గణేశ పురాణము - ఉపాసనా ఖండము
13 – బ్రహ్మస్తుతి వర్ణనం
త్రిమూర్తులిలా స్తుతించారు :
జన్మ మృత్యువులకతీతుడు, నిరాకారమూ, శుద్దాద్వైతమూ, అనంతమూ, శాశ్వతుడవు అగు పూర్ణబ్రహ్మరూపమే నీవు! పరమనిర్గుణుడవు, గుణరహితడవు, నిర్విశేషుడవూ సంకల్పరహితమైన పరబ్రహ్మతత్వమే నీవు!
త్రిగుణాతీతుడవూ, సృష్టికి ఆదిభూతుడవూ ఐన పరమానందరూపా! జ్ఞానానందరూపమైన గణేశరూపా నీకు నమస్కారము!
గుణాతీతుడవు, పంచభూతాలకునూ పరమైన ఆదిపురుషుడవు పరమానందరూపియగు, సర్వవ్యాపియగు జ్ఞానేశ్వరునకు నమస్కారము!
యోగీంద్రులచేత, మునులచేతనూ హృదయాకాశమున ధ్యానించబడే పరమాకాశరూపుడగు, పరబ్రహ్మయగు గణేశునకు నమస్కారము!
జగత్కారణుడవు సృష్టికి కారణుడై, జ్ఞానస్వరూపియూ, కాలాదిచతుర్యుగ స్వరూపునకు, దేవగణములకు ఆదిపురుషుడు అగు గణేశునకు నమస్కారము.
సమస్త విశ్వమూ వ్యాపించిన పరమపురుషునకూ, దేవతలచే నమస్కరించ తగినవాడవైన నీకు నమస్కారము. పరతత్వరూపియగు గణేశునకు నమస్కారము!
త్రిగుణ స్వరూపియగు పరమాత్ముడా! రజోగుణములో బ్రహ్మ స్వరూపం ధరించి సృష్టికార్యమును నిర్వహించు సమస్త వేదాత్మకుడవు, సంకల్ప స్వరూపివి!
సత్వగుణరూపం ధరించి సదాక్రీడలాగా అసురులను సంహరించే జగత్పరిపాలకుడు, అనేకావతారుడగు శ్రీమహావిష్ణు స్వరూపుడా నమస్కారము!
తమోగుణ ప్రధానుడు యోగిరూపివైన త్రినేత్రుడవగు ఓ! రుద్రరూపీ! నీకు నమస్కారము!
త్రిగుణములకూ అతీతమైన పరమాకాశరూపి యగు తారకపరబ్రహ్మమగు ఓ! సచ్చిదానంద జ్ఞానస్వరూపుడా! మా హృదయగత అజ్ఞానపు చీకట్లను పారద్రోలు సమస్త దేవస్వరూపుడా! ఓ నిర్వికారుడా! పరబ్రహ్మరూపా! నమస్కారము.
సమస్త సృష్టికినీ పుష్టినిచ్చే అమృతవర్షముతో ఓషధులను పెంచి పోషించే సోమాత్మకుడా! నీకు నమస్కారము.
సంవత్సరస్వరూపమగు కాలచక్రమునకు ఇరుసుగా ఉండి యుగాదిమాస పర్యంతమూ కాలచక్రమును తిప్పే సూర్యనారాయణ స్వరూపుడా! నమస్కారము.
ప్రకాశ స్వరూపియూ, జ్యోతిస్వరూపియూ గ్రహతారకానక్షత్రరూపివియూనైన ఓ దేవా! నమస్కారము.
సదా విశ్వరూపీ! అనేకానేక శక్తిస్వరూపం ధరించి సృష్టిగా ఏర్పడి జగద్రూపియగు పరమాత్ముడా నమస్కారము.
తాను సృష్టించిన జగత్తుకు అతీతుడైవుండిన ప్రణవస్వరూపము, పంచభూతములకూ అతీతమైన మహాత్తత్వరూపీ! సమస్త దిక్కులూ, దేవతలూ, కాలమూ, కర్మమూ మొదలైన జగత్తుకు కారణభూతుడా నమస్కారము.
సదా విశ్వరూపం ధరించి సృష్టిరూపంలో ప్రత్యక్షమై, ప్రళయంలో సమస్తాన్నీ లీనంచేసుకునే ఓ పరమాత్మరూపీ! గణేశా! నీకు నమస్కారము!
నీయొక్క పాదపద్మములయందు ధృఢమైన చిత్తాన్ని కలిగినవారికి వారి పుణ్యబలంచేత ఎవరికా అదృష్టం కలుగుతుందో అట్టివారి సమస్త విఘ్నములనూ నివారించువాడా! సమస్త పీడలనుండీ రక్షించే సూర్యమండల స్థితుడవైన తేజస్వరూపీ! నమస్కారము.
నీ అనుగ్రహము లేనివాడు అజ్ఞాన భ్రమప్రమలకు లోనుగానై వేలసంవత్సరములు నీకై వెతికినా కనిపించని మయాస్వరూపుడా! శరణాగతుడైన భక్తుని హృదయంలో నీ దయతో ప్రత్యక్షమయ్యే అనుగ్రహ స్వరూపుడా! ఓ ఆదిపురుషా! సృష్టికర్తా! విశ్వంభరా! నమో నమస్తే! నమస్తే నమః! పునః పునః సాష్టాంగ నమస్కారములు నీకివే! మా స్తోత్రరూపమగు పూజను గ్రహించి మమ్మనుగ్రహించు!!”
అంటూ సమస్త దేవతాగణములతో కూడి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అట్లు సాక్షాత్కరించిన పరమ సుందరమైన ఆ గణేశరూపాన్ని ప్రార్థించారు!
ఆ వృత్తాంతాన్ని బ్రహ్మ యిలావివరించాడు.
బ్రహ్మ:
“ఓ వ్యాసమునీంద్రా! గజాననుడు పై స్తుతికి సంతుష్టుడై కృపావీక్షణాలతో వారిని చూస్తూ యిలా అన్నాడు.
“ఓ త్రిమూర్తులారా! మీకు వచ్చిన కష్టం ఎలాంటిది? మీరిక్కడకు రావటానికిగల కారణమేమిటి? ఏమి కారణమైనప్పటికీ మీ స్తుతికి ఎంతో సంతసించాను. మీకు కావలసిన వరాలను కోరుకోండి! మీచేత చేయబడిన ఈ భక్తిపూర్వకమైన స్తుతి – స్తోత్రాలలోకెల్లా తలమానికమై లోకంలో అంతులేని ఖ్యాతి వహించగలదు. ప్రాతకాలమున లేచి, త్రిసంధ్యలలోనూ ఎవరైతే దీనిని శ్రద్ధాళువులై పఠిస్తారో వారిహలోక సౌఖ్యాలను, సర్వాభీష్టములనూ పొందుతారు. అంత్యకాలములో పరబ్రహ్మ స్వరూపులు అవుతారు” అన్న గజాననుని వాక్యములు విని త్రిమూర్తులు సంతుష్టా౦తరంగులై యిలా ప్రార్థించారు.
త్రిమూర్తులు:
“ఓ దేవదేవా! నీవు మా స్త్రోత్రమునకు సంతుష్టుడవైతే మాకు నీ చరణాలయెడ విస్మృతిలేని, అనన్యభక్తిని ప్రసాదించు! అంతేగాక మేము చేయవలసిన కర్తవ్యాన్ని ఆజ్ఞాపించు! ఇదియే మా కోరిక!”
త్రిమూర్తుల మాటలను విన్న గణేశ్వరుడు ప్రసన్నుడై
గజాననుడు:
“ఓ త్రిమూర్తులారా! మీ కోరిక ప్రకారమే నాయందు మీకు ధృఢభక్తిని ప్రసాదిస్తున్నాను. మహత్తరమైన విఘ్నాలన్నింటినీ మీరు దాటగలరు! మీకు ఘనమైన కీర్తి కలిగేందుకు మీకు వేరువేరు బాధ్యతలను అప్పగిస్తాను!” అంటూ వారికి ఇలా వరాలను అనుగ్రహించి రజోగుణ సముద్భవుడైన బ్రహ్మకు సృష్టిబాధ్యతనూ, సత్వగుణాశ్రయుడైన విష్ణువును పాలకుడుగానూ, తమోగుణంలో ఉత్పన్నుడైన రుద్రుడిని సర్వసంహారకుడిగానూ నియమించాడు.
బ్రహ్మ:
ఓ వ్యాసమునీంద్రా! నాకు సకలలోకాలనూ సృష్టిచేయగల శక్తిసామర్థ్యాలను వేదశాస్త్రపురాణాది సకల విద్యలనూ ఆదరంతో ఆ గణేశుడే నేర్పాడు.
అలాగే విష్ణువుకు యోగంవలన స్వేచ్చారూపములను దాల్చగలగటం రుద్రునికి ఏకాక్షర, షడక్షర గణపతి మంత్రాలనూ, సర్వాగమాలనూ, సంహారశక్తిని ప్రసాదించాడు.
అప్పుడు నేను దీనమనస్కుడనై త్రిలోకాదిపతీ, జగత్తుకే గురుత్వం వహించినవాడూ, వరప్రదాతయైన ఆ గజాననుని ఎదుటే దోసిలియొగ్గి ‘నాకు సృష్టిచేయగల శక్తితోపాటూ, సామర్థ్యాన్నీ ఏయే రూపాలను ఎక్కడెక్కడ ఎలా సృజించాలో నిర్ణయించుకోగల వివేకాన్నీ, విచక్షణను ప్రసాదించమని’ అర్థించాను.
అప్పుడు వ్యాకుల చిత్తంతో మదనపడుతున్న నాకు దివ్యదృష్టిని అనుగ్రహించి గజాననుడు నన్ను తన ఉచ్చ్వాసంద్వారా తన ఉదరంలోకి లాక్కున్నాడు. అక్కడ సీతాఫలంలోని గింజలలాగా ఉన్న అనేక కోట్ల బ్రహ్మాండ గోళాలను దర్శించాను. ఒక గోళాన్ని భేదించగా అందులోనూ త్రిమూర్తిత్రయం (బ్రహ్మవిష్ణుమహేశ్వరులు) విడిగా కనిపించారు. అలాగే సూర్యచంద్రాదులూ, పంచభూతాలూ, సముద్రాలూ, కిన్నర కింపురుష గణాలూ, ఋషులు, పున్యజనులూ, చతుర్విధ జీవరాసులూ, పృధివీ మొదలుగాగల ఏడు పాతాళాలనూ ఇలా మరో బ్రహ్మాండాన్ని కళ్ళు తిరిగేలా చూశాను. వాటి ఆది అంతమూ తెలుసుకోవడం నాకు వీలుకాలేదు. దిక్కుతెలీని స్థితిలో వరడుడైన గజాననున్ని దారిచూపమని ప్రార్థించాను.
“ఓ దేవా! నీ కుక్షిలో బ్రహ్మాండ కోటుల నెన్నింటినో కనుగొన్నాను. ఆకాశంలోని నక్షత్రాలనూ, సముద్రంలోగల చేపలనూ, ఇసుకలోని రేణువులనూ లెక్కించడం ఎలాగైతే ఎవరితరమూ కాదో, అలానే వీటి ఆది అంతాలను కనుగొనటమన్నది నాశక్తికి మించినపని! ఇక్కడ ఉండటానికిగానీ, బైటకు రావటానికిగాని నాకిక శక్యం కావటంలేదు! కనుక దిక్కుతోచని స్థితిలో నీ దివ్యచరణారవిందాలపై శరణాగతుడనై శిరమునాన్చు తున్నాను. నాపై దయతలచు!” – అంటూ ప్రార్థించిన నా ప్రార్థనవిని దయతో నన్ను తన ముక్కుయొక్క రంధ్రములోంచి బైటకు విసిరివైచాడు. అలాగే శివవిష్ణువులను కూడా తన కర్ణరంధ్రముగుండా బైటకు విసిరివైచాడు. ఆ హరిహరులిద్దరూ బైటికి వెలువడి అలా సుఖంగా గణేశుడి శరీరంపైనే నిద్రించారు అంటూ బ్రహ్మ వ్యాస మునీంద్రునికి గణేశుడి దివ్యవిజృంభణను వివరించాడు.
Chapter 13 complete
