గణేశ పురాణము - ఉపాసనా ఖండము
52 – నలవ్రత నిరూపణం
తండ్రియైన హిమవంతుడు తనకు ప్రేమతో ఉపదేశించిన ‘వరద గణేశ వ్రతవిధానం’ అంతావిన్నాక పార్వతి యిలా ప్రశ్నించింది.
పార్వతి:
“ఓ తండ్రీ! ఈ వ్రతాన్ని ఇంతకుపూర్వం నలుడు చేశాడని చెప్పావు! ఇంతకీ ఆ నలుడెవ్వరు? ఎందుకని ఆ వ్రతాన్ని ఆచరించాడు? ఈ వృత్తాంతాన్ని చెప్పి నాకు ప్రశాంతిని చేకూర్చవలిసింది!”
హిమవంతుడు:
“అమ్మ! పార్వతీ! ఈ నలుడనే మహారాజు పూర్వం నిషేధదేశాన్ని పరిపాలించేవాడు. అతడొక మహాదాతా! అమిత తపస్సంపన్నుడై, శుభలక్షణాలతోనూ, సకల సంపదతోనూ, తులతూగేవాడు.
ఈ నలమహారాజు సమస్త యుద్ధవిద్యలలో ఆరితేరినవాడై, అంతులేని పరాక్రమంతో శత్రువుల పాలిట సింహస్వప్నమై ఉండేవాడు. ఆ నలమహారాజుకు మహాసౌందర్యవతి, మహాపతివ్రతా, సుగుణవతియైన దమయంతి భార్య! నలమహారాజు కొలువులో పద్మహస్తుడనే కుశాగ్రబుద్ధి గల మంత్రి ఉండేవాడు. ఈ మంత్రి నీతివిషయంలో అంగీరసుని, ఔన్నత్యం విషయంలో మేరుపర్వతాన్ని మించి, సముద్రునివంటివాడై, గంభీర్యంలో, బుద్ధికి బృహస్పతిలా ప్రతిభావంతుడై శోభించేవాడు.
ఈ నలమహారాజు ఒకనాడు మంత్రి సామంత దండనాధులతో కొలువుతీరి, రాజనర్తకీమణులు చేసే అద్భుతమైన నృత్యప్రదర్శనను తిలకించసాగాడు. అట్టి సమయంలో గౌతమమహర్షి ఆయన వద్దకు వచ్చాడు. రాజు ఎంతో గౌరవాదరాలతో తన సింహాసనం పైనుండి లేచి, ఆ మహర్షిని తన ఆసనంపై కూర్చుండచేసి యిలా ప్రశ్నించాడు.
నలమహారాజు:
“ఓ మహర్షీ! మీరాకచే నేను అనుగ్రహించబడినాను! నాజన్మ, కులము, మాతాపితరులూ, రాజ్యమూ సమస్తమూ ధన్యములైనాయి! తమరాకకు గల కారణం వెంటనే సెలవీయ్యండి!”
గౌతముడు:
‘ఓ మహారాజా! త్రిమూర్తులచేతా, త్రిలోకాధిపతియైన ఇంద్రునిచేతా కూడా ప్రశంసించబడుతున్న నీ ఐశ్వర్యాన్నీ, వైభవాన్నీ చూడాలని వచ్చాను. మనుష్యలోకంలో ఉన్నా, దేవతలచేతా, మానవులచేతా కూడా కొనియాడబడుతున్నావు! నేను నిత్యతృప్తుడవైనప్పటికీ, నీ యొక్క వినయమూ, సౌశీల్యమూకూడా నాకు ఎనలేని తృప్తినిచ్చాయి! ఇక నీవు అనుజ్ఞనిస్తే నా ఆశ్రమానికి తిరిగి వెడతాను!’.
నలమహారాజు:
‘ఓ మునివర్యా! తాము సర్వజ్ఞులు! వేదవేదాంగాలను క్షుణ్ణంగా ఎరిగినవారు! సకల శాస్త్రప్రవర్తకులూ! ఓ దయానిదీ! క్షణకాలం తాము దయతో కూర్చుండి, నాకుగల ఒక సందేహాన్ని తీర్చప్రార్ధన!’
గౌతముడు:
“ఓ నలమహారాజా! నీ శ్రద్ధాభక్తులకు అమితంగా ప్రసన్నుడనైనాను. సకల దేవతలూ, రాజులూ సైతం నీమాటను జవదాటక ఆజ్ఞగా శిరసావహిస్తారు! కనుక నేను నీమాటను తప్పక పాటిస్తాను! కనుక నీ సందేహాన్ని తెలుపు!” అన్నాడు
నలమహారాజు:
“ఓ ఋషివర్యా! ఈ నా అపూర్వ వైభవంచూస్తే నాకే ఆశ్చర్యం కలుగుతుంది! పూర్వజన్మలోని ఏపుణ్యవిశేషంచేత ఇట్టి వైభవం నాకు కలిగింది? ఇంతకూ పూర్వజన్మలో నేనెవర్ని? ఆ వివరాన్ని దయతో నాకు తెలియజేయండి!” అంటూ ప్రశ్నించగా
గౌతముడు:
‘ఓరాజా! పూర్వజన్మములో నీవు గౌడదేశానికి ఆవలగల పిప్పల నగరంలో ఒక దరిద్రుడైన క్షత్రియుడవై జన్మించావు! ధనహీనుడవైన నీవు భార్యాబిడ్డల నిరసనవాక్యాలకు ఎంతో బాధపడి, విరక్తుడవై, ఎవరికీ తెలియకుండా ఒక మహారణ్యంలోకి వెళ్ళవు! క్రూరమృగాలతో నిండి, దట్టమైన వృక్షాలతోనూ మధ్య మధ్య సరస్సులతోనూ ఉన్న ఆ అరణ్యంలో తిరుగుతూ వెళ్ళి ఒకానొక ఋష్యాశ్రమాన్ని చేరుకున్నావు! ఆ ఆశ్రమం వేదఘోషతో ప్రతిధ్వనిస్తుంది. అది మహాతపస్వియైన కౌశికుని ఆశ్రమము!
లోనికివెళ్ళి భక్తితత్పరుడవై ఆ ఋషికి ప్రణమిల్లావు! దీనుల బాధలకు కరిగిపోయే స్వభావంగల కరుణాపూరితుడైన ఆ మహర్షి నిన్ను ప్రేమారగా లేవనెత్తి, నీ దుఃఖకారణం ఎరిగి, నిన్ను యిలా ఆశీర్వదించాడు.
కౌశికుడు:
“ ఆ దేవేశుడైన గజాననుడు నీకు సకల శుభాలను చేకూర్చుగాక!”
ఇలా ఆ ఋషిసత్తముని వద్ద అమోఘమైన ఆశీర్వచనాన్నిపొంది, సంతోశభరితుడవై ఆ మునిని నీ దారిద్ర్యనాశనానికై తగిన ఉపాయం చెప్పమంటూ వేడుకున్నావు! అప్పుడా మహర్షి భుక్తిముక్తి ప్రదమైన, సకలాభీష్టాలనూ నెరవేర్చగల, ఉత్కృష్టమైన గణేశారాధనను నీకు ఉపదేశించాడు. ఆ తరువాత కౌశికుడిలా అన్నాడు.
‘ఓ రాజా! నీవు ఒక మాసమాత్రం క్రమంతప్పక ఈ గణేశవ్రతాన్ని ఆచరించు!’ అంటూ ఆ వ్రతవిధానాన్ని నీకు కౌశికుడిలా చెప్పాడు
పూజావిధానం
“ఓరాజా! ముందుగా వరదుడైన గణేశుని దివ్యసుందరవిగ్రహాన్ని మట్టితోచేసుకుని, ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్టచేసి, షోడశోపచారములతో భక్తిగా పూజించాలి. ఇలా ప్రతిదినమూ శ్రద్ధగా ఒక మాసంరోజులపాటు చేయాలి! అలా నియమబద్ధుడవై ఆచరిస్తే, నీకు సకల సిద్ధులూ సంప్రాప్తిస్తాయి!”
నలమహారాజు:
“ఓ కౌశిక మునిపుంగవా! గజాననుని మూర్తిని కృతికతో చేయాలంటున్నారు. ఇంతకీ అతడి స్వరూపమెలాంటిది? అది నాకు దయతో తెలపండి. అతడి స్వరూపాన్ని తెలుసుకున్నాక, గణేశవ్రతాన్ని మీరుచెప్పిన రీతిలో నియమంగా ఆచరిస్తాను!” అన్న అతడి మాటలకు కౌశికుడిలా అన్నాడు.
కౌశికుడు:
“ఓ రాజా! గణేశుడంటే ‘ఇతడు’ అని నిర్వచించరానివాడు! సాక్షాత్తూ పరబ్రహ్మస్వరూపుడే అతడు! ఈ జగత్తంతా ఆ గజాననుని నుండే ఉత్పన్నమైనది! ఆయన సంకల్పంవల్లనే ఈ సమస్త జగత్తూ కూడా నిర్మించబడ్డది! అందువల్ల ఈ జగత్తంతటికీ అతడే తల్లీ, తండ్రీ కూడా!
బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు, విష్ణువు మొదలైన వారందరూ ఆయననే నిత్యం తమ హృదయకమలంలో ధ్యానిస్తుంటారు!”
గౌతముడు:
“ఓ రాజా! నీవా కౌశికుని మాటలను ఆలకించి, అతడికి నమస్కరించి, అతనివద్ద ఆజ్ఞను గైకొని తిరిగి నీ ఇల్లు చేరుకున్నావు! ఆ ఋషి ఆదేశించినట్లుగా, శ్రావణశుక్ల చతుర్థినాడు నీవా గణేశవ్రతాన్ని ఆరంభించి, మృతికతో ఒక గణపతిమూర్తిని తయారుచేసి, ఆ గణేశున్నే నీ హృదయపద్మములో సర్వకాల సర్వావస్థలయందూ ధ్యానిస్తూ, అతడి అనుగ్రహంచేత సర్వోత్తమమైనట్టి సకలసిద్ధులనూ పొందావు! ఆ జన్మములో నీవు సకల దాసదాసి జనములతో కూడిన మహాదైశ్వర్యాన్ని పొందావు! దానితో దేవతాతృప్తికై అనేక దానాదికాలు చేశావు! ఎంతో పుణ్యప్రదమైనట్టి ఒక గొప్ప విలువైన ఆలయాన్నికూడా సర్వాంగసుందరంగా అక్కడే నిర్మించావు! ఇహలోకంలో సకల భోగాలన్నీ అనుభవించాక కాలధర్మం చెంది, తిరిగి ఆ పుణ్యవశాన రాజకుటుంభంలో జన్మించి నిషధదేశానికే రాజుగా నలుడన్న పేరుతో రాజ్యం చేసున్నావు! ఓ నలమహారాజా! ఇదే నీవడిగిన సందేహానికి జవాబు!” అంటూ వెళ్ళిపోయాడా గౌతమమహర్షి!
హిమవంతుడు:
“కనుక అమ్మాయీ! ఇలా గౌతమమహర్షి వెళ్ళిపోయాక నలుడు తిరిగి ఆ జన్మలోకూడా వరదగణేశవ్రతాన్ని అనుష్టించాడు! ప్రతీరోజూ వ్రతం పూర్తయ్యాక వ్రతకథనుకూడా భక్తితో వినేవాడు. ఈ వ్రతప్రభావం చేతనే అతడు తన సకలాభీష్టాలను పొందగలిగాడు! కనుక ఓ పార్వతీ! ఈ విధంగా గౌతమునిచే ఉపదేశించబడిన నలమహారాజు, పూర్వజన్మలో తాను చేసిన వ్రతాన్ని తిరిగి ఆచరించి, కృతార్థుడయ్యాడు! ఆ విధానం అంతా నీకోరికమేరకు ఇప్పుడు చెప్పాను! ఈ వ్రతప్రభావాన్ని పూర్తిగా వర్ణించడం ఎవరితరమూ కాదుతల్లీ!” అంటూ ముగించాడు హిమవంతుడు.
Chapter 52 complete
