గణేశ పురాణము - ఉపాసనా ఖండము
72 – కార్తవీర్య చరిత్ర
శూరసేనమహారాజు:
“ఓ దేవేంద్రా! చతుర్థీవ్రత మాచరించిన ఫలితంగా రాజైన కృతవీర్యునికి ఎలాంటి కుమారుడు జన్మించాడు? ఆ వివరమంతా దయతో నాకు విస్తారంగా తెలుపు!” అంటూ ప్రార్థించగా సహస్రాక్షుడైన ఇంద్రుడు అతనితో యిలా బదులుచెప్పాడు.
దేవేంద్రుడు:
“ఓ రాజా! భక్తానుగ్రహప్రదుడైన ఆ గజాననుడు ప్రసంనుడైవుండగా ఏదిమాత్రం అలభ్యం? అట్టివానికి సకలమూ సులభంగా సిద్ధిస్తాయి. పరమ దయానిదియైన గజాననుని అనుగ్రహవిశేషంచేత ఆ రాణి గర్భందాల్చి తొమ్మిదవనెలలో ఓ కుమారుని కన్నది. విధివశాత్తూ ఆ బాలునికి రెండుమెడలుగల సుందరమైన ముఖము, చక్కని ముక్కు నేత్రములు కలిగి, కాళ్ళుచేతులు లేనట్టి, తొడలు మోకాళ్ళతో, పాదవిహీనమైవున్న ఆ శిశువును చూసిన ఆ తల్లీ దుఃఖమునకు మేరయే లేకుండా పోయింది.”
గుండెలవిసేలా రోదిస్తూ “అయ్యో దైవమా? ఏమి నా దురదృష్టము? నాకిలాంటి అంగహీనుడైన కుమారుడేల జన్మించాడు? గజాననుడికి నాపై దయ ఏల సన్నగిల్లింది? ఇటువంటి సంతానమును కనటంకంటే గొడ్రాలిగా మిగిలివున్నా బాగుండేది! నాకింకా ఎటువంటి దుష్కర్మ అనుభవానికై మిగిలివున్నదో? ఆఖరుకు మరణంకూడా నన్ను చూసి దూరంగా పారిపోతున్నదే!”
“వేదవేత్తలైన విప్రుల ఆశీస్సులన్నీ నిష్పలమేనా? గజాననునికి నాపై యింకాఏల దయకలుగలేదు?” అంటూ గుండెలు మోదుకుంటూ ఏడ్వసాగింది. ఆమెను చూసిన అంతఃపుర స్త్రీలు సైతం భోరుమంటూ విలపించసాగారు. అంతఃపురoలోంచి వినవచ్చిన ఈ కోలాహలం విని రాజు అక్కడికి వచ్చినాడు. రాణిరోదనము విన్న మంత్రులుకూడా అక్కడికి విచ్చేశారు. అప్పుడు ఆ రాజు దైవాన్ని సంభోదిస్తూ యిలా పలికాడు.
కృతవీర్యుడు:
“ఓ గజాననా! దీనజనార్తిహరుడవే! భక్తులమనోభీస్టాలన్నీ యిట్టే ఈడేర్చగలవాడవే! నిన్ను కేవలం మనసులో ఒక్కసారి స్మరించినంత మాత్రానే సకలపాపములూ హరింపబడతాయే! ఎంతో భక్తిప్రపత్తులతో అంతులేని విశ్వాసంతో నీకు నేను సమర్పించిన పూజ, అనుష్టానము హోమాదికము నిరర్థకమైనదే! ఏనాటికేమి జరుగునో ఎవ్వరికీ తెలియదు కదా! కొండని త్రవ్వి ఎలుకని పట్టినట్లు ఆజన్మకృత ప్రయత్నాఫలంగా యిటువంటి కుమారుడు కలిగాడే!” అంటూ దుఃఖపడుతున్న రాజును చూచి మంత్రులిలా హితోపదేశము గావించారు.
మంత్రులు:
“ఓ ప్రభూ! వృధాగా తమరు దుఃఖిoచుట తగనిపని! విధివిధానమును ఎవరూ తప్పించలేరు. కర్మయొక్క గతులగురించి తెలియడం అసాధ్యం! మహామహులకే కర్మానుభవం తప్పలేదు. బంగారులేడి సృష్టిలో అసహజమని తెలిసీ శ్రీరాముడు దాన్ని సాధించడానికై వేటకి వెళ్ళాడు! దూత్యం నిoద్యమని, ఆర్యులకు కూడనిదని పాండవాగ్రజుడైన ధర్మరాజు ఎరిగీ ద్యూతక్రీడలో పాల్గొని తన సర్వస్వాన్ని కోల్పోయి చివరికి భార్యనే పందెం ఒడ్డాడు. నీవిలా ఎంతకాలం శోకించినా పరిపూర్ణతను ఈ బాలకుడు పొందలేడు. కాలానుగుణ్యంగా లోకములో ఫలాలు పక్వమైనట్లు తగిన కాలానికి అన్నీ సమకూరుతాయి!”
ఈ విధంగామంత్రుల హితవాక్యములి విన్న రాజు స్వస్థచిత్తుడై తన భార్యతో యిలాఅన్నాడు ‘ఓ దేవీ! వృధాగా దుఃఖిoచుటవలన ఏమీ ప్రయోజనముండబోదు!’ అంటూ ఊరడించి బ్రాహ్మణులను పిలిపించి సౌమనస్యంతో పుణ్యాహవచనము అభ్యుదయక శ్రాద్ధములను చేసి, అనేకమైన మాన్యములు, అలంకారములు, వస్త్రాదులు, గోవులు, రత్నములను దానంచేశాడు. తరువాత బంధుమిత్రులను, సేవకులను యదోచితరీతిని సత్కరించాడు. వందిమాగధులకు, దీనులకు, అంధులకు అన్నవస్త్రాదికములు యిచ్చాడు. తరువాత నగరిలోని ప్రతియింటికీ శర్కర తాంబూలాదులను పంచిపెట్టాడు. ఈ విధంగా పదకొండురోజులు గడిచాక ఆ బాలునికి ‘కార్తవీర్యు’డని నామకరణం చాశాడు.
ఆ తరువాత పురవాసులందరికీ మహోత్సాహంతో భోజనసమారాధన గావించాడు. ఇలా పన్నెండు సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు అనుకోకుండా తలవని తలంపుగా దత్తాత్రేయమహర్షి రాజభవనానికి విచ్చేశాడు. అప్పుడు కృతవీర్యుడు సాదరంగా ఎదురేగి ఆహ్వానించి సాష్టాంగనమస్కారం చేశాడు. భగవానుడైన దత్తమూర్తి అతడిని లేవనెత్తి గాఢాలింగానం చేసుకున్నాడు. ఆ మునికి సకలోపచారములూ సమర్పించి, సుఖాసీనుడైనాక అతడికి పాదసేవ (కాళ్ళుపట్టి) చేసి యిలాఅన్నాడు. “ఓ మునివర్యా! మీరాకచేత మా అంతఃపురము, రాజ్యము పావనమైనాయి. ఎన్నోజన్మల పుణ్యఫలానకాని తమవంటి మహనీయుల దర్శనమవటం దుర్లభం! నా చర్మచక్షువులతో యోగిజనదుర్లభమైన మీ అద్భుత మహిమాన్వితమైన రూపును దర్శించగలిగాను. మీ అనుగ్రహవిశేషంచేత నా భవిష్యత్తు శుభప్రదం కాగలదు!” అంటూ మృదుమధురంగా వినయాన్వితుడై పలుకుతున్న ఆ రాజుతో దత్తమునీంద్రుడు ఇలాఅన్నాడు.
“ఓరాజా! నీయొక్క అపూర్వకుమారుని చూడాలన్న ఇచ్చతో వచ్చాను”. ఆ మాటలకు కృపాసముద్రుడైన దత్తుని కరుణకు కన్నులలో నీరు చిప్పిల్లగా తన కుమారునికై కబురుపంపి దత్తాత్రేయునితో యిలా అన్నాడు. ‘ఓ మునిసత్తమా! సంతానానికై చిరకాలము పరితపించి ఘోరమైన తపస్సు అనుష్టానమూ ఆచరించగా, ఆ జగదీశ్వరుడైన గణేశుని వరప్రసాదిగా ఈ వైకల్యంగల తనయుడిని పొందాను! నా దురదృష్టము నేమని వర్ణించను? చూడటానికి సైతం ఎబ్బెట్టుగా కనబడే ఈ దురదృష్టవంతుడివల్ల నేనుకూడా అనర్హుడినైనాను!’ అంటూ ఆ బాలకుడిని తెచ్చి మునికి కనపరిచాడు!
అప్పుడా దత్తమూర్తి ధ్యాననిమీలిత నేత్రుడై ఆ బాలకునివైపు కరుణాభరితమైన దృష్టిని సారించి ఆ బాలకునియొక్క పూర్వకర్మనంతా తెలుసుకుని ఆరాజుతో యిలాఅన్నాడు. “ఓరాజా! ఈ బాలుడు మహాబలశాలియై సర్వులనూ ఓడించి మహత్కర్మను చేయగలడు. నీవు చేసిన సoకష్టహర చతుర్థీవ్రతంలో రాత్రిచేసిన జాగారణ సందర్భంలో శుద్దాచమనాది నియమాలను శ్రద్ధగా పాటించకపోవడంవలన ఆవ్రతం లోపయుక్తమైనది. అందువలననే నీకుమారుడిలా అంగహీనుడైనాడు. అందుకని సరైన ఉపాయంవల్ల ఇతడు సకలాంగశోభితుడవ్వగలడు.
అప్పుడు ఆరాజు మునితో “ఓ మునివర్యా! మీరు వచించినదంతా అక్షరసత్యం! కనుక తాము దయవహించి ఈ కష్టనివారణ కలిగి నా కుమారుడు ఏవిధంగా సంపూర్ణావయవ సంపన్నుడౌతాడో అట్టి ఉపాయాన్ని చెప్పవలిసింది!” అంటూ ప్రార్థించగా ఆ దత్తమూర్తి కృపా విష్టుడై ఆ బాలకుని దగ్గర కూర్చుండచేసుకుని సాంగోపాంగముగా ఏకాక్షర గణపతిమంత్రాన్ని అతడికి ఉపదేశించాడు. ఆ తరువాత అతడితో
దత్తమూర్తి:
“నాయనా! ఈ మంత్రరాజమును భక్తిగా నిష్టతో జపిస్తూ గణేశుని ఆరాధించు! ఉపవాసనియమం పాటిస్తూగాని, ఏకభుక్త నియమంతోగాని పన్నెండు సంవత్సరాలు చేసినట్లయితే ఆ తరువాత దేవదేవుడైన గజాననుడు నీకు సాక్షాత్కరిస్తాడు. ఆయనయొక్క దివ్యదృష్టి నీమీద ప్రసరించగానే నీవు వికృతాకృతిని వీడి దివ్యదేహుడవవుతావు! శుభమస్తు!” అంటూ దీవించి రాజువద్ద సెలవుపుచ్చుకుని వెళ్ళిపోయాడా దత్తమూర్తి!!
అలా ముని అంతర్హితుడైనాక బాలుడైన కార్తవీర్యుడు తండ్రివద్ద అనుష్టానానికై అనుమతిబడసి అరణ్యాలకు తపస్సు నిమిత్తమై వెళ్ళిపోయాడు. అతనివెంట కూడావెళ్ళిన సేవకులు అతడికో పర్ణకుటీరం నిర్మించి, అతడిని అందులోవుంచి నగరానికి మరలివచ్చారు. అప్పుడా బాలకుడు స్థిరసంకల్పుడై తపశ్చర్యకు ఉపక్రమించాడు.
Chapter 72 complete
