గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

67 – దూర్వామహాత్మ్యం – 4

గణములు:

‘ఓరాజా! ఈవిధంగా కౌండిన్యపత్నియైన ఆశ్రయ తనకు కలిగిన సందేహనివారణకై భర్తయైన కౌండిన్య ముని ఆదేశానుసారం అతడు యిచ్చిన దూర్వాంకురాన్ని తీసుకుని దానిఎత్తు బంగారాన్ని దేవేంద్రునివద్దనుంచి అర్ధిద్దామని ఇంద్రునివద్దకు చేరుకున్నది. దేవతల ప్రభువైన ఇంద్రునితో ఇలాఅన్నది.

ఆశ్రయ (కౌండిన్యపత్ని):

‘ఓఇంద్రా! నాభార్తయైన కౌండిన్యముని ఆదేశాన్ననుసరించి సరిగ్గా ఈ దూర్వాoకురంతో సమంగాతూగగల బంగారాన్ని నీనుంచి అర్థించి తీసుకువెళ్ళగోరి వచ్చాను.’

ఇంద్రుడు:

‘ఓమాతా! నీభర్త దూర్వాంకురంఎత్తు బంగారానికై పంపించినట్లయితే వారి ఆభీష్టానుసారమే నాశక్తికొలది యిచ్చి పంపిస్తాను.’ అని దూతను పిలిచి అతడితో ఆ మునిపత్నిని కుభేరునివద్దకు తీసుకువెళ్ళి “ఈమెకు దూర్వాoకురమునకు సరిపోయినంత బరువుగల బంగారాన్ని నేను యిమ్మన్నానని నా ఆదేశంగా చెప్పి ఇప్పించు” అంటూ ఆదేశించాడు.

“ఓరాజా! దేవేంద్రుని ఆజ్ఞను అనుసరించి ఆ దూత ఆమెను కుభేరునివద్దకు తీసుకువెళ్ళి యింద్రుని ఆదేశాన్ని వివరించాడు. ఆ కుబేరుడు అందుకు ఎంతో ఆశ్చర్యపడి ‘మునిదంపతులు, దేవతల ప్రభువైన ఇంద్రుడు ఈవిధంగా ఇంతకొంచెం బంగారాన్ని ఎందుకు కోరారు? దూర్వాంకురానికి ఎంతబంగారం తూగుతుంది? అతిస్వల్పమైన బంగారంకోసం ఎంతశ్రమతీసుకున్నారు!’ అనుకున్నాడు. ఆ దూతలు ‘ఓ కుబేరా! ఆమె కేవలం అంతఎత్తు బంగారాన్నే కోరింది. ఆమె పతివ్రతయైన కారణంచేత భర్తమాటను జవదాటదు!’ అన్నారు. అప్పుడు కంసాలి వద్ద ఉండేటటువంటి చిన్నిత్రాసును తెప్పించి దానిలో ఒకవైపు బంగారాన్ని రెండోవైపు దూర్వాoకురమునూ ఉంచగా దూర్వాంకురమే ఎక్కువ తూగింది. ఇంకా మిగిలిఉన్న బంగారాన్నంతటినీ, ఆ తరువాత కోశాగారంలోని బంగారాన్నoతటినీ వేయించాడు కుబేరుడు. ఐనా అవి అన్నీకూడా దూర్వాంకురoఎత్తు బంగారంతో సమంగా తూగలేదు! అప్పుడు కోశాగారంలోఉన్న ద్రవ్యాన్నంతటిని పర్వతంలా కుప్పగా త్రాసులో పోయించాడు.ఐనా అవేవి దూర్వాంకురముయొక్క బరువుకు సరితూగలేదు.అప్పుడు తన భార్యనుకూడా అందులోకి ఎక్కమనినాడు. చివరికి తనతోపాటూ అలకాపురిలోని ఐశ్వర్యాన్నంతటినీ త్రాసులో పెట్టిన దూర్వాంకురం పైకి ఎంతమాత్రమూ లేవలేదు.

ఈ వృత్తాంతాన్ని విన్న ఇంద్రుడు స్వయంగా ఐరావతాన్ని అధిరోహించి వచ్చి తన యావత్ ద్రవ్యాన్నీ వేసి చివరకు తానూ అధిరోహించినా ఆ త్రాసు పైకిలేవలేదు. అప్పుడు ఇంద్రుడు సిగ్గుతో తలదించుకుని చాలా ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఇంద్రుడు హరిహరులను సైతం స్మరించి వారినికూడా ఘటారోహణం చేయించాడు. ఇంతచేసినా దూర్వాంకురం పైకిలేవలేదు. అప్పుడు వారందరూ త్రాసుదిగి దేవతాగణములు తమవెంటరాగా, కౌడిన్యముని ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ మునికి భక్తిశ్రద్ధలతో నమస్కరించి, దిగ్భ్రమనుంచి యింకా తెరుకోనక పోవటంచేత సంభ్రమంగా యిలా అన్నారు.

“ఓ మునిసత్తమా! నీ యొక్క దివ్యసందర్శనభాగ్యం చేతనే మా సకల పాపాలూ నశించాయి. మా పూర్వపుణ్యవశముననే మాకు నీవద్ద శుభం ప్రాప్తిoచుగాక! మహానుభావా! మీరు తమ భార్యచేత పంపిన దూర్వాoకురము యొక్క మహిమను మేమందరమూ కనులారా చూశాము! మూడులోకాలు సైతం దూర్వాంకురoయొక్క బరువును సరితూగలేదు! పైగా అది నీచేత గజాననుడికి కడుభక్తితో సమర్పించబడడంచేత దాని మహిమ అనంతమైనది. గజాననుడికి ఏకాంతభక్తి సలిపేవారి మహిమను యదార్ధంగా తెలుసుకోవడం ఎవరితరమూకాదు!” అంటూ ఆ దేవతాగణాలు ముందుగా గజాననుణ్ణి అర్చించి, ఆతరువాత భార్యాసమేతంగా ఆ కౌండిన్యమునిని పూజించి, ఆతడిని అనేకరకాల స్తుతించి గానం చేశారు.

“ఓ మునిపుంగవా! అష్టదిక్పాలకులూ, త్రిమూర్తులూ, సిద్ధ, విద్యాధర, గంధర్వ, కిoపురుషాదులకు సైతం నీ మహిమ తెలుసుకోవడం అన్నది అలవికానిపని!” అంటూ భక్తజనసులభుడైన గజాననుని, ఆతని భక్తుడైన కౌండిన్యునీ కీర్తించి వారి సెలవు గైకొని తమతమ నెలవులకు వెళ్ళిపోయారు.

అప్పుడు మునిపత్నియైన ఆశ్రయకూడా, దుర్వాంకురమహాత్మ్యాన్ని స్వయంగా తెలుసుకున్నదవటంచేత తన భర్తృవాక్యముపట్ల యెనలేని గురికుదిరినదై సర్వదేవతావంద్యుడైన ఆ కరివదనడిని అనేక దూర్వాంకురాములతో కడు భక్తిశ్రద్ధలతో పూజించింది.

తన భర్తయైన కౌండిన్యుని చరణకమలాలపై వ్రాలి “ఓ నాదా! దుర్మతినై అత్యంత ప్రతిభావంతమైన తమ సత్యవాక్కుపట్ల విశ్వాసంలేనిదాననై ఎంతో అపరాధంకావించాను. కాని అత్యంత కరుణాoతరంగులైన మీరు నాలో వివేకాన్ని మేలుకొలిపి తగిన అనుభవాన్ని గరపి నా కళ్ళు తెరిపించారు! కనుక అజ్ఞానకృతమైన నా అపరాధాన్ని క్షమించండి! మిమ్మల్నిదే శరణువేడుతున్నాను!” అంటూ ప్రార్థించగా ఆ ముని ఆమెను ఊరడించి స్వాంతనవచనాలతో ఓదార్చాడు. ఆ మర్నాడు ఉదయము ప్రాతఃకాలాన్నే ఆ దంపతులిద్దరూ దూర్వాంకురములను భక్తితో సేకరించి భక్తజనవత్సలుడైన విఘ్నేశుని శ్రద్ధగా అర్చించారు. అదిమొదలు వారు ఇరువురూ అనన్యభక్తితో ప్రాతఃసాయంకాల అర్చనలలో గాణేశుని క్రమం తప్పక దూర్వాంకురములతో అర్చించి, గణేశానుగ్రహానికి పాత్రులై తరించారు.

అప్పుడు దూతలిలా అన్నారు. “ఓరాజా! అత్యంత మహిమోపేతమైన దూర్వామహత్యాన్ని పూర్తిగా వర్ణించడం బ్రహ్మరుద్రాదులకు కూడా శక్యముగానిపని! త్రిలోకాలలోని ఐశ్వర్యముకూడా దూర్వాపత్రంతో సమానంగా తులతూగలేదు! ‘దూర్వా’ అన్న నామోచ్ఛారణచేతనే సకల పాపములూ నశిస్తాయి. దూర్వాంకురాన్ని స్మరించడం ఆ గజాననుణ్ణి స్మరించడమే అవుతుంది! ఓరాజా! నీకై చింతామణిక్షేత్రం యొక్క మహిమనూ, దూర్వాంకుర మహత్మ్యమును వివరించాము. దీనిని వినటం, కీర్తించడం, ధ్యానించడంవలన సర్వకామ్యసిద్ధీ, ముక్తీ రెండూ లభిస్తాయి! ఈ కారణం చేతనే ఆ ఛండాలికీ, గానుగకు కట్టివేయబడిన ఎద్దుకూ, కంచరగాడిదకూ కూడా గణేశుని దివ్యానుగ్రహ ప్రభావంచేత దివ్య విమానములు పంపించబడ్డాయి.

ఆ ఎద్దు, కంచరగాడిదల ముఖాలనుండి దూర్వాపత్రములు ఆ వినాయకుని పైనబడినాయి. ఆ చండాలి తన చలిబాధ తీర్చుకోగోరి దూర్వాంకురములు వెంటతెచ్చుకొనగా ప్రభలమైన గాలివీచి, కొన్ని దూర్వాంకురములు ఆమె చేతినున్న దుర్వాపత్రములు విఘ్నేశునిపై పడేసింది. దూర్వాంకుర అర్చన విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనందువల్ల ఆ ముగ్గురి కల్మషాన్నీ తొలగించి, వారిని పాపరహితులనుగాచేసి వారిపై తన దివ్యానుగ్రహాన్ని వర్షించి తన నిజలోకానికి తీసుకు వెళ్ళాడు. దూర్వాగంధం సోకగానే గజాననుడు సంతుష్టుడౌతాడు. ఇక భక్తిపురస్సరంగా ఆతడి మస్తకమున దూర్వాంకుర సమర్పణచేస్తే వేరుగా చెప్పాలా?” అంటూ ముగించారు.

బ్రహ్మ:

“ఆ విధంగా దూతలవల్ల దూర్వామహత్యాన్ని విన్న రాజు సపరివారంగా స్నానసంధ్యాదులొనర్చి, భక్తజనమందారుడైన విఘ్నపతిని దూర్వాoకురములతో భక్తిప్రపత్తులతో పూజించాడు. ఆ పుణ్యప్రభావంచేత వారందరూ దివ్యమైన పుణ్యశరీరాలను ధరించి, అమితమైన తేజస్సుతో ప్రకాశిస్తూ దివ్యమైన ఆభరణాదులను ధరించి దివ్యవిమానారూఢులై వైనాయక లోకాన్నీ చేరారు.”

అప్పుడు పురజనులుసైతం అదేవిధంగాచేసి ఐహికభోగాలను ఆ తరువాత గణేశధామాన్ని పొందారు. కనుక ఓరాజా! గణేశుని నిజభక్తులైనవారు ఆ దేవదేవుని దూర్వాంకురములతో తప్పక పూజించాలి! అలా దూర్వార్చన చేస్తున్నా భక్తులను చూసినప్పటికీ సకలపాపములూ తొలగి పరిశుద్ధులౌతారు. పెక్కు దూర్వాంకురములు లభించనట్లయితే కనీసం ఒక్క దూర్వాంకురాన్నైనాసరే సమర్పించి పూజించాలి! దానివల్ల అట్టిపూజ కోటిరెట్లు ఫలవంతమౌతుంది. ఓ రాజా! ఈరకంగా దూర్వామహత్యాన్ని నీకు వివరించాను. ఈ దూర్వామహత్యాన్ని వినటంవల్లకూడా సర్వపాపక్షయమౌతుంది. ఇది దుష్టులకు వినిపించరాదు. ప్రియుడైన సచ్చీలుడైన కుమారునికి శ్రేయస్సునుగోరి వినిపించవచ్చు.”

ఇంద్ర:

“ఇలా బ్రహ్మనుంచి అత్యుత్తమమైన ఈ ఆఖ్యానాన్ని విని కృతవీర్యుడు చాలా సంతోషించి బ్రహ్మను అనేక విధముల కీర్తించి తన స్వస్థానానికి ఆయనవద్ద సెలవుపుచ్చుకుని ఆశ్చర్యచకితుడై వెడలిపోయాడు.”

Chapter 67 complete