గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

68 – వ్రతనిరూపణం

శూరసేనుడు:

“ఓ ఇంద్రా! గణనాథుని చరిత్ర ఎంతవిన్నా యింకా వినాలనిపిస్తూనే ఉంది. తనివితీరడం లేదు! దయఉంచి ఆ తరువాత కృతవీర్యుడి తండ్రి ఏంచేశాడో ఆవివరం తెలుపు!”

ఇంద్రుడు:

“ఓ రాజా! చతురాస్యునివద్దనుండి కృతవీర్యుని తండ్రి సంకష్టచతుర్థీ వ్రతవిధానాన్ని, దూర్వామహాత్మ్యాన్ని విని, నిదురించి ఉన్న తన కుమారునికి కలలో కనిపించాడు. చింతావ్యాకులములతో ఉన్న ఆ కృతవీర్యుడు అలా తలపని తలంపుగా తనతండ్రి స్వప్నములో కనపడగా అత్యంత ఆనందముతో మాటలుకూడా అందని ఉద్విగ్నతతో పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. అప్పుడా కృతవీర్యుడు తన కుమారుని తన పర్యంకం మీద కూర్చోబెట్టుకుని”

“నాయనా! సంతానం నిమిత్తం నీవుపడ్డ శ్రమంతా నాకుతెలుసు! అందుకని నీకొక ఉపాయము నేను బ్రహ్మవద్ద తెలుసుకున్న దానిని, నీయందుగల అభిమానంచేత తెలియజేస్తాను! నీ వ్యధయావత్తు దాని నివారణకూడా మానవలోకంనుండి వచ్చిన నారదమహర్షి ద్వారా నాకు తెలిసింది.

నీ అభీష్టసిద్ధికై చతురాననుడు నాకు దయతో చెప్పిన సంకష్టచతుర్ధీ వ్రతం నీకు తెల్పుతాను అంటూ ఆ వ్రతనియమాలు తాను వ్రాసుకున్న పుస్తకాన్ని చేతికిచ్చి

“ఇందులో చెప్పినట్లుగా సంవత్సరకాలం ఈ చతుర్థీవ్రతాన్ని ఆచరించు. అలా ఆచరిస్తే సర్వ సంకష్టహరుడైన గజాననుని అనుగ్రహవిశేషం చేత నీ సకలదోషాలూ నశించి నీకు పుత్రసంతతి ప్రసాదింపబడుతుంది!” అంటూ స్వప్నంలో తెలిపి కృతవీర్యుని తండ్రి అదృశ్యుడైనాడు.

అప్పుడు కృతవీర్యుడు నిద్రనుంచి వెంటనే మేల్కొని స్వప్నంలోని విషయమంతా స్మరించుకుంటూ సంతోషం, దుఃఖము పెనవేసుకోనగా కన్నులనుండి అశ్రుధారలు విడుస్తూ, తన చేతులలోని పుస్తకాన్ని హృదయానికి హత్తుకుని ఉండగా మంత్రులు అతడిని సమీపించి ఊరడిస్తూ

మంత్రులు:

‘ఓ రాజా! నీవీ దుఃఖాన్ని వీడి సావధానమనస్కుడవుకమ్ము! నీవెందులకు దుఃఖపడుతున్నావో ఆ కారణం మాకు చెప్పు. నీవిలా దుఃఖించడం చూస్తే మాకూ దుఃఖం కలుగుతుంది!’

కృతవీర్యుడు:

“మంత్రిపుంగవులారా! నాకీనాడు స్వప్నంలో స్వర్గస్తులైన నా పితృదేవుల దర్శనమైంది. ఆయన సమస్త దుఃఖనివారకమూ, సత్సంతాన ప్రదాయకమూ ఐన సంకష్టచతుర్థీవ్రతాన్ని అనుష్టించమని నాకు ఉపదేశించి, ఆ వ్రతవిధానం వ్రాయబడ్డ ఈ పుస్తకాన్ని నాచేతులలో ఉంచి అదృశ్యులైనారు. ఆ భావోద్వేగంచేత నేను చేష్టలుడిగి ఉద్విగ్నుణ్ణైనాను! ఆయన వియోగదుఃఖాన్ని తట్టుకోలేక దుఃఖిస్తున్నాను.”

మంత్రులు:

“ప్రభూ! స్వప్నంలో మీకు మీపితృదేవుల రూపంలో దర్శనమిచ్చి చతుర్థీవ్రతాన్ని ఆచరించమని మీకు బాధా నివారణోపాయాన్ని తెలిపింది మరెవరోకాదు! సకలలోకాలకూ తండ్రియైన భక్తవత్సలుడు ఆ శ్రీగణేశుడే! అతడే మీ వంశవృద్ధికై తగిన ఉపాయాన్ని తెలిపాడు. అంతేకాదు! ఆ మహదనుగ్రహానికి ప్రత్యక్ష నిదర్శనంగా ఈ పుస్తకాన్ని నీకు అనుగ్రహించాడు! అలాకానిదే ఇట్టి దివ్యస్వప్నం కలగటం అసాధ్యం! కనుక మీరు తక్షణ కర్తవ్యాన్ని ఆలోచించవలసింది”

ఇంద్రుడు:

  ఓ శూరసేనమహారాజా! ఈ విధంగా మంత్రుల సలహాను అనుసరించి వేదవేత్తలైన పండితులను తన సభాస్థలికి పిలిపించి తనకు లభించిన పుస్తకములోని విశేషాన్ని వివరించి చెప్పమని అర్థించాడు.

అప్పుడు ఆ వేదవిదులైన విప్రులా గ్రంధాన్ని పరిశీలించి

‘ఓ కృతవీర్యమహారాజా! ఇందులో మీతండ్రిగారికీ చతుర్ముఖునికి జరిగిన సంవాదమూ, బ్రహ్మ అతడికి ఉపదేశించిన ‘సంకష్ట చతుర్థీవ్రత విధానమూ’, చంద్రోదయ సమయంలో చేయవలసిన గణేశపూజ, అంగారక చతుర్థీమహిమ వర్ణించబడి ఉన్నది!’

అంతేకాదు మహారాజా! ఇంకా చతుర్థీతిధికి, దేవతకు, చంద్రునికి అర్ఘ్యప్రదానంచేసే విధానంకూడా వివరించబడివున్నది. దానితోపాటు ఇరవైఒక్కమంది సద్విప్రులకు చేయవలసిన అన్నసంతర్పణ, పూజ, వాళ్లకీయవలసిన వివిధములైన దానముల గురించీ తెలుపబడిoది.

విఘ్నేశ్వరునికి దూర్వాసమర్పణవల్ల కలిగే అనంతఫలమూ, అందునా శ్వేతదూర్వముయొక్క సమర్పణఫలం గురించి విడిగా తెలపడం జరిగింది. ఓ మహారాజా! ఈ వ్రతవిధానం నీకు సంప్రాప్తమవటం నీ అనంత పుణ్యఫలంగానే కాని వేరుకాదు! ఇలా సర్వులకూ బహుళార్ధప్రదమైన వ్రతం ఇదివరకు ఎవ్వరూ కనీవినీ ఉండలేదు! దీన్ని వినటంవలన, స్మరించుటవలనా కూడా సకల సంకటనాశనం జరుగగలదు!

అన్న విజ్ఞుల శుభవచనాలను విన్న కృతవీర్యుడు అమితసంతోషాన్ని పొందినవాడై వారిని ఉచితరీతిని సత్కరించి సంతుష్టులను కావించాడు. ఆ తరువాత తమ కులపురోహితుడైన అత్రిమహర్షిని పిలిపించి అతడిని యాధావిధిగా పూజించి వారివద్ధనుండి ఎకాక్షరీగణపతి మహామంత్రాన్ని ఒక శుభముహూర్తంలో స్వీకరించి, ఆమంత్రానుష్టానాన్ని అనన్యభక్తితో చేస్తూ, ఇంద్రియములను జయించినవాడై తన సంకట నాశనంకొరకూ, ఆ సంకష్టహర చతుర్థీవ్రతాన్ని సంతానార్ధియైఅత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించాడు.

Chapter 68 complete