గణేశ పురాణము - ఉపాసనా ఖండము
25 – నూతన రాజ నిర్ణయం
విశ్వామిత్రుడు:
అనంతరం విశ్వామిత్రమహర్షి యిలా అన్నాడు: ‘ఓరాజా! ఈ విధంగా దక్షుడు తన స్వప్న వృతాంతాన్ని తన తల్లికి తెలిపి, ఆమె ఆశిస్సులు పొందిన తర్వాత దైవవశాన ఒక అద్భుతం జరిగింది. కౌండిన్య నగరాన్ని పాలిస్తున్న చంద్రసేనుడనే రాజు స్వర్గస్తుడైనాడు. ఆ రాజు యొక్క వియోగాన్ని సైపలేని ప్రజలంతా ఎంతో విలపించారు. ప్రజారంజకుడైన పాలకుడవటంచేత చంద్రసేనుడు అపారమైన ప్రజాభిమానాన్ని చూరగొన్నాడు – ప్రజల్ని కన్నబిడ్డలకన్నా మిన్నగా పాలించటంవల్ల ప్రజలకు రాజు స్వర్గస్థుదవటం తీరని లోటైంది. తండ్రిని కోల్పోయిన పిల్లల్లా దిక్కులేని వారయ్యారు.
తలలు బాదుకొనుచూ, గుండెలవిసేలా రోదిస్తూ ప్రజలందరూ రాజభవనానికి వచ్చి రాజు యొక్క పార్ధివ దేహానికి గౌరవ పురస్సరంగా తలలు వంచి నమస్కరించారు. ఇక రాణియైన సులభ యొక్క మనః స్థితి వర్ణనాతీతం! గుండెలు నెట్టి మొత్తుకుంటూ అతిదీనంగా రోదించసాగింది. తన ఆభరణాలనూ, అలంకరణాలణూ అటూ, ఇటూ విసరవేసి దుఃఖభారము అతశయమవగా మూర్చిల్లింది! కొందరు పరిచారకులు లేవనెత్తి పట్టుకొనగా ‘ఓనాధా! ఓనాధా!’ అంటూ ఎడవసాగింది.
అంత క్రూరంగా నొసటి వ్రాత వ్రాసినందుకు బ్రహ్మదేవుని నిందిస్తూ ఒంటరిగా వీడిపోయినందుకు తన పతిదేవుని తప్పుబట్టి దుఃఖాతిశయంతో వివశురాలైంది. అప్పుడు చంద్రసేనుడి మంత్రులైన సుమంత్రుడు, మనోరంజనుడు అక్కడికివచ్చి ‘రాజులేని రాజ్యగతి ఏమవుతుందా?’ అని ఆందోళన చెందసాగారు - ఇలా అందరూ నిశ్చేష్టులయి బాధా సర్పద్రష్టులై ఉండగా దైవవశాన అక్కడికి ఓ యతీశ్వరుడు వచ్చాడు. సకలశాస్త్రపారంగతుడూ, బ్రహ్మవర్చస్సుతో ప్రకాశిస్తున్నవాడైన ఈ బ్రాహ్మణుడు ఇలా కర్తవ్యబోధ చేశాడు.
‘ఓ ప్రజలారా! మీ స్వార్ధచింతనను కాసేపు వదిలి ప్రభువుకు శ్రేయస్సును కల్గించే మార్గం ఆలోచించండి. ఇంతకాలం మీ బాగోగులన్నీ తనవిగా భావించి మీ అందరి శ్రేయస్సుకై అహరహము కృషిచేసిన మీ రాజుకు మీరు కృతజ్ఞతచూపే ఆఖరి అవకాశం యిది. ఎందుకంటే మృతుడైన ప్రేత తన చుట్టూ చేరి రోదిస్తున్న స్నేహితుల, బంధుజనుల కన్నీళ్లనే ఆహారంగా స్వీకరిస్తాడు. అప్పుడు అతను విడిచిన పాంచభౌతిక దేహం భూమికి బరువవుతుంది! ఈ భూ ప్రపంచంలో ఎక్కడైనా శరీరంలో ప్రాణాలున్నంతవరకే జీవుడికి అనుబంధాలుంటాయి. ఆ తరువాత ఆ జీవుని వెంట ఎవరూ అనుసరించలేరు. అతని సుకృతదుష్క్రుతాలుమాత్రమే అతని వెంటవెడతాయి. ఆ రాణి కూడా తాను అనాధ యైనందుకు దుఃఖిస్తున్నదే తప్ప, రాజును అనుసరించగోరికాదు! మీరంతా మీ మీ స్వంతపనులు నెరవేర్చుకొనటంలోనే సమర్ధులు. ఇదివరలో ఈ భూమండలాన్ని అనేకమంది ప్రభువులు రాజ్యాలేలారు! సూర్య చంద్రవంశపు రాజులెందరో తమ కాలం చెల్లిపోగానే దివంగతులు అయ్యారు కదా!
కనుక ఇకనైనా మీ రోదనలను ఆపి, పుత్రహీనుడైన ఈ రాజుకు శ్రేయస్సుకై, ఆత్మశాంతికై అంతిమ సంస్కారాలకు ఏర్పాటుచేయండి! మృతిని అంతిమసంస్కారం చక్కగా నెరవేర్చినవాడే నిజమైన ఆప్తుడు. ఇటువంటి అపరకర్మలు నిర్వర్తించటానికే శాస్త్రాలు పుత్రుని ఆవశ్యకతను నిర్దేశించాయి! పుత్రహీనుడైన ఈ రాజు యొక్క అంత్యక్రియలు జరపటానికి ఔరసపుత్రునిగాని, పుత్రా సమానుడైన యితరునిగాని తీసుకొని వచ్చి, తరువాత జరగవలసిన కార్యక్రమాలను జరిపించండి! మీరందరూ తిలంజలులు యిచ్చి అతనికి తుది వీడ్కోలివ్వండి!’ అంటూ ఆ యతీశ్వరుడు వారందిరినీ కర్తవ్యోన్ముఖులను చేసాడు.
“ఓ భీమరాజా! అలా పేరేపించబడిన పురజనులు సుమంతుడనే మంత్రిపుంగవుణ్ణి సంస్కార క్రియలకై నియోగించారు. అతడు అంత్యక్రియలన్నిటినీ యధావిధిగా నిర్వహించాడు. ప్రజలంతా తిలాంజలి సమర్పించి, పట్టణానికి మరలారు. శివుని దర్శనం చేసుకుని ఎవరి యిళ్ళకు వారు చేరుకున్నారు. పదమూడవ రోజు రానికి నూతన వస్త్రముల నిచ్చి, ప్రీతితో సుఖభోజనాలు చేసారు. ఇలా కొంతకాలం గడిచాక రాణి, మంత్రులు, పురజనులు రాజ్యపరిపాలనను ఎవరికీ అప్పగించాలా? అన్న సందిగ్ధంలో పడి, ఆలోచించసాగారు. ఆ సమయంలో అక్కడికి యాదృచ్చికంగా ముద్గల మహాముని విచ్చేశాడు. వారి సమస్యకి ఒక పరిష్కారాన్ని సూచించాడు.
ముద్గలుడు:
‘ ఓ జనులారా! గహనమనే పేరుగల రాజుగారి పట్టపుటేనుగు కమలాల మాలను తొండంతో ఎవరిమేడలో వేస్తుందో అతడినే ప్రభువుగా ఎన్నుకుంటే బాగుంటుంది’ అనగానే ప్రజలంతా సంతోషంతో ‘బాగు బాగు’ అంటూ హర్షధ్వానాలు చేశారు.
Chapter 25 Complete
