గణేశ పురాణము - ఉపాసనా ఖండము
8 – నానాపక్షి నివారణం
భృగువు:
ఇట్లా గుణవర్ధనుడనే ఆ బ్రాహ్మణుడు ఎన్నోవిధాల వేడుకున్నా వజ్రమంతటి కఠినమైన నీ హృదయమేమాత్రం కరుగలేదు! చాల కాలంగా ఘోరకృత్యాలను జంకుగొంకులులేకుండా చేస్తుండటంవల్ల కరడుగట్టిన కాఠిన్యంతో, జాలి అన్నమాట మందుకిగూడ లేకుండా నిర్దయగా ఆ బ్రాహ్మణుడితో నీవిలాగన్నావు.
కామందుడు:
“ఓ బ్రాహ్మణోత్తమా! నీవిలా ఎంత వేడుకుంటే మాత్రం ప్రయోజనమేముంది? చెవిటివాడి చెవిన శంఖం ఊదినట్లు నాదగ్గర నీ ఉపదేశాలేం పనికివస్తాయి? త్రాగినవాడికి తత్వోపదేశం చేవికెక్కుతుందా? ధనార్జనే ప్రధానమైన వాడికి తల్లిదండ్రీ బంధువులుఅన్న విచారం ఉండనట్లు, కామాతరునకు సిగ్గులజ్జా మచ్చుకైనాలేనట్లు నావద్ద కూడా నీవు ఉహించే జాలీ, దయా వంటి సుగుణములేవీ లేవు! ఐనా చాలాకాలంగా పనిలేని నాచేతికి చిక్కవు! నిన్ను ఊరికే వదుల్తానా? అని పల్కుతూ, “ఓ రాజా! దయాశూన్యుడవై కుడిచేత్తో ఖడ్గంతీసి వాని శిరస్సును ఖండించావు! ఇట్లాగ లెక్కలేనన్ని బ్రహ్మహత్యలను నిస్సంకోచంగా చేశావు! ఇలా ఎంతోకాలం గడిచాక నీకు ముసలితనం కూడా వచ్చింది. శరీరంలో కఫము, శ్లేష్మము, వాతములు ఉద్రేకించి అటుఇటూ కదలలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు నీభార్య, పుత్రులు, సేవకులూ అందరూ నిన్ను నిరాదరణతో త్రోసివైచారు.
ఎవరూలేని ఏకాకివై, ఒక రహస్య స్నేహితుడిని చేరబిలిచి అక్రమంగా సంపాదించిన నీ ధనాన్నంతటినీ దానధర్మములు చేసేయవలెనని సంకల్పించి ఆ ఆరణ్యంలో బ్రహ్మనులందరినీ పిలిచి వారికి దానములివ్వబోగా
“పతితుడ” వైన నీవద్ద దానంపట్టి తమ పుణ్యాన్ని నశింపజేసుకోలేమని నిరాకరించారు. అంతేకాదు మహాపాపివైన నీవంటివాడితో సంభాషించడం కూడా దోషమని, దానినివరణకై జపించి వెడలిపోయారు. ఈ సంఘటనతో నీకు పశ్చాత్తాపము కల్గింది. నీదగ్గర అన్యాయంగా ఆర్జించిన ధనాన్నంతటినీ ఖర్చుచేసేసే మార్గం తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు. అప్పుడు ఆ అరణ్యంలోఉన్న ఒక జీర్నదేవలయాన్ని బాగుచేయాలన్న ఆలోచనకల్గింది. అప్పుడు కొందరు విప్రులు నీకిలా సలహాయిచ్చారు.
విప్రులు:
“ఓయీ! అతి ప్రాచీనమైన ఈ ఆలయంలో ఒక గణేశుని మూర్తి ఉన్నది. నీవు సకలాంగా సుందరంగా ఆ ఆలయాన్ని పునర్నిర్మించి ప్రాయశ్చిత్తం చేసుకోవటమే నీకు తగిన పని!”
అప్పుడు నీవు వారి మాటవిని నాలుగు తోరణాలనూ, నాలుగు ద్వారాలతోనూ అనేక స్తంభాలతో, వేదికలతో విలసిల్లే దివ్యమైన గణేశ మందిరాన్ని, ముత్యాలు పగడాలతో తాపబడిన వాకిళ్ళతోనూ, నానారకాల ఫలవ్రుక్షలతో నిండివున్న దానిని నిర్మించి, అందులో నాలుగు దిక్కులలోనూ నీతివసతికని దిగుడు బావులనూ సదుపాయంగా త్రవ్వించి ఒక బ్రహ్మ౦డమైన గణేశ దేవాలయాన్ని కట్టించి నీవు ఆర్జించిన ధనాన్నంతటిని ఖర్చుచేశావు!
నీవార్జించిన దానిలో కొంత నీ భార్యపుత్రులూ, సేవకులూ మోసంతో హరించారు. అనంతరం కొద్దికాలానికి నీవు మరణించావు! అప్పుడు యమదూతలు నిన్ను తమ పాశాలతో బంధించి, కొరడాలతో కొడుతూ, ముళ్ళతో గుచ్చుతూ సూదులవంటి రాళ్ళపై పడదోస్తూ ఘోరమైన మహానరకాలలో పడద్రోశారు! ఇలా యమదూతలతో హింసించబడుతూ యముడి సన్నిధికి వెళ్ళగా యముడిలా నిన్ను ప్రశ్నించాడు.
యముడు:
“ఓరీ! నీవు ముందుగా చేసిన పాపాన్ని అనుభవిస్తావా? లేక పుణ్యాన్ననుభావిస్తావో చెప్పు” అనగా నీవు ముందుగా పుణ్యాన్నే అనుభవిస్తానన్నావు! అప్పుడు నీవు జీర్ణమైన గణేశ దేవాలయాన్ని ఉద్దరించిన నీపుణ్య విశేషంచేత చంద్రుడివంటి శరీరకాంతితో భయంకర సోమకాంత మహారాజుగా పుట్టావు. అలా నీ పుణ్యఫలం అంతా ఖర్చు అయిపోయినాక, పాపఫలంవల్ల నీకీ కుష్ఠువ్యాది సంభవించింది!”
అని భృగుమహర్షి సోమకాంతమహరాజుతో అతని పూర్వజన్మ వృత్తాంతం చెబుతూండగా
“ఓ మహర్షులారా! ఆ మహారాజుకు హృదయంలో ‘ఇదంతా నిజామా?’ అన్న సంశయం కలిగింది. వేదశాస్త్రాలలో నిధివంటివాడూ, త్రికాలవేదియైనటువంటి ఆ మహనీయుని వాక్కులను సంశయించిన దోషానికి వెంటనే ఆ ఋషి శరీరంలోంచి ఒక పక్షులగుంపు వెలువడి ఆ సోమకాంతరాజు యొక్క శరీరాన్ని ఖండఖండాలుగా పొడుచుకు తినసాగాయి!” అంటూ సూతమహర్షి అక్కడి మహర్షులతో కథాగమనాన్ని యిలా కొనసాగించాడు.
“ఆ బాధకు తట్టుకొనలేని సోమకాంతమహరాజు భరించరాని బాధతో వలవలా ఏడుస్తూ తనను రక్షించమ౦టూ ఆ భృగుమహర్షిని శరణువేడి, దీనంగా యిలా ప్రార్థించాడు.
“ఓ మహాత్మా! ఎంతో కౄరస్వభావంగల మృగాలుసైతం తమ దుష్టత్వాన్ని వీడి, మీ ఆశ్రమంలో ఎంతోస్నేహంగా వెలుగుతున్నాయి కదా? అటువంటి పావనమైన ఈ ఆశ్రమంలోనే, మీ సమక్షంలోనే ఈ పక్షులగుంపులిలా నన్ను బాధిస్తున్నాయె౦దుకనో? ఇవి నన్ను పొడిచి పొడిచి మరీ చంపుతున్నాయి! నీ పావన చరణాలను ఆశ్రయించి శరణువేడినవాడిని! పైగా దీనుడను! కనుక నీవు నాపై దయతో అభయాన్ని ప్రసాదించి కాచి, రక్షించు!” అంటూ వేడుకున్నాడు.
అప్పుడు ఆతరువాత జరిగిన కథావృత్తా౦తాన్ని సూతులవారిలా తెలియజేసారు.
ఇలా ఆ సోమకాంతమహారాజు దీనుడై ప్రార్థించగా భృగుమహర్షి ఇలా బదులిచ్చాడు.
“ఓ రాజా! నీవు నావాక్యములను సంశయించటం వలన ఇటువంటి ఆపద కలిగింది! దీనికి ప్రతిక్రియ చేస్తాను, నీవొక క్షణకాలం ఊరుకో!”
అని ఆ మహర్షి ఒక ‘హుం’కారం చేయగానే ఆ పక్షులగు౦పులన్నీ అంతర్థానమై పోయినాయి! అంటూ సూతుడు చెప్పాడు. ‘ఆ కరుణాభరితమైన మహర్షి చర్యకు సోమకాంత మహారాజూ ఆయన భార్యయైన సుధర్మా ఎంతో సంతోషించారు.
Chapter 8 complete
