గణేశ పురాణము - ఉపాసనా ఖండము
85 – స్కందోత్పత్యుపాఖ్యానం – 1
బ్రహ్మ:
అలా ఆ శివపార్వతులు కైలాసానికి వృషభారూఢులై చేరుకున్న తరువాత “ఓ వ్యాసమునీంద్రా! ఆ భిల్లయువతి వేశంలోవున్న పార్వతి మధనతాపం చెందసాగింది! నీటిలోంచి ఒడ్డునపడిన చేపలా తీవ్ర విరహబాధకు లోనయింది. శీతోపచారములుగాని, చందనం, పచ్చకర్పూరం మొదలైన లేపనాలేమీ ఆమెకు ఉపశమనాన్ని కల్గించలేకపోయాయి. పైగా అవి ఆమె తాపాన్ని మరింతగా పెంచాయి. ఇలా ఎంతోకాలము గడచిన తరువాత శల్యావశిష్టయై కృశించిoది. అప్పుడు ఆమె ఒకనాడు శంభుని సన్నిధికి చేరి యిలాఅన్నది.
పార్వతి:
“ఓ ప్రభూ! నీవెందుకనో ఈ మధ్యన నాపై శీతకన్ను వేశావు! సూర్యకిరణాలు సోకనిదే కమలం వికసించజాలనట్లు, నీ కరస్పర్శసోకని నామేను పొందే విరహం యింతింత అని వర్ణింపనలవికాకుండా వున్నది! ఎన్ని ఉపచారాలు చేసినా మదనాగ్నిచే కలిగే తాపం శాoతించటంలేదు. దీనికేదైనా ప్రతిక్రియ సల్పి నా బాధను నివారించు!” అంటూ “ ఈ మన్మధుడు నీచే భస్మీభూతుడైనా నన్ను నిలువనీయకున్నాడు స్వామీ! నీ దయ, నీప్రేమా మాత్రమే నాకిక శరణ్యం” అంటూ క్రీగంట చూస్తూ తలవాల్చుకుని నిలుచుని నర్మగర్భంగా పలికిన శర్వాణి మాటలువిన్న ఆ మాధనాoతకుడైన శంకరుడు చిరునవ్వుతో ఆమె చేయందుకుని తన అక్కున చేర్చుకుని మదనునిచే వశీకృతుడై ఆమెను పర్యంకముపై పరుండపెట్టాడు. మదనప్రేరితుడైన ఆ శివుడు ఉమామనోహరుడై పార్వతీప్రియుడై ,పార్వతీప్రియుడై యదేచ్చగా రమించాడు.
అలా శివుని ముడోకంటిచే భస్మీకృతుడైన దైవకార్యమైనట్టి శివపార్వతుల సమాగమాన్ని ఏర్పాటుచేయటంలో కృతకృతుడైయ్యాడు రతీపతియైన మన్మధుడు. ఇక భిల్లయువతిగా పార్వతి ఆమెపాటి ఒకరిలో ఒకరు లయమై, శ్రుతీలయల్లా, పాలూ తేనెల్లా కలిసిపోయి సృష్టికే ఒక వినూత్నశోభను చేకూర్చారు. ఇలా దాదాపు అరవైవేల సంవత్సరాలు గడచిపోయాయి! ఈ లోగా తారకాసురునిచేత స్థానభ్రష్టులైన దేవతలంతా మన్మధునికి కార్యసిద్దియైన విషయం విని కైలాసం చేరుకున్నారు. ఐనప్పటికీ ఏకాంతంలో ఉన్నట్టి ఆ ఉమాశంకరుల ఏకాంతానికిభంగం చేయటానికి ఎవరూ సాహసం చేయలేకపోయారు. మూకీభావంతో తలలుదించుకుని తారకాసురుని భీతిచేత తిరిగి పర్వతగుహలకు వెళ్ళిపోయి తమ తలదాచుకున్నారు.
దేవగణాలు:
‘అహా! ఈ దుష్టరాక్షసుని పీడా మనకు ఎప్పటికి విరుగుడవుతుందోకదా! ఈ శంకరుడు తిరిగి మనకు ఎన్నటికి స్వస్థతను ప్రసాదిస్తాడోకదా!’ అనుకోని వాపోతూ చింతాక్రాంతులై వుండగా, దేవగురువైన బృహస్పతి వారికి యిలా హితోక్తులను పలికాడు:
బృహస్పతి:
“ ఓ దేవతలారా! దీనికి ఒక్కటే మార్గంవున్నది. రూపాంతరం చెందటంలో ప్రసిద్ధుడైనట్టి అగ్నిని శంకరునివద్దకు పంపించండి. అతడే శంకరుని ప్రభోధించగల సమర్ధుడు. అప్పుడు మీకార్యం నెరవేరుతుంది.”
ఆ మాటలు విన్న దేవతాగణములు హృదయాలపై పన్నీటిజల్లు కురిసినట్లయింది! వారంతా అగ్నిహోత్రుని ఆహ్వానించి యిలా స్తోత్రం చేశారు. “ ఓ అగ్నిభట్టారకా! యజ్ఞయాగాది క్రతువులకూ, సమస్తమైనట్టి సంస్కారములకూ ఆధారమైనట్టి పరమపావనుడవు! నీవే దేవతలమైన మాకు ఆహారాన్ని ఆహుతులరూపంలో గ్రహించి అందించే వాహకుడవు. కనుకనే దేవతలకు ముఖమైనావు! బడబాగ్ని, దావానలాగ్ని ఇవన్నీ నీకు రూపాంతరాలే! పంచాగ్నివిద్యద్వారా ఉపాసించబడేవాడవూ నీవే! సుర్యాన్తర్వర్తివై సముద్రములలో జలాన్ని ఆవిరిచేసి మేఘాలుగా మార్చినా, జఠరాగ్నివై ప్రానులుతిన్న ఆహారాన్ని జీర్ణింపచేసినా, ప్రాణాగ్ని స్వరూపివిగా జీవులకు శరీరంలో ప్రాణాలు నిలుచుటకు ఆధారుడవైనా, చివరకు నచికేతసాగ్నిగా శరీరాలను నీలో దగ్ధమొనర్చి వారిలోని పoచభూతాలనూ వేటికవిగా విడిపోవటానికి దోహదకారుడవైనా కామాగ్నిగా సృష్టికి ఆధారభూతమైన మైధునక్రియకు ప్రోద్బలంచేసి జీవులకు తిరిగి శరీరాలు ధరించేందుకు కారణమైనట్టి ఆ గణిత గుణములుకల మహామహిమోపేతుడవు నీవే! నీకివే మా ప్రణామాలు! నీవే మూడులోకాలకూ మేలుకలిగే కార్యాన్ని నిర్వహించగల్గిన సమర్ధుడవు! ఈ తారకాసురుని బాధ మాకు విరగడ కావాలంటే శివుడు ఉమా పరిష్వంగంనుండి వెలుపలికి వచ్చేలా ప్రభోధించాలి! నీవు మారువేషంలో కైలసానికి వెళ్లి భిక్షను యాచిoచవలసింది! అలాగనుక చేసినట్లైతే జగత్కళ్యాణము, దేవకార్యమూ సిద్ధిస్తాయి. కనక వేగిర వెళ్ళి ఈ కార్యసాధనకై పూనుకోవలసింది!” అంటూ అర్ధించిన దేవతల అభ్యర్ధనను మన్నించి, అగ్ని దేవుడు కాషాయాంబరమును ధరించి యతివేషాన్ని దాల్చాడు. నేరుగా పార్వతీపరమేశ్వరులుండే తావునకువెళ్ళి ద్వారంవద్ద నిలిచి చిన్నగా “భిక్షాందేహి!” అంటూ ముమ్మారు అర్ధించాడు. శివపార్వతులిద్దరూ ఆ శబ్ధంవిని ఆశ్చర్యచకితులై ఈ భిక్షకునికి ఇవ్వదగినది తమవద్ద ఏమున్నదా అని యోచించారు. అప్పుడు శివుడు ఉమా యిరువురూ వెంటనే వస్త్రదారులవ్వగా భిక్షకై ఉమాదేవియోక్క దోసిలిలో భవుడు తన వీర్యాన్నుంచాడు. ఆ పార్వతి దాన్ని ధరించుటకు ఆశక్తురాలై, శివుని భావాన్ని గ్రహించి ఆమె ఆ వీర్యాన్ని భిక్షకునికి యిచ్చింది.
పార్వతి:
“ఓ భిక్షకా! ఇది భూపతనమైతే మూడులోకాలనూ దహిస్తుంది సుమా!” అంటూ హెచ్చరించి లోనికి వెళ్ళిపోయింది.అప్పుడు అగ్నిక్రింద ఉంచజాలక శాపభయంచేత ఆ హరవీర్యాన్ని మ్రింగాడు. సిగ్గుపడుతూ లోపల భరింపరాని తాపంచెందుతూ ఒక సూర్యోదయకాలంలో సూర్యుడు తులారాశిలో ఉన్న సమయాన ఆ శివతేజస్సును శౌచాకృత్యాలు నిర్వహించే సమయంలో ‘శివతేజస్సును ఆతడి జటాజూటంనుండి వెలువడ్డ అతడి ప్రియురాలైన గంగమాత్రమే భరించగలదు’ అనుకుని గంగానదీజలములలో విడిచాడు.
అదే సమయానికి స్నానార్ధమై కృత్తికలు ఆ గంగకి వచ్చారు. ఆ ఆరుగురూ ఆ శివతేజాన్ని పానంచేశారు. వివస్త్రలవటంచేత స్నానం పూర్తయ్యాక అగ్ని దూరంగా వెళ్ళేదాకా ఆగి తమ వస్త్రాలను ధరించి నిజగ్రుహాలను చేరారు. వారి భర్తలు వారి ముఖాలు దేదీప్యమానంగా వెలుగుతున్న వారి ముఖాలనుచూసి తమ దివ్యదృష్టిద్వారా వారు గర్భిణులని గ్రహించారు. ‘మీ ముఖాలను చూడటమే పాపం’ అంటూ ఆ కృత్తికలను తమ యిల్లనుండి వెళ్ళగొట్టారు. అప్పుడు ఆ కృత్తికలు తిరిగి గంగాతీరం చేరుకుని అక్కడి గంగాతీరంలోవున్న రేల్లుదుబ్బులలో తమ గర్భాములను జారవిడిచి శుచిస్నానం ఆచరించి తమ యింటికి వెళ్ళిపోయారు.
కుమారస్వామి జననం
అలా కృత్తికలు వెళ్ళిపోయిన తరువాత ఆ ఆరుగర్భాలు ఒకటిగా కూడి అందులోంచి ఆరుముఖాలు పన్నెండు చేతులు కలిగినట్టి అందమైన బాలుడు ఉద్బవించాడు. అతడు హుంకారం చేసినంత మాత్రాననే ఆకాశంలోంచి చుక్కలు రాలిపడ్డాయి. పాతాళము మొదలుగాగల పద్నాలుగు లోకాలూ కంపించాయి. ప్రచండమైన వాయువువీచగా చెట్లన్నీ పెకలించబడ్డాయి. సహస్రకిరణుడైన సూర్యభగవానుడు సైతం మంచుతో కప్పబడ్డాడు.
అప్పుడు నారదమహర్షి ఆకాశమార్గంలో శంకరుని దర్శించుకునే నిమిత్తం వెళుతూ, మార్గమధ్యంలో దివ్యకాంతితో శోభిల్లుతూవున్న అమితపరాక్రమోపేతుడైన ఆ బాలుని చూచి దివ్యదృష్టితో అతని వివరం తెలుసుకున్నాడు. కైలాసానికి వెళ్ళి అక్కడ ఉన్న పార్వతీపరమేశ్వరులకు ఈ వృత్తాంతాన్ని తెలియజేసాడు. సకల లోకాలలోనివారూ ఆ దివ్య బాలకుడు శివాత్మజుడని ఎరిగి సంతుష్టులైనారు. దేవతలు దేవదుందుభులు మ్రోగించారు. అప్సరసలు నాట్యమాడారు! గంధర్వులు తమ దివ్యగానాన్ని ఆలపించారు.
నారదుడు:
“జగన్మాతా! నేనీ కైలాసానికి వస్తూ మార్గమధ్యంలో నీ కుమారుణ్ణి చూశాను. ఆరుశిరస్సులతో పన్నెండు బాహువులను కలిగి కోటిసూర్యులకు సమానమైన కాంతితో ప్రకాశిస్తూన్నాడు! ఆతణ్ణి నీవుగాని గంగాతీరంలో విడిచావా ఏమి?
కోటిమన్మధులను మించిన దివ్యసౌoదర్యంతో కేవలం హుంకారమాత్రం చేతనే బ్రహ్మాండాన్ని గడగడలాడించినట్టి ఆ సుందర బాలకుడిపై నీకీ కాఠిన్యం ఏలతల్లీ?” అంటూ నారదుడు అంతర్హితుదయ్యాడు. అప్పుడు గిరిరాజనందనయైన పార్వతి ఎంతో ఆత్రంగా తన కుమారుని చెంతకు పయనమై వెళ్ళింది.
Chapter 85 Complete
