గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

77 – కార్తవీర్యోపాఖ్యానం – 1

బ్రహ్మ:

“ఓ వ్యాసమునీoద్రా! నీవు కోరినట్లుగా దూర్వామహాత్మ్యము, నామప్రభావము వివరించాను. నీవింకా ఏమి వినగోరుతున్నవో చెప్పవలసింది”

వ్యాసుడు:

“ఓ పరమేష్టీ! సకల శుభకరమైన ఈ సంకష్ట చతుర్ధీవ్రతాన్ని ఎవరు ఆచరించారు? ఏయే ఫలాలను పొందారు? దయతో ఆ విశేషాలన్నీ వర్ణించవలసింది!”

బ్రహ్మ:

“గతంలో జమదగ్ని మహర్షి ప్రియసుతుడైన రాముడు ఈ వ్రతాన్ని ఆచరించి శత్రునిర్మూలనా సామర్ధ్యాన్ని, విజయాన్ని ‘జ్ఞానమును’ దీర్ఘాయువునూ కూడా పొందాడు!”

వ్యాసుడు:

“ఓ చతురాననా! ఈ రాముడెవరు? ఎలా ఉద్భవించాడు? అతడి తల్లిదండ్రులెవరు? అతని వృత్తాంతాన్నంతటినీ విస్తారంగా తెలుపవలసింది!” అంటూ కోరాడు.

బ్రహ్మ:

శ్వేతద్వీపంలో మహాతపశ్శాలియైన జమదగ్ని అనే ప్రఖ్యాతుడైన మహర్షి ఉండేవాడు. ఆయన కేవలం సంకల్పమాత్రంచేతనే సృష్టి స్థితి లయములు కావించగలిగినంతటి సమర్ధుడు. నిగ్రహానుగ్రహ సమర్ధుడూ త్రికాలవేదీను! అత్యద్భుత సౌందర్యరాశియైన రేణుకాదేవి ఆతడి ధర్మపత్ని. ఈ పుణ్యదంపతుల గర్భాన విష్ణ్వoశ సంభూతుడైనట్టి రాముడు జన్మించాడు.

రాముడుకూడా మన్మధుడిని తలదన్నేటంతటి సౌందర్యంతో, అమితమైన తపశ్శక్తితో ‘మరోసూర్యుడా’ అనేటంత ప్రకాశమానుడై దేవతలను, ద్విజులను గురువులను గో అశ్వద్ధములను అమిత భక్తిశ్రద్ధలతో పూజించి ప్రణతులర్పించేవాడు. ఆతడు భాషిస్తూంటే దేవతాగురువైన బృహస్పతి స్పురించేవాడు. పితృవాక్యపాలనా తత్పరుడు. మిక్కిలి ఓర్పు కలిగి గాంభీర్యంతో ఉండేవాడు. ఇటువంటి సద్గుణసంపన్నుడైన రాముడు ఒకనాడు తండ్రియొక్క అజ్ఞానుసారం యజ్ఞకర్మకు సమిధలను సేకరించెందుకని అరణ్యానికి వెళ్ళాడు!

ఆ సమయంలో అమిత బలపరాక్రమోపేతుడు ఒక్కసారిగా అయిదువందల బాణములు విడువగలవాడు, అత్యంత బలపౌరుశాలతో ఇంద్రాది దిక్పాలకులచే సేవిoచబడుతున్నవాడూ, అపారమైన చతురంగబలోపేతుడూ, కేవలం తన శంఖధ్వనిచేతనే శత్రు సేనవారముల గుండెలవియచేసేవాడూ ఐన కార్తవీర్యుడు వేటకని అడవికి విచ్చేసి తనతో చతురంగబలాలు వెంటరాగా, నీలమైన వస్త్రాన్ని ధరించి నీలఛత్ర పతాకంతో శోభితుడై, సైనికులు వెంటరాగా వేటాడుతూ సహ్యాద్రిపైనున్న ఒకానొక ముని ఆశ్రమ సమీపానికి చేరుకున్నాడు. ‘ఇది ఎవరి ఆశ్రమము? అoటూ సేవకులను ప్రశ్నించగా

“ప్రభూ! మహాతపస్వి, ఆగ్రహానుగ్రహసమర్ధుడూ యైనట్టి జమదగ్ని మునియొక్క దివ్యతపోభూమి యిది! కేవలం ఆ పుణ్యపురుశుని సందర్శించటం చేతనే సకలపాపములూ పటాపంచలైపోగలవు! నీవు తప్పక అతడిని దర్శనం చేసుకోవలసింది! మహాత్ముల దర్శనంచేత నీవూ, నీవల్ల మేమూ ఉపకారం పొందగలము” అన్న దూతవాక్కులు విన్న కార్తవీర్యుడు తన అపార సేనావాహినిని అక్కడే విడిదిచేయించి కొద్దిమంది ముఖ్యులు వెంటరాగా ఆ జమదగ్నిముని ఆశ్రమంలోకి వెళ్ళాడు. అక్కడ దర్భాసనంపైన కూర్చుని ప్రజ్వరిల్లే అగ్నిలా ప్రకాశిస్తూన్న మునిపుంగవుని చూచి తన సహచరులతో సాష్టాంగ దండప్రణామాలు ఆచరించాడు.

ఆ జమదగ్ని మహర్షి రాజుతో కూడావచ్చిన వారికి ఆదరంతో యధోచితరీతిన ఆతిధ్యమిచ్చి గౌరవించాడు. రాజుతోకూడా వచ్చిన పరివారమంతా, అక్కడి సరోవరంలోని నిర్మలజలాలలో స్నానంచేసి, సేదతీరి ఆ ఆశ్రమంలోనే మునియొక్క శిష్యులు చేసే వేదఘోషలను వింటూ, శాస్త్రచర్చలను సైతం శ్రద్ధగా ఆలకించారు. అప్పుడు ఆ రాజు మునియొక్క ఆతిధ్యానికీ సత్కారాలకూ సంతసించి యిలా అన్నాడు

కార్తవీర్యుడు:

“ఓ మునిసత్తమా! తమ సందర్శనభాగ్యంచేత నేటికి నా తపోవృక్షము ఫలించింది! నా జన్మ, పూర్వీకులైన పితరులూ ధన్యమైనారు. శ్రుతులలో ఏదైతే పరబ్రహ్మమని చెప్పబడుతున్నదో ఆ మంగళకర స్వరూపమే తమది! నీయొక్క అతిధిసత్కారంచేత అత్యంత సంతుష్టుడనైనాను!” అన్న రాజు మాటలకు ఆ మహర్షి చిరుదరహాసంచేస్తూ సర్వగ్నుడై ఉండికూడా ప్రసన్నచిత్తంతో యిలా ప్రశ్నించాడు.

జమదగ్ని:

“ఓ రాజా! నీవెవరవు? ఎవరికుమారుడవు? ఏపని మీద యిటుగా వచ్చావు?”

కార్తవీర్యుడు:

“ఓ మహాత్మా! నా పూర్వజన్మ పుణ్యపరిపాకంవల్ల మీ సందర్శనభాగ్యం నేడు మాకు కలగింది! నేను కృతవీర్యుని పుత్రుడను. కార్తవీర్యుడన్న నామధేయం నాది! ఇక మాకు సెలవైతే నగరుకు తిరిగివెళ్ళగలము!”

జమదగ్ని:

“ఓ రాజా! నీ ఖ్యాతిని నేనూ ఇదివరలో వినేవున్నాను! నిన్ను చూడాలన్న నా ఆకాంక్ష నాకూ ఎంతోకాలంగావున్నా అది నేటికి ఫలించింది! నీవు నా ఆశ్రమానికి విచ్చేయటంవల్ల నా దేహము, అంతరాత్మజ్ఞానము, ఆశ్రమము, సంపదలూ సర్వమూ సార్ధకములైనాయి! అతిధివై వచ్చిన నీవు ఏమీ భుజింపకుండా ఎలా వెళ్ళగలవు? నీకిచట కొదవేమీలేదు! నీవంటి అతిలోక పరాక్రమవంతునికి ఆతిధ్యమిచ్చిన ఖ్యాతి నాకూ లోకంలో కలుగనియ్యి! కనుక కొంచం తడవాగి భోజనం చేసివెళ్ళు!” అన్నాడు.

కార్తవీర్యుడు:

“ఓమునివర్యా! ఇప్పుడు భోజనసమయం కనుక తమ ఆజ్ఞమేరకు తప్పక భుజించగలను! శ్రోత్రీయులైన వారి యింట అన్నము లేకపోయినా జలాన్ని యాచిoచైనాసరే త్రాగమనికదా శాస్త్ర వచనం? అలా ఐనప్పటికీ నాతోకూడా వచ్చిన పరివారాన్నంతటినీ వదల నేనొక్కణ్ణీ కేవలం నీళ్ళైనాసరే త్రాగ నిచ్చగించను. మా సిబ్బందికందరికీ భోజనం పెట్టగల శక్తి తమకు లేదని నాకు తెలుసు! కనుక నాకు సెలవిప్పిస్తే పోయివస్తాను!” అన్నాడు

జమదగ్ని:

“ఓ కార్తవీర్యమహారాజా! నేనెట్లా యింతమంది పరివారానికీ ఆతిధ్యమివ్వగలనా అన్న సందేహం నీకు వద్దు! ససైన్యంగా నాల్గువిధాల భక్షభోజ్యచోష్యలేహ్యాదులతో అందరికి బోజనపు ఏర్పాటుచేస్తాను. తపస్సు వల్ల సాధించలేనిదేదీ లేదుకదా! కనుక నీవు నీ సందేహాన్ని వీడి, వదలివచ్చిన సిబ్బందినందరినీ కూడా రప్పించు! ఈ సుందర నదీ తీరంలో క్షణకాలం విశ్రమించు, భోజన పదార్ధములన్నీ సిద్ధమయ్యాక సంతోషంతో వాటిని వీక్షిద్దువు గాని !” అన్న జమదగ్నిముని వాక్యాలకు మనస్సులోనే ఆశ్చర్యపోతూ ఆ రాజు నదీతీరానికి వెళ్ళాడు.

అప్పుడా ముని తన పత్నిని పిలిచి ఈ వృత్తాంతాన్నంతా చెప్పాడు. ఆ యిరువురూ దేవలోకంలోని కామధేనువును స్మరించి, పూజించారు.’ఓ దేనుశ్రేష్టమా! మా ఆతిధ్యంలో ఎటువంటి కొరతా కలుగనీయక మా మానం కాపాడు. అసంఖ్యాకమైన పరివారమంతటితోనూ రాజును ఆతిధ్యానికి ఆహ్వానించాము. సైన్యసహితంగాఉన్న ఆ రాజుకు తృప్తి కలిగేలా, లోకంలో సత్యం నిలిచేలా, నాకు అపకీర్తి కలుగకుండేలా, అతిధులను ఆదరించకపోయిన అసంతృప్తి నాకు కలుగనీయక నా ప్రార్ధన నాలకించి నీకు తోచినట్లు చేయి!”

మునిదంపతుల ప్రార్ధనను ఆలకించిన కామదేనువు తన మహాప్రభావంచేత క్షణకాలంలో రాజోచితమైన నగరును నిర్మించింది. రమ్యమైన, సుందర ఉద్యానవనాలతోనూ, రత్న ఖచిత దివ్యమందిరాలతో సర్వాంగసుందరంగా అలంకరించబడి రాజోచిత భోగాలన్నీ కలిగి, విశాలమైన భవంతులను, కొలువుదీరెందుకు అనువైన సభామంటపాలనూ కలిగిన ఆ భవంతి అనేకములైన ధ్వజములు, పతాకములతో శోభిల్లుతూ ఉంది. మంగళవాయిద్యాలు కర్ణపేయంగా వీనులవిందు చేస్తూండగా అతిధుల విందుకు తగిన భోజనపదార్ధాలన్నీ భోజనశాలలతోసహా అమర్చింది.

ఏర్పాట్లన్నీ సరిగ్గా సరిగ్గా ఉన్నాయని సంతృప్తిచెందిన జమదగ్నిముని కార్తవీర్యమహారాజును భోజనానికి పరివారసమేతంగా రావలసిందని కబురుపంపి సకల పదార్ధములను వడ్డిoపచేశాడు.

Chapter 77 complete