గణేశ పురాణము - ఉపాసనా ఖండము
21 – మంత్రోపదేశ వర్ణనం
శ్రద్ధాళువై ఎంతో ఆసక్తితో కధను ఆలకిస్తున్న భీమునితో విశ్వామిత్ర మహర్షి ఇలా కొనసాగించాడు.
విశ్వామిత్ర:
“ఓ రాజా! ఎప్పుడైతే వరదుడైన వినాయకుని మూర్తి హఠాత్తుగా అంతర్దానమైపోయిందో, బాలకుడైన దక్షునికి ఇక దిక్కుతోచలేదు. ఎంతో బెంగతోనూ, బాధతోనూ విహ్వలుడై దారినపోయే వారందరినీకూడా, చెట్లు చేమలతోసహా ‘వినాయకుడు మీకెక్కడైనా కనిపించాడా? మీకేమైనా ఎదురైనాడా?’ చెప్పమంటూ విలపించసాగాడు. ఆ అఘాతానికి తట్టుకొనలేక మూర్ఛిల్లినాడు. ఇంతలో అతనికి దైవవశాన ఒక అద్భుతమైన స్వప్నం కలిగింది. అందులో ప్రకాశమానమైన సుందరవదనంతో బ్రహ్మవర్చస్సుతో దేదీప్యమానంగా వెలుగొందే ఒక బ్రాహ్మణుడు ఎదుటనిలబడి ‘అభీష్టవరమును నీకు ప్రసాదించాను! నీవు నీకు ప్రత్యక్షమైన గజాననుని ఏయేవరములు అర్ధించదలిచావో అవన్నీ నీకు యిచ్చాను!’ అనిచెప్పి వెళ్లిపోతుండగా ఒక్కఉదుటన మేల్కాంచి, తన ఎదుటగాఉన్న ఒక బ్రాహ్మణుడిని దర్శించి పరమానందభరితుడైనాడు. అతడిని ముద్గలుడు అనే బ్రాహ్మణోత్తముని ఆశ్రమానికి దారి చూపగోరాడు.
ముద్గాలాశ్రమ వర్ణనం
ఆ బ్రహ్మణుని అనుసరించి దక్షుడనే ఆ రాకుమారుడు వెళ్ళగా, ముద్గలుని ఆశ్రమం కనుచూపుమేర దూరంలో కనిపించింది. గజాననుని భక్తుడైన శ్రెశ్రేష్టుడనేవాడూ, అనేక శిష్యులచే ఆశ్రయించబడినవాడూ అన్ని జీవులపట్లా కరుణ ఉట్టిపడుతూ అభయాన్ని ప్రసాదించినవాడూ, వేదవేదాంగములలో దిట్టయై, సర్వశాస్త్రములలో పారీణుడైనవాడూ, యొగంలో అనేక సిద్ధులను తనకు ఆభరణాలుగా ధరించినవాడూ, ఐన ఈ మద్గలమహర్షి ఆశ్రమం ఎలా వున్నదంటె, ఎంతో రమణీయమైన ప్రకృతితో శోభిల్లుతూ, అనేక రకాలైన ఫలపుష్ప వృక్షాలతోనూ, అనేక ఆశ్చర్యకర వస్తువులతోనూ నిండి అది యక్షుల ప్రభువైన కుబేరుని రాజధాని అలకాపురిని మరిపించేదిగానూ, దేవతల రాజైన ఇంద్రుని నందనోద్యానవనాన్ని తలదన్నేదిగానూ, అత్యంత శొభాయమానంగా వెలుగుతున్నది.
ఆ అశ్రమంలో రత్నాలతో పొదగబడిన స్వర్ణవినాయకుడిని అర్చిస్తున్న ముద్గలుణ్ణి దర్శించాడు. ఆ వినాయకమూర్తి నాఉగు హస్తాలనూ మూదు నేత్రాలతో అనేకములైన అలంకారములతో ప్రకాశిస్తున్నది. అటువంటి దివ్యమంగళమైన వినాయకుని అమూర్త్ని అత్యంత శ్రద్ధాభక్తులతో షోడశ ఉపచారములతోనూ ఆ ముద్గలమహర్షి అర్చించసాగాడు.
అలా దేవతార్చన్లో మగ్నుడైన ముద్గలుడి సన్నిధికి వెళ్ళి భక్తి ప్రపత్తులతో సాష్టాంగనమస్కారంచేసి, అందువల్ల కలిగిన భావోద్వేగానికి ఆనందభాష్పాలను వర్షిస్తూ వినమ్రుడై నిల్చున్నాడు! అప్పుదు జరిగిన వ్రుత్తాంతాన్ని విశ్వామిత్రుడిలా కొనసాగించాడు. అప్పుడు గణేశుని పరమ భక్తాగ్రగణ్యుడైన ముద్గలుడు ఆ దక్షుడిని అప్యాయంగా లేవనెత్తి,
ముద్గలుడు:
"నాయనా! నీవెవరు? ఏకారణం చేత ఇక్కడికి వచ్చావు? నీ దుఃఖానికిగల కారణమేమిటి? నీ దుఃఖాన్నీ, భయాన్నీ నివారిస్తాను ఆందోళనను వీడి నీయొక్క యావద్వ్రుత్తాంత్తాన్నీ నాకు వివరించు!" అన్నాడు
అప్పుడు ఆ మాద్గుల మహర్షి మాటలచేత ధైర్యం పొందినవాడై, ప్రశాంతచిత్తంతో కమలాసుతుడైన దక్షుడిలా బదులిచ్చాడు.
దక్షుడు:
"ఓ మహాత్మా! కర్ణాటకదేశంలోని భానునగారానికి రాజైన వల్లభుడు నాకు తండ్రి! కమల అన్న పేరుగల ఈ మహారణి నన్ను కన్నతల్లి. దైవవశాన నాకు పుట్టుకతోనే అనేక వైకల్యాలు, దుర్గంధభూయిష్టమై చీమూ నెత్తురూ స్రవించే శరీరమూ ప్రాప్తించాయి. ఐనా నాకు తగినె స్వస్థత చేకూర్చాలన్న సంకల్పంతో నా తండ్రి ఒక పుష్కరకాలం (పన్నెండు సంవత్సరాలు) కఠిన నియమాలతో ఘోరమైన తపస్సు ఆచరించినా ప్రయోజనం లేకపోయింది. దానితో నా తండ్రి ఆగ్రహోదగ్రుడై నన్ను, నా తల్లిని రాజాంతఃపురమునుండి వెడలగొట్టాడు!
తీరని దుఃఖంతో నాతల్లి నన్ను వెంటబెట్టుకుని గ్రామగ్రామాలలో భిక్షచేసి అలా సంపాదించుకున్న ఆహారం నా పోషణకై వినియోగిస్తూ, ఎంతో దైన్యస్థితిలో కాలం వెళ్ళబుచ్చుతూ కౌండిన్యపురం చేరుకున్నది. ఆ ఊరిలో మేమిరువురమూ భిక్షాటనం చేస్తుండగా పూర్వ పుణ్యవశాన గ్రుడ్డివాడికి దృష్టి లభించినట్లు మాకు మీ దర్శనభాగ్యం కలిగింది! నీ శరీరం మీదనుండి వీచిన గాలి నన్ను సోకగానే నాకుగల వైకల్యాలు, శరీరబాధ మటుమాయమైపోయాయి!
శిలారూపిణి అయిన అహల్యామాతకు రఘురాముని చరణధూళి శాపవిముక్తిని ప్రసాదించినట్లు, మీ అనుగ్రహ విశేషంచేతనే – ఈ విధంగా దివ్యసుందరమైన దేహం నాకు సంప్రాప్తించింది! ఈ వృత్తాంతాన్నంతా నాకు నా తల్లి చెప్పటం వలననే తెలుసుకున్నాను.
ఏ మహనీయుని శరీరముపైనుండి వీచిన వాయుస్పర్స మాత్రం చేత నా అనారోగ్యములన్నీ మటుమాయమైనాయో, అట్టి సత్పురుషుని దర్శించుకుని జీవితం సార్ధకం చేసుకోవాలన్న సంకల్పం కలిగి, తిరిగి మీకై అన్వేషిస్తుండగా హఠాత్తుగా గజాననుని సాక్షాత్కారం లభించింది. ఆ దివ్యమంగళమూర్తిని దర్శించుకున్న నాతల్లి కమల తన మనోభీష్టాలనన్నింటినీ పొందింది! ఆ గజాననుడు తానివ్వగల్గినా ఆ వరాలను తన అనుగ్రహ స్వరూపులై, నిజానుగ్రహాన్ని సంప్రాప్తించుకున్న మీ నుంచి పొందమని ఆజ్ఞయిచ్చి అంతర్ధానం చెందాడు. దాంతో మిమ్మల్ని వెతుక్కుంటూ ఇలా మీ ఆశ్రమం చేరుకున్నాను!” అంటూ తన కధను ముద్గాలునితో వివరంగా తెలియచేసాడు.
అలా వివరించిన పై గజానన సాక్షాత్కారంతోపాటూ ద్విజరూపంలో ప్రత్యక్షమైనదీ, ఆ తరువాత మరలా గజవదనుడై సాక్షాత్కరించి తానే ఆ రెండు రూపాలలో దర్శనమిచ్చినట్లు నిరూపించిందీ వివరించి ముద్గలునివల్లనే తన సకలాభీష్టములూ నేరవేరగలవని చేసిన గణేశుని దివ్య ఆదేశాన్ని తెలిపాడు.
గజాననుని అంతర్దానంతో ఎంతో వ్యధకు లోనైనాననీ, ఆ వివశతలో స్పృహను కోల్పోయానని – వరం కోరుకోమన్న ఆ దివ్య దేశాన్నే మననం చేసుకుంటూ ముద్గలుని ఆశ్రమానికి చేరుకున్నాననీ తెలియజేశాడు. ఇంకా ఆ దక్షుడు యిలాఅన్నాడు :
దక్షుడు:
“ఓ మహాత్మా! మద్గల మహర్షి! పరిపూర్ణ గణేశశానుగ్రహానికి పాత్రుడవైన నీవే సాక్షాత్తు గజాననుడవు. ఈ భగావానుని అనుగ్రహవిశేషంచేత నాకు సర్వమూ గణేశమయమై కనిపిస్తున్నది.!”
ఈ వృత్తాంతాన్నంతటిని సోమకాంత మహారాజుకు వినిపిస్తున్న భృగుమహర్షి ఇలా అన్నాడు.
భృగు:
భక్తిపూరితాలైన దక్షుని యొక్క వచనాలను విని మద్గలమహర్షి యిలా అన్నాడు:
మద్గల మహర్షి:
“నాయనా! నీవు ఎంతో అదృష్టశాలివి! నీకుగల అనన్యభక్తి వల్లనే – నీకు పైరీతిలో గజాననుగ్రహం సంప్రాప్తించింది. ఆ దేవదేవుడు కేవలం నిర్మలమైన భక్తిచేతనే ప్రసన్నుడౌతాడు. అంతేగాని, డాంబికంగా, ప్రదర్శనాత్మకంగా ఎంతకాలం తపస్సుచేసినా నిష్ఫలమౌతుంది. భగవద్దర్శనానికై తీరని ఆర్తీ, తపనా కలిగినప్పుడు, వీటికి భాగావదనుగ్రహమో తోడైనప్పుడే భగవద్దర్శనం సంప్రాప్తిస్తుంది. ఆ కరుణాలవాలుడు మూడు లోకాలకు భర్త! త్రిగుణాలకు అధిష్టాత! త్రిమూర్తులకు వారివారి ఉపాడులను తానె కల్పిస్తున్నాడు! పంచభూతములకు, పంచతన్మాత్రలకూ, ఇంద్రియ మనోబుద్దులకన్నా, అతడు అతీతుడైనవాడు. ఆయనను దేవతాగణములుకానీ, గంధర్వాదులు కానీ చిరకాలం తపస్సు చేసిన ఋషులుగాని వేదములుగాని కనుగోనలేవు! అటువంటి దేవతలకే దేవుడైన గజాననుడిని సాక్షాత్కారం పొందిన నీవు చాలా ధన్యుడివి! నీ వంటి భక్తుడు నాకు పరిచయమవటం నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది!” అంటూ ముద్గలుడు ఆ దక్షునికి నమస్కరించి ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకున్నాడు. ఆతరువాత మద్గలమహర్షి గజాననుని ఏకాక్షర మహామంత్రాన్ని సాంగోపాంగంగా దక్షునికి ఉపదేశించి ఇలా అన్నాడు.
‘ఓ రాజకుమారా! ఈ మంత్రాన్ని ప్రతీదినమూ క్రమం తప్పక నియమంగా జపించు! నీ సకలాభీష్టాలు ఆ గణేశానుగ్రహంచేత సిద్ధిస్తాయి! ఈ గణేశుని భక్తిచేత ఇంద్రాది దిక్పాలకులు సైతం వశ్యులై వుంటారు! అనన్య మనస్సుతో ఆ పరాత్పరుని ధ్యానిస్తే – ఇహంలో సకల సంపదలూ చిరకాలం అనుభవించి అంతములో మోక్షపదాన్ని పొందుతావు!” అంటూ దీవించాడు.
Chapter 21 complete
