గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

12 - గజానన దర్శనం

సూతమహర్షి ఋషులతో ఇలా అన్నాడు :

సూతుడు:

ఓ ఋషీశ్వరులారా! బ్రహ్మ చెప్పిన పై వాక్యాలను విన్న వ్యాసమునీంద్రుడు తన అంతరంగం ప్రశంతమవగా ప్రసన్నచిత్తంతో చతుర్ముఖుడిని తిరిగి యిలా ప్రశ్నించాడు.

వ్యాసుడు:

“ఓ చతురాననా! నీ అర్ధవంతమైన ప్రశాంతమైన వాక్యాలను విని నా మనస్సుకు ఎంతో స్వాంతన కలిగింది! ఈ గజానన మంత్రాన్ని గతంలో ఎవరు అనుష్టించారు? వారు గజాననుడినుండి ఎట్టి అనుగ్రహాన్ని పొందారు? నీ అమృతవచనాలను వింటున్నకొద్దీ గజాననుడి లీలలయందు రుచి పెరుగుతున్నదేకాని తరగడంలేదు! ఈ గణేశుని గురించిన ఉపాసనాది విశేషాలను దయతో వినిపించి నన్ను కృతార్ధుణ్ణి చెయ్యి! ఈ విషయంలో నీకన్నా సమర్థుడైన గురువు దొరకడం దుర్లభం!”

అప్పుడు భృగువిలా అన్నాడు :

భృగువు:

“ఓ సోమకాంతమహారాజా! వినమ్రుడై వ్యాసమునీంద్రుడు అడిగిన ప్రశ్నకు బ్రహ్మ యిలా బదులిచ్చాడు.

బ్రహ్మ:

“ఓ వ్యాసమునీంద్రా! నీయొక్క శ్రద్ధాసక్తులకు నాకెంతో సంతోషమైంది. అనంతమైన పుణ్యవిశేషం వల్లనే నీకీ ఆసక్తి కలిగింది! నీయొక్క వినయమూ, సౌశీల్యతా నన్నెంతగానో అలరించాయి! యోగ్యుడూ, వినయగుణ సంపన్నుడూ అయిన శిష్యుడు కోరితే గురువైనవాడు తీర్చని సందేహమే ఉండదు!

నాయనా! ఈ గజాననుడు సకల కార్యారంభములయందూ అవశ్యం పూజించతగినవాడు. అతని దయచేతనే సకల విఘ్నాలూ తొలగి, దుష్కరమైన కార్యాలు కూడా అలవోకగా సిద్ధిస్తాయి. అలా గజాననుని అనుగ్రహం పొందనివారికి అడుగడుగునా కార్యసిద్ధికి ఆటంకాలు సంభవిస్తాయి!

ఎందుకంటే సమస్త వేదమంత్రాలకు ప్రణవమే ఆది! ప్రణవరహితమైన మంత్రం నిరర్థకం. ఇక విఘ్నహరుడైన గణపతి సాక్షాత్తూ ప్రణవ స్వరూపుడే! పరతత్వ స్వరూపుడూ, పరబ్రహ్మరూపీ అయిన గజాననుడే సకల సృష్టీ అయివున్నాడు. వ్యక్త, అవ్యక్త రూపాలలో ఉన్న జగత్తంతా ఆయన రూపమే! సమస్త దేవతలూ, సిద్ధ, సాధ్య, గ౦ధర్వ, రాక్షస, యక్ష, కిన్నర, కింపురుష గణాలు, మానవులూ వీరందరూకూడా గణేశుని స్వరూపమే అయివున్నారు.

ఇక గణేశ ఉపాసననూ, దాని విశిష్టతను తెలియచేసే పురాతన గాధనొకదానిని చెబుతాను విను!

పూర్వం ఒకానొకప్పుడు ప్రళయం సంభవించింది. భీకరంగా వీస్తున్న ఆ ప్రళయకాల ఝూం ఝూమారుతాలకు పర్వతాలు సైతం ఎగురకొట్టబడి ముక్కలు ముక్కలైపోయాయి! అప్పుడు ఉదయించిన ద్వాదశాదిత్యుల వలన ఆ జలం యావత్తూ ఎండిపోయింది. అప్పుడు ప్రళయాగ్ని చేత సర్వమూ భస్మీపటలమైంది. ఆ సమయంలో ‘సంవర్తకము’ మొదలైన మేఘాలు ఏనుగులు తొండములతో వర్షించినట్లు కుండపోతగా వర్షం కురిపించాయి. దీనివల్ల సృష్టియావత్తూ జలమయమైంది.

అప్పుడు సకలజగత్తూ నశించిపోయింది. అతిసూక్ష్మరూపం ధరించిన గజాననుడు మాత్రం అణువుకన్నా అతిసూక్ష్ముడై అజ్ఞాతంగా ఉన్నాడు. చిరకాలం లోకాలన్నీ అంధకార బంధురంలో మునిగిపోయాయి! ఇలా చాలాకాలం గడిచాక ప్రణవనాదమూ, దానినుంచి పరబ్రహ్మ శబ్ధబ్రహ్మగా ఉద్భవమైనారు! ఆ నాదమే క్రమముగా మాయావికారం పొంది, గజాననుడి రూపు సంతరించుకుంది! ఆ మాయావికారం పొందిన గజాననుని నుండి సత్వ, రజ, స్తమోగుణాలూ వాటినుండి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులూ త్రిమూర్తులుగా ఉద్భవించారు. ఆ తరువాత త్రైలోక్య సహితమైన చరాచర జగత్తు యావత్తూ పుట్టింది!

అప్పుడు త్రిమూర్తులు మాయయొక్క ప్రభావంవల్ల చిత్తబ్రాంతి కలవారై – ‘తామెందుకు పుట్టిందీ, తమ కర్తవ్యం ఏమిటి?’ అన్న విషయాలు తెలుసుకోవాలనీ, తమ పుట్టుకకు కారణుడైన ఆ గజాననుణ్ణి ధర్శించాలనీ ఉత్సుకులైనారు.

అప్పుడు సృజింపబడ్డ 21 స్వర్గాలనూ, అంతరిక్ష పాతాల లోకాలను చూసి ఎక్కడా నిర్గుణస్వరూపుడైన ఆ పరమాత్ముని జాడ కనుగొనలేక త్రిమూర్తులు తపస్సుచేయడం మొదలుపెట్టారు. ఆహరం వర్జించి, అలా వేయి దివ్యవత్సరాల సుదీర్ఘకాలం తపస్సును ఆచరించారు. అయినా పరమాత్మయొక్క సాక్షాత్కారం అవకపోవడంవల్ల, అలసి విరక్తితో విచారగ్రస్తులై భూలోకానికివచ్చి అరణ్యాలు, నదులూ, పర్వతాలూ, గుహలలో వెతుకుతూ చివరకి ఒక సరోవర తీరాన్ని చేరుకున్నారు.

నానావిధ జలచరాలతోనూ, పద్మములతోనూ జలపక్షులతోనూ నిండివున్నదా దివ్యసరస్సు. త్రిమూర్తులు ముగ్గురూ ఆ సరస్సులో స్నానం చేసి కొంతతడవు విశ్రాంతి తీసుకుని తిరిగి బైలుదేరారు! ఇలా ఆ సరస్సునూ, అందులోని అలలనూ చూస్తూ ఆ ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులై వెడుతున్న వారికి కళ్ళు మిరుమిట్లుగొలిపే దివ్యకాంతి కనిపించింది. కోటిసూర్యుల కాంతితో సమానమై ప్రకాశమానమై ప్రళయాగ్నిలా వెలుగుతూవున్న ఆ తేజస్సును కన్నులతో చూడలేక భ్రాంతిచెందిన మనస్సుతో ‘ఇది ఏమి విపరీతమో?’ అని వ్యాకుల పడుతూండగా కరుణామయుడై, సకల లోకాలకూ వంద్యుడైన గజాననుడు ఆ తేజోమధ్యంలో వారికి సాక్షాత్కరించాడు.

అప్పుడు వారి హృదయాలు అమితమైన సంతోషంతో ఉప్పొంగినాయి. ఆ దివ్యమంగళ రూపం ఎలావున్నదంటే – ఆ రూపం పాదాంగుష్టంయొక్క నఖం (గోరు) నుంచి వెదజల్లబడుతూన్న కాంతితో, ఎఱ్ఱని రోమాలు, ఎఱ్ఱటి వస్త్రమూ ధరించినందువల్ల, సంధ్యాకాలంలో ఎఱ్ఱనై ప్రకాశించే సూర్యమండలాన్ని తలదన్నేలా ఉంది. తన నాల్గు దివ్యబాహువులలోనూ ఒక్కోదాన్లో ఖడ్గమూ, ఖేటమూ, ధనుస్సూ, శక్తీ, వీటిని ధరించి ఉన్నాడు. చక్కటి నాసికతో పున్నమచంద్రుని వెక్కిరిస్తున్నట్లున్న దివ్యమైన ముఖకాంతి కలిగి, పద్మములవంటి నేత్రాలతో, ధగధగా కోటిసూర్యుల ప్రకాశంతో వెలిగిపోయే కిరీటందాల్చి, నక్షత్రాలతో నిండిన ఆకాశంలాంటి దివ్యసుందర ఉత్తరీయాన్ని ధరించి ఏకాదంతముతో ఐరావతం మొదలైన ఏనుగులకే భీతి కలిగేలాంటి పెద్దతుండంతో, దివ్యకాంతితో ప్రకాశిస్తూన్న ఆ గజాననుని దివ్యమంగళ విగ్రహాన్ని చూసిన త్రిమూర్తులాయన పాదాలనంటి నమస్కరించి స్తోత్రంచేయసాగారు.

Chapter 12 complete