గణేశ పురాణము - ఉపాసనా ఖండము
63 – దూర్వామహాత్మ్యం – 1
దేవగణాలు:
“ఓ యోగీశ్వరులారా! ఏకాగ్రమనస్సుతో వినుడు. గజాననుడి మహిమలు వర్ణించుటకు బ్రహ్మదేవునికిగాని, సహస్రఫణములుగల ఆదిశేషునికిగాని శక్యము కానిపని. ఐనాప్పటికీ మా శక్తిమేర మీకు వర్ణించి తెలిపెదము. ఏ మహానుభావుని నిత్యమూ బ్రహ్మమహేoద్రాదులు వేదమంత్రములతో స్తోత్రములు చేయుచుందురో అట్టి గణేశుని మహిమనెవరు వర్ణించగలరు? ఇంకనూ దూర్వాంకుర మహిమలను గురించి తెలుపుటకు దేవతలకూ మునులకూ కూడా వశముగానిపని! ఎందుకనగా కేవలం దూర్వాంకురము సమర్పించడంవల్ల కలిగేటటువంటి అసమాన ఫలము – యజ్ఞము, దానము, వ్రతము తపస్సులతోకూడా పొంద వీలుకానoతటి అనంత పుణ్యఫలము! దీనిగురించిన ఒక ప్రాచీన ఇతిహాసము కలదు! దానిని వర్ణించి తెలిపెదము. గతంలో ఇంద్రునకూ నారదునకూ జరిగిన సంవాదాన్ని మీకిప్పుడు తెలిపెదము.
ఒకానొకప్పుడు దేవర్షియైన నారదుడు ఇంద్రదర్శనమునకై స్వర్గానికి వెళ్ళగా ఇంద్రుడాయనకు ఆర్ఘ్యపాద్యములను ఒసగి సమస్త గౌరవాలతో పూజించి, సుఖాసీనుడైన నారదుని ఇంద్రుడు దుర్వాంకురములు (గరిక చిగుళ్ళు) గణేశునకు సమర్పించుటవలన కలిగే ఫలాన్నిగురించీ వానిమహాత్మ్యం గురించీ తెలుపమని ప్రశ్నించెను. అంతట ఇంద్రుడు “ఓ మునీంద్రా! దేవతలకు అధిదేవుడైన గణపతిదేవునకు ఈ దూర్వాoకురమoటే అంతప్రీతి ఎందుకు? దాని ప్రత్యేకమైన మహిమనుగూర్చి వివరముగా తెలుప”మని ప్రార్ధించెను. దానికి నారదమునీంద్రుడు :
నారదుడు:
“ఓ దేవేంద్రా! పూర్వకాలములో స్థావరమనే నగరంలో కౌండిన్యుడనే పేరుగల మహాముని నివసించేవాడు. ఆయన గొప్ప గణపతి ఉపాసకుడు. గణేశమంత్ర జపసిద్ధిపరాయణుడు. గొప్ప తాపసి! ఆ గ్రామమునకు దక్షిణదిక్కుగా పరమపవిత్రమైన ఆశ్రమాన్నినిర్మిoచినాడు! దానిలో పచ్చని నవనవలాడే వృక్షములు, దివ్యౌషదములు, ఫలపుష్పములు కలిగి నిర్మలమైన కొలనులో వికసించిన తామరపద్మములు లక్ష్మీకళతో విలసిల్లేవి! ఆ సరస్సులో తెల్లని హంసలు, పున్నమచంద్రునివంటి చక్రవాకపక్షులు, కొంగలు, కలకలలాడే జలపక్షులు ఆనందంగా విహరించేవి! అట్టి నిర్మలమైన ఆశ్రమంలో ఆ మునీశ్వరుడు యోగానిష్టాపరాయణుడై ధ్యానసమాధిస్థితిలో తన హృదయములో గణేశునిమూర్తిని ప్రతిష్ఠింపజేసుకుని “గణేశషడక్షరీమంత్రము”ను అఖండముగా జపించేవాడు. అంతేకాక పరమపవిత్రములైన దూర్వాంకురములతో ప్రతీనిత్యం గణపతి విగ్రహాన్ని పూజించేవాడు.
ఇట్లుండగా ఆ మునీశ్వరుని భార్య మునిపత్నియగు ఆశ్రయాదేవి ఒకనాడు తన భర్తను యిలా ప్రశ్నించింది
“ఓ ప్రాణనాధా! ప్రతిరోజూ మీరు గజాననునిపై పూజానంతరము పచ్చని గరికచిగుళ్ళు(దూర్వాంకురములు) ఎందుకని ఉంచుతున్నారు! కేవలము గడ్డిపరకల వలననే గణేశుడు సంతసించునా? ఇలా దూర్వాంకురములు సమర్పించడంవల్ల కలుగు ఫలితమేమి? దీనికి ఏదైనా రహస్యము ఉంటె దానిని తెలియజెప్పండి దయతో!” అని ప్రశ్నించెను. దానికా మునీశ్వరుడు
కౌండిన్యుడు:
“ఓ ప్రియభార్యామణీ! దూర్వాంకురముయొక్క మహాత్మ్యము ఇంతింతని చెప్పరాదు. దీని గురించి మహాత్మ్యకధను నీకు చెప్పెదను శ్రద్ధతో విను :
పూర్వకాలంలో “సంయమనీ పురము”లో ఒక గొప్ప మహోత్సవము జరుగుతున్నది! ఆ ఉత్సవానికని సమస్త దేవతాగణములు అప్సరసలు, గాంధర్వ, విద్యాధరులూ, కిన్నరకింపురుషాదులు ఆహ్వానిoచబడి తరలివచ్చారు. ఆ దేవతాసభలో అతిలోకసుందరియైన ‘తిలోత్తమ’ అనే అప్సరస నాట్యoచేస్తున్నది. నృత్యం మధ్యలో ప్రమాదవశాత్తూ ఆమె చీరకొంగు జారిపోయింది. దేవసభలో కూర్చున్న యమధర్మరాజు ఆమె సౌందర్యమును తటాలున చూసి మోహపరవశుడై ఆమె సౌందర్యమునకు వశపడి కామంతో తపించి ఒక్కసారిగాలేచి ఆమెను కౌగిలించుకోవాలని లేచాడు. మరుక్షణమే ఒడలు తెలిసి సభలోంచి తలవంచుకుని వెల్లిపోతుండగా ప్రమాదవశాత్తూ అతని వీర్యము స్ఖలించి భూమిపై పడింది!
ఆ యమధర్మరాజు వీర్యంచేత అగ్నిజ్వాలవలే మండుతున్న ఒక భయంకరాకారుడైన అసురుడు పుట్టాడు. భయంకరమైన కోరలు, పెద్దనోరు, జ్వాలలవంటి జడలు, నిప్పుకణికెలవంటి మిడిగ్రుడ్లు ప్రపంచాన్ని దద్దరిల్లచేసే పెద్దఅరుపులతో భయంకరమైన వాడికోరలుగల నోటిని తెరచి లోకాలను భక్షించాలని ఉరికాడు. ఆ రాక్షసుని భయంకర వికటాట్టహాసంతో ముల్లోకములలోనివారు గడగడలాడిపోయారు. అకస్మాత్తుగా జరిగిన ఈ విపరీత ప్రమాదమునకు భయపడిన దేవతలందరూ దేవసభలో లేచి శ్రీమహావిష్ణుదేవుని శరణుపొంది అనేక విధముల స్తోత్రం చేశారు. శ్రీవిష్ణుదేవుడు వారందరినీ శ్రీగణేశప్రభువును ఆశ్రయించవలసిందిగా సలహాయిచ్చాడు. ఆ దేవతాగణములను వెంటపెట్టుకుని ఆ రాక్షసుని సంహారం నిమిత్తం మహాగణపతిని శక్తివంతమైన దివ్యమంత్రాలతో స్తుతింపచేశాడు.
దేవతల గణపతిస్తోత్రం
దేవతలు:
‘విఘ్నస్వరూపుడైన గణపతి దేవునకు నమోనమస్తే! సర్వ విఘ్నములనూ హరించు విఘ్నహరునకు నమోనమః, సర్వసాక్షీభూతుడైన పరమాత్మరూపియగు గణేశునకు నమో నమస్తే! సర్వసృష్టి స్వరూపుడైన గణేశపరబ్రహ్మకు యివే మా నమోవాకములు! ఓ సర్వసాక్షివగు ప్రభూ! నీకిదే నమోనమః!! ఓ దేవదేవా నమస్తే! నమస్తే!! ఓ మహానుభావా! మహాగణపతీ!! సమస్త జగదాధారా భూతుడా! మహాగణపతీ నమోవాకములు! ఓ కృపానిధీ! జగద్రక్షకుడా, గణేశా! నీకిదే మా శరణాగతి! ఓ జగత్పరిపాలకుడా! పూర్ణబ్రహ్మ స్వరూపుడా! పరిపూర్ణ తపస్స్వరూపుడా నీకిదే మా నమోనమః!
సర్వదుష్ట అసురసంహారకర్తకు, సమస్త కష్టనివారకునకు, వరములిచ్చి అనుగ్రహించే దయామూర్తికివే మా నమస్సులు! ఓ పరమేశ్వరా! నీకంటే మాకు అనన్యశారణ్యం వేరులేదు! మా సమస్త కోరికలనూ తీర్చగల నీకిదే మా నమస్కారము.
ఓ సమస్త వేదమంత్రాత్మకూడా! సమస్త వేదచ్ఛందస్వరూపుడా! సమస్త వేదచందోగణాధిపా! వేదమూర్తీ! నమస్కారము! నీవుతప్ప దిక్కులేని మేము వేరేవారిని శరణుపొందగలము? నీవుతప్ప మమ్ములను సంకటములనుండి భయములనుండీ రక్షించగల దయామూర్తి ఎవరుంటారు?
ఈ అకాలప్రళయమేమిటిప్రభూ? ఈ దుష్టరాక్షసబాధ ఏలమాకు? హాగాజాననా! అయ్యో! హాహా!! సర్వవిఘ్నహరుడా! దేవదేవేశా!! సర్వరక్షకా!!! మాకందరకూ మరణప్రాప్తి కాగల గొప్ప మృత్యుభయంనుంచి రక్షించు! మమ్ములను ఉపేక్షించకు! ఓ కరుణాసముద్రా! మహాగణేశా!! శరణు! శరణు!!”
అంటూ దేవతలు ప్రేమతో, ఆర్తితో, భక్తితో స్తుతించగా వారి ముందర శిశువురూపములో గణపతిదేవుడు “బాలగణపతి”గా సాక్షాత్కరించి, ‘భయములేదు! అభయం! అభయం! అంటూ తమరపద్మములవంటి నేత్రములతో దయను వర్షించుతూ పున్నమిజాబిల్లివంటి ముఖం కోటిచందమామల అందం కులికించగా, కోటిసూర్యకాంతి ప్రభలతో, వేయిమన్మధుల అందంతో తెల్లని మల్లెపూవులవంటి ధవలవర్ణంతో చవితిచంద్రునివలే తెల్లగా ప్రకాశించే దంతంతో, తామరమొగ్గవంటి ఎఱ్ఱని క్రిందిపెదవితో గంభీర కంబుకంఠస్వరంతో ఉన్నతమైన కుంభస్థలంతో, ముద్దులు మూటగట్టే చిట్టిపాదములతో లక్ష్మీకళతో వెలుగొందే గుండ్రని మోకాళ్ళు, బొద్దుగా ముద్దుగావుండే పాదపద్మములతో నవరత్నఖచితమైన అందెలతో మేఘస్వరం వంటి మంగళవాద్యస్వరంతో నృత్యతాండవ స్వరూపoలో వారిఎదురుగా భూమిపై సాక్షాత్కరించాడు గణేశ ప్రభువు!!
ఒక్కసారిగా దేవతలు ఖంగారుగా లేచినిలబడ్డారు! జయజయ శబ్దములతో దండములవలె సాష్టాంగముగా క్రిందపడి నమస్కరించారు. తామరపుష్పములవంటి సుకుమారమూర్తియైన గణేశునితో ఇంద్రాది దేవతలు ప్రార్ధనగా యిలాచెప్పార.
దేవతలు:
“ఓ దేవదేవా! ఈ బాలస్వరూపమేమిటి? పరమాశ్చర్యమైనది! బ్రహ్మరూపివైన బాలకుడా ఏకార్యం నిమిత్తం యిట్టి సుందర శిశురూపంలో సాక్షాత్కరించావు? ఘోరమైన అనలాసురుడు మమ్ములను భక్షించే ప్రమాదంలో యిలా మాకు బాలకుడిగా ప్రత్యక్షమైతేఎలా? మమ్ములను నీవే రక్షించగలవని నమ్మి ఉన్నామే? అయ్యో! శిశురూపీ! పసిబాలకుడా! గజాననా! ఏమి ఈరూపం?” అంటూ ఆశ్చర్యంతో ప్రార్ధించిన మునిగణాలతో కలసి ప్రణామంచేసిన దేవతలతో శ్రీ గణేశుడు యిలాచెప్పాడు
గణేశుడు:
“నేను నా సంకల్పంచేతనే ఇలా బాలరూపంలో ప్రత్యక్షమైనాను! అతివేగంగా, జన్మించగానే బాలునివలే మీముందర ఆ రాక్షసుని సంహారం నిమిత్తం అవతరించాను. ఓ అనఘులారా! ఈ రాక్షసవధకు ఉపాయం చేనుతాను!
నేను ఆరాక్షసుని యొక్క పరాక్రమాన్ని చూడాలన్న కుతూహలంతోనే ఈ బాలరూపంతో అవతరించాను. మీరుపోయి ఆ రాక్షసుణ్ణి ప్రేరేపించండి!”
గణపతి వాక్యములు విని దేవతలు ఆనందపరవశులైనారు. దేవతలు ఒకరితో ఒకరు ‘ఆహా! ఈశ్వరుడైనా ఈ గణపతి ఇలా బాలరూపంలో సాక్షాత్కరించి ఆరాక్షసునితో తలపడటం ఎలాసాధ్యం? మనల్ని రక్షించేందుకూ, ముల్లోకాలను పీడిస్తున్న ఈ రాక్షసుని వదార్ధము ప్రార్ధించాముకదా!’ ఇంతలోనే ఈ కాలానలుడు అగ్నిస్వరూపుడైన జ్వాలలుదశదిక్కులకూ ప్రజ్వలించగా మానవలోకం హాహాకారాలు చేసేలా ప్రత్యక్షమయ్యాడు! గొప్ప కోలాహలంతో సర్వత్రా గగ్గోలుగా సమస్తలోకాల జీవులూ రోదనం చేస్తున్నారుకదా! ఆ మహాత్కష్టంచూసి మునులు, దేవతలు భయంతో పరుగెత్తసాగారు. మనంకూడా శీఘ్రంగా తప్పించుకు పోకుంటే ఈ రాక్షసుడు మనలను ఒక్కసారిగా ఓపెద్ద తిమింగలం చిన్నచిన్న చేపలను మింగినట్లు గుటుక్కున భక్షించగలడు! గరుత్మంతుడు సర్పాలను చీల్చినట్లు మనలను చీల్చి చెండాడనూగలడు! పారిపోదాం పదండి!” – అంటూ పరుగేత్తిపోయే కోలాహలశబ్దం విని పరమాత్ముడైన గజాననుడు బాలరూపం ధరించి, ఆ రాక్షసుని దారికడ్డంగా బండరాయివలే కదలక స్థిరంగా నిలబడ్డాడు. ఆ బాలకుని ఒంటరిగా విడిచి దేవతలు దూరంగా పరుగెత్తారు ప్రాణభయంతో.
Chapter 63 complete
