గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

64 – అనలాసుర వృత్తాంతం

 ఈ కధావృత్తాంతాన్నoతటినీ కౌండిన్యమహర్షినుండి వింటున్న ఆతడి ధర్మపత్ని యిలా ప్రశ్నించింది. “ఓ మునివర్యా! దేవతలు, మునులు అలా రాక్షసుడి భీతితో కాలికి బుద్దిచెప్పి పారిపోగా ఓ పర్వతంలా ఆ బాలకుడా నిలిచివున్నది? ఆ తరువాత ఏం జరిగింది? ఆ వృత్తాంతమంతా వినాలని కుతూహలమౌతున్నది. కనుక దయతో వివరించండి!” అలా ప్రశ్నించిన ఆశ్రయకు కౌండిన్యుడు ఏమి బదులిచ్చాడో ఓ దేవేంద్రా నీవూవిను! అంటూ నారదుడు తరువాత జరిగిన కధను వివరించాడు.

నారదుడు:

బాలుడైన గజాననుడు అలా అచలుడై నిలిచియుండటంచూసి అనలాసురుడు కాలాగ్నిలా మండిపడుతూ మీదికి దాడిచేయవచ్చాడు. ఆతడి భయంకర పదఘట్టనలకు భూమి గడగడా వణికింది! ఆకాశంలో ఉరుములతో మేఘగర్జన వినవచ్చింది. ఆ వికృతమైన ధ్వనులకు చెట్లకొమ్మల పైనుండి పక్షులన్నీ నేలపై రాలినాయి. సముద్రములు ఉప్పొంగాయి! ఒక ప్రచండవాయువు పెనుతుఫానులా వీచి పెద్దపెద్ద వృక్షాలన్నీ కూకటివేళ్ళతోసహా పెకలించబడ్డాయి.

అప్పుడు బాలస్వరూపుడైన ఆ గజాననుడు అనలరూపుడైన ఆ రాక్షసుణ్ణి తన మాయాబలంతో పట్టేసి అందరూ చూస్తుండగా అగస్త్యుడు సముద్రాలను అవపోశనపట్టినట్లు ఆ దానవుడిని మ్రింగేశాడు. అలా మ్రింగివేసి ‘వీడుగాని కడుపులోకి వెళ్ళాడా, కుక్షిలోని భువనాలన్నీ దగ్ధమౌతాయి’ అనుకున్నాడు.

అప్పుడా బాలగజాననుడి తపోపశమనమునకై ఇంద్రుడు చంద్రునికళని యిచ్చాడు. ఆనాటినుండి అతడికి ‘ఫాలచంద్రుడ’న్న నామం కలిగింది. బ్రహ్మదేవుడు తన మనఃసంకల్పమాత్రంచేతనే సిద్ధిబుద్ధియనే ఇరువురు కన్యలనూ సృజించి, సర్వాంగసుందరులూ, కోమలశరీరులైన ఆ భామలను సమర్పించి ‘ఓదేవా! వీరిని ఆలింగనం చేసుకుంటే నీ తాపం శాంతిస్తుంది’ అంటూ మొక్కాడు. అప్పుడు విష్ణుమూర్తి కమలములను యివ్వగా ‘పద్మహస్తుడు’ అన్న నామం సుప్రసిద్ధమైంది! అప్పటికీ అగ్ని శాంతిoచనందున వరుణుడు చల్లని ఉదకంతో తడిపాడు. శంకరుడు శేషుడిని బహుకరించగా దానితో బంధింపబడిన ఉదరము కలవాడైనందున ‘వ్యాళబద్ధు’దాని దేవతలు కీర్తించారు. ఐనా వేటివల్లా కూడా గణేశునికి తాపోపశమనంకాలేదు. అప్పుడు 8,800 మంది మునీశ్వరులు వచ్చి ఒక్కొక్కరూ ఇరవైఒక్క దూర్వాంకురముల చొప్పున భక్తితో సమర్పించారు. అప్పుడు వాటివల్ల ఆ అగ్ని శాంతించింది.

ఈ రీతిగా దూర్వాంకురములచేత అర్చించబడిన గజాననుడు చాల సంతసించాడు. ఈ విషయం తెలుసుకున్న దేవతలందరూకూడా ఆ భక్తసులభుడిని దూర్వాంకురములతో పూజించి సంతుష్టిపరిచారు. అలా అనంతమైన దూర్వాంకురములచేత అర్చిoచబడ్డ గజాననుడు దేవతలతోనూ, మునులతోనూ యిలాఅన్నాడు.

గణేశుడు:

“నా పూజకై భక్తిశ్రద్ధలతోపాటూ సేకరించాల్సిన మహాముఖ్యమైన పూజాద్రవ్యం ఈ దూర్వాంకురాలే! అందువల్ల నా పూజలో వీటిని తప్పక వినియోగించాలి! దూర్వాంకురములులేని పూజవల్ల ఎట్టి ప్రయోజనం ఉండదు! అందువల్ల నా భక్తులు ఉషఃకాలంలో ఒక్కటైనా, ఇరవైఒక్కటైనా దూర్వాంకురములు సమర్పిస్తే అది అనంతఫలప్రధమౌతుంది! ఆ ఫలితం నూరుయజ్ఞాల వల్లగానీ, దినాదికములవల్లగాని ఉగ్రతపోనిష్టవల్లగాని సంపాదించే పుణ్యంకన్న ఎన్నోరెట్లు అధికమైనది.”

“ఓ ఆశ్రయా! ఈ విధంగా దేవతలు, మునులు గజాననుని వాక్యాలను విని తిరిగి ఆయనను దూర్వాంకురములతో పూజించారు. అప్పుడా భక్తవత్సలుడు అమిత సంతోషంతో భూనభోoతరాళాలు ప్రతిధ్వనించేలా గర్జించాడు. అనేక వరాలను ఆనందపరవశులైన దేవతలకు, మునులకు, మానవులకు ఒసంగి అంతర్ధానం చెందాడు. ఆదిమొదలు ఆయనకు ‘కాలానల ప్రశమనుడు’ అన్ననామం కల్గింది. తరువాత అందరూ ఆ ప్రదేశంలో ఒక గణేశదేవాలయాన్ని నిర్మించి గణేశమూర్తిని స్థాపించి ఆ మూర్తికి ‘విఘ్నహరుడ’న్న నామం ఉంచారు.

ఎవరైతే ఈ ప్రదేశంలో స్నానం, దానము, అనుష్టానము నిష్టగా ఆచరిస్తారో వారికి విఘ్నహరుని కృపవలన అనంతమైన పుణ్యం సంప్రాప్తమౌతుంది. ఇక్కడ గజాననుడు కాలనలఅసురునిపై జయంపొందాడు గనుక ఈ ప్రదేశము విజయపురమన్న పేరిట ఖ్యాతివహించింది. సకల భక్తజనుల విఘ్నహర్త కనుకనే ఆ దేవదేవునికి విఘ్నహరుడన్న పేరుకూడా విఖ్యాతమైంది. “ఓ ఆశ్రయా! నీవు అడిగావుగనుక అమిత ఫలప్రదమైన ఈ దూర్వాంకుర మహాత్మ్యాన్నీ నీకు వివరించాను. దీనిని పఠించుటవలన వినటం వలన సర్వపాపములు క్షయమౌతాయి! ఇది అతిపురాతనమైన ఇతిహాసం” అంటూ కౌoడిన్యమహర్షి తన అనుష్టానానికి నదీతీరానికి వెళ్ళి పోయాడు.

Chapter 64 complete