గణేశ పురాణము - ఉపాసనా ఖండము
81 – రామోపాఖ్యానం – 2
రాముడు “జమదగ్ని, రేణుకాదేవి” ల కర్మసంస్కారము చేయుట
బ్రహ్మ:
“ఓ వ్యాసమునీoద్రా! ఆ తరువాత రాముడు తలనీలాలను తీసివైచి, శుద్ధిస్నానంచేసి స్మార్తవిధానం ప్రకారం సంచయనాది కర్మనంతటినీ యధావిధిగా నెరవేర్చి, మంత్రాగ్నిని ప్రజ్వరిల్లజేసి తలిదంద్రులిద్దరికీ విశ్రాంతి శ్రాద్ధమునూ ఆ తరువాతి సంస్కారాలనూ చేసి, ఆ తరువాత దత్తాత్రేయుని సన్నిధికి వెళ్ళాడు. మాయాస్వరూపియైన ఆ దత్తాత్రేయుడు కుత్సితునిలా వేశంధరించి, శిష్యులు తనను కుక్కలై అనుసరించగా కుక్కలమేడలో త్రాటిని వైచి ఆ త్రాళ్ళు చేతిలోపట్టుకొని కృశించిన మాలినరూపిగా దర్శనమిచ్చాడు. ఆ మునీంద్రుని నిజస్వరూపాన్ని తన ధ్యానంద్వారా గ్రహించిన రాముడు నమస్కరించి దోసిలియొగ్గి ఎదుట నిలిచాడు. సర్వజ్ఞుడైనప్పటికీ యోగీశ్వరేశ్వరుడైన ఆ దత్తమూర్తి అతడి మనోభీష్టాన్ని గ్రహించదలిచి. అందుకనే జమదగ్ని సుతునితో యిలా అన్నాడు.
దత్తాత్రేయుడు:
“ఓ రామా! నీ మనోభీష్టము అర్ధమైనది. అయినా నీవేకార్యార్దివై ఇటకు వచ్చావో చెప్పు!” అనగా అప్పుడు ఆ రాముడిలా అన్నాడు.
రాముడు:
“ఓ యోగిరాజా! కృతవీర్యుని కుమారుడైన కార్తవీర్యుడు నేను ఆశ్రమంలో లేని సమయంలో వేటకని వచ్చి మాతండ్రి జమదగ్నిమహర్షి యిచ్చిన ఆతిధ్యాన్ని స్వీకరించి, దురాశాపరుడై, ఆ ఏర్పాట్లు ఒనరించన కామధేనువుని బలాత్కారంగా తోలుకొని పోజూశాడు. దైవబలంగల ఆ ధేనువు ధాటికి అతడి సైన్యమంతా కకావుకలై చెల్లచెదురైపోయింది. ఆ ధేనువు దేవలోకానికి వెళ్ళిపోగా, క్రుద్ధుడై అవమానభారంతో మా తండ్రిపై అకారణవైరం పూని తన తీవ్ర శరాఘాతంతో దాడిచేసి వధించాడు. అది చాలదన్నట్లు మందలించపోయిన అసహాయురాలైన నా మాతృదేవిపైకూడా ఇరవైఒక్క శరాలు గుప్పించాడు! ఆమె నేను తిరిగివచ్చేదాకా కోనఉపిరితో ఉండి ఈ ఆకృత్యాన్ని నాకు వివరించి తమకు అపకర్మలు నిర్వర్తించేందుకు మిమ్మల్ని పురోహితునిగా అభ్యర్ధించమని ఆదేశించి, తన తనువును చాలించింది! ఆ అపరకర్మల నిర్వహణలో మీ సహాయాన్ని అర్ధించడానికై మీ చెంతకు వచ్చాను. ఈ కర్మకు తంత్రంలో మీకు సాటైనవారెవరూ లేరని, ఆ కర్మ ముగించి ఇరవైఒక్కమార్లు క్షత్రియులనెల్లా పరిమార్చి ధరను క్షత్రియులబారినుండి కాపాడమని మాతల్లి ఆదేశo! అందువల్ల ఓ మహాత్మా! నాపై దయుంచి నాతోకూడా దయచేయవలసింది!” అంటూ ప్రార్ధించగా కరుణాళువైన ఆ దత్తమూర్తి అతడిని అనూనయిస్తూ శోకార్తియైన రామునితో యిలాఅన్నాడు.
దత్తాత్రేయ:
“ఓ రామా! కార్తవీర్యుడు క్షత్రియుడెన్నడూ చేయకూడని ఆకృత్యాన్నే చేసి తీరనిపాపం మూటకట్టుకున్నాడు! ఎవరి యింటిలో తృప్తిగా భుజించామో వారితో ఎన్నడూ విరోధం కూడదు! ఒకవేళ ఎవరైనా దుష్టత్వం వహించి అలా చేసినా, తగిన ఫలితం తప్పక అనుభవించి తీరుతాడు! నీవు ఇప్పుడు నీమాతా పితరులిరువురికీ ఊర్ధ్వాదైహికకర్మను యధావిధిగా ఆచరించవలసింది!”
“ఓ వ్యాసమునీంద్రా! ఆ విధంగా కార్తవ్యోన్ముఖుడైన రాముడు దత్తాత్రేయునితోకూడి తన ఆశ్రమానికివచ్చి దత్తాత్రేయుడు చెప్పిన ప్రకారమే సమంత్రకంగా రెండవరోజునుండి మొదలుపెట్టి భక్తిపూర్వకంగా ఉత్తర క్రియలు జరుపసాగాడు.
అలా రెండోరోజున కర్మకాండ పూర్తవగానే తాను కొల్హాపురం వెడతానని చెప్పగానే ఆ రాముడు “ఓ మునీంద్రా! తిరిగి మీరెప్పుడు వస్తారు?’ అని అడిగాడు.
దత్తాత్రేయుడు:
‘ఓ రామా! నీవెప్పుడు ‘ఏహి దత్తాత్రేయా! అని స్మరిస్తావో ఆ క్షణంలోనే నన్ను చూడగలవు!’ ఇలాగ దత్తాత్రేయుడు ప్రతిదినమూ కర్మకలాపాన్ని నిర్వహింపజేస్తూ అశౌచాన్నాము అభోజ్యం కనుక, బిక్షాటన నిమిత్తమై వెళ్ళేవాడు! ఇలా ఒకనాడా దత్తాత్రేయ మునీంద్రుడు కొల్హాపురం వెళ్ళినప్పుడు రాముడు కర్మ చేస్తుండగా అకస్మాత్తుగా ఒకపులి అక్కడికి వచ్చింది! అప్పుడు రాముడు ‘అమ్మో! అమ్మో! ఎక్కడికిపోను’ అంటూ భయంతో అరచాడు. ఆ పిలుపులకు రాముడి తల్లియైన రేణుక అక్కడ ఆవిర్భవించింది. కర్మకాండ యింకా అసంపూర్తిగా కావడంతో ఆ దేహానికి శిరస్సుమాత్రం ఏర్పడలేదు! అలా పన్నెండవరోజున పిలిచివుంటే ఆమె సంపూర్ణ ఆకృతితో వచ్చివుండేది! అప్పుడా రేణుకాదేవి యిలాఅన్నది.
రేణుకాదేవి:
“నాయనా! రామా! నన్నెందుకాహ్వానించావు?” అంటూ తన కుమారుడిని ఆలింగనం చేసుకున్నది. ఆరవరోజున దత్తాత్రేయుడు మరలివచ్చి ‘రామా! మధ్యలో అమెనెందుకు పిలిచావు? అసంపూర్ణదేహంతో వచ్చిందికదా! పిండీకరణ అయినాక పిలిస్తే సంపూర్ణ అవయవాలతో నీయందలి ప్రేమతో వచ్చివుండేది” ఆ మాటలకు జమదగ్నినందనుడు “ఓ మునీంద్రా! బాలభావంచేత పులికి భయపడి “మాతర్మాతః” అని అరచినాను! ఆ వెంటనే ఇట్టి స్వరూపాన్ని చూశాను!” అని బదులిచ్చాడు.
ఆ తరువాత రాముడు పదకొండోరోజున వృషోత్సర్జనంచేసి పన్నెండవరోజున మాతాపితరుల కిరువురికీ సపిండీకరణ శ్రాద్ధమును ఆచరించాడు. ఆ మర్నాడు ప్రాధేయశ్రాద్ధమునూ చేసి బ్రాహ్మణులకు యధార్హముగా అనేక దానధర్మముల నాచరించాడు. అప్పుడు జమదగ్నిమహర్షి దివ్యదేహందాల్చి బ్రహ్మలోకానికి వెళ్ళాడు.
రేణుకాదేవిమాత్రం భూలోకంలోనే అసంపూర్ణదేహంతో తిరుగుతూ భక్తజనుల కోర్కేలనన్నీ తీరుస్తున్నది! “ఓ వ్యాసమునీంద్ర! ఈమె మహాత్మ్యం స్కాందపురణంలో విస్తారంగా వర్ణించబడివున్నది. అందుచేత ఇక్కడ సంక్షేపంగా వివరించాను.” అంటూ దరహాసం చిందించాడు చతురాననుడు.
Chapter 81 complete
