గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

90 – శేషోపాఖ్యానము – 1

శేషుని గర్వభంగము

నారదమహర్షి:

“ఓ నాగరాజా! నీవిలా నీ తేజస్సును కోల్పోయి ఎందుకని దుఃఖిస్తున్నావు? నీ శిరస్సులిలా భగ్నములైనవి ఎందువల్ల? నీవే మునికైనా అపచారంచేసి వారి ఆగ్రహానికి గురైనావా? లేక వళ్ళు మరచిన గర్వంతో శంకరునికేమైనా అపచారం చేసావా? ఓ శేషా! ఆ కారణము నాకు వివరించి చెప్పు! ఆ తరువాత నీ దుఃఖనివారణకు తగిన ఉపాయాన్ని చెబుతాను! నీవు అత్యంతశక్తిమంతుడవూ గనకనే ఈ ధరణీభారాన్ని నీవు నీ ఫణములపై సునాయాసంగా మోయగలుగుతున్నావు!”

ఈ మాటలకు బదులు పలుకకుండా భారంగా నిట్టూర్చి మౌనందాల్చి వున్న శేషుని చూచి దయార్ద్రహృదయుడై ఆ దేవర్షి నారదుడు కరిగిపోయి తనంతట తానే ఆ నాగరాజుకు శ్రేయఃప్రదమూ, తిరిగి అతడిని స్వస్థానం పొందేలా సహకరించే మంగళకరమైన ఉపాయాన్ని ఉపదేశించాడు.

“ఓ అశేష శక్తిసామర్ధ్యాలు కలిగిన శేషా! నీకు శ్రేయాన్నిచ్చే నా వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించు! ఏ ఉపాయంచేత నీవు ఈ సమస్త భూమండలాన్నీ బాలుడు శిరస్సున ఒక పూమాల ధరించినట్లుగా ధరించగలుగుతావో, ఆ ఉపాయాన్నిప్పుడు చెబుతాను.”

శేషుడు:

“ఓ మునిపుంగావా! తీవ్రంగా గాయపడిన వాడినవటంచేత మునుపటిలా భూమండలాన్ని నా శిరస్సులపై మోయగల సామర్థ్యం కొరవడి అందుకశక్తుడనై వున్నాను. ఓ మహానుభావా! తిరిగి నా పూర్వపు స్థితి నాకెలాగున సిద్ధిస్తుందో ఆ ఉపాయాన్ని దయతో తెలుపు! నన్ను కృతార్దుణ్ణి ఒనరించు!”

నారదుడు

“ఓ నాగరాజా! నీకు ఆ దేవదేవుడైన గజాననునియొక్క అనుగ్రహం కలిగించే మహామంత్రోపదేశం గావిస్తాను! ఎవరియొక్క దివ్యానుగ్రహ ప్రభావంచేత ఇంద్రాదిదేవతలు తమతమ పదవులను పొందారో, త్రిమూర్తులెవరి అజ్ఞానువర్తులై సృష్టి, స్థితి, లయములను నెరవేర్చుతున్నారో , అటువంటి దేవదేవుడు ప్రసన్నుడై నీవు తిరిగి నీ పూర్వపు వైభవాన్ని సంతరించుకోగలవు! ఓ శేషా! నిన్ను చూడటంతోనే నా మనస్సు జాలిచెంది ద్రవిస్తోంది! అందుచేత నీకు పూర్ణస్వస్థత చేకూర్చేటటువంటి “గణేశ షడక్షరీ మంత్రా”న్నుపదేశిస్తాను. దీన్ని నీవుగనుక శ్రద్ధతో జపించినట్లయితే నీకు గజాననుడు తప్పక సాక్షాత్కరించగలడు.”

బ్రహ్మ:

‘ఓ వ్యాసమునీంద్రా! నారదమహర్షి శేషునకు మంత్రోపదేశం గావించి అంతర్హితుడైనాడు.’ అప్పుడు శేషుడు తపస్సు చేయటానికి కృతనిశ్చయుడై, తన సర్వేంద్రియాలను నియమించి, గజాననుని ధ్యానించి అచంచలభక్తితో ఆ పరమమంత్రాన్ని తదేకదీక్షతో జపించసాగాడు. ఇలా వేయి దివ్యవత్సరాలు గడిచిన తరువాత దేవదేవుడైన గజాననుడా శేషునకు సాక్షాత్కరించాడు. ఆ దివ్యసాక్షాత్కార వైభవమెలాంటిదంటే

సింహవాహనరూడుడై, త్రినేత్రుడై, దశబాహువులతో బాహుపురులు, కుండలములూ ధరించి, మెడలో మెరిసే ముత్యాలహారాలతో రత్నకిరీటాన్ని రత్న ముద్రాక్ష సూత్రములను దాల్చి సురలకు, నరులకు నానావిధ వరాలనొసగే ఏకదంతుడై దర్శనమిచ్చాడు. సిద్ధిబుద్ధులతో కూడినవాడై శేషుడు ఏవిధంగా ధ్యానిoచాడో అట్టి మంత్రమూర్తిగానే సాక్షాత్కరించాడు. కోటిసూర్యులను ధిక్కరించే దివ్యప్రకాశంతో, నాల్గు దిక్కులూ ఆ కాంతితో ప్రకాశిస్తుండగా దిగ్భ్రాంతిచెందిన శేషుడు ఆ తేజస్సుకు వెరచి కళ్ళు మిరుమిట్లుగొలుపగా చూడజాలక భయంతో కన్నులు మూసుకున్నాడు.

తిరిగి కొంతసేపటికి ధైర్యంతెచ్చుకుని, తనలో తానిలా అనుకున్నాడు. ‘ప్రళయకాలాగ్నిని బోలిన ఈ తెజస్సేమిటి? ఇది సకల లోకాలతోపాటు నన్నూ తనలో దహించివేయదుకదా? నేను శుభాఫలాన్ని ఆపేక్షించి సత్కర్మను ఆచరిస్తుంటే ఈ విపరీతమేమిటి? లేదా ఈతడు నారదునిచే ఉపదేశితమైనట్టి మంత్రమూర్తియైన గజాననుడా?’ అనుకుంటూ చింతాక్రాంతుడవగా గజాననుడిలా అతనికి అభయమిచ్చి ఆశ్వాసించాడు.

గజాననుడు:

‘ఓ నాగరాజా! భయపడకు! దివారాత్రములు ఏకమనస్కుడవై నీవెవరినైతే ధ్యానించావో ఆ మంత్రమూర్తియైనట్టి గజాననుడిని నేనే! నీ భక్తికిమెచ్చి నీకు కోరిన సకల వరాలనీయదలచి యిలా నీ ఎదుట సాక్షాత్కరించాను! సృష్టి స్థితి లయాలకు కారణమైన పరబ్రహ్మతత్వాన్ని నేనే! నా యొక్క తేజస్సువల్లనే సూర్యచంద్రాది నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి! పరబ్రహ్మ స్వరూపుడనైనప్పటికీ లోకోపకారార్థమై, నీకు వరములనివ్వడానికే యిలా సగుణరూపంలో ఆవిర్భావించాను! కనుక నీకు కావలిసిన వరాలన్నింటినీ కోరుకో!” అని గంభీరధ్వనితో ఉరిమినట్లుగా పలుకగానే శేషుడిలా భక్తిప్రపత్తులతో వేడుకున్నాడు.

శేషుడు:

“ఓ దేవా! నీయొక్క ప్రచండ తేజస్సుచేత దిగ్భ్రాంతుడనై నీవంక చూడలేక, నీతో మాట్లాడేందుకు సాహసం చేయలేకపోతున్నాను. నాయందు దయదాల్చి సౌమ్యమైన రూపాన్ని ధరించి అనుగ్రహించవలసింది.”

“ఓ వ్యాసమునీంద్రా! ఇలా భక్తుడైన శేషుని అభ్యర్ధనమేరకు కరుణాoతరంగుడైన ఆ గజాననుడు కోటిచంద్రులతో సమమైనట్టి శీతలమైన ప్రశాంత సౌమ్యరూపాన్ని దాల్చాడు. అప్పుడా శేషుడు అఖిలేశ్వరుడైనట్టి ఆ గజాననుని ఇలా స్తుతించి వరములను కోరి ధ్యానించాడు.

“అనాదినిధనుడవైన ఓదేవా! నీకు నమస్కారము! సర్వవ్యాపకుడవూ, సకల జగత్తూ నీ స్వరూపమే అయినవాడవూ, విశ్వేశ్వరుడవూ సకల జగాలచేత కొనియాడబడే నీకు నా నమస్కారము! త్రిగుణాలకూ అతీతుడవైన వాటికి అధీశుడవైన ఓ ప్రభూ! నీకిదే నా శరణాగతి! గణములకు అధ్యక్షుడవూ, విద్యలకెల్ల ఒజ్జవు! దేవదేవుడవైన ఓ గణాధిపా! నీకు నా ప్రణతి! సురలెల్లరు భక్తిశ్రద్ధలతో కొలిచే గణనాయకా నీకు నమస్సుమాంజలి! అష్టసిద్ధులను అనుగ్రహించే నీకు విఘ్నహర్తకు, సర్వసిద్ధిప్రదునకు నా శతసహస్ర వందనములు!”

“సిద్ధి బుద్ధులకు నాథుడవై, సమస్త శుభాఫలాలనూ అనుగ్రహించే ఓ వరదగణేశా! ఓ గణనాయకా! నీకు నమస్కారము!”

అంటూ “ఓ మునీంద్రా! ఆ శేషుడేయే వరాలను అర్థించాడో ఆ దేవవంద్యుడుఏయే వరాలను అనుగ్రహించాడో విను!” అంటూ చతుర్ముఖుడు కొనసాగించాడు తన కథనాన్ని!

“ఓ దేవదేవా! నీయొక్క దివ్యసందర్శనంచేత నాజన్మ, తపస్సూ జ్ఞానములూ సార్థకమైనాయి! నా మాతాపితరులు ధన్యులైనారు. నా నేత్రాలు, దేహము, శిరస్సులూ, అన్నీ ధన్యములైయ్యాయి! నిన్ను స్తుతించుటచేత నా జిహ్వాకూడా చాలా ధన్యమైంది. నీ సందర్శనభాగ్యంచేత నా నాగకులము, శీలము యావత్తూ ధన్యమైనాయి! ఓ దేవా! నీ అఖండ భజనను సదా నా కనుగ్రహించు! నీవు సకలమూ ఎరిగిన సర్వఘ్నుడవు! అనర్థకారియైన గర్వకారణంచేత నా శిరస్సులు ఈరకంగా ప్రక్కలైనాయి! మహేశ్వరుని ఆగ్రహానికి గురైనాను! నాకు దైవికంగా కలిగిన నారదానుగ్రహంచేత నీ సందర్శనభాగ్యం కలిగింది! ఓ దేవా! మూడులోకాలలోనూ శ్రేష్టత్వాన్నీ, ధరాదారణ సామర్థ్యాన్నీ నాకివ్వు! స్థిరమైన స్థానాన్ని నాకు ప్రసాదించు! నిత్యమూ నీ సందర్శనభాగ్యాన్ని నాకు అనుగ్రహించు! శంకరుని సాన్నిధ్యమూ, స్థిరభక్తీ నాకు అనుగ్రహించు!” అంటూ ప్రార్థించగా ఆ కరివదనుడిలా పలికాడు.

“ఓ శేషా! నీ శిరస్సులు పదిగా వ్రక్కలైనాయి గనక వేయిపడగలతో సహస్రవదనుడవనీ ప్రఖ్యాతిగాంచగలవు! అతి దుర్లభమైన ధరాధారణ నీకు కలుగుతుంది! ఇకపై నీవు స్థిరముగా శంకరుని శిరస్సును అలంకరించగలవు! అంతేకాదు, నీ కోరికమేరకు నా సాన్నిధ్యాన్నికూడా సతతమూ పొందగలవు! నీ సకల మనోభీష్టములూ అవశ్యం నేరవేరుగాక!” అంటూ వరములను గుప్పించి అతడిని అనుగ్రహపురస్సరంగా తన ఉదరమున బంధించుకున్నాడు. ఆనాటినుండి వినాయకునకు వ్యాలబద్ధుడన్న పేరు కల్గింది. అనంతరం శేషుని శిరస్సుపై అభయహస్తాన్నుంచి అతనికి తన విరాట్ రూపాన్ని కనబరిచాడు. ఆ విశ్వరూపం ఎలావున్నదంటే,

“ఈ భూమియే పాదములుగా, దిక్కులు శ్రోత్రములై, సూర్యచంద్రులు నేత్రములై, ఓషదులు రోమస్థానములుగానూ, పర్వతములు గోళ్ళు (నఖములు) గానూ, మేఘములు చమటగానూ, చతుస్సాగర పర్యంతమైన సర్వజగత్తూ, బ్రహ్మ, ప్రజాపతులూ, వారిసృష్టీ ఆయనయొక్క కుక్షిగానూ, అనంతముఖాలతో, బాహువులతో, అనంతపాదములూ, అనంతమైన శక్తీ కల్గి తిరిగి వెనుకటి గజాననుని విశ్వరూపాన్ని దర్శించిన శేషుడు భయభ్రాంతుడై సౌమ్యరూపాన్ని దాల్చమంటూ ప్రార్థించాడు.

అప్పుడా విశ్వరూపాన్ని ఉపసంహరించి తిరిగి దశభుజములు దాల్చిన సింహారూఢునిగా సాక్షాత్కరించి యిలా అన్నాడు

గజాననుడు:

“ఓ శేషా! దివ్యమైనట్టి ఈ రూపవిజృంభనను సురలు, మునులు, తపోధనులు సైతం కనుగొనజాలరు. కేవలం నీయందుగల అనుగ్రహవిశేషంచేతనే నీకు అది లభించింది. నీకు పాతాళంలోనూ, శివునిశిరమందూ స్థిరమైన స్థానం లభిస్తుంది. నా అనుగ్రహవిశేషం చేత ఈ భూమినిసహితం నీవొక పూలమాలగా దరించగలుగుతావు!”

శేషుడు:

“ఓ దేవా! నీ ఆజ్ఞమేరకు ధరణిని ధరించగలను. నేటినుండీ నీకునూ నాకునూ ధరణీధరుడనే పేరుప్రఖ్యాతమౌతుంది! నీవుకూడా భక్తజనుల మనోరధము లీడేర్చుతూ ఈ పవిత్రక్షేత్రంలో వెలిసి ఈ క్షేత్రదర్శనం చేసినవారిని అనుగ్రహించు!” అంటూ వేడగా “తథాస్తు” అంటూ అంతర్థానం చెందాడు గణేశుడు!

“ఓ వ్యాసమునీంద్రా! ఆ తరువాత శేషుడా ప్రాంతంలో అట్టి అనుగ్రహప్రదుడైన విఘ్నేషుని మూర్తిని స్థాపనచేసి రత్నస్థoభాలతో కూడిన బంగారు ప్రాకారాన్ని నిర్మించాడు. ఆ దేవునికి ‘ధరణీధర’ మూర్తియన్న నామకరణం చేశాడు.

తాను శ్రీహరిపానుపై, భూదేవిని పుష్పమాలవలే ధరించాడు! గజాననునియొక్క నాభీపద్మమునుకూడా శేషుడు స్థిరవాసమేర్పరుచుకున్నాడు. ఓ వ్యాసమునీంద్రా! ఈవిధంగా గజాననుని అనంత మహిమనంతా వివరించి చెప్పాను. ప్రవాళనగరం ఈ ధరణీధరుడు ఈ ఖ్యాతిగా వెలిసిన పుణ్యక్షేత్రం. శేషుడు గజాననుని ఆరాధించే అనుగ్రహాన్ని బడసినదీచోటనే!

Chapter 90 complete