గణేశ పురాణము - ఉపాసనా ఖండము
35 – కదంబపుర గతవర్ణనం
వ్యాసమునీంద్రుడు:
“ఓ చతురాననా! ఆవిధంగా చింతామణితీర్థమహిమను వివరించి నారదమహర్షి అంతర్ధానం చెందాక రుక్మాంగదుడు ఏమిచేశాడు? తదుపరి కథావిధానమెట్టిది? నాకు వివరించండి!”
బ్రహ్మ:
“ఓ వ్యాసమునీంద్రా! అలా నారదమహర్షి గణేశషడక్షరీ మహామంత్రోపదేశం చేసి, ‘చింతామణితీర్థాన్ని’ ఆ తీర్థమహిమను వర్ణించి వెళ్ళిపోయిన తరువాత, తన తలపైనుంచి ఒక పెద్ద భారం తొలగినంత సంతోషించి, రుక్మాంగదుడు తనని వెదుకుతూ వస్తూన్న తన సేనాపరివారాన్ని చూశాడు. రాజుని అతని సైనికులు పోల్చుకోలేకపోయారు. స్వర్ణకాంతితో, మన్మధుడి సౌందర్యాన్నే తలదన్నేoత అందగాడైన తమ ప్రభువైన రుక్మాంగద మహారాజు, అలా కాంతిహీనుడై, వికృతరూపం ధరించి ఉండటాన్ని వారు అర్థంచేసుకోలేక అతడిని ఇలా ప్రశ్నించారు.
“ఓ రాజా! నీజాడ తెలియక, నిన్ను అన్వేషిస్తూ అరణ్యాలు, నదులూ అన్నీ దాటి, ఆకలిదప్పుల బారినపడి అలసిసొలసి చివరకు నిన్ను ఇప్పటికి దర్శించగలిగాము. నీకీ దురవస్థ ఎలా సంప్రాప్తించిందో? ఆ వివరం మాకు తెలియజేయవలసింది” అంటూ కుశలప్రశ్న వేసిన ఆ పరివారానికి రుక్మాంగదుడు తాను దప్పికగొని వాచక్నవి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ మంచినీటిని అర్థించిన వైనమూ, ఋషిపత్నియైన ముకుంద తనపై మరులుగొని తన పొందుగోరి బలవంతం చేయటమూ, తాను ఆమెను నిరాకరించినందుకు ప్రతిగా, ఆమె తనకు శాపమివ్వడమూ, అప్పుడు విదివైపరీత్యానికి ఖిన్నుడై దుఃఖిస్తున్న తనకు దేవఋషియైన నారదమహర్షి ప్రత్యక్షమై, చింతామణిక్షేత్ర మహిమనూ అక్కడ స్నానంచేస్తే నాకు గల సమస్తచింతలూ తొలగగలవన్న ఉపాయం ఎరిగించటమూ అంతా పూసగుచ్చినట్లు వివరించి, తాను ఆ చింతామణి క్షేత్రానికి వెల్లదలిచానని చెప్పాడు.
ఆ తరువాత పరివార సమేతుడై చింతామణి తీర్థమునకు వెళ్ళాడు. ఆ తీర్థాన్ని సందర్శించినంత మాత్రాన్నే ఆ రాజు తన రోగభూయిష్టమైన శరీరాన్ని పాము కుబుసం వీడినట్లు విడిచి, దివ్యదేహాన్ని పొందాడు.
అప్పుడు ఆతడు పూర్వంలా బంగారువన్నె దేహంగలిగి ప్రకాశించాడు. ‘ఆహా! నారదమహర్షి వాక్యాలు అక్షరసత్యాలుకదా!’ అని మనస్సులో సంతోషాన్ని అనంతమైన ప్రశాంతిని పొంది, ఆ చింతామణి తీర్థంలో విధివిధానపూర్వకంగా పుణ్యస్నాన మాచరించి, అనేక దానాలను సైతం ఆచరించాడు. ఎంతో సంతోషంగా భక్తితో అక్కడ వెలసిన వినాయకుని అర్చించాడు. ఇలా అర్చిస్తూ ఉండగా సూర్యకాంతిని తలదన్నేటట్లున్న ప్రకాశం కళ్ళుమిరుమిట్లు గొలుపుతూఉన్న ఒక దివ్య విమానం అతని కంటపడింది. అందులో ఉన్న వైనాయక గణములు అప్సరసలతో, కిన్నర కింపురుష గణాలతో అలరారుతూ ఉండటాన్ని చూసి అందులోని వారిని ‘ఓ దూతలారా! మీరెవరు? ఎవరి దూతలు? ఎక్కడినుండి విచ్చేశారు? మీ ఆగమనంలోని కారణమేమిటి? ఆ వివరాలు దయతో తెలుప’మంటూ ప్రార్థించగా, ఆ వైనాయక దూతలిలా అన్నారు.
దూతలు:
“ఓ రాజా! నీవు ధన్యుడివి! అనన్యభక్తితో చింతామణి తీర్థములో సుస్నాతుడవై, విధివత్తుగా విఘ్న నివారకుడైన గణేశుని అర్చించి సకలములైన దానాలనూ శ్రద్ధతో చేశావు. కనుక నీవు కోరిన అభీష్టము నెరవేరింది. చింతితార్థములన్నీ ఇచ్చేవాడు కనుకే ఆ దేవదేవునికి ‘చింతామణి వినాయకుడ’న్న ఖ్యాతి కలిగింది! త్రికరణశుద్ధిగా ఆత్మార్పణబుద్ధితో నీవు చేసిన ఆరాధన ఎంతో ఫలప్రదమైనది! అంతేకాదు ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన గణపతికి చేసే అర్చన, ఎంతో అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. అందుచేతనే ఆ దేవుడు నిన్ను అనుగ్రహించి సశరీరునిగా తీసుకురమ్మని మమ్మల్ని యిక్కడకు ఈ ప్రత్యేక విమానంలో పంపించాడు! కనుక నీవు వెంటనే దీన్ని అధిరోహించి, ఆ వినాయకుని సన్నిధికి రావలసింది!” అంటూ కోరారు.
బ్రహ్మ:
“ఓ వ్యాసమునీంద్రా! అలా దూతల వాక్యములు విని రుక్మాంగదుడిలా బదులు పలికాడు”
రుక్మాంగదుడు:
‘ఓ దూతలారా! సకల జగన్నియామకుడైన ఆ దేవదేవుడెక్కడ? మందబుద్ధినైన నేనెక్కడ? సర్వవ్యాపకుడూ, అవ్యయుడు, త్రిమూర్త్యాత్మకుడు, కారణాతీతుడైన ఆ విఘ్నేశ్వరునకు నామీద ఇంతటి ఆదరణ ఎలా కల్గింది? ఇది అనంతకోటి పుణ్యప్రదమైన ఈ తీర్థమహిమా? లేక నా పూర్వజన్మల సుకృతం ఈనాటికి పరిపాకమైనదా? బహుశః అందువల్లనే కాబోలు! పుణ్యమూర్తులైన మిమ్మల్ని చూడగలిగాను! మీరు అనంత పుణ్యస్వరూపులవటం వల్లనే అనునిత్యం ఆ స్వామి సన్నిధిలో ఉంటూ, ఆయనను సేవించుకునే మహాద్భాగ్యం పొందారు.’ యిలా పలుకుతూ, వారికి నమస్కరించి వారితో రుక్మాంగదుడు యిలా అన్నాడు.
“ఓ దూతలారా! రాజనగరులో నా తండ్రియైన భీముడు పరమధార్మికుడు, సత్యసంధుడు అమేయ పరాక్రమోపేతుడై ఉన్నాడు. నా జననియైన చారుహాసిని కూడా పరమ పతివ్రత. వయోవృద్ధులైన నా జననీ జనకులను విడిచి కేవలం నా స్వార్థం మాత్రమే చూసుకొనబూనటం అనుచితం కదా?”
దూతలు:
“అయితే రుక్మాoగదా! నీవు వారి పేరిట కూడా సంకల్పం చెప్పి కుశాకంకణం (దర్భలతో చేసిన కంకణం) ధరించి వారి సద్గతి నిమిత్తమైకూడా ఈ చింతామణీ తీర్థంలో స్నానం చెయ్యి! ఆ పుణ్యవిశేషంవల్ల వారుకూడా గణేశలోక ప్రాప్తిని నిస్సందేహంగా పొందగలరు!” అన్నారు.
దూతల ఆ సూచనమేరకు రాజు కుశా కంకణాలను తన తల్లిదండ్రులపేరిట, రాజ్యంలోని ప్రజలపేరా ధరించి, ఆ పుణ్యతీర్థంలో స్నానాలు విడివిడిగా ఆచరించాడు. అలా స్నానవిధులను సంకల్పసహితంగా, సమంత్రకంగా నిర్వహించాక, వినాయకదూతలు మరికొన్ని విమానాలతో వచ్చారు.
ఆకాశమండలమంతా మంగళవాయిద్యాలతోనూ, వేదఘోషలతోనూ, గంధర్వులగానంతోనూ దశదిశలా మారుమ్రోగింది. అప్పుడు రుక్మాంగదుడు తల్లిదండ్రులకు, పురజనులకూ తన చింతామణి తీర్థపు స్నానఫలాన్ని ధారపోశాడు. ఆ తరువాత మాతాపితరులతోనూ, పురజనులతోనూ కూడి గణేశస్థానానికి ఆ ప్రత్యేక విమానాన్ని నధిరోహించి వెళ్ళాడు. ఓ వ్యాసమునీoద్రా! ఈవిధంగా ఆ గణేశతీర్థ పుణ్యప్రభావంచేత ఆబాల గోపాలమూ సద్గతిని పొందారు. ఓ మునీంద్రా! నీవడిగిన చింతామణిక్షేత్ర మహాత్యాన్నంతటినీ వివరించాను. ఏ మానవులు ఈ మహత్యాన్ని భక్తిశ్రద్ధలతో వింటారో వారుకూడా సద్గతిని పొందుతారు!
Chapter 35 complete
