గణేశ పురాణము - ఉపాసనా ఖండము
91 – శేషోపాఖ్యానము – 2
వ్యాసమహర్షి:
“దేవా! గణేశభగవానుని కథామృతం ఎంతవిన్నా అమృతంవలే తృప్తి కలుగుటలేదు! ఇంకనూ వినవలెనన్న ఆసక్తి కలుగుతున్నది. ప్రభూ! ఇంకనూ గణేశకథామృతమును ప్రసాదించు!”
బ్రహ్మ:
“ఒకానొకప్పుడు పూర్వకాలము ప్రళయం సంభవించింది! అప్పుడు గజాననుడు నాకు కర్తవ్యం జ్ఞాపకంచేస్తూ “ఓ బ్రహ్మదేవుడా! నానావిధమైన సమస్త సృష్టినీ నా ఆజ్ఞతో నీవు వెంటనే ప్రారంభించి యథాప్రకారం సమస్తమూ సృష్టించు!” అనగా ఆ ప్రకారమే నేను సంకల్పంచేసి ఏడుగురు మహర్షులను మానసపుత్రులుగా సృష్టించితిని. వారిపేర్లు చెబుతున్నాను.
(1) కశ్యపుడు (2) గౌతముడు (3) జమదగ్ని (4) వశిష్టమహర్షి (5) భరద్వాజుడు (6) అత్రిమహర్షి (7) విశ్వామిత్రుడు
ఈ ఏడుగురినీ సర్వవిద్యావిశారదులైన సప్తఋషులుగా మనసా కల్పించాను. వారందరూ నాకు ప్రణమిల్లి
“బ్రహ్మాన్! ఆజ్ఞాపించు! మేమేం చేయాలో! ఆ విధంగా చేస్తాము!” అన్నారు. వారందరిలోకి విశేష బుద్ధిమంతుడైన కశ్యపుని ఆజ్ఞాపించగా “నా సమస్త సృష్టికార్యములూ నేను చెప్పిన విధంగా ప్రారంభించుము!” అనగా “అలాగే చేసెదను” అని నాతోచేప్పి వనములకేగి ఘోరతపస్సు చేశాడు. అలా దివ్యసహస్రవర్షముల కాలం ఏకాక్షర గణపతి మహామంత్రమును తీవ్రనిష్టతో జపించగా పరమేశ్వరుడగు గజాననుడు సాక్షాత్కరించాడు.
చతుర్భుజుడు, పద్మసుందరనేత్రుడు మహోజ్వల కిరీటధారి, పాశాంకుశములను ధరించి, ఏకదంతమును, చేతిలో అక్షమాలను ధరించి, కంకణకేయురాది సువర్ణ మణిరత్నములతో విరాజిల్లే ఆభరణములతో, సర్పము చుట్టిన ఉదారముతో, కోటిసూర్యుల తేజస్సుతో బ్రహ్మాండమును ప్రజ్వలింపచేస్తూ, అందమైన తొండముతో సుందరముఖుడై సాక్షాత్కరించాడు. ఆ విధంగా కశ్యపమహాముని ఎదుట ప్రత్యక్షమైన గజాననుడు చిరుగంటల సుందరశబ్దంతో, అందేలా సుందర రవళితో నాట్యంచేస్తూ తన ముద్దుపాదముల ధ్వనితో ఆనందతాండవం చేయగా చూసి, కశ్యప మహర్షి ఆనందం భరించరాక నిర్భరహృదయంతో పులకించాడు. భక్తివినమ్రుడై నానామంగళవస్తువులను తెచ్చి పూజించాడు. తనముందు సాక్షాత్కరించిన ప్రసన్నుడైన గజాననుని అంజలి ఘటించి యిలా ప్రార్థించాడు.
కశ్యపుడు:
“ధన్యుడు నాతండ్రి! ధన్యురాలు నా తల్లి! నీదయతో యింతటి సుందరరూపాన్ని దర్శనమిచ్చావు! నా అదృష్టమేమని వర్ణించను? ఆహా! ఈ భూమి చరితార్థురాలు! ధన్యురాలు! భూమిపై తరు, వృక్ష, ఫలములు సార్థకవoతములు! ఆహా! నేడుకదా ఏకాక్షరగణపతి మంత్రముతో సిద్ధించిన ప్రత్యక్షంతో సర్వేశ్వరుడైన గణపతి దర్శనంతో ధన్యుడనైతిని! పరమాత్మావతారుడైన శ్రీ గణేశభగవానుడు ఎదుట సాక్షాత్కారించగా సాక్షాత్తు ఆ చతుర్వేదములే వాక్కు పెగలక మూగపోగా ఇక నేనా? ఆహా! మనస్సుకు అగోచరుడు, తర్కంచేత అందనివాడు సాక్షాత్పరమేశ్వరుడైన గణేశుడు నాముందు స్వయంగా సాక్షాత్కరించి ఈశ్వర, విష్ణు ప్రభృతులైన దేవతలను, సృష్టికర్తను అనుగ్రహించినాడు. పాతాళం ఆదిగా, ఏడు అదోలోకములు పైని ఏడు ఊర్ధ్వలోకములు కలిసి చతుర్దశ భువనాలూ ప్రళయంచెందినా సనాతనుడూ, శాశ్వతుడైన పరమాత్మ్తుడైన గణేశుడు ఈనాడు నాకు దర్శనమిచ్చినాడు!
ఎవరు నిర్గుణుడో, గురువువలే శరణుపొందతగిన పరమగురువో ఎవరు పరబ్రహ్మ స్వరూపియో అట్టి లోకగురువు భగవంతుడైన గణేశుడు ఈనాడుకదా! నాకు దర్శనమిచ్చినాడు!”
కశ్యపుడు:
ఈవిధంగా అమృతమును కురిసే వాక్కులతో ప్రసన్నుడైన గజాననుడు, ప్రణమిల్లిన కశ్యపమహర్షియొక్క స్తోత్రముతో ఆనందించి ఈవిధంగా అనుగ్రహించాడు.
గణేశుడు:
“నీయొక్క పరమప్రేమకూ గాఢమైన భక్తికీ మిక్కిలి సంతోషించితిని! ఓ మునీశ్వరా! మీవేమి వరం కోరుకున్నా అది నేను మనోభీష్ట ప్రకారమే అనుగ్రహిస్తాను! నీ సంకల్పము తప్పక నెరవేర్చెదను! వరము కోరుకొనుము.
కశ్యపుడు:
“ఓ ప్రభూ! గణేశదేవా! సమస్త సృష్టినీ నానావిధ రూపములతో యధాప్రకారం సృష్టించే శక్తిని నాకనుగ్రహించు! అంతేకాదు నీపాదపద్మములయందు అచంచల భక్తివిశ్వాసములను, ఎన్నడూ నీ పాదములను మరువకుండు జ్ఞప్తినీప్రసాదించు. నేను ఎప్పుడెప్పుడు భక్తితో నీ దర్శనంకోరి ప్రార్థిస్తానో అప్పుడు నీవు తప్పక నాకు అనుగ్రహించవలెను. అంతేకాదు! సాక్షాత్తూ నీవంటి సత్పుత్రునే కశ్యపనందనునిగా నాకనుగ్రహించు!” అంటూ కోరగా
గణేశుడు:
“ఓ మహామునీ! నీవు కోరిన వరాన్ని సంతోషంతో అనుగ్రహిస్తున్నాను! నాయందు అచంచలమైన మరుపులేని భక్తినీ, నీకెపుడెపుడు అవసరములు సంకటములు కలిగితే అప్పుడే నీకు సన్నిధిలో ప్రత్యక్షం అవగాలను. నా అనుగ్రహంతో ప్రసాదించిన సిద్ధివల్ల చిత్రవిచిత్రములైన సృష్టి చేయగలవు. ఇదే నా ఆశీస్సులు!
కశ్యపుడు:
ఈ విధంగా గణపతిదేవుడు కశ్యపమహామునికి వరమిచ్చి మెరపు మెఱసినట్లు అక్కడే మాయమైనాడు. కశ్యపమహాముని పరమానంద హృదయుడై తన స్వస్థానమునకు వెళ్ళెను.
ఇలావుండగా ఇంకొకసారి అకస్మాత్తుగా కశ్యపునకు శరీరంలో పీడ సంభవించింది. కొంచెంకూడా శరీరాన్ని కదపలేని ఆశక్తుడై గృహంలోనే కూలబడిపోయాడు. తాను చేయవలసిన నిత్య నైమిత్తికములైన వేదకర్మలు, కామ్యకర్మలు, సమస్త కర్మలూ చేయలేక ఆశక్తుడై భయకంపితుడై తన పధ్నాలుగు భార్యలైన (1)దితి (2)అదితి (3)వినత (4)కద్రువ మొదలైన 14గురు భార్యలూ భర్తయొక్క దురవస్థను చూసి దుఃఖములో కశ్యపుని వద్దకు వచ్చి నిలిచారు.
అప్పుడు కశ్యపుడు వారలతో ఇష్టసుఖములను అనుభవించి వారి సంకల్పములను తీర్చగా వారు గర్భములను ధరించి సకాలములో సంతానములు కనిరి! అట్లు వారు కన్న సంతానమే,
అదితికి దేవతలు, గంధర్వులూ,
దితికి దైత్యులు, దానవులూ
అలానే క్రమంగా గంధర్వ, యక్ష, రాక్షస, కిన్నర, సిద్ధ, చారణ, కింపురుషగణాలు సృష్టించబడ్డారు. పృధివి, పర్వతములు, వృక్షములు, సముద్రములు, నదులు, లతలు, ఓషదులు, గామ్య, అరణ్య, పశువులు, సమస్త ధాతువులు, రత్నములు, ముత్యములు, సర్పములు, పక్షిగణములు, క్రిమికీటకాది, పిపీలికాది జీవగణము సమస్తమూ, ఈ చరాచర సృష్టి అంతా జన్మించింది.
ఈ విధంగా కశ్యపుడు నానావిధ రూపములతో వర్ధిల్లిన సమస్త సృష్టినీ చూచి ఆనందించి విధివత్తుగా వారికి మంత్రోపదేశాన్ని సిద్ధ – సాధ్య, ఋణ – ధన అర్వణములు పరీక్షించి వారివారి అర్హతల ప్రకారం కొందరికి షోడశాక్షరీ మంత్రమును, మరికొందరకు షడక్షరీ మంత్రమును, ఇంకొందరకు ద్వాదశాక్షరీ యిలాక్రమంగా యధార్హము అధికార అర్హతలనుబట్టి వారివారికి మంత్రములను ఉపదేశించాడు.
అలా ఉపదేశించిన కశ్యపమహాముని వారితో “పుత్రులార! నేనిచ్చిన ఈ మంత్రములను శ్రద్ధాభక్తులతో జపించుడు! మీకు అఖిలాధారుడగు పరమాత్మయైన గజాననుడు సాక్షాత్కరించగలడు!” అని వారిని ఆజ్ఞాపించాడు. ఆప్రకారమే వారందరూ తమతమ ఉపదేశములనుబట్టి వారికిచ్చిన మంత్రములను అనన్యభక్తితో జపించారు. అలా వేయి సంవత్సరాలు గడచినవి.
అంతట వారికి అనుగ్రహమూర్తియైన గజాననుడు సాక్షాత్కరించి వారందరికీ ప్రత్యక్షముగా ఎవరెవరు తనను ఏయే ధ్యాన్మూర్తిరూపంలో భావించి ధ్యానించారో ఏ మంత్రపురస్సరంగా జపించారో, సరిగ్గా అదే ప్రకారంగా వివిధ గణపతుల రూపంలో వారందరికీనానారూపములతో సాక్షాత్కరించి అనుగ్రహించాడు.
కొందరిముందర రక్తవర్ణముతో షడ్భుజములతో ప్రత్యక్షముకాగా కొందరికి శశివర్ణముతో చతుర్భుజుడై విఘ్నహరుడుగా ప్రకాశించాడు. మరికొందరిముందు నీలమేఘచాయతో ఎనిమిది మహాభుజములు దివ్యాయుధములూ ధరించి సాక్షాత్కరించాగా మరికొందరు సహస్రనేత్రములతో సహస్రసూర్యతేజస్సును మించిన ప్రకాశంతోనూ, మరికొందరికి బాలగణపతిగా శిశురూపంలో, ఇంకొందరు యువకునిగా యవ్వనరూపంలోనూ, మరికొందరకు వృద్ధుడై జ్ఞానస్వరూపునిగానూ, మరికొందరికి పన్నెండు భుజములు కలిగి, ధూమ్రవర్ణంతో బ్రహ్మతేజస్సుతో ప్రకాశించాడు. ఇంకొందరి ముందర పద్దెనిమిది భుజాలలో అష్టాదశ ఆయుధాలు ధరించి కోటిసూర్య సమప్రభతో వేగాడు. మరికొందరికి సింహ వాహనారూడుడై అనేక గజవాక్త్రములతో మాహాకాయుడై తెజోరూపిగా దర్శనమిస్తే, ఇంకొందరికి మూసికవాహనుడై అనేక శిరస్సులతో సాక్షాత్కరించాడు.
ఈ విధంగా వారందరికీ నానావిధ రూపములలో అనేకదా వారివారి సంకల్పం ప్రకారం మంత్రస్వరూప అనుసారంగా విధివత్తుగా సాక్షాత్కరించిన గణపతిదేవునికి భక్తితో గద్గదకంఠులై మిక్కిలి ప్రేమతో యిలా స్తుతించారు.
సర్వులూ:
“ఓ నిర్గుణ పరమాత్మ! అనంతశక్తి స్వరూపుడా! అనేక జీవ ఆత్మస్వరూపుడా! అప్రమేయ గుణస్వరూపుడా! నీకివే మా నమోవాకములు! అనంతమూ నిర్గునమూ అపరిమితమూ అయి భేదరహితమైన అనాద్యంతమౌ నీ పరబ్రహ్మ స్వరూపమునకు, సదా గణేశదేవునకు నమోనమో భాజింతుము గాక!”
“ఎవరినుంచి ఈ సమస్త విశ్వమూ సమస్త చరాచరా జీవస్వరూపములు సృష్టికర్తయగు పద్మసంభవుడూ, విశ్వదేవతలూ, అష్టదిక్పాలకులూ ఉద్భవించారో అట్టి విశ్వరక్షకుడు సమస్త సృష్టికర్తయైన నీకిదే నమోవాకములు”
“సమస్త సృష్టిరూపమగు ఇంద్రాది సర్వదేవతలు, దైత్యసంఘములు మనుష్య కీటక పశుగణములు ఇలా సమస్త రూపములూ ధరించిన గణేశభగవానుడా! నీకిదే నమస్కారము”
“ఓ అంతరాత్మస్వరూపుడా! అంతర్యామీ! ఎవరినుండి ఈ అగ్నిహోత్రము, భూమీ, జలమూ, సప్తసముద్రాలూ, చంద్రాది గ్రహనక్షత్రములు, వాయువూ, ఆకాశమూ, స్వర్గమూ, సమస్త స్థావర జంగమాత్మకమైన వృక్షసంఘములూ ఈ సృష్టిస్వరూపం ధరించి ఆవిర్భవించాయో అట్టి భగవంతుడైన గణేశునకు నమోనమో నమస్కారం!”
“ఎవరివల్ల మాకీ బుద్ధి, అజ్ఞానమును నశింపచేసే ఈ జ్ఞానమూ మోక్షమును కోరవలేననే వివేకమూ కల్గినవో అట్టి ఆత్మప్రచోదకునకు పరబ్రహ్మమూర్తి విఘ్నవినాశకునకు గణేశునకు సమస్త కార్యసిద్ధి ప్రదాతయైన గణపతికి నమస్కారం! హెచ్చుగా మా నమస్కారం!”
“భక్తులకు సంపదలను, సంతోషములను, కోరిన కోరికలను తీర్చే వరప్రదునకు, విఘ్ననివారణకు, సమస్త కార్యసిద్దీ అనుగ్రహించే దేవదేవేశా! గణేశా! నీకిదే శరణు శరణు!”
“ఎవరినుండి పుత్రకళత్ర సంపద, భోగము, సమస్త సౌఖ్యములు, కోరిన కోరికలన్నీ అనుగ్రహించబడుతున్నాయో అట్టి ఏకమూర్తియగు అనేక స్వరూపుడు, భక్తివిద్యాప్రదునకు సర్వేశ్వరునకు ఇవే మా నమస్సులు!”
“మాలోని శోకమోహములు, కోరికలు ఎక్కడినుండి కలుగుతున్నాయో వాటిని నివారించే జ్ఞానము, ముముక్షుత్వము, వివేకమును తిరిగి మాకు ఎవరు ప్రసాదిసున్నారో అట్టి గణేశదేవునకు నమోనమో నమస్కారము!”
“ఏ భగవంతుని స్తుతించలేక వేదములే మాటపెగలక, మూగ పోయినవో మనస్సుకు సహితం అందని పరబ్రహ్మ రూపియగు బ్రహ్మతత్వముగా “నేతినేతి” అని వర్ణించలేకపోయాయో, చిత్, సత్, ఆనంద స్వరూపమునకు, పరబ్రహ్మ స్వరూపునకు, సదా గణేశస్వరూపునకు నమస్కారము! నమోనమోనమః!”
ఈ విధంగా సమస్త గణములూ సమస్త స్వరూపుడగు గణేశభగవానునకు నానా రూపములైన వాక్కులతో స్తుతించి, భక్తిభావంతో పులకించి తరించారు!
Chapter 91 complete
