గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

14 – బ్రహ్మ చింతావర్ణనం

అప్పుడు సోమకాంతమహారాజు భృగుమహర్షిని అలా గజాననుని ఉదరంలో అనేక బ్రహ్మాండాలను చూసి, ఆ తరువాత గణేశుని అనుజ్ఞమేరకు బ్రహ్మ ఎలా సృష్టిని చేసినదీ వివరింపమని ప్రార్థించగా ఆ భృగుమహర్షి యిలా బదులిచ్చాడు :

భృగువు:

“ఓ రాజా! అలా గజాననుని గర్భంలోంచి బైటకువచ్చిన చతుర్ముఖుడు తనలోతాను గర్వితుడై ‘సకలవేదశాస్త్ర పురాణములను, ఆగమాలన్నింటిని ఎరిగినవాడను! జ్ఞాన విజ్ఞాన సంపన్నుడిననీ, శాపానుగ్రహ సమర్థుడినీ అవటంవల్లనే – నాయొక్క సృష్టిరచనాపద్ధతిలోగల ప్రావీణ్యతవల్లనే నాకీ సృష్టిబాధ్యత సిద్ధించింది. ఇక సృష్టివిషయంలో నాకు వీలుకాని పనంటూలేదు!’ అంటూ గర్విష్టియై సృష్టికి పూనుకున్నాడు. కానీ ఆ ప్రయత్నంలో ఆయనకు అనేక విఘ్నాలు తేనెతుట్టెను చుట్టుముట్టే తేనెటీగల్లా ముసురుకున్నాయి.

ఆ విఘ్నదేవతల స్వరూపం ఎంతో వికృతంగానూ, భయాన్ని గోలిపేవిగానూ ఉండటంతో బ్రహ్మ వారి ఘోరమైన రూపాలూ, వారు చేసే వికృతధ్వనులూ చూసి గడగడా వణికిపోయాడు.

అప్పుడు కొందరు విఘ్నదేవతలు బ్రహ్మను కొట్టారు! మరికొందరు స్తుతించారు. యింకొందరు నమస్కరించారు. కొందరు నిందిస్తే, మరికొందరు ప్రశంశించారు. కొందరు సేవిస్తే, మరికొందరు బంధించారు. వారిలోనే కొందరు అతడిని విడిపించారు. అలా విడిపించినవాణ్ణి కొందరటూ యిటూ ఈడ్చారు. కొందరాతని నాలుగు ముఖాలనూ చూసి పరిహసిస్తే మరికొందరా శిఖలను పట్టి అటూయిటూ ఊపారు. కొందరు ఆలింగనం చేసుకునీ, మరికొందరు చిన్ని శిశువునువలే ముద్దాడీ, కొందరాతని గడ్డాన్నీ మీసాలనూ పట్టుకొనీ,ఆటపట్టిస్తూ నృత్యం చేశారు.

ఇలాంటి వికృతచేష్టల పట్ల బ్రహ్మ మనః స్వాదీనం కోల్పోయి హృదయం అంతా చింతతోనూ, శోకంతోనూ బరువెక్కినవాడై, తన మనోగర్వాన్ని వీడి జీవితంపట్ల నిరాశకల్గి వివశుడై మూర్ఛిల్లాడు.

అల ఒక ముహూర్తకాలం గడిచాక, తెలివితెచ్చుకుని తన హృదయంలో దేవదేవుడైన ఆ విఘ్నేశ్వరున్ని స్మరిస్తూ, దుఃఖితుడై, గజాననుడిని యిలా స్తుతించసాగాడు.

బ్రహ్మ గజాననుడిని స్తుతిచేయటం

బ్రహ్మ:

ఓ దేవదేవా! నాకా ఆయుఃప్రమాణం ఎంతోవున్నది! చేయబూనిన కార్యమా ఎంతో ఉత్కృష్టమైనది! నాకా నిష్కళ౦కమైన బ్రహ్మజ్ఞానం కలుగలేదు. ఈ భూమండలంపైన జన్మనెత్తి నీకు భక్తుడనై, ముక్తిని ఎప్పుడు ఎలా పొందగలనోకదా! ఓదేవా! అందుచేత నీయొక్క కరుణావృష్టి నాపై కురిపించి నన్నీ బాధలనుండి, పీడలనుండీ విముక్తుడిని గావించు! కనుక నాజన్మ సార్ధకమయ్యేలా, నా కర్తవ్యాన్ని సమర్ధవంతంగా నెరవేర్చేలా అనుగ్రహించు!” అంటూ దీనంగా వేడుకుంటున్న సమయంలో ఆకాశంనుంచి అశరీరవాణి “తప! తప!” (తపస్సుచెయ్యి! తపస్సుచెయ్యి ) అన్న ఆదేశం వినబడింది.

ఆ వాక్కు చెవినపడిన వెంటనే బ్రహ్మను వేధిస్తున్న విఘ్నదేవతలు ఆయనను విడిచి అంతర్థానమైనారు. అప్పుడు బ్రహ్మ తన మనస్సులో ‘తపస్సు చేయడానికి తగిన స్థానం, మంత్రమూ ఉంటేనేకదా! తపమాచరించగలిగేది!’ అనుకుని తన తపస్సుకు అనువైన స్థానానికై అన్వేషిస్తూ వరప్రదుడైన గజాననుని హృదయపద్మంలో ఏకాగ్రచిత్తంతో యిలా ధ్యాని౦చసాగాడు.

గజాననుని ధ్యానమూర్తి :

ఆ ధ్యానమూర్తి ఎలా ఉన్నదంటే – ఎఱ్ఱటి చందనంతో అద్దబడిన దేహంతో ప్రకాశిస్తూ, సిందూరారుణ వర్ణంతో శోభించే శిరస్సుపైన, ముత్యలచేతా, రాత్నాలచేతా, అలంకరించబడిన దివ్యమైన కిరీటాన్ని ధరించి, మేడలో ముత్యలహారాన్ని నాగాయజ్ఞోపవీతాన్నీ ధరించి ఉన్నాడు. ఆ దివ్యమంగళమూర్తి చేతివ్రేళ్ళకు మరకత మాణిక్యాలతో పొదగబడిన ఉంగరములను ధరించీ, చిత్రవిచిత్రమైన రత్నాలతో తాపించబడిన ‘మొలత్రాటి’తో నాభి ప్రదేశంవద్ద శేషునితో చుట్టబడి ఎఱ్ఱటి దివ్యమైన పట్టువస్త్రాన్ని ధరించి ఉన్నాడు.

అతని ఏకదంతం చంద్రకళలాగా తెల్లగా ప్రకాశిస్తుంది! అటువంటి పరమ సుందరమైన, దివ్యమైన, అనుగ్రహరూపుడైన గజాననమూర్తిని బ్రహ్మ హృదయంలో ధ్యానిస్తుండగా, ఆకాశంలోనుండి అశరీరవాణి మరలా యిలాపలికింది “వటం పశ్య! వటం పశ్య!” అనగా మఱ్ఱి చెట్టును చూడమన్న ఆదేశం విన్న బ్రహ్మ వటవృక్షనికై అన్వేషించసాగాడు!

Chapter 14 complete