గణేశ పురాణము - ఉపాసనా ఖండము
41 – బ్రాహ్మణాభీష్ట ప్రదానం
వ్యాసుడు:
“ఓ చతురాననా! అలా దేవతలకు వర ప్రదానం చేశాక సకల గణాలకూ అధిపతియైన గణపతి వరదుడై ఏమేమి లీలలను గావించాడో – ఆ వివరాలను వినాలని కుతూహలంగా ఉన్నది. కనుక నాకు తెలియజేయవలసింది!” అన్న వ్యాసుని అభ్యర్ధనకు బ్రహ్మ యిలా బదులిచ్చాడు.
బ్రహ్మ:
“ఓ వ్యాసమునీంద్రా! దేవతలందరికీ వరప్రసాదం చేసిన గజాననుడు తానొక బ్రాహ్మణవేషందాల్చి త్రిపురుని సన్నిధికి వెళ్ళాడు. దేవేంద్రుని ఐశ్వర్యాన్నే మరిపించేలా వెలలేని రత్నాలతో పొదగబడిన దివ్యసింహసనాన్ని అధిష్టించి వున్న ఆ దానవుడిని చూశాడు.
అప్పుడు దిగ్గున సింహాసనంనుండి లేచి త్రిపురుడా బ్రాహ్మణుని ఎంతో ఆదరంగా తన ఆసనంపై కూర్చుండచేసి భక్తిశ్రద్ధలతో సపర్యలను చేసి పూజించి యిలా ప్రశ్నించాడు.
త్రిపురుడు:
“ఓ బ్రాహ్మణోత్తమా! నీవెవరు? ఎక్కడనుండి వచ్చావు? నీకు ఎందులో పాండిత్యమున్నది? నీవిలా రాజసభకు ఏ కార్యర్థివై వచ్చావు? నీ కోరికేదైనా సంకోచించకుండా చెప్పు! నా శక్తిమేర నెరవేరుస్తాను!”
బ్రాహ్మ:ణుడు:
“ఓ దానవశ్రేష్టా! సాయంతనగృహం కలవాడిని, నాపేరు కళాధరుడు. త్రికాలవేదిని! నీ సంపదలను గూర్చి విని పేరు, ఖ్యాతి విని చూద్దామని వచ్చాను. నీకు గల భోగభాగ్యాలను అఖిలమైన సంపదలను చూచి సంతుష్టుణ్ణైయ్యాను. నీ సంపదా, ఐశ్వర్యము కైలాసంలోగాని, వైకుంఠంలోగాని సత్య, స్వర్గలోకాలలో ఎక్కడా కానరాదు!”
త్రిపురుడు:
“ఓ బ్రాహ్మణోత్తమా! నీవు పేరుకే కళాధరుడివి గాని, అన్ని లోకాలలోని విశేషాలనూ నీవెరిగున్నట్లే మాట్లాడుతున్నావే! నా సంపదనంతా పోగుడుతున్నవే – అలాటి విశేషాలేమైనా నీవెరిగుంటే అలాంటి వాటిలో గోప్పదేదో నాకూ తెలియజేయి! నీ ప్రజ్ఞను నిర్థారించుకుని నీ వాంచితార్థముల నన్నిటినీ తీరుస్తాను. ఆడినమాట తప్పను! చివరికి నాప్రాణమైనా సమర్పిస్తాను. ఇదిమట్టుకు యదార్థంసుమా!”
బ్రాహ్మ:ణుడు:
“ఓ దానవా! పరుల ఐశ్వర్యాన్ని గురించి తెలుసుకోవడంవల్లా వాటిని చూడటంవల్లా నీకేమిటి ఉపయోగం? ఐనా నీ వినయ విధేయతలకు ఎంతో ప్రసన్నుడనైనాను! నాకు కల్గినవి నీకు అనుగ్రహంగా ఇస్తాను. బాణాలపై నిర్మింపబడిన, బంగారు, వెండి, లోహముల ప్రాకారాలతో తయారైన త్రిపురాలను నీకు ప్రసాదిస్తాను. ఆ పట్టణాలలో సుస్థిరంగా సుఖంగా నివసించు.
ఆ పురములు దేవతలకుగాని, మనుష్యులచేతగాని గంధర్వులచేతగాని భేదింపబడరానివి. కోరుకున్న తావుకు వెళ్ళగల ‘కామ గమనం’ గలవై ఉండగలవు! సకలైశ్వర్యాలు ఆ పురములలో తాండవమాడుతాయి. ఐతే ఏనాడైతే రుద్రుడు ఆ మూడింటిని ఒకే బాణంతో భేదిస్తాడో అప్పుడు వాటితోపాటూ నీవూ నశిస్తావు!”
ఇలా అభయప్రదానం చేసిన కళాధరుడు ఒక ధనుస్సును పాటి దానిమీద త్రిపురాలనూ నిర్మించాడు. నానా చిత్ర విచిత్ర భవనములతో, రకరకాల దిగుడుబావులూ, ఉద్యానవనాలతోనూ అలరారుతూ, సకల పక్షిగణముల కిలకిలారావాలతో అంతరిక్షంలో వ్రేలాడే ఆ పురత్రయాన్ని తన మాయతో నిర్మించి యిచ్చాడు.
అలా తనని ఆ బ్రాహ్మణుని మాయ కప్పేయగా ఆ పురంలో తన నివాసమేర్పరుచుకుని నివసిస్తూ సంతోషంగా ఆ దానవప్రభువు కాలం గడపసాగాడు. ఆ సంతోషంతో, బలగర్వంతో గర్వోన్మత్తుడై మూడు లోకాలనూ గడగడ లాడి౦చేలా గర్జించేవాడు. ఇలా మదగర్వంతో సకల లోకవాసులకూ క౦టకప్రాయుడై, త్రిపురుడు ఆ మాయాబ్రహ్మనునితో యిలా అన్నాడు.
త్రిపురుడు:
“ఓ బ్రాహ్మణోత్తమా! నీవు ఎట్టి దుర్లభతరమైన దాన్నైనాసరే కోరుకో! ఇస్తాను!” అనగానే ఆ బ్రాహ్మణుడు నిష్కాముడైఉండీ మాయావిగనుక ఇలా వరాన్ని కోరుకున్నాడు.
బ్రాహ్మ:ణుడు:
“ఓ దానవా! నేను నీవద్దకు వస్తూ, మార్గమధ్యంలో కైలాసశికరానికి వెళ్ళి అక్కడ పరమశివునిచేత అర్చించబడుతున్న సకల కామప్రదుడైన గణపతిమూర్తిని చూసాను. నీకు సామర్థ్యం ఉంటే ఆ మూర్తిని తెచ్చి నాకివ్వు! అసలలా౦టి మూర్తి మూడు లోకాలలోనూ నాకెక్కడా తటస్థపడలేదు! అందుచేతనే నా మనస్సు దానిపై పూర్తిగా లగ్నమైయున్నది”.
“అలాంటి మూర్తిని పొందడంవల్ల నేను కృతకృత్యుడనౌతాను! నీకు అడిగినవారికి లేదనకుండా ఇస్తావన్న ఖ్యాతి లభిస్తుంది”.
ఆ మాటలకు గర్వంతో వివశుడైన త్రిపురాసురుడు “ఓ బ్రాహ్మణోత్తమా! ఆ శంకరుడు నాకు కింకరుడే! నేను ఏ దేవతను లెక్కచేయను! నీవు కోరిన ప్రకారంగానే కైలాసమునకు వెళ్ళి ఆమూర్తి నీకు తెచ్చిస్తాను!” ఇలాఅని ఆ బ్రాహ్మణుని అత్యంత ఆదరంతో పూజించాడు. అతనికి లెక్కకుమీరిన ఆవులను, వస్త్రభూషణాలనూ, పదిగ్రామాలనూ, విలువైన ముత్యాలహారాలతోపాటూ, రత్నాలు, పగడాలు, తివాసీలు, దాసదాసీలు, బంగారు ఇరుసులతో ఒప్పే వెండిరథాలూ, ఉత్తమాశ్వములు మొదలైనవన్నీ సమర్పించాడు.
అప్పుడా కలాధరుడు బలాత్కారంగా తనకు సమర్పించబడిన సపర్యల నందుకుని తన ఆశ్రమానికి వెళ్ళి తన భార్యను ఇతర ఆశ్రమవాసులను సంతోషపరిచాడు. ఓ వ్యాసమునీ౦ద్రా! ఈ జరిగిన యావద్వృత్తాంతరాన్ని నారదుడు దేవతాగణాలకు తెలియచెప్పాడు. అప్పుడు దేవతలుకూడా తగుకాలం కోసం నిరీక్షిస్తూ కాలం గడపసాగాడు.
Chapter 41 complete
