గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

17 – మంత్రోపదేశం

ఆవిధంగా బ్రహ్మదేవునిచే స్తోత్రం చేయబడిన యోగనిద్ర శ్రీమహావిష్ణువు యొక్క కనురెప్పల పైనుండి వైదొలగి అతడిని మేల్కొలిపింది. ఈలోగా దుష్టులైన ఆ మధుకైటభులిరువురూ కలిసి స్వర్గాదిలోకాలనన్నింటినీ ఆక్రమించారు. వారి ధాటికి తట్టుకోలేక దేవతలు తలో దిక్కుకూ చెల్లచెదరైనారు. వారిలో కొందరు ఆ భయానికి మూర్చిల్లారు. యోగానిద్రనుండి మేలుకున్న శ్రీమహావిష్ణువు అలా ప్రేరేపించబడి ఆ మధుకైటభులిద్దరితోనూ యుద్దానికి తలపడ్డాడు.

దివ్యమైన తన శంకచాక్రాది ఆయుధాలను చేత ధరించి ఎదపై వైజయంతీమాల శోభిల్లగా నీలమేఘంవంటి శరీరకాంతి కలవాడై, తన చేతిలో శంఖాన్ని తీసుకుని భూనభోంతరాళాలు దద్దరిల్లేలా పూరించాడు. ఆ భయంకర పాంచజన్య ధ్వనికి దిక్కులు పిక్కటిల్లాయి. రాక్షసుల గుండెలు గుబగుబలాడాయి! ‘ఇలాటి ధ్వని ఇంతకుముందెక్కడా వినియుండలేదే? ఇదేదో రాబోయే ఘోర సంగ్రామానికి సూచనగా కనిపిస్తుంది! అందుకని విజయమో వీరస్వర్గమో తెల్చుకోనిదే వెను దిరగరాదు! ఇలా అనుకుని ధైర్యం తెచ్చుకుని మధుకైటబులిద్దరూ శ్రీ మహావిష్ణువును తమతో ఆయుధాలతోకాక ద్వంద్వయుద్ధానికి దమ్ముంటే రమ్మని సవాలు చేశారు. ఆ తరువాత చాల భీకరమైన పోరు జరిగింది. అలా దాదాపు ఐదువేళ్ళ ఏళ్ళు ఘోరంగా యుద్ధం చేసినా శ్రీహరి వాళ్ళని ఏమాత్రం వది౦చలేకపోయాడు. అప్పుడు విష్ణువు గానకళలో కోవిదుడైన గంధర్వుడి రూపందాల్చి అడవిలో వెళ్ళి ఎంతో శ్రావ్యంగా వీణాగానం చేయసాగాడు.

ఎంతో మధురమైన ఆ గానమాధుర్యానికి అరణ్యంలోని సకల జంతుజాలమూ, దేవతాగణాలూ తన్మయత్వంతో ఒళ్ళుమరిచిపోయారు. కర్ణపేయంగా ఉన్న ఈ గానం కైలాసంలో కొలువున్న శంకరుడి చెవులకు కూడా సోకింది! ఆ మాధుర్యానికి చకితుడైన పినాకి,

నికుంభుడు, పుష్పదంతుడూ అన్నపేర్లుగల తన అనుచరులిద్దరినీ ఆ మధురగానం ఆలపిస్తున్న వారిని ‘నా వద్దకు వెంటనే తీసుకురమ్మని’ పంపించాడు.

ఆ ఇద్దరు దూతలూ గానాలాపం చేస్తున్న విష్ణుమూర్తి సన్నిధికి ఆగమేఘాలమీద చేరుకొని ఆయనను శివునియొక్క ఆహ్వానాన్నీ, ఆదేశాన్నీ తెలియజేశారు. వాళ్ళతో కలిసి కైలాసవాసుని సన్నిధికి చేరుకున్నాడు శ్రీమహావిష్ణువు.

అప్పుడు కైలాసశిఖరంపైన భక్తజన సులభుడు, భక్తవశంకరుడు భోలాశంకరుడైన శివుని శ్రీమహావిష్ణువు దర్శించాడు. అక్కడి ప్రమధగణాలా కన్నులకు వెలుగై, దీనజనమందారుడైన పరమశివుడు తన శిరస్సున చంద్రుని ధరించి చంద్రమౌళీశ్వరుడిగా, జడలుగట్టిన దట్టమైన శిరోజాలపైన గంగతో గంగాధరుడిగానూ గజచర్మాన్ని, నాగయజ్ఞోపవీతాన్ని ధరించి పరమశోభాయమానంగా వెలుగొందుతున్నాడు. ఆ సదాశివుడిని చూసి సాష్టాంగంగా నమస్కరించాడు. అప్పుడు భక్తవత్సలుడైన ఆ పరమేశ్వరుడు ఎంతో ఆదరంతో ఆయనను లేవనెత్తి తగు ఆసనమును చూపి కూర్చుండచేసాడు. అప్పుడు హరి తన మంజులగానంతో శివుడినికూడా సంతృప్తిపరచాడు.

ఆగానంతో సుబ్రహ్మణ్యుడు, గణేశుడు, పార్వతీమాతకూడా అమిత సంతృప్తులయ్యారు. అపరిమితమైన ఆనందంతో విష్ణువును ఆలింగనం చేసుకుని

శివుడు:

‘ఓ శ్రీమహావిష్ణూ! నీగానం నన్ను ఎంతగానో అలరించి సమ్మోహనపరిచింది! నీ అభీష్టమేమిటో కోరుకుంటే తప్పక నేరవేర్చగలను’ అన్నాడు.

విష్ణువు మధుకైటభుల గాధను వివరించడం

ఆ తరువాతి కథావృత్తాంతాన్ని భృగుమహర్షి సోమకాంతుడితో ఇలా కొనసాగించాడు.

భృగువు:

‘ఓ రాజా! విష్ణువు శంకరుడి అభయాన్ని విని తన అభీష్టాన్ని ఇలా చెప్పసాగాడు.’

విష్ణువు:

“ఓ శంకరా! క్షీరసాగరంలో ఆదిశేషునిపై శేషశాయినై నే పవళించి ఉండగా నా చెవిలోని గులిమినుంచి మధుకైటభులనే దానవులు ఉద్బవించారు. ఆ ఇరువురూ లోకకంటకులుగా మారి సృష్టికర్తయైన బ్రహ్మనే భక్షించటానికి సన్నద్దులైనారు. అప్పుడు భీతావహుడైన బ్రహ్మ నా నేత్రములను ఆవహించిన యోగానిద్రను ప్రార్థించాడు. ఆమె చేసిన ప్రభోధంవల్ల మేల్కొన్న నేను వారిద్దరితో చిరకాలం యుద్ధంచేసినా ఏమి ప్రయోజనమేమీ లేకపోయింది. ఇక నాకు వేరే మార్గాంతరం కనిపించక నీ అనుగ్రహాన్ని కోరి ఈ రకంగా గంధర్వుడిగా గానంచేశాను. కనుక నీవు నాయందు దయతో ఆ దుష్టరాక్షసుల సంహారానికితగ్గ ఉపాయం ఉపదేశించు!”

ఆ మాటలకు ప్రసన్నతతో కూడిన దరహాసం ముఖంపై కాంతులీనగా భక్తవత్సలుడైన శంకరుడిలా చెప్పాడు.

శివుడు:

“ఓ హరీ! నీవు యుద్దానికి సన్నద్దుడవై వెళ్ళేటప్పుడు ప్రారంభంలో విఘ్నహరుడైన ఆ గజాననుని అనుగ్రహానికి ప్రార్థించడం మరిచావు! అందువల్లనే నీకు యిన్ని విఘ్నాలు సంభవించాయి. కనుక యిప్పటికైనా సకలాభీష్టప్రదుడూ, సకల విఘ్ననివారకుడైన ఆ గజాననుని పూజించి అతడి అనుగ్రహాన్ని పొంది యుద్ధసన్నద్ధుడివికా! అప్పుడు ఆ గజాననుడే వారిని సమ్మోహితుల్ని చేస్తాడు. నా అండదండలూ ఎటూ నీవెంటనే ఉంటాయి. అందువల్ల ఇక ఆ దుష్టరాక్షసుల వధ సులభతరం కాగలదు! అభీష్టసిద్ధిరస్తు!” అన్న ఆ అనుగ్రహవచనాలు విని రాక్షసాంతకుడైన శ్రీమహావిష్ణువు ఇలా ప్రశ్నించాడు.

విష్ణువు:

“ఓ దయాళూ! భాక్తవరదుడైన ఆ గణేశుని ఎలాగ పూజించాలి? నీవు నాయందు కృపవహించి విధివత్తుగా ఆ విధానం యావత్తూ ఉపదేశించ గోర్తాను!”

ఆ మాటలకు అనుగ్రహదృష్టిని ప్రసరిస్తూ మదనాంతకుడైన శంకరుడిలా బదులిచ్చాడు.

శివుడు:

ఓ శ్రీహరీ! భక్తానుగ్రహప్రదములైన గణేశ మంత్రాలు అనేకానేకములున్నాయి. వాటన్నింటిలోకి ఏకాక్షర గణపతి మంత్రము అత్యంత ప్రభావయుతమైనది! అలాంటిదే షడక్షర గణపతి మంత్రము కూడా! నీకు తగిన మంత్రాన్ని యిప్పుడే ఉపదేశిస్తాను. దానిని అనుష్టించి, గణపతిని ఉపాసించి అతని అనుగ్రహాన్ని పొంది కార్యసిద్ధిని చేకూర్చుకొమ్మని ఉపదేశం చేసాడు.

అలా శివుడు ఉపదేశించిన గణేశమంత్రాన్ని స్వీకరించి అనుష్టానికై శ్రీమహావిష్ణువు కైలాసాన్ని వీడి తగు ప్రదేశాన్ని చేరుకున్నాడు.

Chapter 17 complete