అధ్యాయము 17

నారదుడు

1 - యానేతాన్ భగవాన్ ప్రాహ కామిభిః శశినంప్రతి

 ఆరాధనాయదేవాభ్యాం హరీశాభ్యాం వదస్వతాన్

నారదుడు

శివకేశవుల ప్రసన్నులను గావించుకొనుటకు చంద్రుడు గావించిన వ్రతారాధనము లెవ్వియోదయచేసి సెలవియ్యవలయును.

పులస్త్యుడు

2 - శృణుష్వకామిభిః ప్రోక్తాన్ వ్రతాన్ పుణ్యాన్ కవిప్రియ

 ఆరాధనాయశర్వస్య కేశవస్య చ ధీమతః

3 - యదాత్వాషాడీ సంయాతి వ్రాజతేచోత్తరాయణం

 తదాస్వపితిదేవేశో భోగిభోగే శ్రియః పతిః

4 - ప్రతిసుప్తేవిభౌతస్మిన్ దేవగంధర్వగుహ్యకాః

 దేవానాంమాతరశ్చాపి ప్రసుప్తా శ్చాప్యనుక్రమాత్

పులస్త్యుడు

నారదా! శర్వకేశవులను ప్రసన్నుల గావించుకొనుటకుగా కాముకులు ప్రవచించిన పుణ్యవ్రతాలను గురించి వినుము. ఉత్తరాయణం వెళ్ళిపోయి ఆషాఢ మాసాగామనంతో దేవాధిదేవుడు లక్ష్మీపతి శేషశయనం మీద నిద్రించును. తమ ప్రభువు నిద్రించినతోడనే దేవ గంధర్వ యక్షులు వారల తల్లులు క్రమంగా గాఢ నిద్రలో మునిగిపోతారు.

నారదుడు

5 - కథయస్వసురాదీనాం శయనే విదిముత్తమమ్

 సర్వమనుక్రమేణ్యైవ పురస్కృత్య జనార్దనమ్

నారదుడు

మహర్షే ఆదేవతల ఉత్తమశయన పద్ధతిని క్రమంగా వినగోరెదను.

పులస్త్యుడు

6 - మిథునాభిగమనే సూర్యే శుక్లపక్షేతపోధన

 ఏకాదశ్యాం జగత్స్వామీ శయనంపరికల్పయేత్

7 - శేషాహిభోగపర్యంకం కృత్వాసంపూజ్య కేశవమ్

 కృత్వోపవీతకంచైవ సమ్యక్ సంపూజ్యవై ద్విజాన్

8 - అనుజ్ఞాం బ్రాహ్మణేభ్యశ్చ ద్వాదశ్యాం ప్రయతఃశుచిః

 లబ్ద్వా పీతాంబరధరః స్వస్తినిద్రాం సమానయేత్

9 - త్రయోదశ్యాంతతః కామః స్వపతే శయనేశుభే

 కదంబానాం సుగంధనాం కుసుమైః పరికల్పితే

10 - చతుర్దశ్యాంతతోయక్షాః స్వపంతి సుఖశీతలే

 సౌవర్ణపంకజవృతే సుఖా స్తీర్ణోపధానకే

11 - పౌర్ణమాస్యాముమానాధః స్వపతే చర్మసంస్తరే

 వైయాఘ్రేచ జటాభారం సముద్గ్రoథ్యాన్యచర్మణా

12 - తతో దివాకరోరాశిం సంప్రయాతిచ కర్కటమ్

 తతోమరాణాంరజనీ భవతే దక్షిణాయనమ్

13 - బ్రహ్మ పతిపది తథా నీలోత్పలమయేనఘ

 తల్పే స్వపితి లోకానాం దర్శయన్ మార్గముత్తమమ్

14 - విశ్వకర్మా ద్వితీయాయాం త్రుతీయాయాం గిరేఃసుతా

 వినాయకశ్ చతుర్థ్యాంతు పంచమ్యామపి ధర్మరాట్

15 - షష్ట్యాంస్కందఃప్రస్వపితి సప్తమ్యాం భగవాన్ రవిః

 కాత్యాయనీతథాష్టమ్యాం నవమ్యాం కమలాలయా

16 - దశమ్యాంభుజగేంద్రాశ్చ స్వపంతే వాయుబోజనాః

 ఏకాదశ్యాంతుకృష్ణాయాం సాధ్యాబహ్మన్ స్వపంతిచ   

17 - ఏషక్రమస్తేగదితో నాభాదౌ స్వపనేమునే

 స్వపత్సుతత్రదేవేషు ప్రావృట్కాలః సమాయయౌ

పులస్త్యుడు

ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు సూర్యుడు మిథునరాశిలో ప్రవేశించగా జగన్నాథుడు శయనమున కుపక్రమించును. పీతాంబరదారియై శుచియై ప్రయత్నశీలుడై నరుడు. శేషశయనము నేర్పరచి దానిపై కేశవునికి ఉపవీతదారణం కావించి అర్ఘ్యపాద్యాదులతో చక్కగా పూజించి, ద్వాదశినాడు బ్రాహ్మణ పూజచేసి, వారిచేత అనుజ్ఞ పొంది స్వామిని సుఖశయనుని గావింపవలెను. త్రయోదశినాడు కదంబ పుష్పశయ్య మీద మన్మథుడు నిద్రించును. చతుర్దశినాడు యక్షులు, బంగారు కమలాలు పరచినశీతల శయ్య మీద మంచి తలగడలమర్చుకొని నిద్రింతురు. పౌర్ణమి నాడు పరమశివుడు తనజటాజూటాన్ని పులితోలుతో ముడివేసికొని వ్యాఘ్రాజినం మీద శయనించును. సూర్యుడు కర్కట రాశిలో ప్రవేశించుటతో దేవతలకు రాత్రి ఆరంభమగును. అదే దక్షిణాయనము. ఓ పవిత్రమునీ! పాడ్యమినాడు నల్లకలువలశయ్య మీద విరించి శయనించును. ప్రజలకు ఉత్తమమైన మార్గము చూపును. తర్వాత వరుసగా విదియనాడు దేవ శిల్పి విశ్వకర్మ తదియనాడు పార్వతీదేవి, చవితినాడు వినాయకుడు, పంచమినాడు యమధర్మరాజు, షష్టినాడు కుమారస్వామి, సప్తమినాడు సూర్యుడు, అష్టమినాడు కాత్యాయని, నవమినాడు మహాలక్ష్మి, దశమినాడు వాయుభుక్కులు పన్నగులు, నిద్రింతురు. కృష్ణ పక్ష ఏకాదశినాడు సాధ్యులు నిద్రింతురు. ఈ క్రమంలో దేవతలు శ్రావణమాసంలో నిద్రించగా అప్పటి నుండి వర్షాకాలము ప్రారంభమగును.

18 - కంకాః సమంబలాకాభి రారోహంతి నగోత్తమాన్

 వాయసాశ్చాపి కుర్వంతి నీడాని ఋషిపుంగవః

 వాయసాశ్చ స్వపంత్యేతే ఋతౌ గర్భభరాలసాః

19 - యస్యాంతిథ్యాంప్రస్వపితి విశ్వకర్మా ప్రజాపతిః

 ద్వితీయా సా శుభాపుణ్యా అశూన్యశయనోదితా

20 - తస్యాంతిథావార్చ్యహరిం శ్రీవత్సాంకం చతుర్భుజం

 పర్యంకస్థం సమం లక్ష్మ్యా గంధపుష్పాదిభిర్మునే

21 - తతో దేవాయశయ్యాయాం ఫలాని ప్రక్షిపేత్ క్రమాత్

 సురభీణినివేద్యేత్త్థంవిజ్ఞాప్యో మధుసూదనః  

22 - “యథాహిలక్ష్మ్యాన వియుజ్యసేత్వం త్రివిక్రమానంత జగన్నివాస

 తథాస్త్వశూన్యం శయనం సదైవ అస్మాకమేవేహ తవప్రసాదాత్

23 - యథాత్వశూన్యం తవదేవతల్పం సమంహి లక్ష్మ్యా వరదాచ్యుతేశ

 సత్యేనతేనామితవీర్యవిష్ణోః గార్హస్థ్యనాశో మమనాస్తు దేవ   

24 - ఇత్యుచ్చార్యప్రణమ్యేశం వ్రసాద్యచపునఃపునః

 నక్తం భుంజీత దేవర్షేః తైలక్షార వివర్జితమ్

25 - ద్వితీయేహ్ని ద్విజాగ్ర్యాయ ఫలాన్ దద్యాత్ విచక్షణః

 లక్ష్మీధరః ప్రీయతాంమే ఇత్యుచ్చార్య నివేదయేత్        

26 - అనేనతువిధానేన చాతుర్మాస్యవ్రతం చరేత్

 యావద్ వృశ్చికరాశిస్థః ప్రతిభాతి దివాకరః

27 - తతోవిబుధ్యంతిసురాః క్రమశః క్రమశోమునే

 తులాస్థేర్కేహరిః కామః శివః పశ్చాద్విబుధ్యతే

28 - తత్రదానంద్వితీయాయాం మూర్తిర్లక్ష్మీదరస్యతు

 సశయ్యాస్తరణో పేతాయథావిభవమాత్మనః

29 - ఏషవ్రతస్తుప్రథమః ప్రోక్తస్తవ మహామునే

 యస్మింశ్చర్ణేవియోగస్తు నభవేదిహ కస్యచిత్

30 - నభస్యేమాసి చతథా యాస్యాత్కృష్ణాష్టమీశుభా

 యుక్త్వామృగశిరేణైవ సాతు కాలాష్టమీ న్మృతా

గ్రద్దలు (కంకాః) కొంగలు, కాకులు, కొండకొమ్ముల మీద చేరుతవి. కాకులు గూళ్ళు కట్టడం మొదలెడతాయి. ఈ ఋతువులో గర్భాభారంతో ఉండే ఆడకాకులు వెళ్లి ఆగూళ్ళలో నిద్రిస్తవి. నారదా! ప్రజాపతి విశ్వకర్మ నిద్రించిన రోజును పవిత్రమైన అశూన్యశయన ద్వితీయ అంటారు. ఆదినాన శ్రీ వత్సాంకుడు చతుర్భుజుడైన మహా విష్ణువును, మహాలక్ష్మితో గూడ శయనం మీద నుంచి గంధ పుష్పాదులతో పూజించి ఆ శయ్య మీద సువాసన గల ఫలాలు ప్రక్షేపించాలి. వానిని నివేదించి ఆ మధుసూదనుని యిలా ప్రార్థించాలి. “ఓ త్రివిక్రమా! అనంతా! జగన్నివాసా! నీవే విధంగా క్షణ కాలం కూడ వదలకుండా లక్ష్మితో ఉంటావో అదే విధంగా నీ అనుగ్రహం వల్ల మాశయ్యలు గూడ ఒక క్షణకాలం కూడ శూన్యంగా ఉండకుండుగాక! మేము కూడ అశూన్యశయనుల మగుదుము కాక! ఓ అచ్యుతా! వరదా! లక్ష్మితో కూడి ఎట్లు నీ తల్పం అశూన్యంగా ఉంటుందో, అదేవిధంగా ఓ అమితవీర్యా! విష్ణూ! మాకుగార్హస్త్య నష్టమే నాడును కలుగ కుండుగాక! ఈ విధంగా ప్రార్థించి మరల మరల నమస్కారములు గావించి శ్రియః పతిని ప్రసన్నుని గావించుకొని, ఆనాడు రాత్రివేళ మాత్రమే, నారదా! నూనె ఉప్పులేని భోజనం చేయాలి. ఆ మరునాడు ఉత్తమ బ్రాహ్మణునకొక పండును, తన శక్తి కొలది దక్షిణతో కూడ దానం చేయాలి. లక్ష్మీనాధుడు సంతోషించు గాక! అని సంకల్పించుకొని ఆఫలదానం చేయాలి. ఈ విధంగా, సూర్యుడు వృశ్చికరాశిలో ప్రవేశించువరకు చాతుర్మాస్య వ్రతాచరణం చేయాలి. అంతట దేవతలొకరొకరుగా నిద్రనుంచి మేలుకుంటారు. అంతట విదియనాడు లక్ష్మీనారాయణ విగ్రహాన్ని తల్పం ఆస్తరణతో కూడ తన వైభవానికి తగిన రీతిలో దానం చేయాలి, ఈ విధంగా మొదటి వ్రతాన్ని నీకు తెలిపితిని. దీనినాచరించిన వారికి జీవితంలో ఎవరితో వియోగం ఎప్పుడు కలుగదు. ఇదే విధంగా మృగశిరా యుక్తమైన శ్రావణ కృష్ణ అష్టమి గూడ పవిత్రమైనది. దానిని కాలాష్టమి అంటారు.

31 - తస్యాం సర్వేషు లింగేషు తిథౌస్వపితి శంకరః

 వసతేసంవిధానేతు తత్రపూజా క్షయాస్మృతా

32 - తత్రస్నాయీతవై విద్వాన్ గోమూత్రేణజలేనచ

 స్నాతఃసంపూజయేత్ పుష్పై ర్దత్తూరస్యత్రిలోచనమ్

33 - ధూపం కేసరనిర్యాసం నైవేద్యంమధుసర్పిషీ

 ప్రీయాతాంమే విరూపాక్ష స్త్విత్యుచ్చార్య చదక్షిణాం

 విప్రాయదద్యాన్నై వేద్యం సహిరణ్యం ద్విజోత్తమ

34 - తద్వదాశ్వయుజేమాసి ఉపవాసీ జితేంద్రియః

 నవమ్యాంగోమయస్నానం కుర్యాత్పూజాం తు పంకజైః

 ధూపయేత్సర్జనిర్యాసం నైవేద్యంమధుమోదకైః

35 - కృతోపవాసస్త్వష్టమ్యాం నవమ్యాంస్నానమాచరేత్

 ప్రీయతాంమేహిరణ్యాక్షో దక్షిణాసతిలాస్మృతా

36 - కార్తికేపయసాస్నానం కరవీరేణచార్చనమ్

 ధూపం శ్రీవాసనిర్యానం నైవేద్యంమధుపాయాసమ్   

37 - సనైవేద్యంచరజతం దాంతవ్యందానమగ్రజే

 ప్రీయతాంభగవాన్ స్థాణు రితి వాచ్యమనిష్ఠురమ్

38 - కృత్వోపవాసమష్టమ్యాం నవమ్యాంస్నానమాచరేత్

 మాసిమార్గశిరేస్నానం దద్నార్చా భద్రయాస్మృతా

39 - ధూపం శ్రీవృక్షనిర్యాసంనైవేద్యం మధునోదనమ్

 సంనివేద్యారక్తశాలి ర్దక్షిణాపరికీర్తితా

 నమోస్తుప్రీయతాం శర్వ స్త్వితివాచ్యంచపండితైః

40 - పౌషేస్నానంచ హవిషా పూజా స్యాత్తగారైఃశుబైః

 దూపోమధుకనిర్యాసో నైవేద్యం మధుశష్కులీ

41 - సముద్గాదక్షిణాప్రోక్తా ప్రీణనాయ జగద్గురోః

 వాచ్యంనమస్తేదేవేశ త్ర్యంబకేతి ప్రకీర్తయేత్    

42 - మాఘేకుశోదకస్నానం మృగమదేన చార్చనమ్

 దూపః కదంబనిర్యాసో నైవేద్యం సతిలోదనమ్

43 - పయోభ క్తంసనైవేద్యం సర్ముకం ప్రతిపాదయేత్

 ప్రీయతాంమేమహాదేవః ఉమాపతి రితీరయేత్

44 - ఏవమేవ సముద్దిష్టం షడ్భిర్మాసైస్తు పారణమ్

 పారణాంతేత్రినేత్రస్య స్నపనం కారయేత్క్ర్కమాత్

ఆ తిథినాడు శంకరుడన్ని లింగములలోను నిద్రించును. ఆ సమయాన ఆయన నారాధించిన వాని పూజ అక్షయఫల దాయకమౌతుంది. అప్పుడు విజ్ఞుడు గోమూత్ర జలాలతో స్నానం చేయించి ఉమ్మెత్తపూలతో త్రిలోచనుని పూజించాలి. కేసరసత్తు ధూపం వేసి, తేనె నేయి నైవేద్యం యిచ్చి “విరూపాక్షుడు నా యెడ ప్రసన్నుడగు గాక !” అని పలికి సువర్ణ సహితంగా నైవేద్యాన్ని ఉత్తమ బ్రాహ్మణునకు దాన మివ్వవలెను. అదే విధంగా ఆశ్వయుజంలో ఉపవసించి జితేంద్రియుడై నవమినాడు గోమయ స్నానం చేయించాలి. కమలాలతో పూజ చేసి, ధూపం అర్పించి తేనె మిష్టాన్నం (కుడుములు) నైవేద్యం యివ్వాలి. అష్టమినాడుపవసించి నవమినాడు స్నానంచేయాలి. హిరణ్యాక్షుడు నన్ననుగ్రహించు గాక; యనుచు నువ్వులు దక్షిణ యివ్వాలి. కార్తీక మాసంలో పాలతో స్నానం చేయించి కరవీర పుష్పాలతో అర్చన చేయాలు. శ్రీగంధం ధూపం వేసి తేనె పాయసం నివేదించాలి. రజత దక్షిణతో ఆ నైవేద్యం బ్రాహ్మణునకిచ్చి సౌమ్య వచనాలతో “భగవంతుడగు స్థాణువునన్నను గ్రహించు గాక!” అని నమస్కరించాలి. మార్గశీర్ష మాసంలో అష్టమినాడుపవసించి నవమి రోజు పెరుగుతో స్నానం చేయించి భద్ర పుష్పాలతో అర్చన చేయాలి. బిల్వవృక్షపు బెరడులతో ధూపం వేయాలి. తేనెతో వండి అన్నం నివేదనం చేసి, దానిని బ్రాహ్మణునకు ఎర్రబియ్యపు దక్షిణతో దానం యివ్వాలి. “శ్రీశర్వునకు నమస్సులు! ప్రీతుడగు గాక!” అని ప్రార్థించాలి. పవిత్రమైన పుష్యమాసంలో నేతితో స్నానం చేయించి మంగళ ప్రదాలయిన తగరుపూలతో అర్చనం చేయాలి. మధూక చెట్టు బెరడు ధూపం వేసి మధువు శష్కులి (రొట్టె) నైవేద్యం పెట్టాలి. పెసలు దక్షిణగా ఆ నైవేద్యం బ్రాహ్మణునకు దానం చేసి, దేవాధిదేవా! త్ర్యంబకా! నీకు నమస్కారం!” అని కీర్తించాలి. మాఘ మాసంలో దర్భలు వేసిన జలంతో స్నానం చేయించి కస్తూరితో పూజించాలి. కడిమిచెట్టు బెరడు ధూపం వేసి నువ్వుల అన్నం నివేదించాలి. బంగారం పాయసాన్నం దక్షిణగా నివేదితాన్నాన్ని బ్రాహ్మణునకు యివ్వవలెను. “ఉమాకాంతుడను మహాదేవుడు ప్రీతుడగు గాక!” అని సమర్పించవలెను. ఈ విధంగా ఆరు నెలల కాలంసాగే ఈ వ్రతపారణంజరుగుతుంది. పారణం (సమాప్తి) చివర త్రిలోచనునికి సక్రమంగా స్నానం చేయించాలి.

46 - గోరోచనాయాః సాహితగుడేన దేవం సమాలభ్యచపూజయేత

 ప్రీయస్వదీనోస్మి భవంతమీశ మచ్చోకనాశం ప్రకురుష్వ యోగ్యమ్

47 - తతస్తు ఫాల్గుణేమాసి కృష్ణాష్టమ్యాం యతవ్రత

 ఉపవాసంసముదితం కర్తవ్యం ద్విజసత్తమ

48 - ద్వితీయేహ్నితతః స్నానం పంచగవ్యేన కారయేత్

 పూజయేత్కుందకుసుమైః దూపయేత్ చందనం త్వపి

49 – నైవేద్యంసఘృతం దద్యాత్ తామ్రపాత్రే గుడోదనమ్

 దక్షిణాంచ ద్విజాతిభ్యో నైవేద్యసహితాం మునేః

 వాసోయుగంప్రీణయేచ్చ రుద్రముచ్చార్య నామతః

50 - చైత్రేచోదుంబరఫలైః స్నానం మందారకార్చనమ్

 గుగ్గులుం మహిషాఖ్యంచ ఘృతాక్తం ధూపయేద్భుదః  

51 - సమోదకం తథాసర్పిః ప్రీణయేచ్చ వినివేదయత్

 దక్షిణాచసనై వేద్యం మృగాజిన ముదాహృతమ్

52 - “నాట్యేశ్వరః నమస్తేస్తు” ఇదముచ్చార్య నారదః

 ప్రీణసందేవనాథాయ కుర్యాచ్చ్రద్దాసమన్వితః

53 - వైశాఖేస్నానముదితం సుగంధకుసుమాంభసా

 పూజనంశంకరస్యోక్తం చూతమంజరిభి ర్విభో  

54 - ధూపం సర్జాజ్యయుక్తంచ నైవేద్యం సఫలంఘృతమ్

 నామజప్యమపీశస్య కాలఘ్నేతి విపశ్చితా

55 - జలకుంభాన్ సనైవేద్యాన్ బ్రాహ్మణాయ నివేదయేత్

 సోపవీతాన్ సహాన్నాద్యాం స్తచ్చిత్తై స్తత్పరాయణైః

56 - జ్యేష్టేస్నానంచామలకైః పూజార్కకుసుమై స్తథా

 దూపయేత్తత్త్రినేత్రంచ ఆయత్యాం పుష్టికారకమ్

57 - సక్తూంశ్చసఘృతాన్ దేవేదద్నాక్తాన్ వినివేదయేత్

 ఉపానద్యుగళ చ్చత్రం దానం దద్యాచ్చ భక్తిమాన్

58 - నమస్తేభగనేత్రఘ్నః పూష్ణోదశననాశన

 ఇదముచ్చార యేద్భక్త్యా ప్రీణనాయ జగత్పతేః

59 - ఆషాడేస్నానముదితం శ్రీఫలై రర్చనంతథా

 దత్తూరకుసుమైః శుక్లై ర్దూపయేత్ నిల్హకంతథా

60 - నైవేద్యాఃసఘృతాః పూపాః దక్షిణా నమ్రుతయనాః

 నమస్తేదక్షయజ్ఞఘ్న: ఇదముచ్చైరుదీరయేత్

61 - శ్రావణేమృగభోజ్యేన స్నానంకృత్వా ర్చయేద్దరిమ్

 శ్రీవృక్షపత్రైః సఫలైః దూపందద్యాత్తథాగురుమ్

62 - నైవేద్యం నఘ్రుతం దద్యాద్దదిపూపాన్ సమోదకాన్

 దద్యోదనం శకృసరం మాషదానాః సశష్కులీః

63 - దక్షిణాంశ్వేతవృషభం దేనుంచ కపిలాంశుభాం

 కనకంతక్తవసనం ప్రదద్యాత్ బ్రాహ్మణాయహి

 గంగాదరేతిజప్తవ్యం నామశంభోశ్చ పండితైః

64 - అమీభిః షడ్బిరపరైర్మాసైః పారణ ముత్తమమ్

 ఏవంసంవత్సరం పూర్ణం సంపూజ్య వృషభధ్వజమ్

 అక్షయాన్లభతేకామాన్ మహేశ్వరవచో యథా

65 - ఇదముక్తంవ్రతంపుణ్యం సర్వాక్షయకరం శుభమ్

 స్వయంరుద్రేణదేవర్షే తత్తథా నతదన్యథా

మహర్షే! గోరోజనం బెల్లం కలిపిన మిశ్రమంతో స్వామిని తాకి పూజించాలి. “ఈశ్వరా! ఈ దీనునియెడ ప్రసన్నుడవుకమ్ము. ణా శోకబాధలన్నింటిని నశింపజేయుము!” అని ఆత్మ నివేదనము చేయవలె. తర్వాత ఫాల్గుణమాసంలో కృష్ణ పక్షంలో అష్టమినాడు యథావిధిగ ఉపవసించాలి. ఆ మరునాడే దేవుని పంచాగవ్యములతో(పంచగవ్యములనగా – ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నేయి , గోమయము, గోమూత్రము) నభిషేకించాలి. మల్లె పూలతో పూజించి చందన ధూపం వేయాలి. రాగి పాత్రలో నేయి బెల్లముతో వండిన అన్నం నైవేద్యం చేయాలి. మునీ! రెండు వస్త్రాలు దక్షిణతో నైవేద్యం, బ్రాహ్మణునకు రుద్ర నామోచ్చారణ చేస్తూ యివ్వాలి. చైత్ర మాసంలో ఉదుంబర (మేడి) ఫలరసంతో స్నానం చేయించి మందార కుసుమాలతో అర్చించాలి. మహిష గుగ్గిలం నేతితో తడిపి ధూపం వేయాలి. నేయి కుడుములు (లడ్లు) ప్రేమతో నైవేద్యం పెట్టాలి. ఈ నైవేద్యంతో బాటు దక్షిణ క్రింద చర్మాన్ని బ్రాహ్మణునకివ్వవలెను. నారదా! తదుపరి శ్రద్దా భక్తులతో ఆ దేవేశ్వరునకు ప్రీతిగొల్పునట్లుగా “ప్రభో! నాట్యేశ్వరా! నీకు నమస్కారము!” అని ప్రణమిల్లాలి. వైశాఖ మాసంలో సుగంధ కుసుమ వాసనలు గల నీటితో అభిషేకం చేసి శంకరునకు తియ్యమామిడి పుష్పగుచ్చాలతో అర్చన చేయాలి. నేతితో తడిపిన పాలవృక్షపు బెరడులు ధూపం వేసి “కాలఘ్నా!” (కాలాంతకా!) అని జపిస్తూ నేయి పండ్లు నైవేద్యం పెట్టాలి. ఆ నైవేద్యదానంతో బాటు బ్రాహ్మణునకు జల కుంభములు, యజ్ఞోపవీతాలు, భోజన సామగ్రి దక్షిణ యివ్వాలి. ఇక జ్యేష్ఠ మాసంలో స్వామికి ఆమలక జల స్నానం చేయించి అర్కపుష్పాలతో (జిల్లేడు పూలు) అర్చన చేయాలి. అభ్యుదయకారియగు సరళ వృక్ష బెరడుల దూపంవేయాలి. నేయి పెరుగులతో తడిపిన సత్తు (పేలపిండి) ను నైవేద్యం చేయాలి. రెండు పాదరక్షలు గొడుగు దక్షిణగా యివ్వాలి. అనంతరం, జగత్పతి ప్రీతి సంపాదనకై “భగుని నేత్రములడచిన ప్రభూ, నీకు నమస్సులు ! పూషు (సూర్యు)ని పండ్లూడకొట్టిన స్వామీ! నీకు ప్రణామము! “ లంటూ ఉచ్చరించాలి., భక్తి పురస్పరంగా, ఇక ఆషాడ మాసంలో బిల్వోదక స్నానం శ్వేత దత్తూర (ఉమ్మెత్త ) కుసుమార్చనం ప్రతిపాదింపబడినవి. పిల్హక (సాంబ్రాణి) ధూపం వేసి నేతితో వండిన పూపాలు (అప్పాలు) నైవేద్యం చేయాలి. నేయియవలు దక్షిణగా యివ్వాలి. “దక్ష యజ్ఞనాశకా!” అని బిగ్గరగా కీర్తించాలి. శ్రావణ మాసంలో భ్రుంగరాజపత్ర (గుంటకరాకు) జలంతో స్నానం చేయించి మారేడుదళాలతో పూజించాలి. అగరుదూపం వేసి నేతితో వండిన పెరుగు వడలు, లడ్డూలు, పెరుగన్నం, అప్పములు నైవేద్యం చేయాలి. దక్షిణగా తెల్లని ఎద్దును, కపిల గోవును, బంగారం, ఎర్రని వస్త్రాలు బ్రాహ్మణునకర్పించాలి. శివుని “గంగాధర” నామం కీర్తించాలి. ఈ విధంగా మరొక ఆరు మాసాలు వ్రతం పారణ చేయాలి. ఇట్లు సంవత్సరం పాటు వృషభకేతనుని ఆరాధించిన వాడు అనంతమైన కోర్కె లను సిద్దింపజేసుకొనగలడని స్వయంగా మహేశ్వరుడే వక్కాణించాడు, ఓ దేవర్షీ! అన్ని విధాల అక్షయత్వాన్ని ప్రసాదించే ఈ ఉత్తమమైన పుణ్యవ్రతాన్ని సాక్షాత్తు రుద్రుడే వివరించాడు. దీనికి తిరుగులేదు. సాటిలేదు.

అధ్యాయము 17 complete