వామన మహా పురాణము
అధ్యాయము 3
పులస్త్యుడు
1 - తతః కరతలే రుద్రః కపాలే దారుణే స్థితే ।
సంతాప మగమద్ బ్రహ్మంశ్చింతయా వ్యాకులేంద్రియః
2 - తతః సమాగతా రౌద్రా నీలంజనచయప్రభా ।
సంరక్తమూర్ధజా భీమా బ్రహ్మహత్యా హరంతికమ్ ॥
3 - తా మాగతాం హరో ద్వష్ట్వా పప్రచ్చ వికరాలినీమ్ ।
కా-సి త్వ మా గతా రౌద్రే కేనాప్యర్దేన తద్వద ॥
4 - కపాలిన మదోవాచ బ్రహ్మహత్యా సుదారుణా ।
బ్రహ్మవద్యా-స్మి సంప్రాప్తా మాం ప్రతీచ్ఛ త్రిలోచన ॥
5 - ఇత్యేవ ముక్త్వా వచనం బ్రహ్మహత్యా నివేశ హ ।
త్రిశూలపాణినం రుద్రం సంప్రతాపిత విగ్రహమ్ ॥
పులస్త్యుడు
ఓ నారదా ! తన చేతి కంటుకొనిన బ్రహ్మకపాలమట్లే యుండుట చూచి రుద్రుడెంతో కలవరపాటందెను. అప్పుడు కాటుకకొండ లాగ భయంకరాకారంతో ఎర్రటి వెండ్రుకలతో రూపుదాల్చిన బ్రహ్మహత్య, రుద్రుని సమీపించెను. కరాళాకృతితో వచ్చిన ఆమెను చూచి శంకరుడో క్రూరురాలా! నీవెవ్వతెవు? యిచ్చటి కేలవచ్చితి వనెను. అపుడా భీకరాంగన త్రిలోచనా! నేను బ్రహ్మహత్యను. నన్ను స్వీకరించు మనుచు శివుని దేహములో ప్రవేశించెను. రుద్రుడందుల కెంతయోపరితాపము పొందెను. ఆయన దేహమంతయు కంపించెను.
6 - బ్రహ్మహత్యాభిభూతస్చ శర్వో బదరికాశ్రమమ్ ।
ఆగచ్చన్న దదర్శాథ నరనారాయణా వృషీ ॥
7 - అద్వష్ట్వా దర్మతనయౌ చింతాశోకసమన్వితః ।
జగామ యమునాం స్నాతుం సా పి శుష్కజలా భవత్ ॥
8 - కాళిందీం శుష్కసలిలాం నిరీక్ష్య వృష కేతనః ।
ప్లక్షజాం స్నాతు మగమ దంతర్దానం చ శా గతా ॥
9 - తతో మ పుష్కరారణ్యం మాగధారణ్యమేవచ ।
సై౦ధవారణ్యమేవాసౌ గత్వా స్నాతో యథేచ్చయా ॥
10 - తథైవ నైమిషారణ్యం ధర్మారణ్యం తథేశ్వరః ।
స్నాతో నైవ చ సౌ రౌద్రా బ్రహ్మహత్యా వ్యముంచత ।
11 - సరిత్సు తీర్థేషు తథాశ్రమేషు పుణ్యేషు దేవాయతనేషు శర్వః ।
సమాయుతో యోగయుతో-పి పాపాన్నావాప మోక్షం జలదద్వజో-సౌ ॥
12 - తతో జగామ నిర్విణ్ణః శంకరః కురుజాంగలమ్ ।
తత్ర గత్వా దదర్శాథ చక్రపాణిం ఖగద్వజమ్ ॥
13 - తం దృష్ట్వా పుండరీకాక్షం శంఖచక్రగదాదరం ।
క్రుతాంజలిపుటో భూత్వా హరః స్తోత్ర ముదైరయత్ ॥
బ్రహ్మహత్యసోకిన శంకరుడు వెంటనే బదరికాశ్రమమునకు పరుగిడెను. అయితే అక్కడ నరనారాయణు లాయనకు కనపడలేదు. ఆ ధర్మపుత్రులు కనుపించక పోవుటతో చింతాశోకవ్యాకులితుడై శంకరుడు యమునలో స్నానము చేయబోగా నానది ఎండి పోవుచుండెను. కాళిందిలో నీరు లేకుండుటతో ప్లక్షజానదిలో మునుగపోగా నానదియు ఎండి యుండెను. అక్కడ నుండి పుష్కరారణ్యం మగధారణ్యం సైంధవారణ్యం వెళ్ళి అక్కడి జలాల్లో యథేచ్చగా స్నానం చేశాడు. తర్వాత ధర్మారణ్య నైమిశారణ్య తీర్థాల్లో మునిగిన శంకరుని బ్రహ్మ హత్య వదలలేదు. అంతటనాజీమూత కేతువు శివుడెన్నో తీర్థాల్లో నదీ నదాల్లో మునిగి ఎన్నియో క్షేత్రాల్లో ఆశ్రమాల్లో దేవాయతనాల్లో పూజలు, యోగాబ్యాసాలు చేశాడు. ఎన్ని చేసినా బ్రహ్మహత్య వదలకుండుటతో నిర్విన్నుడై కురుజాంగల భూమి చేరి అందున్న గరుడ ధ్వజుని శంఖ చక్ర గదాధరుడైన పుండరీకాక్షుని దర్శించి అంజలి ఘటించి ఈ విధంగా స్తోత్రం చేశాడు.
శంకరుడు
14 - సమస్తే దేవతానాథ నమస్తే గరుడధ్వజ ।
శంఖచక్ర గదాపాణే వాసుదేవ నమో-స్తుతే ॥
15 - నమస్తే నిర్గుణానంత అప్రతర్కాయ వేధసే ।
జ్ఞానాజ్ఞాననిరాలంబ సర్వలంబ నమోస్తుతే ॥
16 - రజోయుక్త నమస్తే-స్తు బ్రహ్మమూర్తే సనాతన ।
త్వయా సర్వమిదం నాథ జగత్సృష్టం చరాచరమ్ ॥
17 - సత్వాదిష్టితలోకేశ విష్ణుమూర్తే అధోక్షజా ।
ప్రజాపాల మహాబాహో జనార్ధన నమోస్తుతే ॥
18 - తమోమూర్తే అహం హ్యేష త్వదంశ క్రోదసంభవః ।
గుణాభియుక్త దేవేశ సర్వవ్యాపిన్ నమో-స్తుతే ॥
19 - భూరియం త్వం జగన్నాథ జలాంబరహుతాశనః ।
వాయుర్భుద్దిర్మనశ్చాపి శర్వరీ త్వం నమో-స్తుతే ॥
20 - ధర్మోయజ్ఞ స్తవః సత్య మహింసా శౌచమార్జవమ్ ।
క్షమా దానం దయా లక్ష్మీ ర్ర్భహ్మచర్యంత్వ మీశ్వర
21 - త్వం సాంగాశ్చతులో వేదాస్త్వం వేద్యో వేదపారగః ।
ఉపవేద భవానీశ సర్వో సిత్వం నమోస్తుతే ॥
22 - నమో నమస్తేచ్యుత చక్రపాణే నమోస్తుతే మాధవ మీనమూర్తే! ।
లోకే భావాన్ కారుణికో మతోమే త్రాయస్వమం కేశవ పాశబంధాత్ ॥
23 - మమాశుభం నాశయ విగ్రహస్థం యద్బ్రహ్మ హత్యాభిభవం బభూవ! ।
ధగ్థోస్మి నష్టోస్మ్యసమీక్ష్యకారీ పునీహి తీర్ధోసి నమోనమస్తే ॥
శంకరుడు
ఓ దేవేశ్వరా! గరుడద్వజా! నీకు నమస్కారము. శంక చక్ర గదాధరా! వాసుదేవా నీకు వందనము! నిర్గుణా! అనంతా! అప్రతర్క్యా ! సృష్టికర్తా! జ్ఞానాజ్ఞాన స్వరూపా! సర్వాదారా! నిరాధారా! నీకు నమో వాకములు! రజోగుణివైన సనాతన బ్రహ్మమూర్తి! చరచరాత్మకమైన నీ జగత్తంతయు నీ సృష్టియే. నీకు కై మోడ్పులు! సత్వగుణాశ్రయుడవై ప్రజాపాలన మొనరించు అధోక్షజా! లోకేశ్వరా! జనార్దనా! విష్ణో! మహాబాహో! నీకు వందనము. తమోమూర్తినై నీ క్రోధాంశాతో జనించినవాడను నేను. ఓ సర్వవ్యాపి! దేవేశ్వరా! నీకు ప్రణామము! ఓ జగన్నాథా! ఈ భూమి, నీరు, ఆకాశము, అగ్ని, వాయువు, బుద్ధి, మనస్సు దివారాత్రులు నీవే. నీకు సాష్టాంగపడెదను ధర్మం, యజ్ఞం తపస్సు, సత్యాహింసలు, శౌచము, ఆర్జవము, క్షమాగుణం, దానం, దయ, లక్ష్మి బ్రహ్మచర్యం అన్నియు నీవే! షడంగాలతో కూడిన నాలుగు వేదాలు నీవే! వాటిని ఎరిగిన వాడవు. వాని ద్వారా తెలియదగిన పరతత్వము నీవే! ఉపవేదాలు నీవే! సమస్తమూ నీవే! నీకు నమస్సులు. ఓ అచ్చుతా! చక్రపాణీ! మాధవా! మత్స్యమూర్తీ! నీకు నమస్కారము. లోకములో పరమకారుణికుడవైన లక్ష్మీపతి! ఈ పాపబంధాల నుండి నన్ను రక్షించుము. నా దేహగతమైన అశుభాన్ని హరించుము. బ్రహ్మహత్యా సంభవమైన ఆ జ్వాలలో నేను దగ్దమగుచున్నాను, వివేకహీనుడను.ఓ తీర్ధ స్వరూపా! నన్ని జ్వాలల నుండి కాపాడుము. పవిత్రుని గావింపుము. నీకు నమస్కారము!
పులస్త్యుడు
24 - ఇత్ధం స్తుతశ్చక్రధరః శంకరేణ మహాత్మనా ।
ప్రోవాచ భగవాన్ వాక్యం బ్రహ్మహత్యక్షయాయ హి ॥
పులస్త్యుడు
శంకరుడు చేసిన ఈ స్తోత్రమును విని ఆయన బ్రహ్మహత్యా నివారణార్ధమైన చక్రపాణి యిట్లనెను:
హరి
25 - మహేశ్వర శృణుష్వేమాం మమవాచం కలస్వనామ్ ।
బ్రహ్మహత్యాక్షయకరీం శుభదాం పుణ్యవర్దనీమ్ ॥
26 - యోసౌ ప్రాజ్ మండలే పుణ్యే మదంశప్రభవోవ్యయః ।
ప్రయాగే వసతే నిత్యం యోగశాయితి విశ్రుతః
27 - చరణాద్దక్షిణాత్తస్య వినిర్యాతా సరిద్వరా ।
విశ్రుతా వరణేత్యేవ సర్వపాపహరా శుభా ॥
28 - సవ్యాదన్యా ద్వితీయా చ అసిరిత్యేవ విశ్రుతా ।
తే ఉభేతు సరిచ్చ్రేషష్ఠే లోకపూజ్యే బభూవతుః
29 - తాభ్యాం మధ్యేతు యోదేశ స్తత్ క్షేత్రం యోగాశాయినః ।
త్త్రెలోక్యప్రవరం తీర్ధం సర్వపాపప్రమోచనం ।
న తా ద్రుశోస్తి గగనే న భూమ్యం న రసాతలే ॥
30 - తత్రాస్తి నగరీ పుణ్యా ఖ్యాతా వారణాసి శుభా ।
యస్యాంహి భోగినోపీశ ప్రయాంతి భవతో లయమ్
31 - విలాసినీనాం రాశనాస్వనేన శ్రుతిస్వనై ర్బ్రాహ్మణపుంగవానామ్ ।
శుచిస్వరత్వం గురువో నిశమ్య హాస్యా దశాసంత ముహుర్ముహుస్తాన్
32 - వ్రజత్సు యోషిత్పు చతుష్పథేషు పదాన్యలక్తారుణితాని దృష్ట్వా ।
యయో శశీ విస్మయమేవ యస్యాం కింస్విత్ ప్రయాతా స్థలపద్మినీయమ్ ॥
33 - తుంగాని యస్యాం సురమందిరాణి రుంధంతి చంద్రం రజనీముఖేషు ।
దివాపి సూర్యం పవనాప్లుతాభి ర్దీర్ఘాభిరేవం సుపతాకికాభిః
34 - బృంగశ్చయస్యాం శశికాంతభిత్తౌ ప్రలోభ్యమానాః ప్రతిభింబితేషు ।
ఆలేఖ్యయోషిద్విమలాననాబ్జే ష్వీయుర్బ్రమాన్నైవచ పుష్పకాంతరమ్
35 - పరిశ్రమశ్చాపి పరాజితేషు నరేషు సంమోహన ఖేలనేన ।
యస్యాం జలక్రీడనసంగతాసు న స్త్రీషుశంభో! గృహదీర్ఘికాసు ॥
36 - నచై వకశ్చిత్ పరమందిరాణి రుణద్ది శంభో! నహసా ఋతేక్షాన్ ।
నచాబలానాం తరసా పరాక్రమం కరోతి యస్యాం సురతంహి ముక్త్వా ॥
37 - పాశగ్రంథి ర్గజేంద్రాణాం దానచ్చేదో మదచ్యుతౌ ।
యస్యాం మానమదౌ పుంసాం కరిణాం యౌవనాగమే ॥
38 - ప్రియదోషా సదా యస్యాం కౌశికా నేతదేజనాః ।
తారాగణేకులీనత్వం గద్యేవృత్తచ్యుతి ర్విభో ॥
39 - భూతిలుబ్దా విలాసిన్యో భుజంగపరివారితాః ।
చంద్రభూషితదేహశ్చ యస్యాం త్వమివ శంకర!
40 - ఈదృశాయాం సురేశాన వారాణస్యాం మహాశ్రమే ।
వసతే భగవాంల్లోలః సర్వపాపహరో రవి
41 - దశాశ్వమేదం యత్ర్పోక్తం మడంశో యత్రకేశవః ।
తత్ర గత్వా సురశ్రే__ పాపమోక్ష మావాప్స్యసి
హరి
మహేశ్వరా! బ్రహ్మహత్యా నివారకములు కర్ణమధురములు శుభకరములునగు నా వచనములు వినుము. యిక్కడకు తూర్పుగా ప్రయాగ క్షేత్రంలో అవ్యయమగునాయంశ వల్లజన్మించిన యోగశాయి నిత్య నివాసియై యున్నాడు. అతని దక్షిణ చరణము నుండి సర్వపాపనాశిని శుభదాయిని యగు వరణానది యుద్భవించినది. వామ చరణము నుండి అసియనెడునది వెలువడినది. ఈ రెండు నదులు లోకపూజ్యములు పవిత్రములు. ఆ రెంటికీ మధ్యనున్న యోగశాయి క్షేత్రము సర్వపాపములు పోగొట్టు పవిత్ర తీర్థము. ముల్లోకములలో శ్రేష్టమైనది. స్వర్గమర్త్య పాతాళాలలో అలాంటి క్షేత్రం లేదు. ఈశ్వరా! అక్కడ పరమ పవిత్రమూ మంగళకరమునగు వారాణసీ నగరమున్నది. ఆ ప్రదేశాన భోగులు కూడ నీలో లయము పొందుదురు. అచట విలాసినీ స్త్రీల మొలనూలు ధ్వనులు విప్రశ్రేష్టుల వేద ధ్వనులతో కలిసి పవిత్రతను సంతరించుకొనును. వాని శ్రవణసుభాగత్వాన్ని పెద్దలు మందహాస వదనాలతో మాటిమాటికి విని ఆమోదింతురు. లత్తుక పారాణిపూసిన అందలి పురస్త్రీల చరణ చిహ్నాలతో నలంక్రుతాలయిన చతుష్పథాలను చూచి, చంద్రుడు స్థల పద్మినులా త్రోవ నడచిరాయని యచ్చెరువందును. ఆ నగరంలోని ఆకాశాన్నంటే దేవాయతనాలు రాత్రులందు చంద్రకాంతినీ, వాని శిఖరాలపై రెపరెపలాడు సుందర పతాకాలు పగటి యందు సూర్యరశ్మినీ నిరోదించుచుండును. అచ్చటి చంద్రకాంత శిలా భిత్తికల మీద చిత్రించబడిన స్త్రీల వదనారవిందాల ప్రతిబింబాలను చూచి తుమ్మెదలు భ్రమించి వానిని వదలి నిజమైన పుష్పముల వంకకుపోవు. వినోదక్రీడలలో పరాజితులైన వారలలో కూడ నచట అలసట గోచరించదు. తమ యిండ్ల యందలి ఈత కొలనులలో జల క్రీడలాడు స్త్రీలలో గూడ పరిశ్రాంతి ఏ మాత్రము కనిపించదు. శంభో! ఆ నగరవాసులలో, ద్యూత క్రీడల్లో తప్ప, పరగృహములనాక్రమించు వారు లేరు. అనంగ క్రీడలలో తప్ప నబలలపై పరాక్రమము చూపువారుండరు. అక్కడ ఉన్న గజరాజులకే సాధనము, మదపుటేనుగులలోనే దాన జల నిరోధము. యౌవనంలో ఉన్న మగ ఏనుగులలోనే మాన (దేహపు కొలత)ము మదము (మదజలము) కనిపించును. (ఈ నాలుగు అవలక్షణాలు అచటి పురజనులలో లేవన్న మాట) అందలి కౌశికు (గుడ్లగూబ)లే దోష (రాత్రి) ప్రియలు. ఇతర జనులు కారు. అకులీనత్వం (భూమిలో లీనముగాకుండుట) నక్షత్రాలలోనే, వృత్తచ్యుతి (శీలము-ఛందోవృత్తము లేకుండుట ) గద్యమునందే ఓ శంకరా! భూతి (ఐశ్వర్యము) లోభం గలిగిన అచటి వారాంగనలే భుజంగు (విటులు)లతో చంద్రుల(చంద్రహారములు)తో కలిసి నీ వలె విహరించుచుందురు. (శివుడు భస్మ సర్ప చంద్రాలంక్రుతుడు గదా !) ఈశానా ! ఏవంగులు విశిష్టమైన వారాణసీ పుణ్యాశ్రమంలో సర్వపాప హరుడగు లోలార్కదేవుడు విజయం చేసియున్నాడు. దశాశ్వమేధ క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన అచ్చోట ణా అంశతో కేశవుడున్నాడు. అచటకు వెళ్ళినంతనే ఓ సురశ్రేష్టా ! నీవు పాపవిముక్తుడవు కాగలవు.
42 - ఇత్యేవ ముక్తో గరుడద్వజేన వృషధ్వజస్తం ప్రణమ్య ।
జగామ వేగాద్గరుడో యథా- సౌ వారాణసీం పాపవిమోచనాయ ॥
43 - గత్వా సుపుణ్యా౦ నగరీం సుతీర్థాం ద్వష్ట్వాచ లోలం సదశాశ్వమేదమ్ ।
స్నాత్వాచ తీర్థేషువిముక్తపాపః స కేశవం ద్రష్టు ముపాజగామ ॥
44 - కేశవం శంకరో దృష్ట్వా ప్రణిపత్యేద మబ్రవీత్ ।
త్వత్ప్రసాదాత్ హృషీకేశః బ్రహ్మహత్యా క్షయంగతా ॥
45 - నేదం కపాలం దేవేశ మద్దస్తం పరిముంచతి ।
కారణం వేద్మి నచత దేతన్మే వక్తుమర్హసి ॥
గరుడధ్వజుని ఈ పలుకులు విన్నంతనే వృషద్వజుడాయనకు శిరసాప్రణామం చేసి అతిత్వరగా, తన పాప విముక్తికై వారాణసి క్షేత్రానికి వెళ్ళెను. పవిత్ర తీర్థాలతో కూడిన ఆనగరిని దర్శించి, అందలి తీర్థాలలో స్నానమాడి, దశాశ్వమేధాన్ని లోలార్క భగవానుని దర్శించి సర్వ పాపాల నుండియు విముక్తుడై శంకరుడు కేశవుని చూచుటకై తిరిగి వెళ్ళెను. కేశవునకు ప్రణామం చేసి యిట్లనెను. “హృషీకేశా! నీ దయవల్ల బ్రహ్మహత్య తొలగిపోయినది. కాని ఈ కపాలము నా యర చేతిని వదలకున్నది. ఇందులకు కారణమేమి?”
పులస్త్యుడు
46 - మహాదేవవచః శ్రుత్వా కేశవో వాక్యమబ్రవీత్ ।
విద్యతే కారణం రుద్రః తత్సర్వం కథయామితే ॥
47 - యో-సౌ మమాగ్రతో దివ్యో హ్రదః పద్మోత్పలై ర్యుతః ।
ఏష తీర్థవరః పుణ్యో దేవగంధర్వ పూజితః ॥
48 - ఏతస్మిన్ ప్రవరే తీర్థే స్నానం శంభోః సమాచర ।
స్నాతమాత్రస్య చాద్యైవ కపాలం పరిమోక్ష్యతి ॥
49 - తతః కపాలీ లోకేచ ఖ్యాతో రుద్ర భవిష్యసి ।
కపాలమోచనేత్యేవం తీర్థంచేదం భవిష్యతి ॥
50 - ఏవముక్తః సురేశేన కేశవేన మహేశ్వరః ।
కపాలమోచనే సస్నౌ వేదోక్తవిధినా మునే ॥
51 - స్నాతస్య తీర్థే త్రిపురాంతకన్య పరిచ్యుతం హస్తతలాత్ కపాలమ్ ।
నామ్నా బభూనాథ కపాలమోచనం తత్తీర్ణవర్యం భగవత్ప్రాసాదాత్ ॥
పులస్త్యుడు
మహాదేవుని మాటకు విష్ణు విట్లనెను. “ఓ రుద్రా! కపాల మోచనోపాయము చెప్పెదను వినుము. ఇదిగో నా ఎదుటనే పద్మోత్సలాలతో నిండియున్న ఈ దివ్య సరోవరం పరమ పవిత్ర తీర్థం, దివ్యగంధర్వసేవితం. దీనిలో స్నానం చేసినంతనే నీకు కపాల మోచనము కాగలదు. ఆ కారణంగా ఈ తీర్థానికి కపలమోచన క్షేత్రమనీ, నీకు కపాలి యనీ ప్రసిద్ధి కలుగుతుంది. నారదా! సురేశ్వరుడగు కేశవుడు చెప్పినట్లు మహేశ్వరుడా కపాలమోచన తీర్థంలో విద్యుక్తంగా స్నానమాచరించగా ఆయన అరచేతికంటుకొని యున్న బ్రహ్మపుర్రె యూడిపడెను. భగవత్ప్రసాదం వల్ల అది కపాల మోచనమను పేర పవిత్ర తీర్తమాయెను.
అధ్యాయము 3 complete
Summary of chapter 3 of the Vāmana Mahā Purana is as follows:
Following the tragic dissolution of Daksha's sacrifice, Mahādeva Śiva, overcome with deep grief and divine detachment, roams the sacred realms carrying the holy frame of Satī Devi until Bhagavān Vishṇu uses his divine discus to dismember the body, establishing the revered Śakti Pīṭhas across the earth. Afterwards, a profound cosmic dialogue takes place between Hari and Hara, wherein the essential non-difference and eternal identity of Bhagavān Vishṇu and Parameśvara Śiva are revealed to the devas and ṛshis. The two supreme manifestations of the Divine affirm that whoever perceives duality between Hari and Hara remains bound in ignorance, whereas those who honor both with equal devotion attain ultimate liberation and eternal peace.