గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

74 – చతుర్థీవ్రత మహాత్మ్యం – 2

ఆ విధంగా ఇంద్రుడు శూరసేనమహారాజుకు చతుర్థీవ్రత కథనాన్ని ఇతిహాసంతోపాటు వివరించాక ఎంతో శ్రద్ధతో ఆలకించిన ఆ శూరసేనుడు తన దూతలను పిలిచి యిలా ఆజ్ఞాపించాడు.

శూరసేనమహారాజు:

“ఓ దూతలారా! మీరు వెంటనే నగరంలోకి వెళ్ళి సంకష్టచతుర్థీ వ్రతాన్ని ఎవరైనా పుణ్యపురుషుడు ఆచరించివున్నట్లైతే అతడిని ఉన్నఫళంగా మీవెంట తీసుకురండి!”

ఈ మాటలు విన్న రాజదూతలు వెంటనే నగరిలోకి వెళ్ళి ప్రతి ఇంటికీ వెళ్ళి ‘ఆ ఇంట్లో చతుర్థీవ్రతాన్ని ఆచరించినవారెవరైనా ఉన్నారా?’ అంటూ ప్రశ్నించసాగారు. ఇలా తిరుగుతూన్న వారు ఒకచోట ఆగివున్న ఒక దివ్యవిమానాన్ని చూశారు. ఆయింట్లో ఒక దుష్టఛoడాలస్త్రీ కుష్టువ్యాధితో బాధపడుతూ, శరీరపు గాయాలనుండి రసి స్రవిస్తూoడగా ఈగలు, దోమలు ముసురుతూన్న కృశించిన దేహంతో ఉన్నది. ఆమెను తీసుకువెళ్ళడానికై ఒక దివ్యవిమానం వచ్చి ఆగింది. అందులోంచి గణేశదూతలు దిగుతుండగా, ఆ రాజభటులు వారినిలా ప్రశ్నించారు.

రాజభటులు:

“ఓ దూతలారా! ఈమెను చూడటానికే ఏవగింపు కలిగేంత జుగుప్సాకరంగా ఉన్నది. పైగా ఛoడాల కులములో పుట్టినట్టిదికూడాను! ఇంతటి పాపి స్వర్గములోకి ఎలా వెళ్ళగలదు? ఈమె ఇంతకు పూర్వమెవరు? ఈ దుస్థితి ఈమె కెoదువల్ల కల్గింది? ఈమె స్వర్గవాసానికి వెళ్ళడానికి ఏపుణ్యం కారణమైనది? ఈ వృత్తాంతాన్ని మాకు వివరించండి!” అంటూ ప్రశ్నించిన వారితో గణేశభటులు యిలా బదులిచ్చారు.

గణేశదూతలు:

“ఓ రాజభటులారా! బంగాళాదేశంలో సారంగధరుడనే పేరుగల క్షత్రియ ప్రముఖుడుoడేవాడు. ఈమె అతని కుమార్తె సుందరి అన్న నామధేయముగలది! మహాసౌoదర్యంతో మహాతపస్వుల చిత్తాలను సైతం మోహింపచేయగల సామర్థ్యం గలది. జాణతనంలో దిట్ట! జారత్వంతో అందరినీ వివశులను చేస్తూ, యువకులను బ్రహ్మచర్యంనుంచి పతితులను చేస్తూ సంచరిస్తూండేది! విలువైన దుస్తులను ధరించి, సకలాలంకరణములను ధరించి విషయభోగములననుభవిస్తూ, సిగ్గూ, లజ్జలను విడిచి వేశ్యవలె బంగాళానగరంలో సంచరించేది. ‘చిత్రుడు’ అన్న యువకుడిని వివాహమాడినా విశృంఖలత్వంతో అతడినికూడా మోసగిస్తూ, అతడి ద్రవ్యాన్ని అంతటినీ కర్పూరంలా హారతిగా వెలిగించింది.”

ఇలా ఉండగా ఒకనాడు తనయింట భర్త శయనించిఉండగా, మంచంనుండి దిగి సకల అలంకారములు చేసుకుని తన విటునివద్దకు పోతుండగా భర్తకు మెలకువవచ్చి ఆమె చేయిపట్టి, కొట్టితిడుతూ

“ఓసీ దౌర్భాగ్యురాలా! ఉచ్ఛనీచాలను వీడి కట్టుకున్నవాణ్ణి ఏమార్చి విటుడికై అంగలారుస్తున్నావే? నీపాపం పండకపోతుందా?” అంటూ మందలించాడు.

ఇలా అన్న భర్త వాక్యాలకు ఆమె పుండుపై కారం చల్లినట్లైoది, తాత్కాలికంలో కోపాన్ని దిగమ్రింగుకుని ఒక అర్థరాత్రి సమయంలో పదునైన ఖడ్గం చేతబూని తన భర్తను దారుణంగా పోదిచివైచింది. ఆ తరువాత తన జారునితో రమించటానికి పారిపోయింది. ఆమె అలా రమిస్తుండగా యిరుగుపొరుగులవారీ వృత్తాంతాన్నంతటినీ తెలుసుకుని ఆ దేశపు రాజువద్ద ఫిర్యాదుచేశారు! అప్పుడు ఆ రాజాజ్ఞ మేరకు రాజదూతలు పొంచివుండి ఆమెను ఇంటికివెళ్ళే మార్గంలో పట్టుకుని బంధించి ఆమెను రాజసన్నిధికి ఈడ్చుకోనిపోయారు!

అప్పుడు రాజు ఆమెకు మరణశిక్ష విధించగా ఆ భటులామెను ఊరివెలుపలికి తీసుకువెళ్ళి మరణదండనను అమలుజరిపారు. శరీరం విడిచీ విడవగానే యమదూతలు ఆమెను ఈడ్చుకొని వెళ్ళి ఘోరనరకములను పొందింపచేశారు. ఆ నరకాలలో క్రిములచేత పీకబడుతూ తన దుష్కృత్యాలను గుర్తుచేసుకుని అధోముఖియై ఎంతగానో లజ్జనొందుతూ మహావేదనల ననుభవించి, ఈ రకంగా కల్పాంతంవరకూ గడిపి చండాలస్త్రీయై దుష్టమైన వ్యాధితో జన్మించింది. ఒకనాడామె మద్యం పూర్తిగా సేవించి మతిభ్రమించగా రాత్రి ప్రధమయామంలో లేచి ఆకలి తీర్చుకోడానికై భిక్షాటన నిమిత్తం దైవవశాన ఒకానొక సంకష్టచతుర్దీ వ్రతకారకుని ఇల్లు చేరుకున్నది! వారుపెట్టిన అన్నాన్ని చంద్రోదయ సమయంలో భుజించింది! గజాననుని నామాన్నికూడా మనసార స్మరించిoది. ఆ పుణ్యవిశేషంచేత తక్షణమే గజాననుని దూతలు విమానం కొనివచ్చారు. సంకష్టచతుర్ధీవ్రత దివసాన్న చంద్రోదయ కాలంలో గజాననుని స్మరిస్తూ ప్రసాదాన్ని భుజించిన కారణంగా ఈమెకు ఇంతటి భాగ్యమబ్బింది!”

రాజభటులు:

“ఓ గణేశదూతలారా! కార్యార్థులమై వెళ్తున్న మాకు యిది ఒక మహాద్భుతంగా తటస్థమైనది! మారాజు చెప్పిన వాక్యాన్ని మీకు తెలియజేస్తాము, ఆలకించండి.”

“దేవతల రేడైన ఇంద్రుడు గృత్న్యమదుని దర్శించుకోగోరి, ఆ మార్గమధ్యంలో భ్రుశుండిమహర్షి ఆశ్రమంలో అతడినికూడా దర్శించి ఆయన పూజను గ్రహించి అనుజ్ఞను బడసి, తిరుగుప్రయాణంలో అమరావతికి వెలుతూండగా ఈ శూరసేనపురంలోని ఒక వైశ్యుని దృష్టిసోకడంచేత అతడి విమానం నేలబడింది! ఆ విషయం విన్న శూరసేనుడు అక్కడికి వెళ్ళి ఇంద్రుని పూజించి, అతడి విమానం పతనమవడానికిగల కారణమడిగాడు.

అప్పుడు ఇంద్రుడా కారణాన్ని సంగ్రహంగా అతడికి వివరించి, తిరిగి తన విమానం యధాప్రకారం నింగికెగారాలంటే అది కేవలం సంకష్టచతుర్థీవ్రత సంభవమైన పుణ్యప్రభావం వల్లనే జరుగుతుందనీ, అటువంటి వారిని అన్వేషించమనీ పురిగోల్పగా, మా రాజాజ్ఞను అనుసరించి అటువంటి వ్రతానుష్టానం చేసిన వ్యక్తికై వెదుకుతూ యిలా వచ్చాము. గనుక ఓ గణేశదూతలారా! ఈమె గనుక ఆ సంకష్టచతుర్ధీ వ్రతాన్ని అనిష్టించినట్లైతే ఈమెను మాతో మాప్రభువు శూరసేనులవారి సన్నిధికి తీసుకొనిరండి! ఈమె తన పుణ్యం ధారపోసి ఇంద్రుని విమానాన్ని తిరిగి మింటినoటేలా చేయగలదు! దేవతాధిపతియైన ఇంద్రుడు సకలురచే వందనీయుడవటంచేత ఇంద్రుని కార్యము నేరవేరటానికై మనముభయులమూ రాజాజ్ఞ పాటించవలసిందే! మీకు ఈమాట నచ్చితే ఆ ప్రకారం చేయండి!”

గణేశదూతలు:

“ఓ రాజభటులారా! మాకు ఈమెనివ్వటానికి గణేశుని ఆజ్ఞ ఎంతమాత్రమూలేదు! అంటూ ఆ చండాలస్త్రీని విమనంపైకి ఎక్కించారు. అలా దివ్యవిమానాన్ని అధిరోహించటంతోనే ఆమెకు దివ్యదేహం సంప్రాప్తమైనది. దివ్యమైన శరీరపు కాంతితో శుభంగా దివ్యాలంకారాలను మేన ధరించి సుందర వస్త్రాలతో అలంకరించుకుని సమస్త వాద్యఘోషలతో దేవదూతలు వెంటరాగా, గజాననుని సముఖానికి తీసుకుపోబడింది.

ఈ విషయాన్నంతటినీ రాజుకు భటులు విన్నవించగా, అతడు నాల్గుదిక్కులా కాంతిని ప్రసరిoపచేస్తూన్న ఆ దివ్యవిమానాన్ని పరివారసమేతంగా దర్శించాడు. అలా దివ్యవిమానంలో వెడుతూన్న ఆ చండాలి దృష్టి సోకడంచేత ఇంద్రుని విమానంకూడా నింగికెగసింది. ఈ దృశ్యాన్ని చూస్తున్న సర్వులూ ఆశ్చర్యచకితులైయారు. ఇంద్రుడు తన నిజలోకానికి వెళ్ళిపోగానే అందరూ తమతమ నెలవులకు మరలివెళ్ళారు. ఆ చాoడాలికూడా దివ్యదేహాన్ని ధరించినదై వినాయక దామాన్ని చేరుకున్నది. సంకష్టచతుర్థీవ్రత పుణ్యవిశేషంచేత ఆమెయొక్క సకల పాపాలూ పరిహరింపబడి గణేశ సామీప్యాన్ని పొందింది. ఈ ఉపాఖ్యానాన్ని ఎవరైతే భక్తిశ్రద్ధలతో పఠిస్తారో, వింటారో వారు సకల కష్టములనుండీ విడివడి తమ సకలాభీష్టములను పొందగలరు.

Chapter 74 complete