గణేశ పురాణము - ఉపాసనా ఖండము
40 – స్త్రోత్ర నిరూపణం
ఆ తరువాత కథను వ్యాసమహర్షికి బ్రహ్మ యిలా చెప్పాడు.
బ్రహ్మ:
ఓ వ్యాసమునీంద్రా! ఈరకంగా దేవతాస్థానాల నన్నింటినీ ఆక్రమించి త్రిపురుడు బ్రహ్మలోకానికి దండెత్తివెళ్ళాడు. దేవతలవల్ల అతడి పరాక్రమం గురించివిన్న బ్రహ్మ విష్ణువుయొక్క నాభికమలంలో లీనమైనాడు. విష్ణువుకూడా, ఆ రాక్షసుడి కంటబడకుండా క్షీరసముద్రానికి వెళ్ళాడు. తన మానసపుత్రుడైన ప్రచండుని బ్రహ్మలోకానికి అధిపతినిచేసి, రెండో కుమారుడైన చండుని వైకుంఠానికి అధిపతిగా చేసాడు.
తాను స్వయంగా కైలాసానికి వెళ్ళి తన బాహువులతో కైలాసాన్ని కంపింపచేసాడు! ఆ భయానికి గిరిజ శివుని గట్టిగా ఆలింగనం చేసుకున్నది. తరువాత బైటకువచ్చిన శంకరుడితో ఆ రాక్షసుడిలా అన్నాడు.
త్రిపురుడు:
‘నీకు ప్రాణాలమీద ఆశఉoటే మందరాద్రికి పోయి తలదాచుకో! నాకు తృప్తి గలిగేదాకా నీవు అక్కడేవుండు!’ అని కోరిన ఆ రాక్షసుడికి గల అల్పాయుర్దాయాన్ని గుర్తుపెట్టుకున్న శంకరుడు ఆతడి కోరిక ననుసరించి మందపర్వతానికి వెళ్ళిపోయాడు. అప్పుడా అసురుడు కైలాసశిఖరాన్ని అధిరోహిoచి అమిత సంతోషాన్ని పొందాడు.
అలా దేవలోకాలన్ని ఆక్రమించి, రసాతలంవైపుకు వచ్చాడు. ఆ త్రిపురాసురుడు. భూమండలాన్ని ఆక్రమించిన భీమకాయుడు బలాత్కారంగా రాజుల రాజ్యాలనన్నింటినీ కబళించి, ఋషులందరినీ బంధించాడు. దేవతలకు తృప్తినొసగే అగ్నిహోత్రాదులనన్నీ భగ్నంచేశాడు. ఆశ్రమాలనూ తీర్థాలనూ పాడుచేసి, తాపసుల౦దరినీ కారాగారాలలో బంధించాడు. గర్వోన్మత్తుడై ‘స్వాహాకారా’లను, ‘స్వధాకారా’లనూ ద్వేషిస్తూ ఉండి బ్రహ్మవేత్తలైన భూసురులను బాధించసాగాడు.
ఇక వజ్రదంష్టుడు సప్తపాతాళలోకాలను వశపరుచుకున్నాడు. శేషుడు, వాసుకి, తక్షకుడు మొదలైన నాగులనందరినీ వశపర్చుకున్నాడు. ఆ నాగుల తలలపైనున్న రాత్నాలనన్నిటినీ తీసుకునివచ్చి త్రిపురునికి సమర్పించాడు. ఆరకమైన పరాక్రమం చూపిన వజ్రదంష్టుడిని త్రిపురుడు అభినందించాడు.
ఈవిధంగా లోకకంటకుడైన ఆ త్రిపురుని దుష్టతకు మిక్కిలి వ్యాకులత చెందుతూన్న హిమవత్పర్వత గుహలలోని దేవతలకు నారదమహర్షి ప్రత్యక్షమై వారి బాధానివారణకై గణేశానుగ్రహం పొందటమే సరైన మార్గమని ఉపదేశించగా.
సమస్త దేవతలూ భక్తితో గద్గదకంఠంతో తమకు సంప్రాప్తించిన ఈ ఘోరమైన సంకటాన్నుంచి రక్షించమని సాష్టాంగనమస్కారంచేసి భక్తితో పరిపూర్ణ శరణాగతితో ఈవిధంగా ప్రార్థించారు సంకటమోచన గణేశ్వరుని గురించి భక్తితో!
దేవతలు:
నమోనమస్తే! ఓ పరబ్రహ్మ పరతత్త్వ స్వరూపా! ఈ సమస్త సృష్టికీ కారణభూతుడవైన నీకిదే నమస్కారం!!
సర్వేంద్రియములకు అధిష్టానదైవమై మా మనస్సూ, ఇంద్రియములు పనిచేయించే ప్రాణస్వరూపుడవై అఖిల కారణుడవైన అంతర్యామి స్వరూపుడవైన నీకు నమస్కారము.
పంచభూతాత్మకుడవై సమస్త సృష్టిగా వెలుగొందునోదేవా! అట్టి పంచభూత స్వరూపమునకు ఆదిభూతమైన నీకిదే నమస్కారము! పంచభూతములనూ సృష్టించిన భూతస్రష్టకు, పరమేష్టికిదే మా నమస్కారం! మా సర్వే౦ద్రియములనూ మేల్కొలిపి, మా మనస్సూ, ఇంద్రియములనూ పనిచేయించే అంతర్యామిస్వరూపా! సమస్త సృష్టికీ అధిభూతుడైన నీకు సృష్టిస్థితి ప్రళయాధినాధుడైన పరమాత్ముడైన గణేశునకిదే నమస్కారము.
ఓ సమస్తవిశ్వస్వరూపా! ఈసృష్టికి కారణభూతుడవై సమస్తభూతములకు మూలకారుణడవైన నీకిదే ఓ కారణకారణా నమస్కారము!
ఓ వేదస్వరూపా! వేదస్వరములన్నీ చేరి ప్రాణస్వరూపుడైన ఏ పరమాత్మునిలో లీనమౌతున్నాయో అట్టి వేదాంత వేదవిరామరూపుడైన నీకివే మా నమోవాకములు. మమ్ములను వరములనుగ్రహించి రక్షించు!.
ఓ వాక్కులకూ, మనస్సునకూ అందని పరతత్త్వస్వరూపుడా! మా విఘ్నములను నివారించు! మేమిదే నీకు శరణుపొందుతున్నాము. భక్తుల మనోరధములు సంకల్పమాత్రములో తీర్చే ఓ భక్తమనోహరా! మా మనోరధములు సిద్ధింపజేయి! సమస్త రాక్షసవినాశకుడా! మా సర్వ సంకటములను నివారించి అసురులబారినుంచి రక్షించుము! ఓ పరమకారుణికుడా! కరుణామయుడా! జ్ఞానమయుడా! అపరిమిత దయాస్వరూపుడైన నీకిదే మా నమోవాకములు! ఓ పరమాత్ముడా! సమస్తజ్ఞానమునూ నశింపచేసే సుఖములనూ, భోగములనూ ప్రసాదించి భక్తుల జ్ఞానమును నీమాయచే హరించే యోగమాయాస్వరూపా! నమస్కారము!
భక్తిహీనులైన పాషండుల సంపదలను హరించే పరమాత్ముడా! నిజభక్తులకు ముక్తిని ప్రసాదించే భవబంధవినాశకుడా! నీకివే మా నమోవాకములు. నమస్తే! నమస్తే!! సమస్త సృష్టియంతా వ్యాపించే విభాగములేని ఏకాత్మస్వరూపుడా! విభక్తమైనట్లుగా సృష్టిరూపంలో గోచరించే అవిభక్తమూర్తీ! నీకిదే మా శరణాగతి!
ఓ పరమపరతత్వ జ్ఞానభోధకుడా! పరబ్రహ్మతత్త్వవిధుడా! గురుస్వరూపుడవైన నీకు తత్వవిబోధకునకు మా నివాళులు!
ఓ సమస్త భక్తుల బహుజన్మముల కర్మలకు సాక్షీభూతుడవైన కర్మసాక్షీ! జీవుల గుణస్వరూపుడవై వారి స్వభావాన్ని నడిపించే గుణనాయకా! నమస్కారము!
“పరమాత్ముడైన గణేశా! సుముఖుడా! సంకష్ట వినాశకుడా! మా సంకటములను నశింపచేయి. నమో నమస్తే! నమో నమః” అంటూ స్తోత్రంచేశారు దేవతలు! అంతట బ్రహ్మ మొదలైన దేవతలు ఈవిధంగా స్తోత్రంచేయగా పరమేశ్వరుడైన గణపతి దయార్ర్ద్రహృదయుడై అనుగ్రహంతో వారిని చూస్తూ ఇలా చెప్పాడు.
గణేశ:
ఓ దేవతలారా! మీ భక్తికీ, తపస్సుకూ, మీ మిక్కిలి ఆర్తితో చేసిన ఈ స్తోత్రమునకు నేను చాల సంతుష్టుడనైనాను! మీ కోరికలేవో కోరుకుంటే తప్పక అనుగ్రహించగలను.
దేవతలు:
“ఓ పరమాత్ముడా! మీకు మాయందు దయకలిగితే చాలు! త్వరగా ఈ ఘోరరాక్షసుడైన త్రిపురాసురుని సహరించు! మా సమస్త దేవతల అధికారాలన్నీ కబళించిన ఈ దురహంకారిని నిర్మూలించు! మా సమస్థ దేవతలకూ నీవు ఒక్కడవే అభయప్రదానమిచ్చి మా ఆత్మలకు కలిగిన సంకటములను నివారించగలవాడివి! ఓ సంకటమోచన గణేశా! నీకిదే మా భక్తిపూర్వక శరణాగతి చేస్తున్నాము! మాకు నీకన్నా పరదైవము లేదు! నీవే మాకు దిక్కు!” అని ప్రార్థించగా గణేశుడు వారితో
గణేశ:
“ఓ దేవతలారా! తప్పక నీకు కలిగిన ఈ రాక్షసబాధను నివారిస్తాను! ఘోరమైన ఈ ఆపదనుండి రక్షింపచేయగల మీరుచేసిన ఈ స్తోత్రం శాశ్వతముగా నిలుచుగాకా ‘సంకటనాశన గణపతిస్తోత్ర’మని! భవిష్యత్ కాలాలలో ఎవరైనా దీనిని పఠించి నాకు ప్రార్థనచేస్తారో వారందరికీకూడా సమస్త సంకటములు నివారించగాలను. సమస్త కోరికలనూ అనుగ్రహించగలను. అంతేకాదు ఏమానవుడైనసరే మూడు సంధ్యలలోనూ భక్తితో అనుష్ఠానపరుడై ఈ సంకటమోచన గణేశస్తోత్రాన్ని పఠిస్తారో అట్టివానికి ఎట్టి సంకటములు కలుగవని నేనిదే అనుగ్రహిస్తున్నాను!.” అంటూ అమోఘమైన వరాన్ని దేవతలకు భగవంతుడైన గణపతి అనుగ్రహించి చూస్తుండగానే మెరుపు మెరిసినట్లు అంతర్థానం చెందాడు!
Chapter 40 complete
