గణేశ పురాణము - ఉపాసనా ఖండము
37 – వరదాఖ్యానం
బ్రహ్మ:
‘ఓ వ్యాసమునీంద్రా! అలా అనుష్టానానికని వెళ్ళిన గృత్సమదుడు తపమాచరించటానికి తగిన ప్రదేశాన్ని అన్వేషిస్తూ అరణ్యాలగుండా వెళ్ళసాగాడు. ఒకచోట పుష్పకమనే అతి రమణీయమైన వనాన్ని కనుగొన్నాడు.
అనేక వృక్షాలతోటీ, లతలతోటీ శోభితమై, గలగలా ప్రవహించే సెలయేళ్లతో, అతి ప్రశాంతంగా ఉన్న ఆ వనంలో ప్రవేశించి ఆ ప్రదేశంలో విహరించే దేవతగణాల అనుమతిని పొంది, అక్కడ నివాస మేర్పరుచుకుని, కాలి బొటనవ్రేలిపైన నిలిచి అనన్యమైన ఏకాగ్రభక్తితో తన శ్వాసనుసైతం నిరోధించి, కేవలం వాయువును భక్షిస్తూ, అలా వేయి సంవత్సరాలకాలం ఘోరమైన తపస్సును ఆచరించాడు. ఆ తపస్సుయొక్క తీవ్రతకు తపోగ్నిజ్వాలలు వెలువడి దేవతలను తరింపచేశాయి! అలా, మరికొంతకాలం ‘రాలిన ఒక్కో ఆకునూ ఆహారంగా స్వీకరిస్తూ’ ధృడప్రయత్నంతో ధ్యానంచేస్తుండగా, మరో పదిహేనువేల సంవత్సరాలు గడిచాయి!
అటువంటి దారుణమైన తపస్సును చూసి అతడిని అనుగ్రహించటానికి వినాయకుడు తేజోరూపంగా ఆవిర్భవించాడు! లేగదూడ పిలుపు విన్న గోమాతలా, అలా గృత్సమదుని సన్నిధికి గజాననుడు చేరుకున్నాడు. తన కిరణాలతో దిగంతాలలోని చీకట్లను పారద్రోలే సూర్యునిలా, ఆద్భుతమైన తేజఃపుoజముతో, అతని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆ దివ్యమైన రూపం ఎలావున్నదంటే, చేటలవంటి చెవులు చలిస్తూండగా, మదించిన ఏనుగులా, ఏకదంతాన్ని ధరించి, తొండమును విలాసంగా అటూ ఇటూ విసురుతూ, శిరస్సున చంద్రకళను ధరించి, కంఠాన పద్మముల మాలతో, చేతిలో తామరతూడును ధరించి, సింహవాహనారూఢుడైన ఆ స్వామి పదిచేతులతోనూ కుంకుమ, అంగరు, కస్తూరి కలిపినా గంధముతో పూయబడిన దివ్యదేహంతో, సర్పయజ్ఞోపవీతాన్ని దాల్చి, సిద్ధి, బుద్ధి యనే భార్యలు చెరోప్రక్కగా ఉండగా, ఇది అని నిర్వచించలేని అనిర్వాచ్య స్వరూపుడై యుండికూడా భక్తకోటులను అనుగ్రహించేoదుకై లీలగా సగుణస్వరూపమునుదాల్చి ఆ గృత్సమదుని ఎదుట సాక్షాత్కరించాడు! అప్పుడు అపారమైన తపస్సుతో వెలిగే ఆ ముని తేజస్సు, గణేశుని ఎదుట వెలాతెలా పోయింది! ఆ దర్శనానికి దిగ్భ్రమచెందిన గృత్సమదుడు భయచకితుడై, ఇది ఏదో విఘ్నం కాబోలునని మూర్చిల్లాడు! అప్పుడు తేరుకుని మనస్సులోనే గణేశుడిని యిలా ప్రార్థించసాగాడు.
“ఓ దేవదేవుడవైన విఘ్నేశా! నా తపస్సుకి ఇట్టి విఘ్నం ఎలా కలిగింది? నన్ను ఈ మహావిఘ్నమునుండి వెంటనే రక్షించు! ఏకారణంచేత నా తపస్సుకిట్టి మహాదుఃఖము సంప్రాప్తించింది? నిన్ను వినా యింకెవరిని శరణుకోరను? ‘నీవు మా పంక్తిలో కూర్చొనేందుకూ, పూజార్హుడవుకావు!’ అంటూ అత్రి మహాముని తిరస్కారంతో పలికిన మాట ముల్లులా నా హృదయంలో గుచ్చుకుని బాధిస్తున్నది! ఈ సంకటంనుంచి ఇక గడిచి గట్టెక్కేదెలాగు?”
బ్రహ్మ:
‘ఓ వ్యాసమునీంద్రా! ఇలా మనస్సులో పరిపరివిధాల తర్కించుకుంటూ వ్యధచెందుతున్న గృత్సమదునితో సర్వజ్ఞుడైన గజాననుడిలా అన్నాడు.’
గజాననుడు:
“నాయనా! నీవు నా భక్తులందరిలోకీ అగ్రస్థానంలో వున్నావు! నిన్ననుగ్రహించదలచి వచ్చిన నీ ఇష్టదైవాన్ని, వరమీయవచ్చిన వేల్పును, గజాననుడిని నేనేనయ్యా! ఎంతో తపోనిష్టాగరిష్టులైన సనకాదులకు సైతం దర్శన దుర్లభమైన ఈ నా స్వరూపాన్ని నీయందుగల ప్రత్యేక అనుగ్రహంగా కనబరిచాను! కనుక నీవు సకలమైనట్టి భయసంకోచాలనూ వీడి నీ మనోభీష్టాన్ని తెలుపు! నీవు కేవలం పాదాంగుష్టముపై నిలిచి చేసిన తపస్సు నాకెంతో సంతోషాన్నిచ్చింది!”
బ్రహ్మ:
ఓ కృష్ణద్వైపాయనా! ఆ గణేశుని అనుగ్రహవచనాలను విన్న గత్సమదుడు సంతుష్టాంతరంగుడై, సంతోషంతో పులకాంకితుడై, భక్తిమీర సాష్టాంగ నమస్కారమునుఆచరించి ఆ వరదగజాననుడితో యిలా అన్నాడు.
గత్సమదుడు:
“ఓ పరమానుగ్రహమూర్తీ! వరదవిఘ్నేశా! నీ అమోఘసాక్షాత్కారంచేత నాజన్మ, నాతపస్సు, నియమాలు సఫలమైనాయి! అఖండమైన ఆనందమే స్వరూపమైనవాడవు! పరబ్రహ్మవు! నిరాకారుడవు! లీలార్థమై స్వరూపం ధరించి భక్తావళిని అనుగ్రహించే ప్రేమైకమూర్తివి!” అంటూ గొంతు గద్గదమవగా, భావాతిరేకంతో ఆనందపరవశుడై ‘చిదానందఘనుడు, వేదశాస్త్రాలచేత కనుగొనబడేవాడు ఐన పరమాత్మ నేడు నాకు సాక్షాత్కరించాడు! ఇక నేనేమి కోరుకోనా?’ అంటూ మరింత భక్తి పెల్లుబికిరాగా ఆనందభాష్పాలు కన్నులనుంచి జాలువారగా”
“ఓ కరుణాసింధో! నీ అనుగ్రహం అపారమైనది! భవసాగరాన్ని తరింపచేయటానికి తారకుడువి! ఐనాప్రభూ! ఎనభైనాల్గులక్షల జీవరాసులలో మనుష్యుడు ముఖ్యుడు! అందులోని చతుర్వర్ణాలలోనూబ్రాహ్మణజన్మ, బ్రాహ్మణులలోనూ జ్ఞానులు, వారిలోనూ అనుష్టానపరులూ, అట్టి అనుష్టానపరులలో బ్రహ్మవేత్తలూ శ్రేష్ఠులు! అందుచే ఓ పరమేశ్వరా! అట్టి బ్రహ్మజ్ఞానాన్ని నాకు అనుగ్రహించు! నీయందు ధృఢభక్తినీ, ఎన్నటికీ మరువని అనన్యచిత్తాన్నీ నాకు ప్రసాదించు!! నిన్ను ఆరాధించే భక్తులలోకెల్లా, నాకు శ్రేష్టత్వాన్ని యివ్వు!”
“ముల్లోకాలలో అందరిచేతా కొనియాడబడే ప్రఖ్యాతినీ, నమస్కారయోగ్యతనూ నాకు కలుగజేయి! ఆ తపోభూమి పుష్పకమనే పేరా ప్రఖ్యాతమవుగాకా! ఓదేవా! నీవిక్కడనే అనుగ్రహమూర్తివై వెలసి సదా నీ భక్తుల మనోభీష్టాలను నెరవేర్చు! ఈ పుష్పకపురము నేటినుండీ నీపేర గణేశపురమని ప్రసిద్ధిచెందుగాక!”
అంటూ పునఃపునః సాష్టాంగ నమస్కారములు చేశాడు! అప్పుడు దరహాసంచిందే మోముతో ఆ విఘ్నపతి యిలా వరమిచ్చాడు.
“ఓ మునిశ్రేష్ఠా! నా అనుగ్రహం పొందిన భక్తులకు ఈ ముల్లోకాలలోనూ అసాధ్యమేమీలేదు! ఓ బ్రాహ్మణోత్తమా! నీ మనోభీష్టము యథాతధంగా తప్పక నేరవేరగలదు! దుర్లభతరమైన బ్రాహ్మణత్వాన్ని నీకు అనుగ్రహించాను. నీవు ‘గణానాంత్వా’ అన్న ఋగ్మంత్రాన్ని జపించావు కనుక ఆ ‘మంత్రానికి నీవే ఋషి’వి కాగలవు! బ్రహ్మాది దేవగణాలలోనూ, వశిష్టాది మునిగణాలలోనూ నీవు పరమోత్కృష్టత్వం పొందగలవు. కార్యార్ధులైన సర్వులూ, ఇకనుంచి సకల కార్యారంభములలోనూ ముందుగా నిన్ను స్మరించాకనే, నన్ను స్మరింతురుగాక! ఈరకంగా చేసినవారికి సకల కార్యాలు సిద్ధించగలవు! ఋషి, దేవతా ఛందస్సులను ఎరుగని దేవతాకార్యాలేవీ ఫలితానివ్వవు!
సకల దేవతలకు భయాన్ని గోలిపేవాడూ, ముల్లోకాలలోనూ విఖ్యాతుడైన మహా పరాక్రమవంతుడైన పుత్రుడు నీకు జన్మిస్తాడు! రుద్రుడు తప్ప అతడు ఎవరివల్లా జయిoపబడని శక్తిసంపన్నుడు! నాయందు అనన్యభక్తి గలవాడౌతాడు!
నీవు తపమాచరించిన ఈ వనము కృతయుగంలో ‘పుష్పక’మనీ, త్రేతాయుగంలో ‘మణిపుర’మనీ, ద్వాపరయుగంలో ‘భానక’మనీ, కలియుగంలో ‘భద్రకా’మన్న పేర్లతో విఖ్యాతమౌతుంది! ఇచట స్నానాదికాలు చేయటంవల్ల సర్వులకూ సకల మనోభీష్టాలు సిద్ధించగలవు.”
బ్రహ్మ:
“ఓ వ్యాసమునీంద్రా! ఇట్లా వరదుడైన గజవదనుడు ఆ మునికి విశేష వరాలను దయతో అనుగ్రహించి అంతర్హితుడైనాడు. ఆ తరువాత అక్కడ ఒక చక్కని గణేశప్రసాదాన్ని నిర్మించి, అక్కడ ‘వరదగణపతి’ మూర్తిని ప్రతిష్టచేశాడు గృత్సమదుడు. గణేశుని అనుగ్రహంవల్ల దీనికి ‘సిద్ధస్థానము’ అన్న ఖ్యాతి గల్గింది! అప్పుడాముని భక్తిభావసమన్వితుడై, ఆ వరదగణపతిని చక్కగా పూజించాడు!”
“ఓ మునీంద్రా! విఘ్నరాజుయొక్క ఈ వరదాఖ్యానాన్ని ఎవరైతే వింటారో, పఠిస్తారో, అట్టివారు సకలాభీష్టాలనూ పొంది గణేశానుగ్రహంవల్ల మోక్షం పొందగలరు!”
Chapter 37 complete
