గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

9 – రాజోపదేశ కథనం

ఆ తరువాత కథను సూతమహర్షి యిలా చెబుతున్నారు :

సూతుడు:

“ఓ ఋషివర్యులారా! అప్పుడు భృగుమహర్షి క్షణకాలం ధ్యానస్థితుడై ఆ సోమకాంతమహారాజుయొక్క పూర్వజన్మ కర్మయొక్క తీవ్రతను గ్రహించి విహ్వలుడై ఆరాజుతో ఇలా అన్నాడు”

భృగువు:

“ఓ రాజా! నీ పాపంయొక్క బరువు ఎంతటిదంటే అది – నేనే పరిహారోపాయం చెప్పబూనినా దాన్ని మించిపోయేలా వుంది! ఐనా అనుగ్రహంవల్ల నీయొక్క సమస్త పాపములనూ నశింపచేసేటటువంటి ఒక ఉపాయం చెబుతాను. నీవు వీలైనంత వెంటనే పరమ పావనమైన ‘గణేశపురాణము’ను విన్నట్లైతే – తక్షణమే నీవీ దుఃఖసముద్రము నుంచి విముక్తుడివవుతావు! దీనికేమాత్రం సందేహం లేదు” అంటూ శ్రీగణేశుని అష్టోత్తరశతనామాలతో తన కమండలంలోని జలాన్ని అభిమంత్రించి సోమకాంతమహారాజుపై చల్లాడు! అలా ఆ పుణ్యజలాలు అతనిమీద పడీపడగానే ఆరాజు ముక్కురంధ్రాలనుంచి ఒక నల్లటి కాలమేఘంవంటి శరీరంగల పాపపురుషుడు భూమ్మీదపడి వెంటనే పెరుగసాగాడు!

పాప పురుష చరిత్ర

సూతుడు:

“ఓ ఋషులారా! ఆ పాప పురుషుడు ఏడుతాడిచేట్లంత ఎత్తు గలిగి నల్లటి దేహకాంతితో, భయంకరమైన కోరలుగల తన నోటిని వికృతంగా తెరచి ఎఱ్ఱని ముఖంతో పెద్ద చేతులతో, జడలు ధరించి భయంకర రూపుడై నోటిలోనుంచి అగ్నిజ్వాలలను వెడలక్రక్కుతూ, ఒక్కో క్షణంలో చీము, రక్తములను గ్రక్కుచూ, చూసేవాళ్ళకు కళ్ళు మిరుమిట్లుగొలిపేలా గాఢంధాకారమావహించిందా అన్నంత నల్లగావున్న ఆ పాపపురుషుని రూపం చూసిన ఆశ్రమ పరిసరవాసులంతా భయభ్రాంతులై పారిపోయారు! దిక్కులు మారుమ్రోగేటట్లుగా గర్జిస్తున్న ఆ వికృతుడైన రాక్షసుడిని చూసి భృగుమహర్షి ఆ సోమకా౦తుని సమక్షంలోనే ‘ఓరీ! నీవెవడవు? నీపేరేమి?’ అంటూ ప్రశ్నించాడు.

అప్పుడు ఆ పాపపురుషుడిలా బదులు పలికాడు :

‘భృగు పాపపురుష సంవాదం’

పాపపురుషుడు:

‘ఓ ఋషివర్యా! ఈరాజుయొక్క సూక్ష్మశరీరంలో నివసిస్తున్న పాపపురుషున్ని నేను! నీవు మంత్రోదకం చల్లటంవల్ల ఈరాజుయొక్క శరీరంలో ఉండలేక బయటకు వచ్చాను! బాగా ఆకలిగొని వున్నాను! నాకు తగిన ఆహారం వెంటనే చూపించు! లేకపోతే లోకాలన్నింటినీ మ్రింగివేస్తాను. వీని శరీరం విడిచిన నాకు తగిన నివాసం కూడా చూపించు!’

అప్పుడు ఆ భృగుమహర్షి తన ఆశ్రమంనుండి వెలుపలికి వచ్చి, ఎదుటగా జీర్ణమై శుష్కించివున్న ఒక మామిడిచెట్టును చూపించి

భృగువు:

‘ఓరీ! నీవీ చెట్టుతొఱ్ఱలో ఉండు! రాలిన ఎండుటాకులనే ఆహారంగా తీసుకో! అలచేయని పక్షంలో నిన్నీక్షణాన్నే భస్మంచేస్తాను! ఇదినిజం!’ అని ఆజ్ఞాపించాడు.

సూతులవారిలా చెప్పసాగారు :

సూతుడు:

‘ఓ ఋషులారా! అప్పుడు ఋషి ఆజ్ఞమేరకు ఆ పాపపురుషుడు ఆ శుష్కించిన మామిడిచెట్టును సమీపించి దాన్ని తాకగానే అతని స్పర్శమాత్రంచేతనే అది కాలి బూడిదైంది. ఋషియొక్క ఆగ్రహానికి వెఱచి అతడా భాస్మంలోనే లీనమై దాగిఉన్నాడు. అప్పుడా భృగుమహర్షి ఆ సోమకాంతమహారాజుతో యిలా అన్నాడు.

భృగువు:

“ఓ రాజా! పురాణశ్రవణం వలన నీకు కలిగే పుణ్యాన్ని అనుసరించి ఈ మాడిమసైన మామిడివృక్షం తిరిగి ఎంతలో చిగురిస్తుందో అలాంటి పుణ్యాన్ని సంపాదించు. ఈ భస్మంలోనే నీ పుణ్యంతో ఈ వృక్షం పెరిగి దినదినాభివృద్ది చెందుతుంది. తిరిగి ఈ చెట్టు మొలకెత్తగానే నీవు పాపరహితుడవు అవుతావు!’ అని ఋషి చెప్పగా విని ఆ రాజిలా ప్రశ్నించాడు!

సోమకాంతుడు:

‘ఓ మహాత్మా! భృగుమహర్షీ! ఈ గణేశపురాణమనే గ్రంధాన్ని గురించి ఎన్నడూ కనీవినీ కూడా వుండలేదు! అటువంటి మహా మహిమోపేతమైన ఈ పురాణం నాకెక్కడ లభిస్తుంది? దాన్ని నాకెవరు వ్యాఖ్యానించి చెబుతారు? దయతో సెలవివ్వండి!’ అంటూ శ్రద్ధాళువై ప్రార్థించాడు. అప్పుడు ఆ భృగుమహర్షి యిలా బదులిచ్చాడు!

భృగువు:

‘ఓ రాజా! ఈ పరమ పవిత్రమైన పురాణాన్ని పూర్వం చతురాననుడైన బ్రహ్మ వ్యాసమునీ౦ద్రునికి చెప్పాడు! వ్యాసులవారు నాకు చెప్పారు. దాన్ని నీకు నేను చెబుతాను. గనక నీవీ పుణ్యతీర్థములో స్నానంచేసి ఈ రోజు నుంచి పరిసమాప్తివరకూ ఆ గణేశపురాణాన్ని శ్రద్ధగా వింటానని సంకల్పంచేసుకో!’ అని నియమించాడు.

అప్పుడు తరువాతి కథను సూతులవారిలా చెప్పసాగారు :

సూతుడు:

‘ఓ మహర్షులారా! అలా భృగుమహర్షిచేత ప్రేరేపించబడిన సోమకాంతమహారాజు పరమ పవిత్రమైన ఆ భృగుతీర్థంలో స్నానంచేసి పరిపూర్ణ శ్రద్ధాభక్తులతో ‘గణేశపురాణం శ్రోష్యే’ (ఈరోజు మొదలు గణేశపురాణమును వినగలను) అంటూ సంకల్పమాచరించాడు. అలా సంకల్పం చేసీచేయగానే రాజు రోగరహితుడై తన పూర్వపు దివ్యమైన శరీరకాంతితో ప్రకాశించాడు. అలా భృగుమహర్షియొక్క అనుగ్రహ విశేషంచేత రోగభూయిష్టమైన తన శరీరంనుండి రక్తస్రావము, క్రిములతో కూడినగాయాలు, పుండ్లు అన్నీపోయి దివ్యదేహం గలవడైనాడు. అప్పుడు ఆ మహర్షి సంతోషంతో మందహాసంచేస్తున్న సోమకాంతుడిని తన చెంతనే ఒక ఆసనంపై కూర్చుండ పెట్టుకున్నాడు.

అప్పుడు ఆరాజు స్వస్థచిత్తుడై యిలా అన్నాడు.

సోమకాంతుడు:

“ఓ ఋషిసత్తమా! తమయొక్క దివ్యమైన అనుగ్రహ ప్రభావంచేత నా శరీరంలోని బాధలన్నీ కూడా “శ్రోష్యే” అని సంకల్పంచేసిన వెంటనే నశించినాయి. కనక తాము దయతో ఇక ఆ గణేశపురాణమును నాకు వినిపించి ధన్యుణ్ణి చేయండి!”

ఆ మాటలకూ భృగుమహర్షి యిలా బదులుచెప్పాడు :

భృగువు:

“ఓ రాజా! అత్యంత పావనమైన, పవిత్రమైన, అట్టి గణేశ పురాణమును నీకు వినిపిస్తాను. శ్రద్ధాళువువై ఏకాగ్రచిత్తంతో విని తరించు! దీనిని వినటం అన్నది అంతతేలికగా సంభవించే విషయం కాదు! అనేక జన్మలలో సముపార్జించుకున్న పుణ్యరాశి వల్లనే జరుగుతుంది! ఈ మహాత్తరమైన పురాణాన్ని వినటంచేత మానవుడికి తాను గత ఏడుజన్మలుగా ఆర్జించుకున్న మహాపాపములన్నీ కూడా ఆ గజాననుని అనుగ్రహవిశేషం చేత సమూలంగా నశిస్తాయి. సూర్యోదయమవగానే రాత్రి తాలూకు చీకటి తొలగిపోయినట్లుగా ఆ గజాననుని అనుగ్రహకిరణాలు ప్రసరించగానే జీవుల పాపాలచీకట్లు ఇట్టే తొలగుతాయి.

ఇక ఈ గజాననుడెట్టివాడ౦టే – నాశనం లేనటువంటివాడూ, విభజించబడనివాడూ (అపరిచ్ఛిన్నుడు), గుణములకు అతీతుడూ, నిరాకారుడూ, వాక్కులచేత మనస్సుచేత అందుకోలేనటువంటివాడూ, ఇటివంటివాడని నిర్దేశించడానికి శక్యంకానివాడూ, ఆనందమే స్వరూపమైనటువంటివాడూ అయినటువంటి ఈతని స్వరూపాన్ని బ్రహ్మ ఈశ్వరుడు మొదలైన దేవతలు సైతం తెలుసుకొనలేరు! అంతెందుకు? వేయినాల్కలుగల ఆదిశేషునికే ఈ మహామహిమోపేతుని మహిమలు వర్ణించడం అసాధ్యమంటే ఇక మామూలువారి సంగతి వేరే చెప్పేదేముంది?

అటువంటి ఈ గణేశుని పుణ్యచరిత్రను పూర్వం వ్యాసభగవానుని ముఖకమలంనుంచి మధువుగా నేను గ్రోలాను! తన యజ్ఞం రుద్రుని అనుచరులైన వీరభద్రునిచేత విధ్వంసమైనపుడు వికల మనస్కుడైన దక్షప్రజాపతి ముద్గాలమహర్షివద్ద విన్నాడు! అటువంటి మహామహిమాన్వితమైన గణేశపురాణమంతటినీ నీకు వినిపిస్తాను! అయితే ఇది వినటానికి శ్రోతలకు ఒక అర్హత ఉండాలి! అదేమిటంటే సర్వసిద్ధులనూ ప్రసాదించి విఘ్నాంధకారాన్ని పారద్రోలే ఆ గాజాననుడియండు దృఢమైన భక్తిభావం ఉండాలి!

ఈ పురాణాన్ని తన అష్టాదశ ఉపపురాణాలలో ప్రధానమైనదిగా, చెప్పవచ్చు! కలియుగంలోని ఆచారరహితులు, అధ్యయన శూన్యులు అయిన, వర్ణాశ్రమ ధర్మాలను సరిగ్గా అనుష్టించని వారికై – ధర్మరక్షణకై అష్టాదశ పురాణాలు, అష్టాదశ ఉపపురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి విరచించారు. ఈయొక్క ఉపపురాణము గణేశునియొక్క స్వరూపాన్నీ, ఆయన అనుగ్రహ విశేషాన్నీ, లీలలనూ తెలిపేది. కనుక నీవు దీన్ని అచంచలమైన మనస్సుతో విని నీ మనోభిష్టాన్నీ, ఆయురారోగ్యాలను ఆ గజాననుని కరుణావిశేషంతో పొందు!” అన్నాడు భృగుమహర్షి!

Chapter 9 complete