గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

22 – భల్లాల వినాయక కధనం

తన పూర్వీకుడైన దక్షుని చరితనంతటినీ విశ్వామిత్రమహర్షి చెప్పగా విన్న భీమ మహారాజు యిలా అన్నాడు. 

భీమరాజు:

 

“ఓ మహర్షిసత్తమా! మీ యొక్క అపారమైన కృపా విశేషం చేత మా పూర్వీకుడైన దక్షుని చరితాన్ని వినగలిగాను! ఐనా నన్నొక సందేహం పట్టి పీడిస్తున్నది. పుట్టుకతోనే మూక, బధిర, అంధత్వాలను సంతరించుకొని శరీరమంతా రోగాలతో దోషభూయుష్టుడై జన్మించిన దక్షుడు ఏ పూర్వపుణ్యంవలన ఆరోగ్యవంతుడైనాడు?ఈ మహర్షి శరీరంపైనుండి వీచిన వాయుస్పర్స ఏవిధంగా అతడిని ఆరోగ్యవంతుడిని చేసింది? ఎన్నో సంవత్సరాలు గాఢతపస్సు చేసినా ముద్గలునికి ఎందుకని సాక్షాత్కారించలేదు? ఎత్తి శ్రమాలేక సులభంగా వల్లభ పుత్రునికి ఎలా ఈ దివ్య సాక్షాత్కారం లభించింది? ఇంతకీ పూర్వజన్మలో తన పుట్టుపూర్వోత్తరాలేమిటి?

ఈ నా సంశయ సమూహాన్నంతనీ తాము విచ్చేధన సలుపవలసింది. తాము సర్వజ్ఞులు, మూర్తీభవించిన అనుగ్రంలా వున్న తమరే నాకీ గణేశ కధామృతాన్ని పానం చేయించవలసింది. ఈ కధను ఎంత వింటున్నా నాకు తనివితీరటం లేదు!” వినయంగా ఆ రాజు చేసిన ప్రశ్నకు విశ్వామిత్రుడు అమిత ప్రసన్నుడై యిలా బదులిచ్చాడు.

విశ్వామిత్రుడు:

 

‘ఓ రాజా! సంశయాల నివృత్తికై నీవడిన ప్రశ్న ఎంతైనా తగియున్నది. ఆ వృత్తాంతాన్నంతా నీకు చెబుతాను సావధాన మనస్కుడవై ఆలకించు!’

విశ్వామిత్రుడు రాజుకు ఇతిహాసమును వివరించుట

ఓ భీమరాజా! పూర్వం సింధుదేశంలో ప్రసిద్ధిచెందిన 'వల్లీ' అనే నగరం ఉండేది. ఆ పట్టణంలో ' ‘కళ్యాణ సంజ్ఞికుడూ' అనే పేరుగల ధనికుడైన వైశ్యుడుండేవాడు. వితరణతో అడిగినవారందరికీ లేదనకుండా దానఢర్మాలు చేసేవాడు. డెవబ్రాహ్మణభక్తిలో సాటిలేనివాడు. అతనికి ఇందుమతి అన్న పేరుగల సౌందర్యవతియూ, మహాపతివ్రతయూయైన భార్య ఉండేది

ఆ దంపతులకు గుణవంతుడూ, రూపవంతుడూ ఐన కుమారుడు జన్మించాడు. యధోచిత సంస్కారములు నిర్వర్తించి, పుత్రుని జనన కాలంలో బ్రాహ్మణుల సంప్రీతికై గోవులను, రత్నమాణిక్యాలనూ, అనేక దివ్యవస్త్రాలను దానమిచ్చాడు. జ్యోతిష్కులను సంప్రదించి ఆ పిల్లవానికి భల్లాలుడన్న నామకరణం చేసాడు.

ఆ పిల్లవాడు కూడా శుక్ల పక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానుడై ఎదగసాగాడు. బాల్యమ్నుంచే భగవద్భక్తి అతనికి సహజంగా అలవడింది. పూర్వపుణ్య విశెషంచేత గజాననుని పట్ల అతనికి గాఢానురక్తి ఉండేది. ఇలా వుండగా ఆ భల్లాలుడు తన తోటి బాలకులతో కలిసి ఒకనాడు అడవికెళ్ళాడు. అనేకరకాలైన ఆటలాడి, స్నానంచేసి ఒక నునుపైన రాతిని స్థాపించి దానికి ప్రాణప్రతిష్టచేసి శ్రద్ధగా దూర్వాంకురాలతోనూ, పువ్వులతోనూ ఆ గణేశుని మూర్థిని భక్తితో పూజించారు. అతని మిత్రులలో కొందరు ధ్యానమగ్నులై గణెశ నామాన్ని జపిస్తుంటె, మరికొందరు ఆనందంతో నాట్యం చేశారు. మరికొందరు మృదుమధురంగా గానం చేశారు. కొందరు కఱ్ఱ్లతోనూ, మామిడిచిగుళ్ళ తోరణాలతోనూ ఆ మూర్తికి ఒక చక్కని మంటపాన్ని ఏర్పాటుచేశారు. ఇలా ఆ బాలకులంతా చక్కని ప్రాకారాన్ని, దెవునికి మంటపాన్నీ, ఆలయాన్నీకూడా అత్యంత శ్రద్ధాభక్తులతో నిర్మించారు. ఫలపుష్పాదులను నైవేద్యంగా సమర్పించి ఢూపదీపాలతో ఆ మూర్తిని ఆరాధించారు! కొందరు పండితుల వేషంలో వేదపురాణాలను ఉపదేశించి తన్మయులయ్యారు!

ఇలా భగవంతునిపైగల భక్తిలో ఆ పిల్లలు అన్నపానాలను సైతం మరిచారు. ఇలా కొన్నిరోజులు గడిచినాయి. ఇలాఉండగా, ఆ పిల్లల తలితండ్రులు ఒకనాడు ఆ కళ్యాణవైశ్యునివద్దకు వచ్చి ఎంతో రోష పూరిత వచనాలతో

" మీ భల్లాలుని నివారించు! తనతోపాటు మా పిల్లల్నీ 'భక్తీ-రక్తీ' అంటూ పాడుచేస్తున్నాడు. అడవుల్లొ తిరుగుతూ, వేళకు భొజనానికి కూడాఇళ్ళకు రావటంలేదు! కనుక నీవే నీకుమారునికి బుద్ధిగరిపి అలా తీసుకెళ్ళకుండా నివారించుము! అలాకాకుంటే మేమే వాణ్ణి కట్టి వేసి చావమోదుతాం! లేదా రాజుగారికి ఫిర్యాదుచేసి మిమ్మల్ని ఈ గ్రామాన్నుంచే వెళ్ళ గొట్టిస్తాము!" అంటూ నిష్టూరమాడారు! ఇలా ఆ గ్రామస్థులాడిన తీవ్రమైన పరుషమైన వచనాలకు బాధ్తో, రోషావేశ పూరితుడైన కళ్యాణ సంజ్ఞికుడూ వడివడిగా తన కుమార్డు అతని స్నేహితులు గణేశుని పూజిస్తున్న అడవిలోకి వెళ్ళాడు.

ఒకపెద్ద కఱ్ఱను పెరికి ఆకఱ్ఱతో బాలురు నిర్మించిన మందిరాన్ని ప్రాకారాన్ని భగ్నచేశాడు. భయంతో ఆ బాలకులు నలుదిక్కులకీ పరుగుతీసారు. ఆ సమయంలో భల్లాలుడు మాత్రం చెక్కుచెదరక స్థిరంగా కూర్చున్నాడు. తోటి గ్రామస్థుల నిందాలాపనచే అప్పటికే క్రొధొన్మతుడైన అతని తండ్రియైన కళ్యాణ వైశ్యుడు మాత్రం క్రోధంతో వివశుడై అతని చేతిని గట్టిగా పట్టుకుని నెత్తురుకారేలా కఱ్ఱతో చావమోదాడు. అతని క్రోధాగ్ని అంతటితో చల్లారక ఆ బాలునిచే పూజింపబడుతోన్న సింధూరవర్ణంలోఉన్న గజాననుని విగ్రహాన్నికూడా పెకిలించి పారవైచాడు. పాలుగారే అతని లేతశరీరం ఆ రక్తపురంగులో మోదుగపువ్వు వర్ణంతో ఎఱ్ఱగా మారిపోగా తన కుమారుణ్ణి చెట్టుకి లతలతోనూ, తాళ్ళతోనూ నిర్దాక్షిణ్యంగా కట్టేసి "ఓరీ! నిన్నిప్పుడు దేముడే రక్షించాలి! అతడే నీకన్నంపెట్టి నీ ఆకలి తీర్చాల్సింది! చూద్దాం ఏంచేస్తాడో? ఒకవేళ పొరబాటున ఇంటికి వచ్చావా... చచ్చావే అనుకో!" అంటూ రోషావేషంతో ఆలయాన్ని, విగ్రహాన్ని భగ్నంచేసి ఇంటికి పెద్దపెద్ద అంగలతో వెళ్ళిపోయాడు. 

ఆ కధా విధానాన్ని భీమరాజుకు వివరిస్తున్న విశ్వామిత్రుడు యిలా కొనసాగించాదు :

ఓరాజా! ఈ విధంగా అతనిలో క్రోధమనే పెద్దపులి వివేకమనే కుందేటిని కబళించగా ఆ వైశ్యుడు వివశుడై, దుష్క్రుత్యాన్ని జంకు లేకుండా ఆచరించి, ఇంటికి మరలిపోయాక, ఆ చిన్ని బాలకుడైన భల్లాలుడు మాత్రం గణేశుని అనన్య భక్తితో స్మరిస్తూ మనసులో ఇలా విచారించ సాగాడు. 

'స్వామీ! ఓ జగత్ప్రభు! దుష్టశిక్షణ నీకు వెన్నతో పెట్టిన విద్యగదా! విఘ్నాలను, దుష్టులను నశింపచెయ్యటంవల్లనే నీకు విఘ్న హరుడన్న కీర్తి జగత్తులో ప్రఖ్యాతమైంది! ఓదేవా! భూభారాన్ని వహించే శేషుడా ఫనిని వీడవచ్చు, సముద్రాలను శొషింపచేసే సూర్యుడు తన కిరణాల తీక్షణతను వదలవచ్చు, అలాగే అగ్ని తన ఉష్ణతనూ, వేడిమినీ కొల్పొవచ్చు కానీ నీవు నీ నిజభక్తులను ఎన్నడూ వీడవని శ్రుతులు ఘోషితున్నాయే! నీకీ ఉదాసీనత తగునా?' అంటూ ఏడుస్తూ తన తండ్రినిలా శపించాడు. 

'నేను ఎంతగానో శ్రద్ధాభక్తులతో శ్రమించి నిర్మించిన ఈ ఆలయాన్ని ఎవరైతే భగ్నం చేసి తీరని దైవద్రోహం చేశారో, బాలుణ్ణి అని కూడా చూడక నన్ను చావచితకమోదారో, నాకు అత్యంత ప్రేమాస్పదుడైన గణేశుని విగ్రహాన్ని విసిరివేశారో అట్టి పరమ పాతకుడైన నా తండ్రి 'అంధుడు, కుబ్ఝుడు, బధిరుడు, శబ్ధహీనుడు అవుగాక!' అని శపించి 'నేను నిజమైన గణేశభక్తుడనైతే నా శాపము సత్యమౌగాక! నన్నైతే ఇలా ఈ పాపి బంధించగలిగాడే కాని నా మనస్సునూ, నా భక్తినీ ఆ దుష్టుడు బంధించలేడు కదా! ఆ పరమ దయాళువైన గజాననుని పాదారవిందాలనే ధ్యానిస్తూ, ఈ అరణ్యంలోనే శరీరాన్ని విడుస్తాను! నా తండ్రి కఱ్ఱతో మోదుతున్నప్పుడే నాదేహాన్ని ఆ దేవదేవునికి అర్పించాను!' అంటూ మనస్సులో ధృఢంగా నిశ్చయించుకున్న ఆ బాలకుడైన భల్లాలుని ఎదుట గజాననుడు బ్రాహ్మణరూపంలో ప్రత్యక్షమైయాడు. అప్పుడు సూర్యొదయ మవటంతోనే ఆకాశాన్ని చీకట్లు వీడినట్లు, ఆ దివ్యదర్శనం అవ్వడంతోనే అతని దేహాన్ని బంధించిన బంధాలన్ని వీడిపోయాయి! అప్పుడు ఆ భల్లాలుడు అత్యంత ఆదరంతో ఆ బ్రాహ్మణునకు సాష్టాంగ నమస్కారం చేసాడు. శరీరం పైని గాయాలు రక్తస్రావము ఆశ్చర్యంగా మటుమాయమయ్యాయి! శరీరం దివ్యదేహంగా మారింది! అప్పుదు అతడు తన శ్రద్ధాభక్తులనే వాక్కులుగా చేసి ఇలా కీర్తించాడు: 

భల్లాలుడు గజాననుని స్తుతించుట

చరాచర రూపమైన ఈ సకల జగత్తుకూ తల్లివీ, తండ్రివీ, కర్తవూ నీవేఐన ఓ విఘ్నేశ్వరా! నీ సంకల్పం వల్లనే కౄరులు, స్జ్జనులు తమతమ స్వభావాలకు యుక్తమైన తల్లితండ్రులకు జన్మిస్తూన్నారూ! అష్ట దిక్కులూ, ప్రాణాధారమైన గాలీ, సకల సముద్రాలూ, సూర్య చంద్రాగ్నులూ, సమస్త ఓషధులూ, ధాతువులూ నీ స్వరూపమే కదా ప్రభూ! అటువంటి నీ మహిమను బాలకుడనైన నా వాక్కులతో ఎలా ప్రస్తుతించగలను? కేవలం నీ అనుగ్రహ విశేషంవల్లనే భక్తి సులభుడవైన నీ దివ్య మంగళరూప దర్శనం నాకు కల్గింది!" అంటూ భక్తితో ప్రణమిల్లిన ఆ భల్లాలుణ్ణి ప్రేమతో లేవనెత్తి, అతనిని గజాననుడు ఆలింగనం చేసు కున్నాడు భక్తవత్సలుడైన ఆ గణేశుడు! ప్రసన్నతతో అనుగ్రహాన్ని వర్షించే సుందరవదనంతో యిలా అన్నాడు.

గణేశుడు:

'ఓ భల్లాలా! నా ఈ మందిరాన్నీ, నీచే అర్చించబడ్డ మూర్తినీ భగ్నంచేసినవారు ఘోరమైన దైవాపచారం చేసినవాడయ్యాడు. అతడు తప్పక నరకంలో పడతాడు. నా ఆఙచే నీవిచ్చిన శాపంకూడా తప్పక తగులుతుంది! అట్టివాడిని వాడి తండ్రి కూడా ఆగ్రహంతో ఇల్లు వెడలగొడతాడు. ఓ బాలకా! నీభక్తికి ఎంతో ప్రసన్నుడనయ్యాను. కనుక ఎంతటి దుర్లభమైనదైనా వరాన్ని నీకు అనుగ్రహించదలిచాను!' అని దరహాసం చిందించాడు.

అప్పుడా బాలకుడిలా ప్రత్యుత్తరమిచ్చాడు

బాలకుడు:

"ఓ దీనబంధూ! నీ పదకమలాల యెడల అంతులేని ధృఢభక్తిని నాకు సర్వదా ప్రసాదించు! నీవీ క్షేత్రంలో వెలసి సకల ప్రజలకూ విఘ్నములను పారద్రోలి అనుగ్రహించు! అంటూ ప్రార్ధించాడు.   

ఆ ప్రార్ధనకు భక్తవత్సలుడైన గజాననుడిలా అన్నాడు.

గణేశుడు:

 

'నీ పేరు ముందుగానూ, నా పేరు తరువాత కలిగి లోకంలో భల్లాలవినాయకుడన్నపేర ఈ క్షేత్రంలో స్థిరంగా వెలుస్తాను! నీకు సదా నా యందు దృఢభక్తినీ ప్రసాదించాను. ఈ వల్లి అనే పేరుగల క్షేత్రాన్ని భాద్రపద శుక్ల చతుర్ధినాడు యాత్రచేసి దర్శించేవారికి సకలాభీష్టములు నెరవేరుస్తాను!' అంటూ వరాలను అనుగ్రహించి వరదుడైన గజాననుడు అంతర్ఢానమైనాడు. ఆ తరువాత ఆ భల్లాలుడు వేదవిదులైన భ్రాహ్ణోత్తముల ఆధ్వర్యంలో వైనాయక మూర్తిని ని ప్రతిష్టించి, సర్వాంగ సుందరమైన మందిరాన్ని కూడా నిర్మించాడు!" అంటూ విశ్వామిత్రుడిలా అన్నడు

విశ్వామిత్రుడు:

 

"ఓ రాజా! నీ అభీష్తమ్మేరకు భల్లాలవినాయకుని చరిత్రను యావత్తూ వినిపించాను. ఎవరైతే పరమ పావనమూ శుభకరమూ అయిన ఈ చరిత్రను భక్తిశ్రద్ధలతో ఆలకిస్తారో అట్టివారు తమ సర్వపాపములనుండీ విముక్తులై, తమతమ మనోభీష్టములను తప్పక పొందుతారు!" అంటూ చిరుదరహాసంతో శరశ్చంద్రునిలా అనుగ్రహచంద్రికలను ప్రసరించాడు.

Chapter - 22 Complete