గణేశ పురాణము - ఉపాసనా ఖండము
29 – నారదాగమనం
ముని:
‘ఓరాజా! ఒకానొక రోజున అలా ప్రాయోపవేశం చేయబోతున్న ఆ రుక్మాంగద మహారాజు దూరాన్నుండి వస్తున్న త్రిలోకసంచారియైన నారదమహర్షిని చూశాడు.
రుక్మాoగదుడు నారదునికి తన శాపవృత్తాంతమును చెప్పుకొనటం
ఎంతో భక్తితో ఆ మహర్షికి నమస్కరించి “ ఓ మునీంద్రా! ఒక క్షణకాలం విశ్రమించండి!” అంటూ ప్రార్ధించాడు. ఆకాశమార్గంలో పయనిస్తున్న నారదమహర్షి ఆ ప్రార్ధన విని క్రిందకు దిగినాడు. యధావిధిగా నారదుని పూజించి గౌరవభావంతో యిలా ప్రశ్నించాడు. “ఓ మహర్షీ! నేను భీమపుత్రుడైన రుక్మాoగదుడను. వేటకై అరణ్యానికి వచ్చి దప్పిగోన్నాను. సమీపంలోనే ఉన్న వాచక్నవి మహర్షి ఆశ్రమానికి వెళ్ళి దాహం తీర్చుకుందుకని మంచితీర్థమును అర్ధించాను. ఆ మునిపత్ని కామపీడితురాలై తన కోరిక తీర్చమని బలవంతం చేసింది. ఇంద్రియనిగ్రహం కలవాడనవటంచేత దైవానుగ్రహంవల్ల ఆమె కోరికను నిరాకరించాను. ఆమె దుఃఖిస్తూ నిష్టుర మనస్సుతో నన్నిలా శపించింది ‘ఓమూర్ఖుడా! కామించిన నన్ను నిరాకరించావు గనుక నీవు కుష్టురోగంతో పీడితుడవుగుదువుగాక!’
ఆ దుష్టవాక్యాన్ని విని నేను ఆ ముని ఆశ్రమము విడిచి నా రాజ్యానికి వెడుతూoడగా మార్గమధ్యంలో నా దేహం శ్వేతకుష్టుకు లోనైంది. ఓమహర్షీ! దీని నివృత్తికి తగిన పరిహారము చెప్పి నన్ను కృతార్ధుణ్ణి చేయండి! నా రాకకై ఎదురుచూచే నాతండ్రి ఈపాటికి నా వియోగంవల్ల యెనలేని దుఃఖసముద్రంలో మునిగి వుంటాడు!”
దైన్యంగా ప్రార్ధించిన ఆ రుక్మాoగదుడి జాలిపూరితమైన మాటలకు కరుణార్దహృదయుడైన నారదమహర్షి హృదయం ద్రవించింది. సర్వజ్ఞుడైనట్టి నారదమహర్షి అతని శ్వేతకుష్టువ్యాధి నివారణకై ఒక చక్కటి ఉపాయాన్ని చెప్పాడు.
నారదుడు రుక్మాoగదునికి వ్యాధినివారణోపాయం చెప్పుట:
నారదుడు:
‘ఓ రుక్మాoగదా! ఎప్పటిలాగే త్రిలోక సంచారంచేస్తూ నేను వస్తుండగా మార్గమధ్యంలో ఒక గొప్ప ఆశ్చర్యాన్ని చూశాను! విదర్భదేశoలో కదంబ మనే నగరం ఉన్నది. అక్కడగల ఒక ప్రాసాదంలో ఒకగొప్ప వైనాయక మూర్తిని చూశాను. భక్తుల సకలాభీష్టాలను నెరవేర్చే ఆ మూర్తికి చింతామణి వినాయకుడని పేరు! ఆ ఆలయానికి ఎదురుగా గణేశకుండమనే కొలనుకూడా ఉన్నది. ఒకానొక శూద్రుడు వృద్దాప్యంచేత కృశించిన దేహంతో అక్కడికి తీర్ధయాత్రలకని వచ్చి ఆ కుండంలో స్నానం చేయగానే దివ్యదేహాన్ని పొందాడు. ఆ తరువాత అతనికై వైనాయక లోకాన్నుంచి వినాయకుని దూతలు ఒక విమానము తీసుకురాగా అందులో ఎక్కి అతడు దుఃఖశోకరహితమైన, పునారావృత్తి రహితమైన గణేశస్థానాన్ని చేరుకున్నాడు. ఓ రుక్మాంగదా! ఇదంతా నేను స్వయంగా నాకళ్ళారా చూశాను. కనుక నీవు కూడా ఆ పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకుని, అక్కడగల ఆ గణేశకుండంలో స్నానమాచరించి, కోరిన కోర్కెలనన్నీ తీర్చే భక్తవరప్రదుడైన ఆ చింతామణిగణేశుని భక్తితో అర్చించి ద్విజోత్తములకు విరివిగా దానధర్మములు చేయి! నీవు తప్పక ఆరోగ్యవంతుడవౌతావు. సర్పం తన కుబుసాన్ని వీడినట్లు నీవుకూడా ఈ రోగంతో కల్మషమైన దేహాన్ని వీడి పరిశుద్ధదేహాన్ని పొందగలవు!” అంటూ చతుర్ముఖుడు వ్యాసమహర్షికి, రుక్మాంగదునికి నారదుడు చెప్పిన బాధా నివారణోపాయాన్ని వివరించి యిలా కొనసాగించాడు. “ఇలా నారదుని నోటినుంచి వచ్చిన అమృత వచనాలను విన్న రుక్మాంగదుని అంతరంగం తొలకరి జల్లులకు పుడమిలా ఆనందంతో పులకరించింది! వెళ్ళిపోబోతున్న ఆ మహర్షికి నమస్కరించి శ్రద్ధాళువై తిరిగి రుక్మాంగదుడు యిలా ప్రశ్నించాడు.
రుక్మాంగదుడు:
‘ఓ నారదమునీంద్రా! ఆ చింతామణి గణపతిక్షేత్రంలో ఎవరెవరు యింతకు పూర్వం గణేశానుగ్రహాన్ని పొందారు? అక్కడి మూర్తిని స్థాపించినదెవరు? పరోపకారులైన మీబోoట్లే మావంటి దీనుల దుఃఖాన్ని నివారించగల సమర్థులు. అందుకనే మీరు మూడులోకాల్లోనూ అవిశ్రాంతంగా సంచరిస్తూoటారు! మేఘాలకు వర్షించడం, శేషుడు భూభారాన్ని వహించటమూ, సూర్యుడు ప్రకాశించటమూ యివన్నీ లోకోపకారానికే గదా! సర్వజ్ఞడవు దయాంతరంగుడవైన ఓ మునీంద్రా! కనుక నీవు దయతో నా సందేహాన్ని నివృతిచెయ్యి!’
నారదుడు:
‘ఓ రుక్మాంగదా! నీ ప్రశ్న ఎంతో సమంజసంగా ఉన్నది. మృదుమధురములైన నీ శ్రద్ధాపూరిత వచనాలకు నాకు ఎంతో తృప్తి కలిగింది. తప్పక నీవడిగిన యావద్వృత్తాంతాన్నీ చెబుతాను. విను!
Chapter 29 complete
