గణేశ పురాణము - ఉపాసనా ఖండము
10 – వ్యాసప్రశ్న వర్ణనం
భృగుమహర్షి యిలా చెప్పనారంభించాడు :
భృగువు:
“ఓరాజా! పరాశరమహర్షి తనయుడూ, సాక్షాత్ నారాయణుని అంశతో జన్మించినవాడూ అయిన కృష్ణద్వైపాయనుడని పిలువబడే వ్యాసమహర్షికి ఒకసారి తాను విభాగించిన వేదములయొక్క అర్థం స్ఫురించడం మానేసింది. స్థబ్దత తనను ఆవరించింది. త్రికాలవేది, పంచమవేదమైన మహాభారతాన్ని రచించినవాడూ, అష్టాదశ పురాణకర్తా ఐన వ్యాసభగవానుడు ఇందుకు చకితుడైనాడు. తాను రచించిన పురాణాలకు మంగళాచరణం ఎలా చేయాలో భావము ఏమాత్రమూ స్ఫురించలేదు. నిత్యనైమిత్తిక కర్మాచరణం ఎంత ఆచరించినా, మణిమంత్ర ఔషదాలచేతా నిర్వీర్యమైన సర్పంలా అతని ప్రతిభ స్థాణువైంది. ఎంత ప్రయత్నించినా అలా ఎందుకు జరిగిందన్న విషయం ఆయనకేమి అంతుబట్టలేదు!
ఈ విషయమై వివరం, కారణం తెలుసుకొనగోరి ఆయన సత్యలోకానికి వెళ్ళాడు. అక్కడ దేవగురువైన బృహస్పతికీ, బ్రహ్మర్షులకూ, దేవగణాలకూ నమస్కరించి, బ్రహ్మకుకూడా ప్రణమిల్లాడు. బ్రహ్మ ఆయనను సాదరంగా తోడ్కొనివెళ్ళి ఉచితసనంపైన కూర్చుండచేసి, అతని రాకకు కారణం అడిగారు. ఆ చతురాస్యుని పాదపద్మాలకు భక్తితో నమస్కరించి వినమ్రుడై బ్రహ్మనిలా ప్రశ్నించాడు.
వ్యాసుడు:
“ఓ కమలాసనా! వేదాలకు అర్థం గ్రహించలేని కలియుగ జీవులు జ్ఞానశూన్యులై, ఆచారవిహీనులైవున్న దుస్థితిచూసి ఎంతో దిగులుచెంది నేను వేదాలకు వ్యాఖ్యానంగా పురాణాలు విరచించి, ప్రతీ ఆశ్రమంలోనూ పాటించవలసిన విధినిషేధాలను సులభ భోదకంగా ఉండేలా చేయాలని పూనుకున్నాను. కాని ఆశ్చర్యకరమైన విషయమేమంటే నాకు భావస్పూర్తి, వ్యక్తీకరణల విషయంలో స్థబ్దత ఏర్పడింది! దీనికి కారణమేమిటో నాకేమాత్రం అంతుపట్టడం లేదు! సర్వజ్ఞుడవైన ఓ పరమేష్టీ! నీవు దయతో నాకు కలిగిన ఈ స్థబ్దతపోయి తిరిగి కార్యసాఫల్యం కలిగే మార్గం ఉపదేశించవలసింది.”
అంటూ ప్రార్థించాడు. ఆతరువాత జరిగిన సంభాషణను సూతమహర్షి ఇలా చెప్పసాగాడు!
సూతుడు:
“ఓ ఋషులారా! ఇలా బ్రహ్మను వ్యాసమునీంద్రుడు ప్రార్థించగా ఆ చతుర్ముఖుడు వినమ్రుడైవున్న వ్యాసునివంక చూస్తూ, చిరునవ్వుతో ఆశీఃపూర్వకంగా యిలా అన్నాడు.
బ్రహ్మ:
“ఓ కృష్ణద్వైపాయన మహర్షీ! ఏదైనా కర్మని నిర్వహించటానికి పూనుకునే ముందుగానే దానిలోని సాధకబాధకాలనూ, మంచిచెడులనూ విచారించే మొదలుపెట్టాలి! అలా యోచించక, చేసే పనులు విపరీత ఫలితాన్నిస్తాయి. ఏ కర్మనైనా ఆచరించేటప్పుడు ఋజుబుద్ధితోనూ, యుక్తితోనూ, కార్యసాధనకు కృషిచేయాలి! నేను చేస్తున్నానన్న గర్వంకాని, యితరులతో పోటిపాడాలన్న మత్సరబుద్ధితోకాని చేయటానికే గనుక ప్రయత్నిస్తే అందుకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి! ఇందుకు పక్షీ౦ద్రుడైన గరుత్మంతుడే ఒక ఉదాహరణ! బలగర్వంవల్లనే చెడి, చివరకు భగవానుని దయచేత విష్ణువాహనత్వం పొందాడు.
ఇక పినతండ్రి పిల్లలైనా పాండవులపైగల మత్సరంతో దుర్యోధనుడు కురువంశ నాశానానికే కారణమైనాడు! మత్సరమువల్లనే జమదగ్నిసుతుడైన పరశురాముడు రాజులపై దండెత్తి క్షాత్రవ తేజమునంతటినీ నశింపచేశాడు. కనుక ఇప్పుడైనా నీవు గర్వాన్ని, మత్సరాన్నీ, ఈరెంటినీ కార్యవినాశ హేతువులు అని గుర్తించు!
బ్రహ్మ వ్యాసునికి విఘ్నకారణం చెప్పుట
బ్రహ్మ:
“ఓ వ్యాసమునీ౦ద్రా! నీవు నీ వేదవిభాగ కార్యారంభంలో, సకలసృష్టికీ ఆద్యుడు, సర్వకార్యములకూ కర్తయైనవాడు, సృష్టిస్థితిలయలకు భాద్యుడూ, త్రిమూర్తులమైన నాచే, శివునిచే, విష్ణువుచేతనూ ప్రణవస్వరూపంగా ధ్యానించబడేవాడూ, ఇంద్రాది దేవతలచేత అష్టదిక్పాలకులూ ఎవని ఆజ్ఞకు వశులై వర్తిస్తున్నారో, అట్టివానిని, భక్తులకు కార్యసాఫల్యతను ఒనగూర్చేవాడూ, అభక్తులకు విఘ్నాలనే చీకట్లతో కన్నుకనబడనీయని విఘ్నకరుడూ ఐన ఆ గజాననుని నీవు స్వవిద్యామదగర్వంచేత పూజించుట, స్మరించుట చేయలేదు. అందువల్లనే నీకీ పరిస్థితి సంభవించింది.
ఓ మునీంద్రా! పరమాత్మ స్వరూపుడైన ఆ విఘ్నపతిని సర్వకార్యారంభములయందూ, శ్రౌత, స్మార్తాదికర్మలయందూ, లౌకిక వైదికకర్మలయందూ స్మరించుటచేతా, భక్తితో పూజించుటచేతనూ సకల విఘ్నములు దూరమౌతాయి. ఈ విఘ్నపతినే వేదశాస్త్రార్థతత్వజ్ఞులు పరమాత్ముడైన ఆనందస్వరూపునిగా, పరబ్రహ్మ స్వరూపునిగానూ పేర్కొంటున్నారు! కనుక అట్టి దేవదేవుడైన గజాననుని శరణుపొందు! ఆ మహానుభావుడు గనుక ప్రసన్నుడైతే నీ వా౦ఛాపరిపూర్తి జేస్తాడు. అలా కానిదే నూరుజన్మలెత్తినా కార్యసాఫల్యత అన్నది సిద్ధించదు!” అంటూ ఉపదేశించాడు.
అప్పుడు వ్యాసమునీంద్రుడు బ్రహ్మతో
వ్యాసుడు:
“ఓ చతురాననా! విఘ్నపతి, విఘ్నహరుడు అని పిలువబడే ఆతడెవరు? ఆయన ఎలా వుంటాడు? ఆయనను తెలుసుకోవడం ఎలాగ? ఇంతకుపూర్వమెవరెవరిని అనుగ్రహించాడు? ఈయన ఏయే అవతారాలెత్తాడు? అప్పుడు ఆయనచేసిన మహత్తర కర్మలెలాంటివి? పూర్వం అతడెవరెవరిచేత పూజింపబడ్డాడు? ఏకార్యములలో స్మరించబడ్డాడు? ఈ వృత్తాంతాన్నంతటినీ అశాంతితో వ్యాకుల చిత్తులడనైన నాకు దయతో విస్తరించి చెప్పుము” అంటూ ప్రార్థించాడు.
Chapter 10 complete
