గణేశ పురాణము - ఉపాసనా ఖండము
18 – సిద్ధక్షేత్ర మహాత్యం
ఎంతో ఆసక్తిగా పై కథను వింటున్న సోమకాంతమహారాజు ఆ కథను రసవత్తంగా, అనుగ్రహపూర్వకంగా వినిపిస్తున్న భృగుమహర్షితో ఇలా ప్రార్థించాడు.
సోమకాంతుడు:
“ఓ మహర్షిసత్తమా! కైలాసంలో గణేశుని మంత్రోపదేశాన్ని శంకరుడివద్ద అనుగ్రహంగా సంప్రాప్తించుకున్న శ్రీమహావిష్ణువు తన మంత్ర అనుష్టానికై ఏ ప్రదేశానికి వెళ్ళాడు? ఆ మంత్రాన్ని ఎక్కడ అనుష్టించి సిద్ధిని పొందాడు? ఏప్రకారంగా ఆ మంత్రసిద్ధి కలిగింది? ఆ విశేషాలన్నీ తమరు నాకు దయతో తెలియజేసి అనుగ్రహించండి!”
ఈ ప్రార్థనకు భృగువిలా జవాబిచ్చాడు.
భృగువు:
“ఓ రాజా! భూమండలంపైన ‘సిద్ధక్షేత్ర’మనే పుణ్యభూమి ఉన్నది. ఆ క్షేత్రంయొక్క విశేషమేమిటంటే – అక్కడ ఆచరించిన తపస్సువల్ల సకలాభీష్టములూ సిద్ధిస్తాయి! అటువంటి మహా మహిమాన్విత సిద్ధక్షేత్రాన్ని చేరుకొని శ్రీమహావిష్ణువు ఎంతోకాలం ఉన్నతమైన సుదీర్ఘ తపస్సును ఆచరించాడు. శివుడిచేత ఉపదేశించబడిన ఆ షడక్షర గణేశమంత్రాన్ని గణేశమూర్తినీ తన యావత్ శరీరంలోని అంగాలపైన న్యాసంతో ఆవాహన చేసుకుని, అంతర్మాతృకా, బహిర్మాతృకా న్యాసములతో, మూలమంత్ర పురస్సరమైన ప్రాణాయామంతో గజాననున్ని తన హృదయంలో ధ్యానిస్తూ, మానసికోపచారపూజను అర్పిస్తూ – ఆ గజాననుని పరమమంత్రాన్ని నూరుసంవత్సరాలకాలం జపించాడు.
అలా చిరకాలమాచారించిన తపస్సుకు, అతని భక్తిశ్రద్ధలచేత సంతుష్టుడైన గజాననుడు ఒక్కసారిగా కోటిసూర్యులకు సమానమైన వెలుగుతో ఎదుట సాక్షాత్కరించి ‘నీ మనోభీష్టములన్నీ అనుగ్రహించగలను! వలయు వరాన్ని కోరుకొమ్మ’ని అనుగ్రహించాడు.
అప్పుడు కార్యార్థియై తపస్సు ఆచరించిన విష్ణువు అంజలి ఘటించి గణేశుని ఇలా స్తుతించాడు.
విష్ణువు:
“సకల దేవగణములచే వంధ్యనీయుడవైన ఓ దేవదేవా! బ్రహ్మరుద్రేంద్రాదులకు సైతం తమ తపశ్శక్తితో నిన్ను దర్శించుట అసాధ్యంకాగా ఇక సామాన్యులకు – తరమా? నీవు అనేకరూపాలలో భక్తులపాలిట కల్పతరువై వారిని అనుగ్రహించి అభిష్టసిద్ధులను ప్రసాదించే ఓ దయామూర్తీ! నీవు వ్యక్తావ్యక్తరూపుడవు. అణువుకన్నా అత్యంత సూక్ష్ముడవు, మహత్తుకన్నా గొప్ప మహిమోపేతుడవు. త్రిమూర్త్యాత్మకుడవై మాద్వారా సృష్టిస్థితిలయములను ఆచరించేది నీవే! అంతర్యామిగా జీవకోటిలో వారి ఆత్మవై వెలుగొందేదీ నీవే! స్తావరజంగమాత్మకమైన జగత్తంతా వ్యాపించినవాడవు! సర్వశక్తిమంతుడవు! ఈ జగత్తంతా నీలోనుంచే ఉద్భవించిన కారణాన జగత్పితవూ, రక్షకుడవూ, పోషకుడవూ కూడా నీవే!
ఓ దేవా! చతురాస్యుడైన ఆ బ్రహ్మ ప్రార్తనమేరకు దుష్టాత్ములైన మధుకైటబులను సంహరించబూని అనేక వేలసంవత్సరాలు ఘోరయుద్ధం చేసినా వారిని ఏమిచేయలేక దిక్కుతోచని స్థితిలో మిమ్ము శరణువేడాను! నాయందు దయతో ఆ రాక్షసవధకు తగిన శక్తియుక్తులను ప్రసాదించు! జయమును, కీర్తిని, నీయందు ఏకాంత భక్తినీ అనుగ్రహించు!”
అంటూ స్తుతించిన శ్రీహరితో
గజాననుడు:
“ఓ వాసుదేవా! నీ అభీష్టం మేరకు సకలమూ సిద్ధించగలదు! ఆ దుష్టదానవ సంహారం నీవల్లనే నిరాటంకంగా జరుగగలదు! నీకు యశస్సు, బలమూ, ధైర్యమూ, తేజస్సూ కలుగుతాయి! శుభమగుగాక!” అని ఆశీర్వచనపూర్వంగా అనుగ్రహించి ఆ భక్తజనపాలకుడైన గజాననుడు అంతర్ధానం చెందాడు.
గజాననుని అనుగ్రహానికి ఎంతగానో సంతోషంపొందిన ఆ మహావిష్ణువు యిక గెలుపు నిశ్చయమన్న దృఢవిశ్వాసంతో గణేశుడు వరాన్నిచ్చిన ఆ ప్రదేశంలో స్పటికమయమైన దేవాలయాన్నొకదాన్ని నిర్మించాడు. బంగారు గోపురంతో ప్రకాశిస్తున్న ఆ మందిరంలో గండకీసంబంధమైన సాలగ్రామంతో గణేశునిమూర్తిని చెక్కించి, అక్కడ సమంత్రకంగా ప్రతిష్టించాడు. ఈ ప్రదేశంలో శ్రీమహావిష్ణువుయొక్క సకల అభీష్టాలు సిద్ధించడం వల్ల దీనికి సిద్ధక్షేత్రమన్న పేరువచ్చింది.
ఆ తరువాత శ్రీమహావిష్ణువు దుష్టులైన ఆ మధుకైటభులను యుద్ధానికి పిలిచి కవ్వించి, వారితో ఘోరమైన యుద్ధం చేయసాగాడు. ఇలా చాలాకాలం యుద్ధం చేసాక వాళ్ళకు ‘మీరు కోరిన వరాల్నిస్తాను కొరుకొ’మ్మని అన్నాడు.
అప్పుడు వాళ్ళు పరిహాసంగా ఇలాఅన్నారు.
మధుకైటబులు:
“ఓహరీ! నీవే మానుంచి ఏదైనా వరాన్నికోరుకో! మేమే నీకు ఓ వరాన్ని అనుగ్రహిస్తాము!”
వారు భాగవతీమాయకు లోనైనారని లోలోపలే సంతసించి పైకిమాత్రం వినయంగా అట్లైతే
విష్ణువు:
“నాచేతిలో మీరిరువురూ వధింపబడే వరాన్ని ప్రసాదించండి!” అన్నాడు. అప్పుడు వారిద్దరూ నిశ్చేష్టులై క్షణకాలం యోచించి
మధుకైటబులు:
“అట్లైన మమ్మల్ని జలంలేని ప్రదేశంలో వధించు! మేము ఆడిన మాట తప్పనివారం! కనుక అలాంటి ప్రదేశమేదైనా వుంటే అక్కడ నీ అభీష్టం నెరవేర్చుకో!” అన్నారు.
భృగువు
“ఓ సోమకాంత మహారాజా! ఆవిధంగా యోగమాయకు వశ్యులైన ఆ మధుకైటబులను దానవాంతకుడైన ఆ హరి గణేశానుగ్రహంచేత తన తొడపై ఉంచుకొని, చక్రాయుధంతో వారి కుత్తుకలుత్తరించాడు!” ఈ ప్రకారం గణేశానుగ్రహం – అతనికి అభీష్టకార్యసిద్ధిని ప్రసాదించింది!
ఈ రాక్షసుల సంహారానికి దేవదుందుభులు మ్రోగాయి. పుష్పవృష్టి కురిసింది!” ఈ యావద్వృత్తాంతాన్నీ విష్ణువు అప్పుడు తన కుమారుడైన బ్రహ్మదేవునికి వివరించాడు! తమకు చేసిన ఆ మహోపకారానికై సకల దేవతలూ గజాననుని స్తుతించారు. మహాప్రభావయుతమైన ఆ సిద్ధక్షేత్ర మహత్యమును ఎవరైతే వింటారో, వాళ్ళు తమ సకల పాపములనుంచీ దుష్కర్మనుంచీ విముక్తులై, భయాన్ని పోగొట్టుకున్నవారై అన్ని మనోభీష్టాలనూ నిస్సందేహంగా పొందగలరు” అంటూ సోమకాంతునికి భృగుమహర్షి వివరించాడు.
Chapter 18 complete
