గణేశ పురాణము - ఉపాసనా ఖండము
43 – త్రిపురవిజయం
అప్పుడు బ్రహ్మ పరాశరాత్మజుడైన వ్యాసమునీంద్రునితో యిలా యుద్దవర్ణనం చేయసాగాడు.
బ్రహ్మ:
“త్రిపురుడు నేరుగా శంకరుడితో తలపడ్డాడు. ప్రచండునితో షణ్ముఖుడు పోరసాగాడు. చండుని శివవాహనమైన నందీశ్వరుడెదుర్కున్నాడు. పుష్పదంతుడు భీమకాయునితోనూ, భ్రుశండుడు కాలకూటుని తోనూ, వీరభద్రునితో వజ్రదంష్ట్రుడును, ఇంద్రుడు దైత్యామాత్యునితోనూ, సకల అస్త్రాలను ఎరిగియున్న బృహస్పతి శుక్రాచార్యునితోనూ, యిలా అనేకమంది దేవతాగణాలు రాక్షసులతో ద్వంద్వయుద్దానికి తలపడ్డారు. రధికులు రధికులతోనూ, గజారోహకులు గజారోహకులతోనూ, అశ్వికులు అశ్వారోహకులతోనూ, పదాతులు పదాతిదళములతోనూ, ఘోరంగా ఆ రణరంగంలో తలపడ్డారు. కొందరు అస్త్రశస్త్రాలను విడిచిపెట్టి మల్లయుద్ధానికి దిగారు. ప్రచండుని తొమ్మిది బాణాలనూ దేవసేనాపతియైన కుమారస్వామి మార్గమధ్యంలోనే త్రుంచివేసాడు. అప్పుడు కుమారుడు తన ఐదు వాడిశరాలతో ప్రచండుని మూర్చిల్లచేయగా, అతడు నేలకొరిగాడు. భీమకాయుని బాణాలను పుష్పదంతుడు తృంచివైచి, అతనిని తిరిగి తన మూడు వాడి బాణాలతో నేలకూల్చాడు. అలాగే భ్రుశండుని చేతిలో కాలకూటుడు పడగొట్టబడ్డాడు. వీరభద్రుడు, వజ్రదంష్ట్రుడు పరస్పరం బాణాలను ఒకరిపై ఒకరు కురిపించుకున్నారు.
ఇంద్రుని వజ్రాయుధం వ్రేటుకి దైత్యమాత్యుడు మరణించాడు. జయవంతుడు విజ్రుoభించి దైత్యకుమారుని తన బాణాలతో వధించాడు. అతడు వెంటనే నెత్తురుక్రక్కుతూ మరణించాడు. ఇలా అనేకవిధాలుగా రాక్షససైన్యమంతా వధింపబడటం చూసిన ఆ అసురరాజు క్రోధోద్రిక్తుడై నేరుగా శంకరునితోనే యుద్ధం చేయమొదలుపెట్టాడు. ముందుగా శస్త్రాలతోనూ, ఆ తరువాత అస్త్రాలతోనూ, ఆ ఉభయులూ భీకరమైన యుద్ధం ఆరంభించారు. శివునిపై ఆ అసురుడు వారణాస్త్రం ప్రయోగించి, వర్ష వృష్టిని కురిపించాడు. తన దేవతా సైన్యమంతా అలా వర్షంతో పీడింపబడటం గమనించిన శంకరుడు వెంటనే వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ మేఘాలను చెల్లాచెదురు చేసేశాడు.
ఆ ఝూoఝూమారుతానికి తెగిపడ్డ వీరుల శిరస్సులు అన్నీ వైపులా ఎగురకొట్టబడ్డాయి! రాధాలతో డీకొట్టబడిన రధాలు, ఏనుగులతో ఏనుగులు, గుఱ్ఱములతో గుఱ్ఱాలు ఢీకొని, చూర్ణం కాసాగాయి! ఆ మహావాయువుచేత వృక్షాలు, లతలూ పెకిలించబడి రణరంగాన్నంతటినీ కప్పివేశాయి.
ఇలా రాక్షసనేనను పీడిస్తున్న వాయవ్యాస్త్రాన్ని పన్నగాస్త్రం వైచి త్రిపురుడు మరలగొట్టాడు. చెవిదాకా వింటినారిని సారించి, మంత్రించిన ఆగ్నేయాస్త్రాన్ని దేవతాసైన్యాలపై ప్రయోగించాడు! ఏదో అగ్ని ప్రళయమే సంభవించిందేమోనన్న భయంతో అందరూ కంపిస్తూండగా, ఆ మండుతున్న జ్వాలలలో౦చి ఒక భీకరాకారుడు ఉద్భవించి, ఘోరంగా విజృంభించి దేవతాసైన్యాల నన్నింటినీ కబళించసాగాడు. ఆ భయానికి శివసేనలన్నీ శివుని వెనుకదాగి ‘రక్ష! రక్ష!’ అంటూ మొరలుపెట్టారు. శివుడు తన సైన్యాన్ని భయపడవలదంటూ ఆశ్వాసించి, పర్జన్యాస్త్రం ప్రయోగించి ఆ పెనుభూతాన్ని వెనక్కి మరల్చాడు! ఒక బాణంతో ఆ అఘోర పురుషుని పడవేయగా, అతడు వెంటనే లేచి శివుని సైనికులను ఆరగించసాగాడు. ప్రమధగణాలన్నీ భయభ్రాంతులై నలుదెసలకూ పారిపోగా శివుడు నిస్సహాయుడై పర్వతగుహలో తలదాచుకోవాల్సి వచ్చింది.
త్రిపుర విజయం
దేవసేనదిపతియైన కుమారస్వామి మొదలైన వారందరూ శివుని అనుసరించారు. ఒంటరిగావున్న పార్వతిని చెరపట్టదలచి, మేరుపర్వతానికి దండెత్తినట్లు వెళ్ళాడు త్రిపురుడు. అతన్ని అల్లంతదూరాన్నే గమనించిన గిరినందన తనదండ్రియైన హిమవంతుని చెంత గుహలో తలదాచుకున్నది!
అప్పుడామెను ఎలాగైనా పట్టుకోవాలని తీవ్రంగా యత్నించి విఫలుడై, అంతటా ఆ పార్వతిని అన్వేషిస్తూ వస్తున్నా ఆ త్రిపురునికి మార్గమధ్యంలో కోటిసూర్య ప్రకాశమానమై, అన్నీ అలంకారాలతోనూ శోభిస్తున్న ‘చింతామణీగణేశ విగ్రహాన్ని’ చూడడం జరిగింది! ఆ విగ్రహాన్ని సంగ్రహించి తన స్వస్థానానికి చేరుకున్నాడు. వందిమాగధులు జయజయధ్వానాలు చేస్తుండగా, త్రిపురుడు పురప్రవేశం చేసి అక్కడినుండి పాతాళంలో తన విజయాన్ని చాటుకోదలిచి వెళ్ళసాగాడు. ఇంతలో అకస్మాత్తుగా అతని చేతిలోని వైనాయకమూర్తి అంతర్ధానమైంది!
త్రిపురుడు ఈ హఠాత్పరిణామానికి మ్రాన్పడి, ఇదొక అపశకునంగా భావించి, మూర్తియోక్క వియోగానికి చింతిస్తూ, తన నగరాన్ని చేరుకున్నాడు.
Chapter 43 complete
