గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

49 – గణేశ పార్థివ పూజవిధానం

పార్వతి:

“ఓ జనకా! ఆ గజననుడెట్టివాడు? ఆతని ఉపాసనా విధానం మెట్టిది? ఆ గణేశుని అనుగ్రహవిశేషం వలన తిరిగి నా నాధుని పొందగలనా? ఈ పవిత్ర ఉపాసనను తెలపటంవల్ల మానవులకు కూడా అమిత ప్రయోజనం చేకూరుతుంది! కనుక ఆ వివరం నాకు తెలియజేయి!” ఈ మాటలకు ఆనందభాష్పములు జాలువారగా, భక్తితో ఆతని కంఠము గాద్గదికమైంది. ప్రేమతో ఆమె తలనిమురుతూ హిమవంతుడిలా అన్నాడు.

హిమవంతుడు:

“అమ్మాయీ! ఈ గణేశ ఉపాసన అతిగోపనీయమైనది. ఇది మహా ప్రభావవంతమైనదికూడానూ! లోకకళ్యాణార్థం ఈ వ్రతవిదానాన్ని తెలియజేస్తాను. సావధానమనస్కురాలవై విను.”

బ్రాహ్మీముహూర్తంలోనే ఈ ఉపాసన చేయగోరువారు నిద్ర మేల్కొనాలి! ఆతరువాత కాలకృత్యాదులను విధివత్తుగా పూర్తిచేసుకుని, దంతధావనం, మలాపకర్షణస్నానం, మంత్రస్నానం ఆచరించి ముఖమున తిలకాన్ని ధరించాలి! శుచిగా ఆరవేసిన మడివస్త్రములను ధరించి ఏకాగ్రచిత్తంతో సుఖాసనంపై కూర్చుని నిత్యకర్మలైన సంధ్యాదికాలు నిర్వర్తించుకోవాలి! రాళ్ళు, రప్పలు లేని ఒండ్రుమట్టిని నీటితో తడిపి ముద్దగాచేసి మర్దించాలి! ఆ పరిశుద్ధమైన బంకమట్టితో సర్వావయవ సంపూర్ణుడైన గణేశుని ప్రతిమను తయారుచేయాలి. నాలుగు చేతులతో పరశువు మొదలైన ఆయుదాలు ధరించిన దివ్యమంగళమూర్తిని అలా తయారు చేశాక ఒక పీఠంపై ఉంచి చేతులను చక్కగా కడుక్కోవాలి!

పవిత్రోదకాన్ని స్నానమునకు సమకూర్చాలి! గంధము, ఎఱ్ఱటి అక్షతలు, ఎఱ్ఱటి పుష్పాలు, ధూపం వేసేందుకు గుగ్గిలము, మూడు, ఐదు, ఏడు పత్రాలుగల దూర్వాంకురాలు సంపాదించుకోవాలి! ఆవునేతితో దీపానికి ఏర్పాటుచేయాలి! ఇక నైవేద్యానికి గజాననుకి అత్యంత ప్రీతికరములైన ఉండ్రాళ్ళును, అప్పాలు, లడ్డూలు, పరమాన్నము, సన్నబియ్యపు వరి అన్నము సమస్త అధరువులతోనూ సిద్ధపరచాలి! సుగంధ చూర్ణయుక్తమైన తాంబూలమునూ, నేరేడు, మామిడి, పనస, ద్రాక్ష, అరటి మొదలైన ఫలములను సమకూర్చుకోవాలి! కొబ్బరికాయ మొదలైన పూజాద్రవ్యాలను బంగారుపళ్ళెములో హారతికర్పూరంతోసహా సిద్దపరుచుకోవాలి!

ఏకాంత స్థలంలో ధర్భాసనమూ, దానిపైన లేడిచర్మము పరచుకుని సుఖాసనంలో కూర్చున్నాక, భూతశుద్దినిచేసి ప్రాణాయామాదికములు చేసి గణేశవిగ్రహానికి ప్రాణప్రతిష్టచేసి దిగ్భందన చేయాలి.

ఆ తరువాత గజాననుని శ్రద్ధాపూర్వకంగా నమస్కరించి, అంతర్బహిర్మాత్రుకా న్యాసములు చేసుకోవాలి! సన్నిధిముద్రతో గణాధిపుని ఆవాహనం చేసి మంత్రాన్ని భీజాక్షరసహితంగా, అంగన్యాస కరన్యాసములతో తనపై న్యాసం చేసుకుని, పూజాద్రవ్యాలన్నింటినీ శుద్ధిచేసుకుని గణేశుని ఈవిధంగా ధ్యానించాలి!

ఏకాదంతముతోనూ, చేటలవంటి విశాలమైన చెవులతోనూ, గజవాదనముతో, నాలుగు బాహువులలోనూ పాశము, అంకుశము, పరశువు మొదలైన ఆయుధములు ధరించినవాడిగనూ, భక్తులకు అనుగ్రహాన్ని వర్షించే వరదునిగా, సిద్ది బుద్ధి ప్రసాదించువాడూ, ధర్మార్థ కామమోక్షాలనే నాలుగు పురుషార్థములు యిచ్చేవాడు, బ్రహ్మ, ఇంద్ర, రుద్రాది, విష్ణుదేవతలందరిచేతా, నారదాది దేవర్షులచేతా స్తుతింపబడేవాడైనట్టి గజాననుని దివ్యమంగళమూర్తిని ధ్యానించాలి!

 ఆ తరువాత ఆతడిని షోడశోపచారములచేత భక్తిశ్రద్ధలతో పూజించి, నీరాజన మంత్రపుష్పములను సదక్షిణకంగా సమర్పించాక, అపరాధ క్షమాపణను వేడి నానా స్తోత్రములచేతా గణపతిని స్తుతించి, సాష్టాంగనమస్కారముచేసి ఆ తరువాత యధాశక్తిగా సర్వసిద్ధిప్రదాయకమైన గణేశుని మంత్రజపము చేయాలి!

Chapter 49 complete