గణేశ పురాణము - ఉపాసనా ఖండము
15 - పూజా నిరూపణం
ఆ తరువాత జరిగిన వృత్తాంతాన్ని భృగువు సోమకాంత మహారాజుకిలా చెప్పసాగాడు.
భృగువు:
అలా ధ్యాననిమగ్నుడైవున్న చతుర్ముఖుడికి ఒక మహత్తరమైన దివ్యానుభూతి స్వప్నం రూపంలో కలిగింది. తాను ఆ జలాలపైనున్న ఆకాశంలో పరిభ్రమిస్తూ ఒక పెద్ద వటవృక్షాన్ని చూశానని ఆ వివరాలను వ్యాసునితో యిలా వర్ణించి చెప్పసాగాడు.
బ్రహ్మ స్వప్న వృత్తాంతం
బ్రహ్మ:
నాయనా! అప్పుడు సమస్త సృష్టీ ప్రళయజలాలలో నశించిపోగా, ఈ వటవృక్షమొక్కటి మాత్రం ఎలా మిగిలివున్నదా? అన్న ఆశ్చర్యంతో పరికించి చూడగా ఆ వటవృక్షపు పత్రంమీద ఒక చిన్న బాలుణ్ణిచూశాను! నాలుగు చేతులు కలిగి చెవులకు చక్కని కుండలాలను ధరించి, ఎఱ్ఱటి వస్త్రాలనూ, కటిసూత్రాలతోనూ ఉండి ఎనుగుముఖమూ, మానవ శరీరముగల ఆ బాలకుడి శిరస్సున అమిత తేజస్సుతో ప్రకాశిస్తూన్న దివ్యకిరీటమూ, నుదుట చంద్రకళను ధరించిన ఆ బాలకుడి మెడలో దివ్యమైన మణిహారాలు విరాజిల్లుతున్నాయి. ఆ బాలకుడిప్పుడీ వటపత్రంపైన ఎలావచ్చాడా? అని ఆశ్చర్యచకితుణ్ణైన నా శిరస్సుపైన ఆ బాలగజాననుడు తన తొండంతో నీటిని సంప్రోక్షించాడు. అప్పుడు నేను పకాలున నవ్వాను. ఆ బాలుడా మఱ్ఱాకు పైనుండి లేచి నావడిలో కూర్చుని మృదుమధురమైన గొంతుతో యిలా అన్నాడు.
బాలగజాననుడు:
“ఓ నాల్గుముఖాలు కల్గిన బ్రహ్మా! నీవు వయస్సులో ఎంతో పెద్దవాదవైవుంది కూడా చిన్నవారికన్నా కూడా చిన్నవాడిలా ప్రవర్తించి, అహంకారబుద్ధితో విర్రవీగినందుకే నీకు అనేక విఘ్నములు దాపరించాయి! చింతావ్యాకులుడవై ఉన్న నీ సకల చింతలూ తోలిగేందుకు చింతావినాశకరమైన నా ‘ఎకాక్షరీ గణపతి మహామంత్రాన్ని’ నీకు ఉపదేశిస్తాను. దాన్ని పురశ్చరణ విధానంలో పదిలక్షలు జపించు! అప్పుడు నీకు దర్శనాన్నుగ్రహించి ఆద్భుతమైన సృష్టిరచనా సామర్థ్యాన్ని ప్రసాదిస్తాను!”
అంటూ స్వప్నంలోనే ఉపదేశమిచ్చి అంతర్ధానం చెందాడు. ఆ తరువాత స్వప్నంలోంచి మేల్కొని, గజాననుని అనుగ్రహానికి కృతజ్ఞతతో ఆనందాంబుధిలో ఓలలాడాను! ఆ తరువాత ఆ దేవదేవుని అజ్ఞానుసారం ఒక్క కాలిపైన పద్మంలో నిలిచి నిశ్చలబుద్ధితో జపంచేశాను. ఇంద్రియాలను నిగ్రహించి, ఆహారమును వర్జించి నిశ్చలంగా వేయి సంవత్సరాలు ఘోరమైన తపస్సును ఆచరించాను. ఆ తపోతీవ్రతకు నా నాల్గు ముఖాలనుండి మహాజ్వాలలు ఉత్పన్నమై సకలలోకాలనూ తల్లడిల్లచేశాయి! నా ధృడనిష్టకూ, భక్తికీ సంతుష్టుడైన గజాననుడు నా ఎదుట అనుగ్రహమూర్తియై సాక్షాత్కరించాడు. ఆ దివ్యసుందర ప్రకాశమైన రూపం వర్ణించడం మాటల్లో అలవికానిది.
గజాననుడి సాక్షాత్కారం
కోటిసూర్యులకు సమానమైన తేజస్సుతో విరాజమానుడై, అగ్నిహోత్రునిలా, ప్రజ్వరిల్లే కాంతితో ఒక తేజఃపుంజములోనుండి ఆ దేవదేవుడు ఆవిర్భవించాడు. ఒకచేత పరశువునూ, మరోచేత ఎఱ్ఱటి కమలాన్నీ ధరించి, దివ్య పుష్పమాలలను మేడలోదాల్చి, సౌందర్యానికి ఆటపట్టువా అన్నరూపంలో, గజవదనంతో భక్తుల మనోభిష్టాలనన్నిటినీ నెరవేర్చే వరదమూర్తియై, సకల మానవుల, దేవ, యక్ష, గంధర్వ, సిద్ధసాధ్యుల యొక్క విఘ్నాలను నివారించే ఆ దివ్యమూర్తి కళ్ళు మిరుమిట్లుగొలిపే కాంతితో దర్శనమిచ్చాడు. అంతటి కాంతిని తట్టుకోలేక భయభ్రాంతుణ్ణైయ్యాను. ముర్చిల్లిన నన్ను ఉపశమింపచేసి నాకు అభయాన్నిస్తూ గజవదనుడు యిలా అన్నాడు.
గజాననుడు:
“ఓ చతురాననా! భయాన్ని వీడు! నీకు స్వప్నంలో మంత్రోపదేశం చేసినదీ, నీవు నిరతమూ నీ హృదయకమలంలో ధ్యానిస్తున్నదీ నన్నే! ఇక ఇప్పుడు నీకు నా సౌమ్యరూపాన్ని అనుగ్రహంగా దర్శనం యిస్తున్నాను! నీ మనోభీష్టమును కోరుకో! నీ సకల వాంఛితాలనూ అనుగ్రహిస్తాను!”
అప్పుడు జరిగిన వృత్తంతమంతటినీ సోమకాంతుడితో వివరిస్తూ భృగువిలా కొనసాగించాడు.
భృగువు:
ఓ రాజా! ఆవిధంగా కృపాళువైన గజాననుని పరమానుగ్రహాన్ని పొందిన చతురాస్యుడు తన నాలుగు శిరస్సులనూ ఆ దివ్యచరణాలకు తాకిస్తూ, హృదయం నిర్మలమవగా, గజాననుని అనుగ్రహవాక్యాలకు పరమానందభరితుడై ఇలా వరం కోరుకున్నాడు.
బ్రహ్మ:
“ఆదీ, అంతమూ లేనటువంటివాడివీ, నిర్గుణుడవూ, విభజించబడనివాడవూ అయిన ఓ కరుణాసింధో! నీకు నాయందు అనుగ్రహం కల్గితే ఎన్నడూ నీ పాదపద్మాలయెడ విస్మృతి కలుగని అచంచలమైన భక్తిని ప్రసాదించు! నానాసృష్టి రచనాశక్తినీ, నిర్మాణ సామర్థ్యాన్ని కూడా ప్రసాదించు! నాకు దయతో సకల విఘ్నబాధలనుంచీ విముక్తి కలిగించు!
ఇది మొదలు ఎప్పుడైనా నీ స్మరణతో ఆరంభించే నాయొక్క సకల కార్యములూ సానుకూలమయ్యేటట్లూ, నిర్మలమైన బ్రహ్మజ్ఞానాన్నీ పొందేలా కర్తవ్యనిష్టనూ, అంత్యములో మోక్షన్నీ అనుగ్రహించు!”
ఈ వాక్యాలను విన్న గజాననుడు “తథాస్తు!” అంటూ అనుగ్రహించి అంతర్ధానం చెందాడు! మంత్రానుష్టానం సంపూర్తియైన సందర్భంగా ఆ దేవదేవుడైన గజాననునికి సకల శుభలక్షణముతో అలరారేవారూ, అనేకవిధాలైన రాత్నాభరణములతో ప్రకాశిస్తున్నవారూ, ఐన ఇద్దరు దివ్య కన్యకలనూ దక్షిణగా సమర్పించుకున్నాడు.
ఆ తరువాత కర్పూరమంగళ నీరాజనాన్నిచ్చి, గణేశుని సహస్రనామాలతో అర్చించి, ప్రదక్షిణాదికాలను, నమస్కారమును సమర్పించి, అపరాధ క్షమాపణకై వేడుకున్నాడు.
అలా బ్రహ్మచే సమర్పించబడిన దక్షిణగా సిద్ధి, బుద్ధి అనే కన్యకలను స్వీకరించి గజాననుడు అంతర్హితుడైనాడు. ఆ దేవదేవుని అనుగ్రహవిశేషంచేత బ్రహ్మ తిరిగి యధావిధిగా సృష్టిని కొనసాగించాడు!
Chapter 15 complete
