గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

70 – సంకష్టచతుర్థీ వ్రతోపాఖ్యానం – 1

పూర్వము శ్రీకృష్ణపుత్రుడైన ప్రద్యుమ్నుడు తన కుమారుని జాడ కానరాక చిoతాజలధిలో మునిగిఉండగా అతని తల్లియైన రుక్మిణీదేవి అతనికి ఇలా సలహాయిచ్చింది.

రుక్మిణీదేవి:

“నాయనా! పూర్వం నీవు ఆరురోజుల వయసుగల బాలకుడవై ఉండగా శంబరాసురుడు నిన్ను నా పొత్తిళ్ళలోంచి అపహరించాడు. అప్పుడు నీ వియోగదుఃఖముచేత నాహృదయం ఎంతగానో తల్లడిల్లింది. ఇతరుల పిల్లలను చూసినప్పుడల్లా ‘నాపిల్లవాడుకూడా యింతే వయసులో ఉండేవాడుకదా’ అని అనిపించి గుండెల్ని పిండివేసినంత బాధ కలిగేది. ఇలా చాలాకాలం గడిచింది. ఒకసారి భాగవత్కృపావిశేషంచేత లోమశుడనే ముని రావడం తటష్టించింది. ఆయన నాపై దయపూని నాకు మనోభీష్టం నెరవేరడానికి ‘సంకష్టచతుర్థీవ్రతాన్ని’ ఉపదేశించాడు. దానిని నేను శ్రద్ధాభక్తులతో నాల్గుపర్యాయములు ఆచరించాను. అప్పుడు ఆ దేవదేవుని అనుగ్రహంవల్ల నీవు శంబాసురున్ని వధించి తిరిగివచ్చావు! కనుక కుమారా! నీవుకూడా ఆ వ్రతాన్ని ఆచరించు! అలా చేసినట్లైతే నీవు తప్పక నీకుమారునిజాడ తెలుసుకొనగలవు!”

బ్రహ్మ:

‘ఓరాజా! అప్పుడు ప్రద్యుమ్నుడు కూడా గణనాధునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ వ్రతాన్ని ఆచరించాడు. అప్పుడు గణేశుని అనుగ్రహంవలన తన కుమారుడు బాణాసురునియొక్క అంతఃపురంలో బందీగాఉన్నట్లు తెలుసుకోగలిగాడు. ఈవిషయాన్ని త్రైలోక్యసంచారియైన నారదునివద్ద తెలుసుకుని, బాణాసురునికి పరమశివుని అండదండలున్నాయి గనుక అతడిని జయించడం చాలాకష్టమని గ్రహించి శ్రీకృష్ణుడు ఆ కార్యసిద్ధికని ఉద్దవుని సలహామేరకు ఈ వ్రతాన్ని ఆచరించాడు.

ఫలితంగా భీకరసమరంలో బాణాసురుని సునాయాసంగా జయించి బాణుని కుమార్తెయైన ఉషాసమేతంగా అనిరుద్ధుని తిరిగి తీసుకుని వచ్చాడు. ‘ఓరాజా! పూర్వం సృష్టిరచనను చేయగోరి నేనుకూడా ఈ వ్రతాన్ని ఆచరించి ఆ గణేశానుగ్రహంచేతనే నానావిధ సృష్టినీ నిర్విఘ్నంగా సమర్థవంతంగా చేయగలిగాను. అంతేకాదు అనేక పర్యాయాలు దేవతలు, అసురులూ కూడా తమకు సంభవించిన విఘ్నముల ఉపశాంతికై ఈవ్రతాన్ని ఆచరించారు. కనుక ఆపదలలోనూ, కష్టకాలమునందూ వాటి శాంతికి ఈవ్రతాన్ని చేయాలి! ఈ వ్రతానికి ధీటైన సర్వసిద్ధికర వ్రతమింకొకటి ఎక్కడా కనపడదు. ఈ వ్రతముతో సమానమైన తపస్సుగాని, విద్యగాని, దానముగాని ఏమిలేదు. ఓరాజా! ఈ కథనంతటిని విని రెండుచేతులనూ జోడించి

హృదయకమలంలో భక్తజనమందారుడైన విఘ్నహరుడిని స్మరిస్తూ మౌనంగా బ్రాహ్మణులు భుజించాగా మిగిలిన శేషాన్ని బందుజనంతో భుజించాలి! ఇలా నిష్టగాచేస్తే కొద్దినెలల్లోనే సిద్ధితప్పక కలుగుతుంది! వేరే ఏ వ్రతమూ, నోమూ, కామ్యకర్మకూడా ఇంత శ్రీఘ్రంగా సిద్ధించదు! ఈ పరమ ప్రభావంతమైన పవిత్రమైన వ్రతవిధానం అత్యంత గోప్యంగా ఉంచాలి. శ్రద్ధాళువులు కానివారికీ, నాస్తికులకూ భక్తిలేనివారికీ చెప్పరాదు. భక్తిగలవారైన కుమారులకు, శిష్యులకు, సాధువర్తనగలవారికి మాత్రమే చెప్పవచ్చు! ఇందులో ఉపదేశించిన ప్రకారం ఆచరిస్తే తప్పక సకల కార్యసిద్దీ కలుగుతుంది! పురుషులైనా, స్త్రీలైనా ఉత్కృష్టమైన మహాత్కార్యాలను చేయదలిచినప్పుడు ఆ కార్యసిద్ధికై ఈ వ్రతాన్ని చేయాలి! అలా చేసినట్లైతే తమతమ మనోభీష్టములను అవశ్యం పొందగలరు! వారికి విఘ్నహరుని అనుగ్రహంచేత లోటేవుండదు!

‘ఓ మహర్షులారా! ఈవిధంగా ఆరాజు చతురాననుడి వద్దనుండి చతుర్థీవ్రత విధానాన్ని పూర్తిగావిని, సమస్త దుఃఖశాంతికొరకూ అత్యంతప్రీతితో ఈ వ్రతాన్ని ఆచరించి వ్రతప్రభావంచేత శత్రువులనందరినీ జయించి, దారాపుత్రులతో నిష్కంటకంగా రాజ్యభోగాలననుభవించాడు’ అంటూ సూతమహర్షి ముగించాడు.

Chapter 70 complete