గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

32 – మంత్రకధనం

శాపవృత్తంతాన్ని తెలుసుకున్న దేవతలు గౌతమముని సన్నిధికిచేరి ఇంద్రాపరాధాన్ని క్షమించమని వేడుకొనుట!

నారదుడు:

 ‘ఓ రుక్మాంగద మహారాజా! అలా దేవేంద్రుడు కీటకరూపంలో తామరతూడులో దాక్కునివున్న సంగతిని నేను స్వర్గంచేరి అక్కడవున్న దేవతల గురువైన బృహస్పతికీ, అగ్ని, వరుణ, యమ, వాయు, కుబేరులు మొదలైన దిక్పాలకులకీ తెలియజేసాను. మాయారూపంలో శచీపతి అహల్యను కూడటం, ఋషి ఆగ్రహానికి గురై శాపాన్ని పొందటమూ చెప్పి, సహస్రభగుడైన తన వికృతరూపం ప్రదర్శించటానికి యిష్టపడని ఇంద్రునిగురించీ, శిలారూపంలోవున్న అహల్యగురించీ తెలిపాను!

నానుండి ఈ వివరాలన్నీ విన్న దేవప్రముఖులంతా విచారంలో మునిగిపోయారు! నిట్టూర్పులు దీర్ఘంగా విడుస్తూ దుఃఖపడసాగారు.

దేవతాప్రముఖులు:

‘నూరు ఆశ్వమేధక్రతువుల పుణ్యం ఫలితంగా స్వర్గాధిపత్యాన్ని ముల్లోకాధిపత్యాన్నీ సంపాదించుకొని, దానవులనందరినీ తన శౌర్యపరాక్రమాలతో అణిచివేసి నిష్కంటకంగా మమ్మల్నందరినీ పాలించే మా ప్రియతమ ప్రభువు వియోగం దుస్సహం! దుర్భరం! మాకింక దిక్కెవ్వరు? ఎవరిని ఆశ్రయించి మా మనుగడ కొనసాగించేది? స్వర్గాభోగాలనుభవించే మా ప్రభువు యిప్పుడెక్కడున్నడో? ఎన్ని యిక్కట్లు పడుతున్నాడో? ఇప్పుడీ అమరావతీనగరమూ, రాణీయైన శచీ కూడా అనాధలైనారే? ఏ ఉపాయం చేత క్రోదోద్దీపితుడైన గౌతముని ప్రసన్నుణ్ణి చేసుకోగలం? ఆయన అనుగ్రహాన్ని పొందే మార్గమేమిటి?’ యిలా పరిపరివిధాల విచారించి, నన్నుకూడా వెంట తీసుకొని ‘గౌతమమునిని శాంతింపచేయటానికి వేడదాము రమ్మని’ గౌతముని సన్నిధిని చేరుకున్నారు. అప్పుడు ఆ దేవతలందరూ అంజలియోగ్గి తపస్సంపన్నుడూ, అగ్నివంటి తేజస్సుతో ప్రకాశిస్తూన్నవాడు, నిండు చంద్రునివంటి ప్రశాంతతనూ, ప్రసన్నతనూ కలిగిన గౌతమమహర్శిని వివిధరీతుల్లో స్తుతిస్తూ శరణువేడారు.

దేవతలు గౌతమమునిని కీర్తించటం.

దేవగణాలు:

“ఓ పరమపావనుడవూ, తపోనిధివీ ఐన మునిసత్తమా! మేరుపర్వతంయొక్క, హిమవత్పర్వతముయొక్క ఎత్తూ వర్షధారల సంఖ్యా, ఇసుకరేణువులనూ, లోకరక్షకుడైన విష్ణుమూర్తి గుణగణాలనూ లెక్కించటం ఎవరితరం? అలాగే ప్రాతఃకాలమున ధ్యానం చల్లి, తపఃశక్తిచేత మధ్యాహ్నానికల్లా సస్యసంపదను తయారుచేసి తీవ్రమైన క్షామంలో కూడా ఋషీశ్వరులకు ఆశ్రయమిచ్చిన ఘనుడవు! వాలఖిల్యులచేత యాగం చేయించి మరో యింద్రుడిని తయారుచేసిన అసమాన ప్రతిభాశాలివి! పూర్వం అగస్త్యునిచేత సముద్రాలే ఆపోశన పట్టబడ్డాయి! బుద్ధిశాలియైన విశ్వామిత్రుడిచే బ్రహ్మ సృష్టికి ప్రతిసృష్టి కావించబడింది! చ్యవన మహర్షివల్ల ఇంద్రుడి భుజమే స్థoభింపచేయబడింది! ఓమహాత్మా! శ్రేయస్సుకోరేవారికి సర్వదా మీ దర్శనం, వందనం, ఆశీర్వచనం అభిలషించతగినది! మీకు యోనర్చే సేవ,పూజ సమస్త పాపములనూ క్షయం చేయగలవు! మీనుంచి ఉపకారము కోరివచ్చాము! దీనులమైన మమ్మల్ని మీరే అనుగ్రహించాలి! మిమ్మల్నే నమ్ముకొని శరణుజొచ్చాము! మేము మారాజైన ఇంద్రుడిని కోరివచ్చాము. దయతో మమ్ము అనుగ్రహించు!” అంటూ ప్రార్ధించిన దేవతలందరిని ఎంతో ఆదరంగా ఆహ్వానించి, వారందరినీ ఉచితాసనాసీనులను గావించి ఎంతో మధురంగా చిరునవ్వు నవ్వుతూ

గౌతమమహర్షి:

“పరమ పావనులూ, శుభప్రదులైన ఓ దేవతలారా! మీ దివ్యమంగళరూపం దర్శించటం చర్మచక్షువులకు అలవికాని పని! ఐనా అనేక జన్మార్జిత పుణ్యం ఫలంగా మీ సందర్శనం నాకు లభించింది. ఇందువల్ల, నాజన్మ, మీరాకతో నా ఆశ్రమమూ, తపస్సూ, దేహమూ, ఆత్మ, నే ఆచరించిన వ్రతాదులు సార్ధకమైనాయి. ఇప్పుడు మీ అభీష్టమేమిటో నా ఎదుట చెప్పండి! నా వల్ల శక్యమైతే – మీయొక్క అనుగ్రహంతో మీకార్యం నెరవేరుస్తాను!” అన్నాడు.

నారదుడు:

‘ఓ రుక్మాంగదమహారాజా! గౌతమముని పలుకులు విన్న దేవతల మనస్సులు మేఘాన్ని చూసి పురివిప్పి అడే నెమళ్ళే ఐనాయి! చంద్రోదయ మవగానే సముద్రం ఉప్పొంగినట్లుగా వారంతా సంతోషంతో ఉప్పొంగినారు!

దేవతలు:

“ఓ మహర్షీ! శివుని తపస్సు భంగం చేయబోయిన మన్మధుడిని శంకరుడు మూడోకంట క్రోధాగ్నిలో బుగ్గిచేశాడు. కానీ నీవలా ఇంద్రుని నీ క్రోధాగ్నికి దగ్దం చేయలేదు! ఘోర అపరాధం చేసిన ఇంద్రుడి ప్రాణాలను తీయకుండా నీ దయను వెల్లడించావు!

ఓ దయానిధీ! మేము నిన్ను కోరేదల్లా ఇప్పుడు నీ అనుగ్రహం వల్ల ఇంద్రుడు తన యధాస్థానాన్ని పొందాలని! మా ప్రార్ధనలను అనసరించి అతని దోషాలను క్షమించు! నీవతనిని అనుగ్రహిస్తే మాకు మా అభీష్టం సిద్దించినట్లే!”

గౌతమమహర్షి:

‘ఓ దేవతలారా! పతితుడు, మహాపాపి ఐన ఆ ఇంద్రుడిపేరును స్మరించటం కూడా దోషమే! చాలా కపటుడు, శఠుడు, దుష్టుడు, యుక్తాయుక్త విచక్షణ కోల్పోయిన అవివేకి! అటువంటి పశ్చాత్తాప రహితుడికి నిష్కృతి లేదు! ఐనా మీ కోరికమేరకు వానికి ప్రియంచేస్తాను! మీవంటి మహనీయుల మాటను నిరాకరించను! మీ అననుగ్రహానికి గురి కాదల్చుకొనుటంలేదు! మీ అందరిచేత అనుగ్రహించబడటంవల్లా, ప్రశంసించబడటంచేతా అట్టి దుష్టుడు కూడా పవిత్రుడౌతాడు! కనుక ఓ దేవతలారా! నేను మీకో మంత్రాన్నిస్తాను! అది ఆ ఇంద్రునికి ఉపదేశించండి!”

గౌతముడు ఇంద్రుని శాపవిమోచనోపాయం చెప్పుట

గౌతముడు:

“ఓ మహామహులారా! త్రిమూర్తి స్వరూపుడూ,ఆద్యంతాలు లేనివాడూ, సకల శుభప్రదుడూ, విఘ్నములను నివారించువాడైన ఆ గణేశుని షడక్షర మహామంత్రం సర్వసిద్ధిదాయకమైనది. ఈ మంత్రాన్ని మీరు సాంగోపాంగంగా ఇంద్రునికి ఉపదేశిస్తే అతడు అనుష్టించి గణేశానుగ్రహంతో దివ్యశరీరాన్ని ధరిస్తాడు. అతని శరీరంపైని భగములన్నీ నేత్రములు కాగలవు! తిరిగి స్వర్గలోకాన్నీ పొందగలడు! ఇది ముమ్మాటికి సత్యం!” అని కరుణాభరిత ధృక్కులతో దేవతాగణాలను సమాధానపరచి మౌనం వహించాడు. అప్పుడు ఆ సకల దేవతలూ గౌతమముని అనుగ్రహానికి పరమానందభరితులై, పూజించి, అతడికి ప్రదక్షిణ నమస్కారములను సమర్పించి మూర్తీభవించిన శాంతంలా ఉన్న ఆ తపోనిధివద్ద అనుజ్ఞ గైకొని ఇంద్రుడిని వెతుకుతూ, అతడు దాగివున్న సరస్సువద్దకు చేరుకున్నారు.

Chapter 32 Complete