గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

11 – మంత్రకథనం

అనంతరం భృగుమహర్షి సోమకాంతునికి యిలా చెప్పసాగాడు.

భృగువు:

“ఓరాజా! ఇట్లా వ్యాసమహర్షి ప్రశ్నించగా బ్రహ్మ సమాధానం చెప్పటం ప్రారంభించాడు.

బ్రహ్మ:

‘ఓ వ్యాసమునీ౦ద్రా! గణేశమంత్రములే గణేశునియొక్క శబ్ధస్వరూపం! ఆగమాలలో ఏడుకోట్ల గణేశమంత్రాలు చెప్పబడివున్నాయి! వాటి రహస్యం పూర్తిగా తెలిసింది శివునికి మాత్రమే! నాకు కొద్దిగా మాత్రమే తెలుసును! ఇక గణేశ మంత్రాలన్నింటిలోనూ ‘షడక్షర గణపతి మంత్రమూ’, ‘ఏకాక్షర గణపతి మంత్రములూ’ శ్రేష్టమైనవి! ఆ మంత్రాలను కేవలం స్మరించినంత మాత్రానే సకల కార్యములూ సిద్ధిస్తాయి! లోకములో గజాననమంత్ర ఉపాసకులు పూజనీయులు!

వారు సర్వదా నమస్కరించతగినవారు. వారు జీవన్ముక్తులు అవుతున్నారు. ఆ గజాననుని భక్తితో ఉపాసించడంవల్ల సకలసిద్ధులూ దాస్యం చేస్తాయి. ఈ గణేశమంత్రోపాసన చేసేవారు ఇచ్ఛావిహారులు! వారికి సర్వజ్ఞత్వమూ, కోరిన రూపం ధరించగల కామరూపసిద్ధీ కలుగుతాయి! సకలాభీష్టములు ప్రసాదించే ఆ వరగణేశుని భక్తిగా కొలిచేవారు ధన్యులు. ఆ గజాననునియందు భక్తిలేనివారి జన్మ నిరర్థకము! అట్టివారి ముఖం చూడటంవల్ల అన్ని పనులూ చెడతాయి! పైగా అట్టివారికి పదేపదే సకల కార్యవిఘ్నములూ కలుగుతుంటాయి.

అలాగే గణేశుని భక్తుల ముఖ సందర్శనమాత్రం చేతనే సకల విఘ్నములూ ఉపశమిస్తాయి! అట్టి గణేశ ఉపాసకులకు చరాచర భూతములన్నీ స్వాదీనమై నమస్కరిస్తాయి! అందుకని ఓ వ్యాసమునీ౦ద్రా! అటువంటి సకల కార్యసిద్ధిప్రదమూ, మహామహిమోపేతమూ, సర్వమంగళకరమూ, పరమ శుభకరమూ, అయిన ఏకాక్షర గణపతి మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను!” అంటూ బ్రహ్మదేవుడు శుచియై, ఆచమించి, వ్యాసునకు ఉపదేశించాడు!

మంత్రానుష్టాన క్రమము చెప్పుట

బ్రహ్మ:

ఓ వ్యాసమునీ౦ద్రా! ఇక నీకు ఉపదేశించిన గణేశ మంత్రాన్ని ఎలా అనుష్టించాలోకూడా చెబుతానువిను!

ఈ అనుష్టానక్రమాన్ని పూర్వం శివుడు నాకుపదేషించాడు. దాన్ని నీకు సంగ్రహంగా వివరిస్తాను! ప్రాతఃకాలాన్నే స్నానంచేసి తెల్లటి పట్టువస్త్రాన్ని ధరించి శుచిర్భూతుడై దర్భాసనాన్ని ఆపైన లేడిచర్మాన్ని, దానిపైన తెల్లటి వస్త్రాన్ని వైచి, మృదువైన ఆసనం తయారుచేసుకోవాలి! దానిమీద కూర్చుండి భూతశుద్ధిని, ప్రాణస్థాపన, అంతర్మాతృక, బహిర్మాతృకా వ్యాసములుచేసి, మూలమంత్రంతో ప్రాణాయామం చేయాలి! ఆ తరువాత గాయత్రీఉపాసన చేయాలి! తదనంతరం నిశ్చల మనస్సుతో గజాననుణ్ణి ఆపాదమస్తకమూ ధ్యానించాలి! ఏకాగ్రచిత్తంతో మానసిక ఉపచారములతో యథావిదిగా గణపతిని పూజించి యధాశక్తి గణపతి మంత్రమును పురశ్చరణగా గణేశుడు ప్రత్యక్షమై వరాలను ప్రసాదించేదాకా జపపరాయణుడై ఉండాలి!

భృగువు:

ఓ సోమకాంతమహారాజా! ఈవిధంగా బ్రహ్మ భ్రాంతచిత్తుడైన వ్యాసమునీంద్రునికి గణేశుని ఉపాసనా నియమాలను, శుభాముహుర్తంలో ఏకాక్షర గణపతిమంత్రాన్ని ఉపదేశించాడు! అంతేకాదు “ఆ గజాననుని “ఓ గజాననా! నా హృదాంబుజమున నిత్యమూ స్థిరంగా వుండమని ఆవాహనచేసుకుని ప్రార్థించి, అతడు ప్రత్యక్షమైనాక వరాన్ని కోరుకో! అలాంటి సమయంలో నీ హృదయంలోనే ఉన్న ఆ గజాననుడు తప్పక నీకుగల సకల కామ్యములనూ ప్రసాదించగలడు! అట్టి గణేశానుగ్రహం పొందినవెంటనే ఎటువంటి భ్రాంతీ లేనటువంటి దివ్యజ్ఞానమూ, త్రికాలజ్ఞానమునూ, నానా గ్రంధ రచనాశక్తీ నీకు కలుగుతాయి!” అంటూ వ్యాసమహర్షిని ఆశీర్వదించాడు వాణీపతియైన ఆ చతురాననుడు.

అప్పుడు వ్యాసమునికి యింకా ఆ మంత్రవిశేషాన్ని గురించి విరించి యిలా వివరించాడు

బ్రహ్మ:

“ఓ వ్యాసమునీంద్రా! నీ మనస్సుకు ఏకాగ్రత కలిగేందుకు అనుకూలమైన నిర్జన ప్రదేశంలో ఏకాంతంగా కూర్చుని ఆ భక్తవరదుడైన గజాననుణ్ణి నీ హృదయంలో నిరంతరం స్మరిస్తూ, ఈ మంత్రాన్ని అనుష్ఠించు! పరమపవిత్రమూ, అనంతమహిమోపేతమూ అయిన ఈ మంత్రాన్నిమాత్రం నాస్తికులకు, వేదనిందచేసే వారికీ, అకృత్యాలుచేసే కౄరులకూ, శఠులకూ, దురాచారపరులకూ ఎన్నడూ చెప్పరాదు.

‘దైవం’యందు ధృఢమైన భక్తివిశ్వాసములు కలవానికీ వినయమూ, శ్రద్ధా ఉన్నవానికి మాత్రమే ఈ మంత్రాన్ని ఉపదేశించాలి! అలాకాక నాస్తికులకు ఉపదేశిస్తే వారి ముందూ, వెనకా, పదితరాల వారిని మహానరకాలను పొందించినవాడవౌతావు!

ఎవరైనా భక్తిశ్రద్దలతో ఈ గణేశోపాసనను చేస్తే అట్టివారి సకల మనోభీష్టములూ తప్పక నెరవేరతాయి! ఆ ఏకదంతుడైన గణపతి యొక్క దివ్యానుగ్రహంచేత పుత్రపౌత్రాభివృద్ధినీ కలిగి, పాడిపంటలతో, సమస్త సంపదలనూ అనుభవించి అంత్యములో నిర్మలమైన దివ్యజ్ఞానాన్ని పొంది ఇలలో సకల భోగాలనూ అనుభవించడమేకాక, చివరకు దివ్యమైన మోక్షాన్ని కూడా నిస్సందేహంగా పొందుతాడు!” అంటూ బ్రహ్మ తన ఉపదేశాన్ని ముగించాడు.

Chapter 11 complete