మాటలకు అత్యంత ప్రసన్నుడైన గజాననుడు శివునితో యిలా అన్నాడు

గణేశుడు:

“ఓ శంకరా! నీవెప్పుడెప్పుడు నన్ను శరణుపొందనిచ్చగిస్తావో అప్పుడప్పుడు నీ ఎదుట ప్రత్యక్షమౌతాను. నీకు నామభీజంతో అభిమంత్రించి యిప్పుడొక బాణాన్ని ప్రసాదిస్తాను!” అంటూ తన సహస్రనామాలనూ ప్రణతుడైన శివునికి ఉపదేశించాడు!

‘దీన్ని యుద్దకాలంలో పఠించడంవల్ల దైత్యులందరినీ అనాయాసంగా వది౦చగలవు! త్రిసంధ్యలలోనూ దీన్ని పఠించడంవల్ల మానవులకు సర్వాభీష్టములూ సిద్ధిస్తాయి.

అన్న గణేశుని అనుగ్రహవచనాలను విన్న శివుడు పరమానందభరితుడైనాడు. అప్పుడు శివుడు ఒక గణేశ మహాప్రసాదాన్ని నిర్మించి సకల దేవతలనూ, మునిసిద్ధ సంఘాలను తన దానధర్మాలతో తృప్తిపరిచాడు. భూసురులైన బ్రాహ్మణులకు అనేక భూరి దానాలనుచేసి తిరిగి వరదగణేశుని పూజించి

శివుడు:

‘ఓ దేవతలారా! ఇది మణిపురమన్న పేరుతో విఖ్యాతి చెందుగాక!’ అంటూ అనుగ్రహవచానాలను పలికి సమస్తదేవతలూ, శంకరుడు కూడా వినాయకునితో అంతర్హితులైనారు.

ఆ తరువాత శంకరుడు కైలాసానికి వెళ్ళి, యక్ష గంధర్వ సమూహాలతో దేవతాoగనల మధ్యనా ఉన్న పార్వతికి ఈ విశేషాలనన్నింటినీ వివరించాడు. అవి విన్న దేవతలు, మునులు, యోగీశ్వరులు, దేవతాoగనలు ఎంతో సంతోషించారు. అందరు శివుని అనుగ్రహంచేత తమ తమ స్వస్థానాలను తిరిగి సంపాదించుకున్నట్లుగా భావించారు!.

Chapter 45 complete