గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

69 – సంకష్ట చతుర్థీవ్రతము

శూరసేనుడు:

“బ్రహ్మదేవునిచేత కృతవీర్యునకు సర్వసిద్ధులూ అనుగ్రహించగల ఏ సంకష్టచతుర్థీవ్రతం చెప్పబడిందో దానిని నాకు సవిస్తారంగా ఉపదేశించండి బ్రహ్మన్!”

ఇంద్రుడు, సత్యలోకంలో సుఖంగా ఆసీనుడైన చతుర్ముఖ బ్రహ్మను కృతవీర్యుని తండ్రి సాష్టాంగనమస్కారంతో శరణుపొంది ఈ విధంగా ప్రశ్నించాడు.

ఇంద్రుడు:

“ఓ దేవదేవా! జగత్తుకు సృష్టివిధాతా! ఆశ్రయించినవారికి బాధలను నివారణచేసే దేవా! నా హృదయంలో గాఢంగా నెలకొనివున్న సందేహాన్ని అడుగుతున్నాను. దయచేసి దానికి సమాధానం ప్రసాదించండి!

ఆపదలచే కొట్టుమిట్టాడుతూవున్న మానవులకు, చింతలూ, దుఃఖాలూ సమస్యలతో గల్లంతుకాబడ్డ హృదయoగల ఆర్తులకూ, ఆప్తుల వియోగంతో, దగ్గరమిత్రుల చిరకాల వేర్పాటుతో బాధపడుతూన్న మానవులకు వారి సంకటములను నివారించే ఉపాయమేది? ధనదారిద్ర్యంతో బాధపడే దురదృష్టవంతులకు సంపదలనిచ్చి సౌభాగ్యమూ, మంచి సంతతినీ యిచ్చి, సకల సంకటములను నశింపచేసే ఉపాయం మానవులకు ఏమికలదో ఉపదేశించండి దయతో!”

బ్రహ్మ:

“ఓ రాజా! నీవడిగినది చెబుతున్నాను! శ్రద్ధగా విను! మానవులకు సకల సిద్ధులనూ ప్రసాదించేదీ కేవలం ఈ వ్రతాన్ని అనుష్ఠించిన మాత్రంచేతనే కోరినవాటినన్నిటినీ ప్రసాదిoచగలట్టి సర్వసిద్ధిప్రదమైన “సంకష్టగణపతివ్రతాన్ని” నీకు ఉపదేశిన్నాను.

బ్రహ్మముహుర్తంలోనే స్నానముచేసి శుచియై తెల్లనువ్వులూ మంత్రౌషధులూ సంపాదించుకొని ప్రాణాయామ, ధ్యానసహితంగా విఘ్నహరుడగు గణపతిని ధ్యానించి వ్రతసంకల్పం చేసుకోవాలి! ఆపైన పరమభక్తితో గణేశభగవానుని ఆగమశాస్త్ర విధానపూర్వకమైన మంత్రములతో యధావిధిగా పూజించాలి! ముఖ్యంగా ఈ వ్రతాన్ని కృష్ణపక్షంలో చవితినాడు రాత్రిపూట చంద్రుడుదయించేవేళ ఆచరించాలి!”

రాజు:

“ఓ బ్రహ్మాన్! దేవదేవుడైన గజాననుని ఏవిధంగా పూజించాలి? ఈ వ్రతాన్ని ఆచరించవలసిన క్రమం మరికొంత వివరంగా అర్థమయ్యేలాగా ఉపదేశించండి నాయందు దయతో!”

బ్రహ్మ:

“ఉదయమే లేచి కాలకృత్యాలనూ నిత్యకర్మలూ పూర్తిచేసుకుని సాయంకాలం చంద్రోదయమయ్యే సమయందాకా నిరీక్షించాలి! సరిగ్గా చంద్రోదయ సమయానికి ముందే శుచియైన ప్రదేశంలో పవిత్రమైన గోమయంతో అలికి పూజావేదికను నిర్మించుకోవాలి! సుద్ద, పసుపుకుంకుమలతో ముగ్గులు పెట్టి అలంకరించిన ఆ పూజవేదికపైన గణేశునికి పీఠం ఏర్పాటుచేయాలి! దానిపై ధాన్యమునుగాని, బియ్యమునుగాని పోసి పట్టువస్త్రము కప్పి అక్షతలతోనూ పుష్పములతోనూ పూజావిధానం ప్రకారం కలశస్థాపనచేసి కలశపూజను చేయాలి! ఆ కలశంలో యధాశక్తి పంచరత్నములు, పంచవల్లవములు, సువర్ణముతో కలిసిన పరిశుద్ధ జలాన్ని నింపాలి! బంగారం లభించకపోతే శుద్ధమైన వెండికాని, దానికీ శక్తిలేకపోతే రూపాయినాణెంగాని వేసి కలశంపైన నూతనవస్త్రం, టెంకాయ, పల్లవములతో, తెల్లని పట్టువస్త్రంతో శిఖరాన్నిపెట్టి ఆ కలశంక్రింద బియ్యంపై ఆగమశాస్త్ర విధానం ప్రకారం గణేశయంత్రాన్ని నిర్మించాలి!

ఆ మహాగణపతి యంత్రంపైన గణేశుని మూర్తిని బంగారుతోగాని, వెండితోగాని సర్వలక్షణ సమన్వితమైన విగ్రహాన్ని స్థాపించాలి! ఆ విధంగా ‘ఏకదంతుడు, మహాకాయుడు, కరిగించిన బంగారువంటి శరీరవన్నె కలిగిన విశాలాక్షుడు, మండుతున్న అగ్నిహోత్రంవంటి తేజోవంతమైన నేత్రములు గలవాడిని, పూర్ణకుంభమువంటి లంబోదరము కలిగి ఒకే దంతముతో మూషికవాహనుడై గణపతిదేవునిమూర్తిని, శేషుడు యజ్ఞోపవీతంగా కల్గిన, దేవతలు చామరములతో సేవిస్తూన్న గజాననుని ధ్యానించాలి!

అలా మనోమయమైన గణేశమూర్తిని తన భావనలోనే దర్శిస్తూ ‘ఓ దేవదేవేశా! దయచేయండి! నా సంకటములను నివారించుము. కృపతో నా వ్రతసమాప్తి అయ్యేదాకా ఈ పీఠమున అసీనుడవుకమ్ము! ఇదిగో ఆసనము, ఆవాహనము, అర్ఘ్యపాద్యములు సమర్పిస్తున్నాను!’ అంటూ “సహస్రశీర్షపురుషః” అన్న పురుషసూక్తమంత్రంతో ఆవాహన చేయాలి!

గణాధీశా! నీకు నమస్కారం! సర్వసిద్ధిప్రదాయకా! ఆసనము స్వీకరించి నా సంకటములను నివారించు. “పురుష ఏవేదగ్o సర్వం” అన్న మంత్రంతో ఆసనం సమర్పించాలి!

ఓ ఉమాపుత్రుడా! నమస్తే! నమస్తే! కుడుములు భక్షములు ప్రీతితో ఆరగించుస్వామీ! అర్ఘ్యపాద్యములు స్వీకరించి నా సంకటములు నివారించు. “ఏతవానస్య మహిమా” అని పాద్యము

ఓ లంబోదరా! నమస్తే! నమస్తే! నవరత్నములు ఫలములతో కూడిన అర్ఘ్యమును స్వీకరించి దయతో నా సంకటములను నివారించు. “తిపాదూర్ధ్వః ఉదైపురుషః” మంత్రంతో అర్ఘ్యము సమర్పించాలి.

గంగాజలముతో పవిత్రం చేయబడిన, సర్వతీర్థములలో సేకరించిన ఆచమనీయమును స్వీకరించు! దయతో నా సంకటములను నివారించు. “తస్మాత్ విరాడజాయత” అన్న మంత్రంతో ఆచమనం.

పంచామృతములైన పాలు, పెరుగు, తేనె, నేయి, చక్కెర కలిపిన పంచామృతములను స్వీకరించు గణేశప్రభూ! నా సంకటములను నివారించు అని. “యత్పురుషేణ హవిషా” అన్న మంత్రంతో పంచామృతస్నానం సమర్పించాలి.

నర్మద, చంద్రభాగా, గంగానదీ జలముల స్నానమును ఔపచారిక స్నానంగా సమర్పించాలి. “సప్తాశ్వాసన్ పరిధయః” అన్న మంత్రంతో శుద్ధోదకస్నానం సమర్పించాలి!

ఓ గజాననా! నాచే సమర్పితమైన ఈ నూతన వస్త్రముల చాపును స్వీకరించి నా సంకటములను నివారింపుము! అని చెప్పి “తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్” అని వస్త్రయుగ్మం సమర్పించాలి.

ఓ వినాయకుడా! నమస్కారం! పరశుధారి దయతో ఈ యజ్ఞోపవీతాన్ని స్వీకరించి నా సంకటములను నివారించు! “తస్మాద్యజ్ఞా సర్వహుతః” అని యజ్ఞోపవీతం సమర్పించాలి.

ఈశపుత్రా! నమోనమః! మూషికవాహనా నమస్తే! దయతో నేను సమర్పిoచు చందనం స్వీకరించి ఈ శీతోలోపచారముతో నా సంకటములను నివారించు. “తస్మాద్యజ్ఞా సర్వహుతః” అను మంత్రంతో చందనం సమర్పించాలి!

పవిత్రమైన ధ్యానంతో క్రొత్తగా తయారుచేయబడిన అక్షతలను సమర్పిస్తూ నేయి, కుంకుమలతో కలిపిన అక్షతలను, సంపెంగ, మల్లె, దర్భలు, పారిజాతము వంటి అనేక పుష్పాలను “తస్మాదశ్వా అజాయత” అన్న మంత్రంతో పుష్పాక్షతలను సమర్పించాలి!

లంబోదర, మహాకాయ, ధూమకేతుడా! సుగంధ పరిమళభూయిష్టమైన ఈ చందన, సాంబ్రాణి ధూపమును స్వీకరించి నా సంకటములు నివారించు! “యత్పురుషం వ్యదధుః” అన్న మంత్రంతో ధూపం సమర్పించాలి!

విఘ్నాంధకార వినాశకుడా! దేవతాధిపా! దేవదేవా! ఈ దీపాన్ని సమర్పిస్తున్నాను. సంకటములనుండి దారిచూపి నా కష్టములు నివారించు! అని “బ్రాహ్మణోస్య ముఖమాసీత్” అన్న మంత్రంతో దీపం సమర్పించాలి!

పిండివంటలు, కుడుములు, లడ్లు, అప్పములు, పాయసము, చక్కర, చక్కగా సిద్ధాన్నం నేతితో, అభికారం చేసి నైవేద్యం సమర్పిస్తున్నాను. దేవా! దయతో స్వీకరించు! దయతో స్వీకరించు! అని ప్రార్థిస్తూ “చంద్రమా మనసోజాతః” అన్న మంత్రంతో నైవేద్యం సమర్పించాలి!

టెంకాయఫలము, ద్రాక్షలు, దానిమ్మ, మామిడి వంటి రుచికరములైన శుభఫలములను సమర్పిస్తున్నాను. ఓ దేవదేవా! నా సంకటములను నివారించు! అని “నాభ్యా ఆసీదంతరిక్షం” అన్న మంత్రంతో ఫలసమర్పణ

“ఏలకులు, లవంగములు, పచ్చకర్పూరము, జాపత్రి, జాజికాయ వంటి సుగంధద్రవ్యములతో చేరిన తాంబూలమును స్వీకరించి నా సంకటములను నివారించుమోదేవా!” అని తాంబూలము సమర్పణ చేయాలి!

ఈవిధంగా షోడశోపచారములు సమర్పించి దక్షిణ రూపములో ‘హిరణ్యము’ అనగా రూపాయినాణెము లేక సువర్ణమును యథాశక్తిగా సమర్పించి, “సప్తాశ్వాసన్” మంత్రంతో దక్షిణను విఘ్నేశ్వరునికి నివేదించాలి!

ఈ విధంగా షోడశోపచారముల పూజను పూర్తిచేసి, గరికచిగుళ్ళతో కలిసిన ఏకవిశoతి పత్రములను గణపతియొక్క ఇరవై ఒక్క నామములతో పూజిస్తూ సమర్పించాలి! ఎకాగ్రమనస్సు కలిగి గణేశుని ఈక్రింద చూపబడిన నామములతో జపిస్తూ పత్రములను సమర్పించాలి! || ఓం సుముఖాయ నమః | మాలతీపత్రం పూజయామి || ఓం గణాధిపాయ నమః | బృహతీపత్రం పూజయామి || ఓం ఉమాపుత్రాయ నమః | బిల్వపత్రం పూజయామి || ఓం గజాననాయ నమః | దూర్వాయుగ్నం పూజయామి || ఓం హరసూనవే నమః | దత్తూరపత్రం పూజయామి || ఓం లంబోదరాయ నమః | బదరీపుత్రం పూజయామి || ఓం గుహాగ్రజాయ నమః | అపామార్గపత్రం పూజయామి || ఓం గజకర్ణాయ నమః | జంబూపత్రం పూజయామి || ఓం ఏకదంతాయ నమః | చూతపత్రం పూజయామి || ఓం వికటాయ నమః | కరవీరపత్రం పూజయామి || ఓం భిన్నదంతాయ నమః | విష్ణుక్రాంతపత్రం పూజయామి || ఓం వటవే నమః | దాడిమీపత్రం పూజయామి || ఓం సర్వేశ్వరాయ నమః | దేవదారుపత్రం పూజయామి || ఓం ఫాలచంద్రాయ నమః | మరువకపత్రం పూజయామి || ఓం హేరంబాయ నమః | సింధువారపత్రం పూజయామి || ఓం శూర్పకర్ణాయ నమః | జాజీపత్రం పూజయామి || ఓం సురాగ్రజాయ నమః | గణ్డకీపత్రం పూజయామి || ఓం ఇభవక్ర్తాయ నమః | శమీపత్రం పూజయామి || ఓం వినాయకాయ నమః | అశ్వద్ధపత్రం పూజయామి || ఓం సురసేవితాయ నమః | అర్జునపత్రం పూజయామి || ఓం కపిలాయ నమః | అర్కపత్రం పూజయామి ||         శ్రీ గణాధిపతయే నమః | ఏకవింశతిపత్రాణి పూజయామి ||

అంటూ ఈవిధంగా ఇరవైఒక్క నామాలతోనూ “ఏకవింశతి పత్రిపూజ”ను చేసి కర్పూరనీరాజనమును గణేశ భగవానునకు సమర్పించాలి! “దేవా నా సంకటములను నివారించుము” అన్న ప్రార్థనతో!

సుగంధముగల్గిన పారిజాత, మందార, తామరపుష్పాలతో “పుష్పాంజలి”ని భక్తితో సమర్పించాలి!

“యజ్ఞేన...” అన్న మంత్రంతో పుష్పాంజలినిచ్చి

“ఓ గణేశదేవ! ఈ పుష్పాంజలి స్వీకరించి, ఈ సంకటములనుండి నన్ను విముక్తినిచేయి!” అంటూ పుష్పాంజలిని సమర్పించాలి! ఆ తరువాత గణేశుని ఈవిధంగా ప్రార్థించాలి

“దేవా! నీవే ఈ విశ్వాన్ని సృష్టించేవాడివి! పరిరక్షించేవాడివి! గజాననా! నీవీ విశ్వసృష్టికి స్థితిసంహారకుడవు! ఈ విశ్వవిశ్వాత్మకుడవు నీవే! అట్టి నీకు, దేవదేవుడైన గజాననునకు, గణనాధునకు, విఘ్నాలను హరించే విశ్వరాక్షకునకు, నాకు ఏకైక దిక్కైన భక్తుల బాధలు నివారించే వేదవేద్యా! నమస్కారం! ప్రణవస్వరూపా! నమోవాకములు! భాక్తార్తిహరుడా శరణుశరణు! వేదపురుషుడా నమస్కారం! నమో నమః!”

అంటూ విధివత్తుగా గణేశుని ప్రార్థించి పునఃపునః మళ్ళీమళ్ళీ నమస్కరించి ప్రదక్షిణపూర్వకంగా నమస్కారములు 21 సార్లు సమర్పించాలి! ఈ విధంగా విశ్వవంధ్యుడైన గజాననునికి నమస్కరించి, నాగయజ్ఞోపవీతిధారి, ఫాలచంద్రునితో పరశువును ధరించిన సర్వవిద్యాప్రదాయకుడైన విఘ్నపతిని పూజించి గరికచిగుళ్ళతో సంకటములు పోవలెనని సంకల్పించి అర్చన చేయాలి!

ఈ విధంగా పూజిస్తే తక్షణమే గణపతి అనుగ్రహించి దుష్కరములైన కోరికలను కూడా సిద్ధింపచేసి, విఘ్నములను నశింపచేసి దుష్టపీడను నివారించగలడు. గణపతి అనుగ్రహంచేత సర్వకార్యసిద్ధి కలుగవలెనని, శత్రువులకు శత్రుబుద్ధి నశించాలని, మిత్రభావం కలగాలని సాష్టాంగ నమస్కారం చేస్తూ పునఃపునః స్తుతించాలి.

ఆ తరువాత హోమముచేసి అష్టోత్తర శతార్చనకాగానే పిండివంటలు, లడ్లు, కుడుములు, పాయసము, ఇరవైఒక్క రకముల ఫలములు గణపతిస్వామికి నైవేద్యమివ్వాలి! ఆ తరువాత విధివత్తుగా వాయనమును ఎఱ్ఱని రక్తవస్త్రముతో (ఎఱ్ఱని పట్టువస్రముతో) తన గురుదేవునకు గణపతి స్వరూపునిగా నిమంత్రణచేసి సర్వసంకల్పసిద్ధికై వాయనమివ్వాలి.

సంకటాం మాం నివారయ” (సంకటములనుండి నన్ను విముక్తున్ని చేయుము) అన్న వాయనమునిచ్చి గణేశునికథను, పుణ్యప్రదమైన పురాణశ్రవణమును శ్రద్ధగా విని స్వామికి పునః అర్ఘ్యపాద్యములు సమర్పించాలి! ఓరాజా! ఈ విధంగా చతుర్థీ మంగళవారంనాడు బహుళపక్షంలో వచ్చే ‘సంకష్టహర చతుర్థీ’ పర్వదినంనాడు           

“ఓ గణేశప్రియవల్లభా! నాచే సమర్పించబడు అర్ఘ్యములను స్వీకరించి నా సంకటములను నివారణచేయి!” అని నివేదించాలి! సంకటహరగణపతిని నిమంత్రించి మోదకప్రియుడైన సంకటహర గణపతికి అర్ఘ్యమివ్వాలి! ఈ క్రిందివిధంగా చంద్రునకు ఏడుసార్లు అర్ఘ్యమివ్వాలి! రోహిణీనక్షత్రం కలిసిన శుభదినంనాడు “క్షీరోదార్ణవ సంభూత! | అత్రిగోత్ర సముద్భవ! | గృహాణార్ఘ్యం మయాదత్తం | రోహిణ్యా సహితశ్శశి” అన్న చంద్రార్ఘ్య సమర్పణ మంత్రంతో అర్ఘ్యమివ్వాలి!

ఆ తరువాత అపరాధక్షమాపణ మంత్రంచెప్పి వేదపండితులైన బ్రాహ్మణులకు భోజనంపెట్టాలి! వారి భుక్తశేషాన్ని ప్రసాదంగా తాను భుజించి మౌనంగా నియమవంతుడై విశ్రమించాలి! బంధుజనులతో ప్రసాదమును భుజించి యిట్లుచేసిన వ్రతము శీఘ్రంగానే ఫలసిద్ధిని కలిగించి సమస్త కోరికలను సిద్ధిoపచేయును. వేయేల? ఇంతకన్నా సంకటముల నివారణకు, సంకల్పసిద్దికీ వేరుమంత్రంలేనేలేదు!” అని ఈ విధంగా బ్రహ్మదేవుడు రాజునకు ఉపదేశించగా, ఆ రాజు శ్రద్ధగా సంకష్ట గణపతీవ్రత మహిమను విని తరువాతి అధ్యాయంలో చెప్పిన విధానంలో ఆచరించి సర్వసుఖాలను పొందాడు.

Chapter 69 complete