గణేశ పురాణము - ఉపాసనా ఖండము

Table of Contents

4 – సోమకాంత తపశ్చర్య

సూతుడు తిరిగి యిలా చెప్పసాగాడు!

సూతుడు:

“ఓ మహర్షులారా! ఇలా సోమకాంతమహారాజు తన కుమారుడైన హేమక౦ఠుని రాజ్యాభిషిక్తునిగాచేసి, సద్బ్రాహ్మణులకు విలువైన మణిమాణిక్యాలనూ, ఇతరులందరికి వారివారికి తగినట్లుగా ఏనుగులను, ఆవులను, జాతిగుఱ్ఱాలనూ, ధనదాన్యాలనూ యిచ్చి భూరిగా సత్కరించాడు. దేశావిదేశాలనుంచి వచ్చిన రాయబారులకు చీనిచీనాంబరములనిచ్చీ, జలతారు శాలువలతోనూ సత్కరించాడు. మంత్రులకు సైతం అనేక గ్రామాలను బహూకరించాడు. ఇవన్ని, ముగించుకుని తరువాత తన దేహపుబాద భరించలేనంతగా పెరిగిపోగా ఎంతో బాధతో అరణ్యానికి వెళ్ళటానికి ఉద్యుక్తుడైనాడు.

ప్రజాభిమానాన్ని చూరగొని, వారికి తలలో నాలికై, కన్నబిడ్డల్లా ప్రేమతో తమను పాలించిన ఆ సోమకాంతమహారాజును విడిచివుండలేక హాహాకారాలతో ప్రజలంతా అతనిని అనుసరించారు. తమ పనులన్నీ విడిచి ప్రజలూ, ఆయనను అనుసరించడంకోసం మంత్రులు, రాణులూ, కుమారుడైన హేమక౦ఠుడూ ఆతని వెనకే పరుగెత్తారు. అలా రెండు క్రోసులదూరం నడిచాక రాజు అలసి అక్కడ ఒక శీతలోద్యానవనంలో కూర్చుని ప్రజలతో యిలా అన్నాడు :

సోమకాంతుడు:

“ఓ నా ప్రియప్రజలారా! రాజ్యపరిపాలన సమయంలో నావలన మీకు జరిగిన అపరాధములన్నింటినీ క్షమించమని అంజలిఒగ్గి ప్రార్థిస్తున్నాను. నాకుమారుడైన హేమక౦ఠునియెడల కూడా దయతో వ్యవహరించండి! నాపట్ల మీరు ఎలాంటి స్నేహభావాన్నీ ఆప్యాయతనూ కలిగివున్నారో అలాగే హేమక౦ఠునిపట్ల కూడా ఆదరం కలిగివుండండి. మీరందరూ రాజధానికి తిరిగివెళ్ళి అతని పరిపాలనలో సుఖవంతులై ఉందురుగాక! శాంతస్వస్థచిత్తముతో నాకు అరణ్యానికి వెళ్లేందుకు అనుమతినివ్వండి! మీరంతా పురమునకు మరలివెళ్ళాక నేను ప్రశాంతచిత్తంతో అడవికి వెడతాను. కనుక మీరు నాయందు దయయుంచి ఈ ఉపకారము చేయండి. ఆహా! జన్మాంతరీయమైన పాపంవల్లనేకదా! మీ అందరితోనూ రాజ్యంతోనూ ఈ వియోగం సంభవించింది, రోగాభూయిష్టమై అసహ్యాన్ని కల్గించే దుర్భరమైన ఈ కుష్టువ్యాధిగ్రస్తుణ్ణైన నేనెలాగ పరిపాలించగలను? ఎవరికైనా తమ దేహప్రారబ్ధం అనుభవించక తప్పదుకదా!” అన్నాడు. ఆ రాజుయొక్క వియోగాన్ని సహింపలేని కొందరు ప్రజలు ధైర్యం తెచ్చుకుని

ప్రజలు:

“ఓ మహారాజా! మమ్మల్ని పోషించటంచేతా, పాలించటంచేతా, రక్షి౦చుటచేతా నీవు మాకు తండ్రివైనావు! కన్నబిడ్డల్లా వాత్యల్యంతో చూసుకున్న నిన్ను మేమెలా విడువగలము? చంద్రుడులేని ఆకాశంలా, నీవులేని రాజ్యం శోభించదు! గనక మేమూ నిన్ను అనుసరించి వచ్చి నీతోపాటే కొన్ని పుణ్యతీర్థములనూ సేవించుకుంటాము. దైవకృపవల్లా, పుణ్యతీర్థ సంసేవనంవల్ల నీకు శరీర స్వస్థత చిక్కితే తిరిగి మనమంతా రాజధానిని చేరుకుందాము” అన్నారు.

సోమకాంతుడు:

“ఓ ప్రజలారా! మీరిలా మారుపలకటం భావ్యంకాదు! ఇది మీకు తగదు!” అంటూ మూడుసార్లు పలికి వారించిన సోమకాంతుడితో పుత్రుడైన హేమక౦ఠుడిలా అంటున్నాడు.

హేమక౦ఠుడు:

“ఓ తండ్రీ! నీవులేని నాకు ఈ రాజ్యభోగములమీదగాని జీవితేచ్ఛగాని ఎంతమాత్రమూ లేదు! ఇప్పటివరకు ఎన్నడూ నిన్ను వీడి ఉండలేదు. ఇప్పుడుమటుకు ఎలా ఉండగలను?” అన్న హేమక౦ఠుడితో రాజు

సోమకాంతుడు:

“కుమారా! నీవిలా అంటావనే నీకు మొదటగా నీతిశాస్త్రవచనాలనూ, ధర్మాలనూ ఉపదేశించాను. వాటిని వృధాకానీయకు! పూర్వం పరశురాముడు తండ్రియాజ్ఞ ననుసరించి మాతృవధ చేశాడు! అలాగే శ్రీరాముడు పితృవాక్య పరిపాలనకై రాజ్యంవీడి అరణ్యములకు వెళ్ళాడు. ఇక లక్ష్మణుడు సరేసరి! భాతృ ఆజ్ఞానుసారం కారణం అడగకుండానే సీతాదేవిని అరణ్యాలలో విడిచాడు! కనుక ఓ కుమారా! నీవు నా అభీష్టం మేరకు నగరానికి వెళ్ళి ఈ ముగ్గురు మంత్రుల సహాయంతో ధర్మబద్ధంగా, ప్రజారంజకమైన పరిపాలన సాగించు! నేను అరణ్యాలకు వెళ్ళినా నీవు నా అంతరాత్మ స్వరూపుడవే కనక నా హృదయంలోనే నాతో కూడా వుంటావు! దైవానుగ్రహంచేత తిరిగి నా శరీరం ఆరోగ్యవంతమై, కాంతివంతమైతే – తిరిగి నేను నగరానికి వస్తాను. కనుక ఇప్పుడు నీవు నన్ను అనుసరించి రావటం అధర్మం! నీవు వెంటనే శీఘ్రముగా పట్టణానికి వెళ్ళు!” అని చెప్పగా రాజాజ్ఞను శిరసావహించిన పురజనులూ, మంత్రులూ హేమక౦ఠునితోసహా కలిసి రాజ్యమునకు వెళ్ళటానికి సిద్ధమైనారు.

Chapter 4 complete