గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

71 – సంకష్టచతుర్థీ వ్రతోపాఖ్యానం – 2

సూతముని:

“ఓ చతురాననా! అనంత శుభఫలప్రదమైనట్టి ఈ సంకష్టచతుర్థీ వ్రతానికి ఉద్యాపనను ఎలాచేయాలి? ఆ వివరం విస్తరించి చెప్పు. లోకోపకారార్థమే నీవంటివారు ఈ దివ్యకార్యములు నిర్వహిస్తారుకదా! అందుచేత లోకకళ్యాణంకూడా జరుగుతుంది!” అన్న సూతముని వాక్కులను విన్న బ్రహ్మ యిలా బదులుచెప్పాడు.

బ్రహ్మ:

“ఓ మునీంద్రా! ఈ చతుర్థీవ్రతానికి ఉద్యాపనమును చైత్ర, శ్రావణ, ఆశ్వయుజ మాసాలలో ఎప్పుడైనా చేయవచ్చును. వ్రతంయొక్క పూర్తిఫలం పొందే నిమిత్తమే ఈ ఉద్యాపనం చేయాలి! పూజను ఇంతకుముందు చెప్పిన విధంగానే ఆచరించాలి! ‘సర్వతోభద్ర మంటపమును’ నానా వర్ణములతోనూ నిర్మించి దానిపై కలశమును స్థాపించాలి! ఆ కలశాన్ని వస్త్రముచేత, ఆభరణములతోనూ అలంకరించి ఆ తరువాత గణపతి యొక్క మూర్తిని స్తాపించాలి. షోడశోపచారాలతో ఆ గణేశుని మూర్తిని పూజించి తరువాత చతుర్థీ తిథికి, దేవతకు, చంద్రునకు, ఇంతకుముందే చెప్పబడినరీతిలో అర్ఘ్యము నివ్వాలి! ఆ తరువాత నానావిధమైన ఉపహారములతో మహానివేదనచేసి గణపతిని సంతృప్తుని గావించి ఆచార్యుని ఋత్వికులకు సంభావించి వారి ఆధ్వర్యంలో ‘గణానాoత్వా’ అనే వైదిక మంత్రముతోగాని, మూలమంత్రముతోగాని వెయ్యి లేదా పదివేలు లేదా నూటఎనిమిదిసార్లు హోమంచెయ్యాలి!

ఆ తరువాత పూర్ణాహుతిని చేసి ‘వసోర్ధార’ను కూడా నిర్వర్తించాక హోమాన్ని పరిసమాప్తిచేయాలి! వేదవిదులైన సద్విప్రులకు షడ్రసోపేతమైన భోజనంపెట్టి వారిని చందన, వస్త్ర, తాంబూలాదులతో సత్కరించాలి! అనంతరం ఆచార్యుని పూజించి వారికి వస్త్రాలంకారాలను యిచ్చి ఫలములతో వాయనమివ్వాలి! పాయసంతో నిండిన పాత్రను ఎఱ్ఱటి వస్త్రంతో అలంకరించి, దానిపైన బంగారు గణేశమూర్తిని ఉంచి దక్షిణతో కలిపియివ్వాలి! ఈ వ్రతం సంపూర్తికావడానికి కుంచెడు నువ్వులనుకూడా ఇచ్చి, ఆ తరువాత దూడతోకూడిన కపిలగోవుకు సకలమైన అలంకారములూ చేసి ఆచార్యునకు అర్పించాలి! ఆ తరువాత బ్రాహ్మణులు, గణేశుడు తృప్తినొందుగాక అనిచెప్పి క్షమాపణ వేడుకోవాలి!

ఈ విధంగా వ్రతోద్యాపన చేయటంవలన అశ్వమేధక్రతువు చేసినంతటి ఫలం లభిస్తుంది!” అంటూ వివరాలన్నీ చెప్పి కృతవీర్యునితో అతడి తండ్రి యిలాఅన్నాడు

“నాయనా! లోకోపకారార్తమై ఈ వ్రతవిధానాన్నంతటినీ బ్రహ్మనాకు వివరించిచెప్పాడు! ఆ విశేషములన్నీ నీకు తెలిపాను! సంతానాన్ని కోరినవాడవు గనక ఈ వ్రతాన్ని యధావిధిగా ఆచరించు!” అంటూ స్వప్నంలోనే తన కుమారుని ఆశీర్వదించి అదృశ్యుడైనాడు.

అప్పుడా కృతవీర్యుడు తనకు తండ్రి స్వప్నంలో ఉపదేశించినరీతిగా ఈ వ్రతాన్ని అనుష్టించాడు. ముందుగా సిద్ధి, బుద్ధులతో కూడినట్టి గజాననుని బంగారు ప్రతిమను చేయించి, దానిని పూవులతో నిర్మిoపబడిన ఒక పుష్పమంటపంలో ఉంచి పురానపఠనం, శాస్త్రచర్చలు, గాననృత్యాదికములలో సకల వాదిత్ర ధ్వనులు మారుమ్రోగగా, సకల వైభవములతో మహోత్సవాలు నిద్వహించి, తాను గణేశమంత్రాన్ని అమిత శ్రద్ధాభక్తులతో జపించి, విధివత్తుగా హోమముచేసి ఆ తరువాత, బ్రాహ్మణులకు అన్నసమారాదనను జరిపి, వారినికూడా సంతుష్టులనుచేసి సత్సంతాన ప్రాప్తికై వారి ఆశీస్సులను బడసినాడు. ఈ రకంగా తపోనిష్టులైన సద్విప్రుల ఆశీఃఫలంగా అతడి భార్య స్వల్పకాలంలోనే గర్భం ధరించింది. శుభసమయంలో సకల శుభలక్షణోపేతుడైనట్టి కుమారుడిని ప్రసవించింది. ఆ సమయంలో రాజు అనేకములైన దానధర్మాలను చేశాడు.

ఆ తరువాత రాజు కుమారునికి సకాలంలో శాస్త్రోక్తరీతిని ఉపనయనాదికాలు, వివాహాది సంస్కారములూ జరిపి, విద్యావంతుడూ జ్ఞానసంపన్నుడైన అతనికి రాజ్యపట్టాభిషేకం జరిపాడు. ఆ కృతవీర్యుడు ఇహలోకంలో అనంతమైన భోగభాగ్యాలను అనుభవించి, చివరకు గణేశానుగ్రహంచేత గణేశపదమును పొందాడు. అతని పుణ్యమువలన ఋత్విక్కులు, పండితులు, ప్రజలు అందరూ సద్గతిని పొందారు.

Chapter 71 complete