గణేశ పురాణము - ఉపాసనా ఖండము
84 – కామదహనం
బ్రహ్మ:
“ఓ వ్యాసమునీంద్రా! ఆ విధంగా మన్మధుడు సింహశార్దూలాది కౄరజంతువులతోకూడి, నానావృక్షములతోనూ, లతలతోనూ దట్టంగా అల్లుకున్నట్టి శంకరుని తపఃస్థానాన్ని చూసి తానుకూడా ఒక మాయావాటికను నిర్మించాడు. అందులో మధురమైన జలాలతో నిండిన సరోవరాలతోనూ, దివ్యమైన సుమసౌరభాన్ని ఒక క్రోసెడు దూరంవరకు వెదజల్లే నానా పుష్పవృక్షాలతోనూ, మామిడి, పనస, అరటి, ఖర్జూరము వంటి ఫలవృక్షాలతోనూ ఉన్న ఒక సుందర వనాన్ని నిర్మించాడు. ఆ పుష్పముల దివ్యసుగంధo ఘోరతపోనిష్ఠలోవున్న శంకరుని నాసికాపుటాలలో దూరింది! సూర్యోదయ కాలాన మనోహరమైన జలమును, అనేక ఫలపుష్పాలతో ఒప్పే ఆ మదనునిచే నిర్మితమైన కామోద్యానమును చూడగానే శివుని మనస్సు చలించింది. తన తపోవనాన్ని అలా పేలవంగా ఉన్నందుకు నిందించాడు. అనుకోకుండా ఈ విధంగా అకస్మాత్తుగా దేహభావాన్ని పొందిన శంకరుడు ‘ఈ వికల్పానికి కారణమేమిటా?’ అని యోచించాడు.
“ఇలా నా తపస్సుకు విఘ్నం కల్గించటానికి సాహసించిన వాడేవ్వరు? ఈ మన్మోహనకరమైన అరణ్యం ఎవరిచే నిర్మించబడింది? ఎవడికి యిటువంటి పోగాలము దాపురించింది?” అనుకుంటూ శంకరుడు క్రోధపరవశుడైనాడు. కోపంతో ముడివడిన కనుబోమ్మలతోను, ఎఱ్ఱబారిన విశాల నేత్రములతోనూ ఉన్న శంకరుడి రౌద్రరూపానికి భీతిల్లిన మన్మధుడు భయంతో వణికిపోతూ, తనని కాపాడేందుకు ఇంద్రాదులను స్మరించినా వారెవరూ రాలేదు! మిగతా దేవతలంతా తమతమ దివ్యవిమానాలను అధిరోహించి స్వర్గంలోనుండి వీక్షించసాగారు.
“భయంతో కృంగి కృశించిన, మన్మధుడు శoకరుడి కంటబడ్డాడు! ఆగ్రహోదగ్రుడై పరమశివుడు అతడిని భాస్మీకరించతలచి మూడోకన్ను తెరువగా, సకలలోకాలూ భయంతో కంపించాయి. అంతరిక్షానఉన్న దేవతలు మన్మధుని చంపవద్దు ‘మాజాహి!’ అంటూ అరిచేలోగానే మన్మధుడిని భస్మంగావించాడు. అప్పుడు భిల్లయువతి రూపంలోవున్న పార్వతి తన అంజలియోగ్గి భక్తితో ఇలా ప్రార్ధించింది.
పార్వతి:
“ఓ శంకరా! నీ ఈ మూడోకన్నునుంచి వెలువడే క్రోదాగ్నిజ్వాల క్షణంలో ముల్లోకాలనూ భస్మీపటలం కావించగలదు! అందుచేత ఆ దారుణమైన క్రోధాగ్నిని ఉపసంహరించవలసింది! బ్రహ్మయొక్క వరాలను పొందిన తారకుడనే రాక్షసుడు మూడులోకాలనూ తన వరగర్వంచేత వశపరచుకున్నాడు. స్వాధ్యాయము, యజ్ఞయాగాదికాలు అన్నీ నశించాయి. దేవతలంతా తమ నెలవులు వీడి స్థానభ్రష్టులైనారు. లోకపాలనకై సమాధిస్థితుడవైన నీకు దేహభావం కల్పించుటకు దేవతలు శీఘ్రముగా మన్మధుని పిలిచి పంపారు. శ్రేష్టాపరాధంవలన మన్మధుడు భస్మమైనాడు.
“ఓ దేవా! నీ శరణుపొందిన మమ్ము రక్షించు! ముల్లోకాలలోనూ శరణాగతులను రక్షించేవాడవన్న కీర్తి కలిగినవాడవు! ఓ దేవా! దీనులైన శరణార్దులైన, దేవతల అపరాధాన్ని క్షమించు!” అంటూ వేడిన భిల్లియొక్క వాక్యములు విని క్రోధాగ్నిని ఉపసంహరించి చిరునవ్వు మోముతో ఇలా అభయప్రదానం చేశాడు.
శంకరుడు:
“ఓ ప్రియురాలా! లెమ్ములెమ్ము! నీవు పూనుకొని దేవతారక్షణను చేశావు. నా పాదములపైబడి వేడినట్టి నీవాక్యంచేతా, నీయందలి అనురాగంచేతా వీరందరినీ కాపాడాను!” అంటూ ఆమెను ఆలింగనం చేసుకొని తన తొడపై కూర్చుండపెట్టుకున్నాడు. అనంతరం వారిరువురూ వృషభవాహనాన్ని అధిరోహించి కైలాసానికి వెళ్ళరు.
Chapter 84 Complete
