అధ్యాయము 50

పులస్త్య

1 - గతే త్రైలోక్య రాజ్యే తు దానవేషు పురదరః

 జగామ బ్రహ్మ సదనం సహదేవైః శచీపతిః

2 - తత్రాపశ్య త్సదేవేశం బ్రహ్మాణం కమలోద్భవమ్

 ఋషిభి స్సార్థ మాసీనం పితరం స్వం చ కశ్యపమ్

3 - తతో ననామ శిరసా శక్రః సురగణై స్సహ

 బ్రహ్మాణం కశ్యపం చైవ తాంశ్చ సర్వాం స్తపోధనాన్

4 - ప్రోవాచేంద్రః సురైః సార్థం దేవనాథం పితామహమ్

 పితామహ! హృతం రాజ్యం బలినా బలినా మమ

5 - బ్రహ్మాప్రోవాచ శక్రైత ద్భుజ్యతే స్వకృతం ఫలమ్

 శక్రని పప్రచ్ఛభో! బ్రూహి కింమయా దుష్కృతం కృతమ్

6 - కశ్యపోఽప్యాహదేవేశం భ్రూణ హత్యా కృతా త్వయా

 దిత్యుదరాత్ త్వయా గర్భః కృత్తో వై బహుధా బలాత్

7 - పితరం ప్రాహదేవేంద్రః స మాతు ర్దోషతో విభో!

 కృంతనం ప్రాప్తవాన్ గర్భో అశోచా హి సా భవత్

8 - తతోఽబ్రవీ త్కశ్యపస్తు! మాతృదోషః సదానతామ్

 గత స్తతో వినిహతో దాసోఽపి కులిశేన భోః

9 - తఛ్రుత్వా కశ్యప వచః ప్రాహ శక్రః పితామహమ్

 వినాశం పాప్మనోబ్రూహి ప్రాయశ్చిత్తం విభో మమ

10 - బ్రహ్మ ప్రోవాచ దేదేశం వశిష్ఠః కశ్యప స్తథా

 హితం పర్వస్యజగతః శక్రస్యాపి విశేషతః

11 - శంఖ చక్ర గదా పాణి ర్మాధవః పురుషోత్తమః

 తం ప్రపద్యస్వ శరణం స తే శ్రేయో విధాస్యతి

12 - సహస్రాక్షోఽపి వచనం గురూణాం స నిశమ్య వై, ప్రోవాచ స్వల్ప కాలేన కస్మిన్ ప్రాప్యో బహూదయః

 త మూచు ర్దేవతా మర్త్యే స్వల్పకాలే మహోదయః

13 - ఇత్యేవ ముక్తః సురరా డ్విరించినా, మరీచి పుత్రేణ చ కశ్చపేన

 తథైవ మిత్రావరుణా త్మజేన, పేగా న్మహీపృష్ఠ మవాప్య తస్థౌ

14 - కాలింజర స్యోత్తరతః సుపుణ్య, స్తథా హిమాద్రే రపి దక్షిణస్థః

 కుశస్థలే పూర్వత ఏవ విశ్రుతా, వసోః పురాత్ పశ్చిమతోఽవతస్థే

15 - పూర్వం గయేన నృవరేణ యత్ర, యష్టోఽశ్వమేథః శతకృత్ సదక్షిణః

 మనుష్యమేధః శతకృ త్సహస్రకృ న్నరేంద్ర సూయశ్చ సహస్రకృచ్చ వై

పులస్త్యుడు

నారదా! తన త్రిలోకాధిపత్యం రాక్షసుల పాలైపోగా మొగము వ్రేల వేసికొని దేవతలతో కలిసి యింద్రుడు బ్రహ్మసదనానికి వెళ్లాడు. అక్కడ పద్మోద్భవుడైన బ్రహ్మను, ఋషి సమూహాన్ని తన తండ్రి అయిన కశ్యప మహర్షినీ, చూచి వారలందరకు తలవంచి ప్రణామాలు గావించి యిలా విన్నవించాడు. ‘పితామహా! నా రాజ్యాన్నంతనూ బలిదైత్యుడు బలపూర్వకంగా అపహరించాడు. 'అది విని చతుర్ముఖుడు 'అది అంతా నీ స్వయంకృతాపరాధ ఫలితమే' ననగా శక్రుడు - భగవాన్ నేను చేసిన దోషమేమో సెల వియ్యండి' అనగా నచటనే యున్న కశ్యపుడు - 'అది భ్రూణహత్త్యా పాపం. దితి గర్భస్థ పిండాన్ని నీవు ముక్కలు గావించిన పాప ఫలం' అని మందలించగా నా పురందరుడు - ప్రభూ! ఆమె అశుచిగా ఉన్నందుననే గర్భనాశం సంభవించిందని బదులు చెప్పగా కశ్యపుడు అశౌచం వల్ల గర్భానికి దాసత్వం కలిగింది. అయితే నీ వా దాసుణ్ణి కూడా వజ్రంతో సంహరించావు 'గా అనగా ఖిన్నుడై బ్రహ్మతో యింద్రుడు యిలా మొరపెట్టాడు. ప్రభో! అపరాధం జరిగింది. ఆ పాపానికి పరిహారం ప్రాయశ్చిత్తం సెలవియ్యండి.' ఇంద్రుని ప్రార్థన విని బ్రహ్మ, కశ్యపుడు, వసిష్ఠుడు, యింద్రునకూ అతనితో బాటు జగత్తుకూ మేలు కలుగునట్లు హితం చెప్పారు. 'సహస్రాక్షా! శంఖ చక్ర గాధరుడూ పురుషోత్తముడు నగు మాధవుని శరణు వేడుకొనుము. ఆయన నీ శ్రేయస్సుకై తగిన ఉపాయం చెప్పగలడు!' గురు జనుల ఆ హితవచనం విని యింద్రుడు స్వల్పకాలంలో అధిక అభ్యుదయం సాధించుట ఎక్కడ వలను పడునో తెలుప మనగా నా మహర్షులు అది మర్త్యలోకంలోనే సాధ్యమని చెప్పారు. అలా బ్రహ్మ, కశ్యప, వశిష్ఠులు చెప్పిన సలహా వినిన తక్షణమే యింద్రుడు భూలోకానికి చేరుకున్నాడు. కాలింజర క్షేత్రానికి ఉత్తరాన పవిత్ర హిమవ త్పర్వతానకి దక్షణాన, కుశస్థలికి తూర్పున వసుపురానికి పశ్చిమాన గల ఆ పవిత్ర క్షేత్రంలో పూర్వరాజవరుడైన గయుడు సదక్షిణాకంగా నూరు అశ్వమేధ యజ్ఞాలు, నరమేధ యజ్ఞాలు నూరు వేయి, రాజసూయ యాగలు వేయిగావించాడు.

16 - తథా పురా దుర్యజనః సురాసురైః, ఖ్యాతో మహామేధ ఇతి ప్రసిద్ధః

 యత్రాస్య చక్రే భగవాన్ మురారిః వాస్తవ్య మవ్యక్త తనుః ఖమూర్తిమత్

17 - ఖ్యాతిం జగామాఽథ గదాధరేతి, మహాఘవృక్షస్య శితః కుఠారః

 యస్మిన్ ద్విజేంద్రాః శ్రుతి శాస్త్రవర్జితాః సమత్వ మాయాతి పితామహేన

18 - సకృత్ పితౄన్ యత్ర చ సంప్రపూజ్య

 భక్త్యా త్వనన్యేన హి చేతసైవ

ఫలం మహామేథ మఖస్య మానవా

 లభంత్యనన్యం భగవ త్ప్రసాదాత్

19 - మహానదీ యత్ర సురర్షికన్యా జలాపదేశా ద్ధిమశైల మేత్య

 చక్రే జగత్పాప వినష్టి మగ్య్రాం సందర్శన ప్రాశన మజ్జనేన

20 - తత్ర శక్రః సమభ్యేత్య మహానద్యా స్తటేఽద్భుతే

 ఆరాధనాయ దేవస్య కృత్వాశ్రమ మవస్థితః

21 - ప్రాతఃస్నాయీ త్వధః శాయీ ఏకభక్త స్త్వయాచితః

 తప స్తేపే సహస్రాక్షః స్తువన్ దేవం గదా ధరమ్

22 - తస్యైవం తప్యతః సమ్యక్ జిత సరేంద్రియస్య హి

 కామ క్రోధ విహీనస్య సాగ్రః సంవత్సరో గతః

23 - తతో గదాధరో ప్రీతో వాసవీం ప్రాహ నారద!

 గచ్ఛ ప్రీతోఽస్మి భవతో ముక్త పాపోఽసి సాంప్రతమ్

24 - నిజం రాజ్యం చ దేవేశ! ప్రాప్స్యసే న చిరాదివ

 యతిష్యామి తథా శక్ర భావిశ్రేయో యథా తవ

25 - ఇత్యేవ ముక్తోఽథ గదాధరేణ, విసర్జితః స్నాప్య మనోహరాయామ్ స్నాతస్య

 దేవస్య తదైవతేననరా స్తం ప్రోచు రస్మా ననుశాసయస్వ

26 - ప్రోవాచ తాన్ భీషణ కర్మకారాన్ నామ్నా పులిందాన్ మమ పాప సంభవాః

 వసధ్వ మేఘాంతర మద్రియుఖ్యయో, ర్హిమాద్రి కాలింజరయోః పులిందాః

27 - ఇత్యేవ ముక్త్వా సురరాట్ పులిందాన్, విముక్తపాపోఽమర సిద్ధ యక్షైః

 సంపూజ్యమానా నునుజగామ చా శ్రమం మాతు స్తదా ధర్మ నివాస మీడ్యమ్

28 - దృష్ట్వాఽదితిం మూర్ధ్ని కృతాంజలిస్తు వినమ్రమౌళిః సముపాజగామ

 ప్రణమ్య పాదౌ కమలో దరాభౌ నివేదయామాస తప స్తదాత్మనః

29 - పప్రచ్ఛ సా కారణ మీశ్వరంతం, ఆఘ్రాయ చాలింగ్య సహాశ్రు దృష్ట్యా

 స చాచచక్షే బలినా రణే జయం, తదాత్మనో దేవగణైశ్చ సార్థమ్

30 - శ్రుత్వైవ సా శోకపరిప్లుతాంగీ జ్ఞాత్వాజితం దైత్యనుతైః సుతం తమ్

 దుఃఖాన్వితా దేవ మనాద్య మీడ్యం, జగామ విష్ణుం శరణం వరేణ్యమ్

అంతే కాదు ఆ గయు డాప్రదేశాన దేవతలకు అసురులకు దుష్కరమైన మహామేధ మనే యజ్ఞం చేశాడు. ఆకాశ రూపి, ముర మర్దనుడు నైన అవ్యక్త రూపి విష్ణు వాప్రదేశాన గధాధరుడుగా వెలశాడు. ఆ ప్రదేశం భయంకరమైన పాప వృక్షాలను కూల్చే కుఠారంగా ప్రసిద్ధి గాంచింది. వేద శాస్త్ర వర్జితులైన ద్విజులు గూడ ఆ ప్రదేశాన్ని సేవించి బ్రహ్మతో సమాను లౌతారు. ఒక్క పర్యాయమైనా అక్కడ శ్రద్ధగా పిండదానంతో పితృ పూజ చేస్తే అది మానవులకు అక్షయమైన మహామేధ యజ్ఞ ఫలా న్నిస్తుంది. దేవ ఋషి కన్య అయిన మహానది, జలరూపంలో హిమగిరి వైపు ప్రవహిస్తూ ఆ ప్రదేశాన, తన దర్శన స్నాన జల ప్రాశనాదులచే జగత్తులోని పాపాలన్నింటినీ క్షాళనం చేస్తూంటుంది. ఆ ప్రదేశానికి వెళ్లి ఇంద్రుడు మహానది అద్భుత తీరాన గదాధరుని ఆరాధించుటకై ఆశ్రమ మేర్పరచుకుని నిలచి పోయాడు. ప్రతిదినం ఉదయాన్నే నదిలో స్నానం చేస నేల మీద శయనిస్తూ అయాచితంగా లభించిన దేదైనా ఉండే రోజు కొక పర్యాయం భుజిస్తూ ఆ సహస్రాక్షుడు, గదాధరుని ఆరాధనలో తపించాడు. ఇంద్రయాల నన్నింటిని అదుపులోనుంచుకొని, కామ క్రోధాలు విడచి అలా ఒక సంవత్సర కాలం తనస్సు చేయగా ఓ నారదా! గదాధర దేవుడు సంతోషించి వాసవునితో యలా అన్నాడు – ఇంద్రా! నేను ప్రీతుడ నైనాను. నీ పాపాలన్నీ యిప్పటికి తొలగి పోయాయి. వెళ్లుము. త్వరలోనే పోగొట్టుకొన్న రాజ్యాన్ని తిరిగ పొందగలవు. నీకు శ్రేయస్సు కలుగు నట్లుగా ప్రయత్నం చేస్తాను." ఇలా వర మిచ్చి గదాధరుడు వెళ్లిన తర్వాత ఇంద్రుడు ఆ మనోహరమైన నదిలో స్నానం చేసిన తర్వాత, ఆయన పాపాలతో పుట్టిన మానవులలో కొందరాయనను సమీపించి, మాకు హితోపదేశం చేయుమని అర్ధించారు. అలా వచ్చిన క్రూర కర్ములైన పుళిందు లనే ఆ కిరాతులను చూచి శక్రుడిలా అన్నాడు. 'మీరు నా పాపఫలంగాజన్మించారు. ఓ పుళిందులారా! ఈ హిమాద్రి కాళింజరాలనే ప్రముఖ పర్వతాల మధ్య దేశాన్ని నివాసంగా చేసుకుని జీవించండి! అలా పులిందుల నాదేశించి పాపముక్తుడైన ఆ వాసవుడు సుర సిద్ధ యక్షాదుల పూజ లందుకుని ధర్మభూమి అయిన తన తల్లి ఆశ్రమానికి వెళ్లాడు. తల్లి అయిన అదితిని చూచి శిరసాప్రణామం చేసి తామర పూలలో భాగానికి వలె మృదువుగా ఎర్రగా ఉన్న ఆమె పాదాలను కన్నుల కద్దుకుని తన తపస్సు విషయాన్ని నివేదించాడు. ఆమె అశ్రు పూరిత నయనాలతో కుమారుని కౌగలించుకుని శిరస్సు మూర్కాని తపస్సుకు కారణ మేమని ప్రశ్నించగా నా శక్రుడు బలి దైత్యునితో యుద్దంతో ఓడిపోయి రాజ్యం కోలుపోవడ మంతా వివరించాడు. దితి కుమారులచేత పరాభవించ బడిన తన సుతుని దుర్దశకు ఆ సాధ్వి దుఃఖంతో క్రుంగిపోయి అద్యంత రహితుడు, వరేణ్యుడు నైన ఆ విష్ణుని ఆశ్రయించి శరణు పొందింది.

నారద

31 - కస్మిన్ జనిత్రీ సురసత్తమానాం స్థానే హృషీకేశ మనంత మాద్యమ్

 చరాచరస్య ప్రభవం పురాణ మారాధయామాస శుభే వద త్వమ్

నారదుడు

ఓ మహర్షీ! ఆ దేవ మాత ఏ ప్రదేశంలో చరాచర సృష్టి కర్తా, పురాణ పురుషుడూ, అనంతుడు నైన ఆ హృషీకేశుని ఆరాధించినది చెప్పండి.

పులస్త్య

32 - సురారణిః శక్ర మవేక్ష్యదీనం, పరాజితం దానవ నాయకేన

 సితేఽథ పక్షే మకరంగతేఽర్కే ఘృతార్చిషః స్యా దథ సప్తమేఽహ్ని

33 - దృష్ట్వైవ దేవం త్రిదశాధిపం తం మహోదయే శక్ర దిశాధిరూఢమ్

 నిరాశనా సంయత వాక్సుచిత్తా, తదోపతస్థే శరణం సురేంద్రమ్

పులస్త్యుడు

నారదా! తన పుత్రుడావిధంగా బలి చేతిలో ఓడిపోయి దీనుడై యుండుట చూచి ఆ అదితి మాఘ శుద్ధ సప్తమీ పవిత్ర దినాన తూర్పున ఉదయించిన త్రిదశాధిపతిని దర్శించి మౌనం పాటించి నిరాహారయై తపో దీక్ష వహించింది. ఆ జగచ్చక్షువును ప్రసన్నురాలై యిలా ప్రార్ధించింది.

అదితి

34 - జయస్వ దివ్యాంబుజ కోశ చోర! జయస్వ సంసార తరోః కుఠార!

 జయస్వ పాపేంఽధన జాతవేద! స్తమౌఘ సంరోధ! నమో నమస్తే

35 - నమోఽస్తు తే భాస్కర దివ్యమూర్తే! త్రైలోక్య లక్ష్మీ తిలకాయ తే నమః

 త్వం కారణం సర్వచరాచరస్య నాధోఽసి మాంపాలయ విశ్వమూర్తే!

36 - త్వయా జగన్నాథ! జగన్మయేన నాథేన శక్రో నిజ రాజ్య హానిమ్

 అవాప్తవాన్ శత్రు పరాభవం చ, తతో భవంతం శరణం ప్రపన్నా!

37 - ఇత్యేవ ముక్త్వా సురపూజితం సా ఆలిఖ్య రక్తేన హి చందనేనీ

 సంపూజయిత్వా కరవీర పుష్పైః సంధూప్య ధూపైః కణ మర్క భోజ్యమ్

38 - నివేద్య చై వా జ్యయుతం మహార్హ మన్నం మహేంద్రస్య హితాయ దేవీ

 స్తవేన పుణ్యేన చ సంస్తువంతీ స్థితా నిరాహార మథోపవాసమ్

39 - తతో ద్వితీయేఽహ్ని కృతప్రణామా స్నాత్వా విధానేన చ పూజయిత్వా

 దత్వా ద్విజేభ్యః కణకం తిలాజ్యం తతోతా సా ప్రయతా బభూవ

40 - తతః ప్రీతోఽభవద్భానుః ఘృతార్చిః సూర్యమండలాత్

 వినిః సృతో గ్రతః స్థిత్వా ఇదంవచన మబ్రవీత్

41 - వ్రతే నానేన సుప్రీత స్తవాఽహం దక్షనందిని!

 ప్రాప్స్యసే దుర్లభం కామం మత్ప్రసాదా న్నసంశయమ్

42 - రాజ్యం త్వత్తనయానాం వై దాస్యే దేవీ! సురారణి!

 దానవాన్ ధ్వంసయిష్యామీ సంభూయై వోదరే తవ

43 - తద్వాక్యం వాసుదేవస్య శ్రుత్వా బ్రహ్మన్! సురారణిః

 ప్రోవాచ జగతాం యోనిం వేపమానా పునః పునః

44 - కథం త్వా ముదరేణాహం వోఢుం శక్ష్యామి దుర్ధరమ్

 యస్యోదరే జగ త్సర్వం వసతే స్థాణు జంగమమ్

45 - క స్త్వాం ధారయితుం నాథ! శక్తః త్రైలోక్య ధార్యసి

 యస్య సప్తార్ణవాః కుక్షౌ నివసంతి సహాద్రిభిః

46 - తస్మా ద్యధా సురపతిః శక్రః స్యా త్సురరా డిహ

 యథా చ న మమ క్లేశ స్తథా కురు జనార్దన!

అదితి

'దివ్య కమలాల గర్భస్థ శోభను పరిహసించు సౌందర్య నిధీ! నీకు జయ మగు గాక! సంసార తరువును ఛేదించు కుఠారమా నీకు జయ మగుగాక! పాపాలనే కట్టెల ప్రోవును భస్మం గావించు అగ్నిదేవా! నీకు జయ మగుగాక! పాపసంఘాలను నిరోధించు ప్రభూ నీకు జయము జయము! దివ్య విగ్రహుడవగునో భాస్కరా! సూర్యమండలాంతర్వర్తి నారాయణా నీకు నమస్సులు! త్రిలోక ఐశ్వర్య నిధీ! నీకు ప్రణామం! ఈ చరాచర జగత్తుకంతకూ నీవే మూలం. సర్వేశ్వరుడవు. ఓ విశ్వమూర్తీ! నన్ను కాపాడుము. జగన్మయుడవూ, జగత్పతివీ అయిన నీవల్లనే యింద్రుడు సర్వస్వం కోలుపోయి శత్రువులచే పరాభవం పొందాడు. అందుచేత నేను నీ మరుగున చేరాను. నన్ను రక్షించుము. ఇలా స్తోత్రం చేసి ఆదేవమాత శ్రీమన్నారాయణుని ప్రతిమను రక్తచందనములతో నలంకరించి కరవీరమాలతో పూజించి ధూపదీపాదులచే నర్చించి ఆజ్యసంమిశ్రితమైన శాల్యన్నం నైవేద్యం చేసింది. ఇంద్రుని క్షేమానికై ప్రభువును స్తుతిస్తూ ఆ దేవజనని నిర్జలోపవాసం గావించింది. రెండవ రోజు విధి విహితంగా స్నాన పూజాదికాలు నిర్వర్తించి బ్రాహ్మణులకు స్వర్ణం తిలలు అమృతం దానం చేసి ప్రణామం గావించింది. అంతట సంప్రీతుడై ఘృతార్చి అయిన ఆ స్యూనారాయణుడు సూర్యమండలాన్నుంచి వెలువడి ఆ దక్షకుమారి ఎదుట నిలచి యిలా అన్నాడు – 'ఓ దాక్షాయణి! నీవు గావించిన వ్రతానికి సంతోషించాను. నా ప్రసాదం వల్ల నీ కోరికనెరవేరుతుంది. ఓ దేవజననీ! నీ పుత్రులకు వారల రాజ్యం ఇచ్చెదను. సందేహించవద్దు. నీ కడుపున పుట్టి దైత్యులను నిర్మూలిస్తాను" వాసుదేవుని మాటలకు గడ గడ వడకుచు నా అదితి, ఓ నారదా! ఆ జగన్మూర్తితో యిలా అన్నది. 'ప్రభో! స్థావర జంగమ సృష్టిని ఉదరంలో పెట్టుకొని దుర్ధరుడవుగా నుండే నిన్ను నే నెలా కుక్షిలో ధరించగలను? కాబట్టి ఓ జనార్దనా! నాకు కష్టం కలగని విధంగా ప్రయత్నించు.

విష్ణు

47 - సత్య మేత న్మహాభాగే! దుర్ధరోఽస్మి సురాసురైః

 తథాఽపి సంభవిష్యామి అహం దేవ్యుదరే తవ

48 - ఆత్మానం భువనాన్ శైలాం స్త్వాం చదేవి! సకశ్యపామ్

 ధారయష్యామి యోగేన మావిషాదం కృథాఽoబికే

49 - తవోదరేఽహం దాక్షేయి సంభవిష్యామి వై యదా

 తదా నిస్తేజసో దైత్యాః సంభవిష్యం త్య సంశయమ్

50 - ఇత్యేవ ముక్త్వా భగవాన్ వివేశ తస్యాశ్చ భూయోఽరి గణ ప్రమర్దీ

 స్వతేజసోంఽశేన వివేశ దేవ్యాః తదోదరేశక్ర హితాయ విప్ర!

విష్ణువు

నీ వన్నట్లు నేను దేవతలకూ అసురులకూ దుర్ధరుడనే అయినప్పటికీ నీ కడుపుననే పుడతానమ్మా! యోగబలంతో నన్నూ యిూలోకాలనూ పర్వతాలనూ కశ్యపునితో సహా నిన్నూ కూడా కలుపుకెని నీ కడుపులో నుండి జన్మిస్తాను. దిగులు పడవద్దు. నీకెలాటి కష్టమూ కలుగ నీయ నమ్మా! నేను నీ గర్భాన జనించుటతోనే రాక్షసలోకం అంతా నిర్జీవమై పోతుంది. సందేహింపకుము. అలా నా దేవమాఆ నూరడించి ఆ శత్రుమర్దను డామె గర్భంలోతన సమస్తతేజము యొక్క సూక్ష్మాంశంతో, ఇంద్రుని హితార్థమై ప్రవేశించాడు.

అధ్యాయము 50 Complete