గణేశ పురాణము - ఉపాసనా ఖండము
79 – కార్తవీర్యుడు జమదగ్నిమహర్షిని సంహరించుట
జమదగ్ని:
“ఓ రాజా! నీవో మేకవన్నె పులిలాగా, గోముఖవ్యాఘ్రంలాగా మొదట్లో సాదువువలే, సాధుజనులకు ఉపకారివిలా కనబడి ఇప్పుడు నీ నైజాన్ని వెలిబుచ్చావు! దురాశతో అనవసరమైన బ్రాoతిలో చిక్కుకున్నట్లున్నావు! ఈ పవిత్రమైన కామధేనువు ఎవరికీ పొందశక్యం కానిది! దీనిని అపేక్షించావా ముడులోకాలనూ నాశనమోనర్చినంతటి పాపం నీపై బడుతుందిసుమా!” అంటూ హితోక్తులను చెవినిబెట్టక కోపంతో త్రాచుపాములా బుసలుకొడుతూకార్తవీర్యుడు ఆ మునిని ఉద్దేశించి యిలా అన్నాడు.
కార్తవీర్యుడు:
“ఓయీ దుర్మార్గా! ఇంతవరకూ నేనెవ్వరివీ పరుషవాక్యాలు విని వుండలేదు! ఐనా బ్రాహ్మణుడవన్న గౌరవంతో యింతవరకూ నీ దుర్భాషలను సహించాను!” అంటూ తన కన్నుల్లో నిప్పుకణాలను కురిపించాడు.
“ఓ వ్యాసమునీంద్రా! అప్పుడు ఆ కార్తవీర్యుడు వెంటనే తాను కూర్చున్న ఆసనంపైనుండి దిగ్గునలేచి దూతలతో “మీరు శీఘ్రంగాపోయి ఆ ధేనువును బంధమువిప్పి నావద్దకు తీసుకునిరండి!” అంటూ ఆజ్ఞాపించాడు. ఆ దూతలు రాజుయొక్క అప్రతిహతమైన ఆజ్ఞను పాటించేందుకు ఆ గోవును చుట్టుముట్టారు. ఆ ధేనువు చేసిన ఫూత్కారము మాత్రంచేత అందరూ తమ అసువులను కోల్పోయారు. ఆ తరువాత చుట్టుముట్టిన సకల సైన్యాన్నీ ఆ కామధేనువు తన క్రోధాగ్ని జ్వలలచే భస్మం కావించింది! అది ముక్కుపుటాలగుండా విసరిన శ్వాసవాయువుయొక్క వేగానికే కొందరు ఆకాశంలోకి విసిరివేయబడ్డారు! అది గిట్టలతో రేపినధూళి ఆకాశాన్నంతటినీ అలముకొని చీకట్లు నలుదెసలా కమ్ముకున్నాయి. అప్పుడు భూమికూడా కంపించింది. వృక్షాలన్నీ సుడిగాలికి పెకలించబడ్డాయి! ఆ రాజసైనికులు దాంతో భయభ్రాంతులై నాలుగు దిక్కులకూ పారిపోయారు! ఒకని బల్లెపుపోటుకు ఆగ్రహించిన ఆ ధేనువు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి ఎనుగుపైకి లంఘించే మృగరాజులా, నాగులపైకి దూకే గరుత్మంతుడిలా సైన్యాలపై పడింది! అప్పుడు సైన్యమంతా హాహాకారాలు చేస్తూ చెల్లాచెదురైపోయింది! అప్పుడు వారందిరినీ ఉత్సాహపరుస్తూ
“భయపడకండి! నేనుండగా మీకెట్టి ఆపదా కలుగదు! నా శంఖపుధ్వని చెవులబడటంతోటే సమస్త శత్రువుల గుండెలూ అవిసిపోతాయి! ఇక నా పౌరుషంముందర ఈ ధేనువెంత?” అంటూ మూడులోకాలు పిక్కటిల్లేలా శంఖాన్ని పూరించాడు కార్తవీర్యుడు. ఐనా ఆ ధేనువదేమి లెక్కచేయలేదు!
అప్పుడు ఆ రాజుయొక్క సైనికులు విజృoభించి ఆ ధేనువును కఱ్ఱలతోనూ, లోహపుఆయుధాలతోనూ కొట్టసాగారు! ఒక్కక్కదెబ్బ ఆ ధేనువు శరీరంపై పడినప్పుడల్లా అక్కడక్కడనుంచి సర్వశస్త్రాలనూ ధరించిన భటులు బయల్వెడలి ఈ కార్తవీర్యుని సేనావాహినిని వధించసాగారు! ఆ కామధేనువుయోక్క రోమకూపాలలోంచి శకులు, బర్బరులు బయలుదేరారు! పాదాలలోంచి పటచ్చరులనేవారు ఇంకా నానావిధములైన యవనజాతులూ ఉత్పన్నమైనారు! వీరంతాకూడా కార్తవీర్యుని సేనలపైబడి వారిని చావమోదారు! లెక్కలేనంతమంది సైనికులు ఆ దాడిలో మరణించారు! కొందరు యుద్ధభూమిలో చనిపోయిన వారివలే భయంతో బిగుసుకుని పడుకుంటే, మరికొందరు శస్త్రాలను శస్త్రాలతో నరికి బహాబాహిగా మల్లయుద్ధానికి తలపడ్డారు! ఇలా సంకుల సమరం కొనసాగింది. శస్త్రాస్త్రాలన్నీ గుట్టలుగా నేలపై పెరుకోసాగాయి. ఆ ధూళి ఆకాశానికంటి ఎవరు తమవారో ఎవరు శత్రువులో తెలుసుకోవడం గగనమైంది. ఒకరి నొకరు కనబడ్డవాడినల్లా తెగనరుక్కుంటూ భీతవహంగా పోరాడసాగారు! మృతసైనికుల కళేబరాలకై కాచుకుకూర్చున్న గద్దలకు, రాబందులకు ఈపోరు ఎంతో సంతోషాన్ని కల్గించింది. వీరపత్నులకుమాత్రం భయావహమైంది! లెక్కలేనన్ని రధాలు,సైనికులు నేలకూలారు. ఈవిధంగా చచ్చినవారు యుద్ధంలో సమసిపోగా కొందరు మాత్రం తమకాళ్ళకు బుద్ధిచెప్పి శక్తికొద్దీ పారిపోసాగారు.
‘మన రాజుకేదో పోగాలము దాపురించే అకారణంగా తాపసియైన ఆ మునితో వైరం కొనితెచ్చుకున్నాడు. ముని మనకెలాంటి హానీ చేయలేదు సరికదా చక్కటి ఆతిధ్యంకూడా యిచ్చాడు. మనరాజుయొక్క దురాశ ఫలితమే ఈ ఉపద్రవం!’ అనుకుంటూ బ్రతికుంటే బలసాకు తినవచ్చు అనుకొని సైన్యం చెల్లాచెదురుగా పారిపోయారు.
“ఓ వ్యాసమునీంద్రా! ఈ విధంగా తనసైన్యం యావత్తూ కకావికలవటం చూసిన కార్తవీర్యుడు దిగ్గునలేచి తన ఐదువందల బాణాలనూ ఎక్కుపెట్టి శరజాలములను ఆ ధేనువు సృజించిన సైనికులపై ప్రయోగించాడు. అలా ఎన్నిసార్లు శక్తికొద్దీ బాణవర్షం కురిపించినా ఒక్క గోసైనికుడుకుడూ మరణించలేదు! ఈ రకంగా తన భాణాలన్నీ వృదాగాపోగా అతడు చింతాక్రాంతుడై ‘ఆహా నేడు నాసామర్ధ్యమంతా మొక్కవోయిందే! ఇక నాకేది దారి?’ అంటూ వ్యాకులపడసాగాడు. ఇట్టి వీనితో యుద్ధమెందుకని ధేనువు తన సైన్యంతోసహా దేవలోకానికి తరలిపోయింది.
అలా కామధేనువు స్వర్గలోకానికి వెళ్ళిపోయాక కార్తవీర్యుడు తిరిగి జమదగ్నిముని సన్నిధికివెళ్ళి ఉక్రోషంతో “ఓయీ! కపటబ్రాహ్మణా! నీ హృదయంలో యింతటి కాపట్యముంచుకొని నను మభ్యపెట్టబోయావా? ఎవని హృదయంలో కాపట్యముంటుoదో అతడు బ్రాహ్మణుడు కానేకాడు!” అంటూ ఆ ముని హృదయంలో నాటుకునేలా ఒక వాడిబాణాన్ని ప్రయోగించాడు. దాంతో ఆ ముని వెంటనే మరణించాడు. అప్పుడా జమదగ్ని మునిపత్నియైన రేణుకాదేవి క్రోధంతో ఉడికిపోతూ
రేణుకాదేవి:
“ఓరి దౌర్భాగ్యుడా! అకారణంగా నీవు బ్రహ్మహత్యకు పూనుకున్నవే! నీకీ మహర్షి ఏమి అపకారంచేశాడు?” అంటూ ఆక్రోశించింది. అంటూ ఆ కార్తవీర్యుని యిలా శపించింది
‘ఓరీ దుర్మార్గుడా! నీకే బలమున్నదని గర్వంతో విర్రవీగుతూ అకారణంగా మమ్మల్ని వధిస్తున్నావు. నీకు అనతికాలంలోనే చేటు మూడుతుంది. నీవు నీ సహస్రబాహువులతోనూ నశించే వినాశం వస్తుంది! దీనికెంత మాత్రము సందేహంలేదు! ఇది యదార్ధంగా జరిగి తీరుతుంది!”
ఈ మాటలకు తననెంతో భాదించగా ఆ కార్తవీర్యుడు శేషమైన పరివారంతో, నిరుత్సాహంతో ఏపని చేయటానికి ఉత్సహంలేక తన ఆకృత్యనికి తనను నిందించుకుంటూ తన మందిరానికి చేరుకున్నాడు.
Chapter 79 Complete
