వామన మహా పురాణము
అధ్యాయము 10
లోమహర్షణ
1 - సపర్వతవనాముర్వీం దృష్ట్వాసంక్షుభితాంబలిః ।
పప్రచ్చోశనసంశుక్రం ప్రణిపత్య కృతాంజలిః
2 - ఆచార్య ! క్షోభామాయాతి సాబ్దిభూమిదరామహీ ।
కస్మాచ్చనాసురాన్భాగాన్ ప్రతిగృహ్ణంతివహ్నయః ?
3 - ఇతిపృష్నో-థబలినా కావ్యో వేదవిదాంవరః ।
ఉవాచదైత్యాదిపతిం చిరంధ్యా త్వామహామతిః ॥
4 - అవతీర్ణోజగద్యోనిః కశ్యపస్యగృహేహరిః ।
వామనేనేహ రూపేణ పరమాత్మా సనాతనః ॥
5 - సమానం యజ్ఞమాయాతి తవదానవపుంగవః ।
తత్పాదన్యాసవిక్షోబా దియంప్రచలితామహీ ॥
6 - కంపంతేగిర యశ్చేమే క్షుభితామకరాలయాః ।
నేయంభూతపతింభూమిః సమర్థా వోడుమీశ్వరమ్ ॥
7 - సదేవాసుర గంధర్వా యక్షరాక్షసపన్నగా ।
అనేనైవదృతాభూమి రాపో-గ్నిపవనౌనభః ॥ ।
దారయత్యఖిలాన్దేవాన్ మనుష్యాంశ్చమహాసురాన్ ॥
8 - ఇయమస్య జగద్దాతు ర్మా యా కృష్ణస్యగహ్వారీ ।
దార్యదారకభావేన యయాసంపీడితంజగత్ ॥
9 - తత్సన్నిదానాసురా నభాగార్హాఃసురద్విషః ।
భుంజతేనాసురాన్ భాగా నపితేనత్రయో-గ్నయః ॥
10 - శుక్రస్య వచనం శ్రుత్వా హృష్టరోమా-బ్రవీద్బలిః ।
ధన్యో-హంకృతపుణ్యశ్చ యన్మే యజ్ఞపతిః స్వయమ్ ।
యజ్ఞమభ్యాగతోబ్రహ్మన్! మత్తఃకో-న్యో-దికః పుమాన్ ॥
11 - యయోగినః సదోద్యుక్తాః పరమాత్మానమవ్యయమ్ ।
ద్రష్టుమిచ్చంతిదేవో-సౌమమాద్వరము పేష్యతి ।
యన్మయాచార్యః కర్తవ్యం తన్మమాజేష్టుమర్హసి ॥
లోమహర్షణ
సమస్త పర్వతవనాలతో కూడిన భూమి అలా కంపించుట చూచి తన గురువు శుక్రాచార్యులకు ప్రణమిల్లి బలి యిట్లడిగెను. ఆచార్యదేవా! సముద్ర పర్వతాదులతో సహా ఈ భూమి కదలాడుతున్నది. అసురులిచ్చు హవిస్సులను అగ్నులు నిరాకరిస్తున్నవి. ఈ విపరీతానికి కారణమేమి? బలి అడిగిన ప్రశ్నకు మహామేధావియగు శుక్రాచార్యుడు చాలాసేపు ఆలోచించి ఆ దైత్యపతితో యిలా అన్నాడు. దానవ శ్రేష్టా! జగత్కారణుడగు శ్రీహరి కరిశ్యపునింట నవతరించాడు. వామన రూపుడగునా సనాతన పరమాత్మనీ యజ్ఞవాటికకు రానున్నాడు. ఆయన అడుగుల బరువునకు భూమి కంపిస్తున్నది. కొండలు సముద్రాలు అల్లకల్లోల మవుతున్నాయి. ఆ భూతేశ్వరుని భారం భూమి మోయజాలకున్నది. దేవాసుర గంధర్వ యక్ష పన్నగ మానవాదులతో కూడిన పంచభూతాత్మకమైన విశ్వాన్నంతా ఆయన ధరించి యున్నాడు. అట్టి సర్వాధారుడగు కృష్ణుని అనిర్వచనీయమైన మాయవల్ల దార్యదారక సంబంధం ఏర్పడి జగత్తు పీడింపబడుతోంది. ఆయన సన్నిధాన ప్రభావాన సురద్వేషులయిన రాక్షసులు యజ్ఞార్హతను కోల్పోయినారు. అందుచేతనే అగ్నులు వారలర్పించు హవిస్సులను గ్రహించుటలేదు. తన గురువు చెప్పిన మాటలు విన్నంతనే బలిచక్రవర్తి సంతోషంతో పొంగిపోయాడు. ఆచార్యదేవా! ఆహా! ఏమి నా అదృష్టం, ఎంత ధన్యుడను నేను! సాక్షాత్తు యజ్ఞేశ్వరుడైన ఆ పరమాత్ముడే ణా యజ్ఞవాటికకు రానున్నాడు. నాకన్న అధికుడెవ్వడు? ఏ మహాత్ముని యోగిజనులెంతో శ్రమించి చూడవలెనని ఉబలాటపడతారో అట్టిదేవదేవుడు తనంతట తానే నాయజ్ఞానికి వస్తున్నాడు. ఆహా ఏమి నాబాగ్యము. గురుదేవా! ఈ సంతోష సమయాన నేను ఏం చేయాలో దయతో ఆదేశించండి !
శుక్రుడు
12 - యజ్ఞబాగభుజోదేవా వేదప్రామాణ్యతో-సుర ।
త్వయాతుదానవాద్వైత్య యజ్ఞబాగభుజః కృతాః ॥
13 - ఆయంచదేవఃసత్వస్థః కరోతిస్థితి పాలనమ్ ।
విసృష్టంచ తథా-యంచ స్వయమత్తిప్రజాః ప్రభుః ॥
14 - భవాంస్తుబందీభవితా నూనం విష్ణుః స్థితౌస్థితః ।
విదిత్వైవంమహాబాగః కురుయత్తేమనోగతమ్ ॥
15 - తవాస్యదైత్యాదిపతే స్వల్పకే-పిహీవస్తుని ।
ప్రతిజ్ఞానైవవోడవ్యా వాచ్యంసామతథా-ఫలమ్ ॥
16 - కృతకృత్యస్యదేవస్య దేవార్థంచైవకుర్వతః ।
అలందద్యాంధనం దేవే త్వేతద్వాచ్యంతుయాచతః ॥ ।
కృష్ణస్యదేవభూత్యర్థం ప్రవృత్తస్యమహాసురః ॥
శుక్రుడు
దైత్యరాజా! వేదాలననుసరించి సత్వగుణ సంపన్నులైన యజ్ఞ భాగభోజ్యార్హత ఏర్పడింది. కాని నీవు నీ శక్తి సామర్థ్యంవల్ల దానిని రాక్షసులకు గూడ సంపాదించి పెట్టినావు. సత్వస్వరూపి అయిన ప్రభువు సృష్టిపాలనం చేస్తూనే మరొకవంక తను సృష్టించిన ప్రజలను తానేభక్షిస్తుంటాడు. స్థితిపాలకుడగు నీ విష్ణువు నిన్ను తప్పక బందీగా చేస్తాడు. ఈ సత్యాన్ని తెలుసుకుని నీకెలా తోచునో అలా చేయుము. ఎట్టి పరిస్థితిలో కూడ ఆయనకు ఏ చిన్నవస్తువుకూడా యిస్తానని మాటయివ్వకుము. అయితే ఆయనతో తియ్యగా, ప్రయోజనశూన్యంగా మాటలు చెప్పి పంపివేయుము. కృతకృత్యుడగు కృష్ణుడు దేవకార్యం చక్కబెట్టుటకు నిన్ను యాచించినచో చాలినంత ధనమిస్తానని మాత్రం చెప్పు.
బలి
17 - బ్రహ్మన్కథమహంబ్రూయా మన్యేనాపిహియాచితః ।
నాస్తీతి, కిముదేవస్య సంసారస్యాఘహారిణః ॥
18 - వ్రతోపవాసైర్వివిదై ర్యఃప్రభుర్గృహ్యతేహరిః ।
సమేవక్ష్యతిదేహీతి గోవిందఃకిమితో-దికమ్ ?
19 - యదర్థంసుమహారంబా దమశౌచగుణాన్వితైః ।
యజ్ఞాఃక్రియంతేయజ్ఞేశః సమేదేహీతివక్ష్యతి ॥
20 - తత్సాదుసుకృతంకర్మతపఃసుచరితంచనః ।
యన్మాందేహీతివిశ్వేశః స్వయ మేవ వదిష్యతి ॥
21 - నాస్తీత్యహంగురోవక్ష్యే తమబ్యాగాతమీశ్వరమ్ ।
ప్రాణత్యాగం కరిష్యే-హం నతునాస్తిజనేక్వచిత్ ॥
22 - నాస్తీతియన్మయానోక్త మన్యేషామపయాచితమ్ ।
వక్ష్యామికథమాయాతే తదద్యచామరే-చ్యుతే ॥
23 - శ్లాఘ్యఏవహివీరాణాందానాచ్చాపత్సమాగమః ।
నబాదాకారియద్దానం తధంగబలవత్ స్మృతమ్ ॥
24 - మద్రాజ్యేనాసుఖీకశ్చిన్నదరిద్రోనచాతురః ।
నాదుఃఖితోనచోద్విగ్నో ససమాదివివర్జితః ॥
25 - హృష్టస్తుష్ట:సుగందీచ తృప్తఃసర్వాసుఖాన్వితః ।
జనఃసర్వోమహాబాగః కిముతాహం సదాసుఖీ ॥
26 - ఏతద్విశిష్టమాత్రోహం దాన బీజఫలంలభే ।
విదితం మునిశార్దూలః మయైతత్త్వన్ముఖాచ్చ్రుతమ్ ॥
27 - మత్ప్రసాదపరోనూనం యజ్ఞేనారాధితోహరిః ।
మమదానమవాప్యాసౌ పుష్ణాతియదిదేవతాః ॥
28 - ఎతద్బీజవరేదానబీజం పతతిచేత్గురౌ ।
జనార్దనేమహాపాత్రే కింనపాత్రంతతోమయా ॥
29 - విశిష్టంమమతద్దానం పరితుష్టాశ్చదేవతాః ।
ఉపభోగాచ్చతగుణం దానం సుఖకరంస్మృతమ్ ॥
30 - మత్ర్పసాదపరోనూనం యజ్ఞేనారాధితోహరిః ।
తేనాఖ్యేతినసందేహో దర్శనాదుపకారకృత్ ॥
31 - అతకోపేనచాభ్యేతి దేవబాగోపరోదతః ।
మాంనిహంతుంతతోహిస్యా ద్వధః శ్లాఘ్యతరో-చ్యుతాత్ ॥
32 - ఏతద్జ్ఞాత్వామునిశ్రేష్ఠ దానవిఘ్నకరేణమే ।
నైవభావ్యంజగన్నాథే గోవిందేసముపస్థితే ॥
బలి
భగవన్, దేహియని యాచించిన వానికి లేదని ఎలా చెప్పగలను? అట్టిచో, సంసారపాపాలు పోగొట్టే దేవదేవుడే అడిగినచో వేరే చెప్పవలెనా? ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేస్తే గాని లభించని ప్రభువు గోవిందుడే వచ్చియాచించడాన్ని మించిన భాగ్యమేముంటుంది? శమ దమాది సద్గుణ సంపన్నులే యజ్ఞేశ్వరుని కొరకై యజ్ఞ కార్యాలన్నీ చేస్తుంటారో ఆ భగవంతుడు మనలను యాచించుట చూడగా మనమెంతటి సుకృతాలు తపసదాచరణాలు చేసిన వారమో తెలియగలదు. అలాంటి విశ్వేశ్వరునకు లేదని చెప్పడం కన్న ప్రాణత్యాగం మేలు. అట్టి అభ్యాగతుడగు సాక్షాద్విష్ణుదేవుని తిరస్కరించను. ఇంతవరకు యితర యాచకుల నేవ్వరికీ నేను యివ్వనని చెప్పలేదు. అలాంటప్పుడు నేడు అచ్యుతునే ఎట్లు పొమ్మందును? తనకు బాధ కలిగించని దానం ఎంతో ముఖ్యమని పెద్దల వచనం. ఇక నావిషయమా, చూడండి. నా రాజ్యంలో సుఖికాని వాడు కాని, దరిద్రుడు కాని, ఆతురుడు గాని, దుఃఖితుడు గాని మనశ్శాంతి లేని వాడు కాని, శమదమాదులు విడిచినవాడు గాని ఒక్కడూ లేడు. అందరూ సంతుష్టులు, సుఖులు, నీలిపరులు, అందరకన్నా నేను ఎల్లపుడూ సుఖంగా ఉంటున్నాను. ఈ వైశిష్ట్యం దాన బీజం యొక్క ప్రభావమేగదా. యిలాగనే తమరే చెప్పియున్నారు గదా? ముని శ్రేష్టమగు బీజం యొక్క ప్రభావమే గదా? ముని శ్రేష్టాః నాదానం స్వీకరించినందున, దేవతలకు అభ్యుదయం కలుగజేసే పక్షంలో, ఆయజ్ఞారాధితుడగు శ్రీహరినన్ను తప్పక అనుగ్రహిస్తాడు. ముల్లోకాలకు శ్రేష్టమగు బీజం, మూలకారణుడైన సర్వోత్తమపాత్రత గలిగిన ఆ గురుబీజం జనార్దనుని చేతిలో నాదాన బీజం పడటం కన్న మేలు అభ్యుదయం ఏముంటుంది? నాకు లభించనిదంటూ ఏముండగలదు? సర్వ దేవతలను తృప్తి పరచగలనాదానం అతి విలక్షణమైనది కాగలదు. తాను అనుభవించడం కన్న దానమిచ్చుట నూరురెట్లు శ్రేష్ఠమని పెద్దల మాట, యజ్ఞాలచేత నారాదింపబడిన శ్రీహరినన్ను అనుగ్రహించుటకే, తన దుర్లభమైన దర్శన భాగ్యం కలిగించుటకే, నా యింటికి వస్తున్నాడు, గురుదేవా! ఇందులో అణు మాత్రం సరిదేహం లేదు. అలాకాక ఒకవేళ, దేవతల యజ్ఞ భాగాలు ఆపినందుకు నామీద కోపంతో, నన్ను వధించుటకే వచ్చినా అదినాకు యింకా మంగళ ప్రదం అవుతుంది. ఆయన చేత మరణం సామాన్యంగా దొరుకునా ? గురూత్తమా! ఇవన్నీ సాకల్యంగా ఆలోచించి గుర్తించిన మీదట, జగన్నాదుడగు గోవిందుడు యాచించినచో కాదనుట, లేదనుట ఈ రాదనుట ఎంత మాత్రమూ భావ్యము కాదు.
లోమహర్షణ
33 - ఇత్యేనంవదత స్తవ్య ప్రాప్తస్తస్య జనార్దనః ।
సర్వదేవమయో-చింత్యో మాయావామనరూపదృక్ ॥
34 - తందృష్ట్వాయజ్ఞవాటంతు ప్రవిష్టమసురాః ప్రభుమ్ ।
జగ్ముః ప్రభావతఃక్షోభం తేజసాతస్యనిష్ప్రబాః ॥
35 - జేపుశ్చ మునయన్తత్ర యేనమేతామహాధ్వరే ।
వసిష్టోగాదిజోగర్గో అన్యేచమునిసత్తమాః ॥
36 - బలిశ్చైవాఖిలంజన్మ మేనేనఫలమాత్మనః ।
తతఃసంక్షోభ మాపన్నో నకశ్చిత్ కించి దుక్తవాన్ ॥
37 - ప్రత్యేకందేవేశం పూజయామాసతేజసా ।
అథా-సురపతిఃప్రహ్వం దృష్ట్వామునివరాంశ్చ తాన్ ॥
38 - దేవదేవపతిః సాక్షాద్ విష్ణుర్వామనరూపధృక్ ।
తుష్టావయజ్ఞంవహ్నించ యజమానమథార్చితః ।
యజ్ఞకర్మాదికారస్తాన్ సదస్యాన్ ద్రవ్యసంపదమ్ ॥
39 - సదస్యాః పాత్రమఖిలం వామనంప్రతితత్ క్షణాత్ ।
యజ్ఞవాటస్థితంవిప్రాః సాదుసాద్విత్యుడైరయన్ ॥
40 - సచార్ఘమాదాయబలిః ప్రోద్బూతపులకస్తదా ।
పూజయామానగోవిందం ప్రాహచేదం మహాసురః ॥
లోమహర్షణ
మునులారా! బలియిలా అంటూండగానే సర్వదేవమయుడు, అచింత్యుడునగు జనార్థనుడు కపట వామనరూపంలో అచటకు వచ్చిచేరాడు! అలావచ్చిన ఆతేజోమయుని చూస్తూనే యజ్ఞశాలలోనున్న దైత్యులంతా సంక్షోభంతో తమ తేజస్సు కోలుపోయారు. కాగా జప దీక్షలో ఉన్నమునులు వసిష్ఠ విశ్వామిత్ర గర్గాదిమహర్షులు బలి చక్రవర్తి వీరంతా తమ జన్మలు సార్థకమైనట్లు ఆనందించారు, సంభ్రమాశ్చర్యాల్లో మునిగి వారెవ్వరు మాటాడలేక పోయారు. అందరూ ఆ దేవదేవుని తమ తమ భక్తి కొద్ది పూజించి నిలబడ్డారు. వినయానతులైన ఆ దైత్యేశ్వరునీ, ఋషి మున్యాదులను చూచి ప్రీతుడైన విష్ణుదేవుడు ఆయజ్ఞాన్నీ, అగ్నులను, యజమానిని. అర్చితులను, యజ్ఞకర్మాదికారులను సభ్యులను ఉత్తమమైన యజ్ఞ సంఖారాలను బహువిధాల ప్రశంసించాడు. సర్వోత్తమాదికారి (పాత్ర) అయిన ఆవామన దేవుని చూచి సదస్యులందరు సాధువాక్యాలు పలికారు. అంతట ఆనందంతో దేహమంతా పులకించగా నాబలి రాజేంద్రుడర్ఘ్య పాద్యాదులతో ణా గోవిందునే అర్చించి యిలా అన్నాడు.
బలి
41 - సువర్ణరత్నసంఘాతో గజాశ్వసమితి స్తథా ।
స్త్రియోవస్త్రాణ్యలం కారాన్ గావోగ్రామాశ్చపుష్కలాః ॥
42 - సర్వేచ సకలా పృథ్వీ భవతో వా యదీప్పితమ్ ।
తద్దదామివృణుష్వేష్టం మమార్థాః సంతితేప్రియాః ॥
43 - ఇత్యుక్తోదైత్యపతినా ప్రీతిగర్భాన్వితం వచః ।
ప్రాహసస్మిత గంభీరం భగవాన్ వామనాకృతిః ॥
44 - మమాగ్ని శరణార్థాయ దేహిరాజన్ పదత్రయం ।
సువర్ణ గ్రామరత్నాది తధర్తిభ్యః ప్రదీయతామ్ ॥
బలి
వటూత్తమా! నాకు కలిగిన సంపదలో నీకేది యిష్టమో దానిని కోరుకొనుము. తప్పక యిచ్చెదను. బంగారం, రత్నరాసులు, గజాశ్వ సమూహాలు, సుందరాంగనలు, వస్త్రాభరణాదులు, ఆలమందలు, గ్రామాలు, నారాజ్యమంతా నీముందున్నది. యిందులో ఏమి కావలెనో కోరుకొనుము. దైత్యేశ్వరుడత్యంత ప్రేమాతిశయంతో పలికిన మాటలు విని చిరునవ్వు పెదవుల మీద నాట్యం చేయగా గంభీరమైన స్వరంతో, నాకు మాత్రం పవిత్రాగ్నులుంచుకొనుటకు మూడడుగుల నేల నొసగి, తక్కినవన్నియు అవి కావలసిన అర్థులకొసగుమనెను.
బలి
45 - త్రిభిఃప్రయోజనం కింతే వదైఃపదవతాంవరః ।
శతం శతసహస్రంవాపదానాం మార్గతాం భవాన్ ॥
బలి
పదవీదారులలో శ్రేష్టుడా! మూడు పదాలనేలతో నీకేంలాభం? ఏ నూరువేల అడుగుల భూమియో అడుగుము.
శ్రీవామన
46 - ఏతావతాదైత్యపతేః కృతకృత్యో-స్మిమార్గణే ।
అన్యేషామర్థినాం విత్తమిచ్చయా దాస్యతే భవాన్ ॥
47 - ఏదచ్చ్రుత్వాతుగదితం వామనస్య మహాత్మనః ।
వాచయామాసవైతస్మై వామనాయ మహాత్మనే ॥
48 - పాణౌతుపతితేతోయే వామనో-భూదవామనః ।
సర్వదేవమయంరూపం దర్శయామాస తత్క్షణాత్ ॥
49 - చంద్రసూర్యౌ తు నయనే ద్యౌః శిరశ్చరణౌ క్షితిః ।
పాదాంగుల్యః పిశాచాస్తు హస్తాంగుల్యశ్చ గుహ్యకాః ॥
50 - విశ్వేదేవాశ్చ జానుస్థాజం ఘే సాధ్యాః సురోత్తమాః యక్షానఖేషుసంభూతా రేఖాస్వప్సరస స్తథా ॥
51 - దృష్టిర్ ఋక్షాణ్యశేషాణి కేశాః సూర్యాంశవః ప్రభోః ।
తారకా రోమకూపాణి రోమేషు చ మహర్షయః ॥
52 - బాహవో విదిశస్తస్య దిశః శ్రోత్రే మహాత్మనః ।
అశ్వినౌశ్రవణే తస్య నాసా వాయుర్మహాత్మనః ॥
53 - ప్రసాదేచంద్రమాదేవో మనోధర్మః సమాశ్రితః ।
సత్యమస్యాభవద్వాణీ జిహ్వా దేవీ సరస్వతీ ॥
54 - గ్రీవా-దితిర్దేవమాతా విద్యాస్తద్వలయస్తథా ।
స్వర్గద్వారమభూన్మైత్రం త్వష్టాపూషాచ వైభ్రువౌ ॥
55 - ముఖేవైశ్వానరశ్చాస్య వృషణౌతు ప్రజాపతిః ।
హృదయంచవరం బ్రహ్మ పుంస్త్వం వైకశ్యపోమునిః ॥
56 - వృష్టే-స్య వసవోదేవా మరుతః పర్వసందిషు ।
వక్షఃస్థలేతథారుద్రో ధైర్యే చాస్య మహార్ణవః ॥
57 - ఉదరేచాస్య గంధర్వా మరుతశ్చ మహాబలాః ।
లక్ష్మీ ర్మేధాదృతిః కాంతిః సర్వ విద్యాశ్చ వైకటిః ॥
58 - సర్వజ్యోతీంషి యానీహ తపశ్చ పరమం మహత్ ।
తస్య దేవాదిదేవస్య తేజః ప్రోద్భూతముత్తమమ్ ॥
శ్రీ వామన
ఓ రాక్షసేశ్వరా! ఈ మాత్రం దానం నాకు చాలు. ఇంకా ఎందరో యాచకులున్నారు. వారలు కోరినవన్నీ యిచ్చి వేయుము. అంతట బలి వామనునకు అడిగినదిత్తునని మాట యిచ్చాడు. దాన జలం చేతిలో పడగానే అంతవరకు పొట్టిగానున్న ఆ ప్రభువు అవామనుడై గట్టివాడైనాడు. సర్వదేవమయమైన తన విరాడ్రూపాన్ని చూపించాడు. ఆ విశ్వరూపుడి నేత్రాలు చంద్ర సూర్యులు, శిరస్సుద్యులోకం, కాళ్ళు భూమి, పాదాంగుళులు పిశాచాలు, చేతుల వ్రేళ్ళు యక్షులు, మోకాళ్ళు విశ్వదేవులు జంఘలు, గోళ్ళుయక్షులు, రేఖలు అప్సరోగణం, చూపులు నక్షత్రాలు, కేశాలు సూర్యకిరణాలు, తారలు రోమకూపాలు, ఆ రోమాలలో మహర్షులున్నారు. బాహువులు విదికలు, శ్రోత్రుగుజందిశలు, అశ్వనీ దేవతలు బాహ్యశ్రవణాలు, నాసిక వాయువులు, ఆ మహాత్ముని అనుగ్రహం చంద్రుడు, మనస్సులో ధర్మదేవత, సత్యమాయన వాక్కు, సరస్వతి నాలుక, కంటం దేవమాత అదితి, త్రయీవిద్య దానిలోని త్రివశులు, అనూరాధ స్వర్గద్వారం, కనుబొమలు త్వష్టపూషులు, నోరు వైశ్వానరాగ్ని, వృషణాలు ప్రజాపతులు, పరబ్రహ్మ హృదయం, పుంస్త్వం (మగటిమి) కశ్యపుడు, వీపు పశువులు, సకలసందులు మరుత్తులు, వక్షోభాగం రుద్రుడు, దృతి (సహనశక్తి) మహాసముద్రాలు, కడుపు గంధర్వులు, లక్ష్మి మేధాదృతి కాంతి సకల విద్యలు కటి ప్రదేశం. ఆ ప్రభువు యొక్క తేజస్సే సకలమైన గ్రహ నక్షత్రాదిజ్యోతిర్గణంగా వెలిగిపోతోంది.
59 - తనౌకుక్షిషువేదాశ్చ జానునీచ మహామఖాః ।
ఇష్టయః పశ్చాస్య ద్విజానాం చేష్టితానిచ ॥
60 - తస్యదేవమయంరూపం దృష్ట్వా విష్ణోర్మహాత్మనః ।
ఉపసర్పంతితేదైత్యాః పతంగా ఇవ పావకమ్ ॥
61 - చిక్షురస్తూ మహాదైత్యః పాదాంగుష్టం గ్రుహీతవాన్ ।
దంతాభ్యాంతస్యవై గ్రీవా మంగుష్టే నాహనద్దరిః ॥
62 - ప్రమథ్యసర్వానసురాన్ పాదహస్తతలైర్విభుః ।
కృత్వారూపంమహాకాయం సంజహారాశుమేదినీమ్ ॥
63 - తస్యవిక్రమతోభూమిం చంద్రాదిత్యౌ స్థనాంతరే ।
నభోవిక్రమమా మాణస్య సక్తిదేశే స్థితావుభౌ ॥
64 - పరం విక్రమమాణస్య జానుమూలే ప్రభాకరౌ ।
విష్ణోరాస్తాంస్థితస్యైతౌ దేవపాలనకర్మణి ॥
65 - జిత్వాలోక త్రయంతాంశ్చ హత్వాచాసురపుంగవాన్ ।
పురందరాయత్రైలోక్యం దదౌవిష్ణురురుక్రమః ॥
66 - సుతలంనామపాతాళ మదస్తాద్వసుదాతలాత్ ।
బలేర్దత్తంభగవతా విష్ణునాప్రభవిష్ణునా ॥
67 - అథదైత్యేశ్వరం ప్రాహ విష్ణుఃసర్వేశ్వరేశ్వరః ।
యత్త్వయాసలిలందత్తం గృహీతంపాణినామయా ॥
68 - కల్పప్రమాణంతస్మాత్తే భవిష్యత్యాయురుత్తమమ్ ।
వైవస్వతేతథా-తీతే కాలేమన్వంతరే తథా ॥
69 - సావర్ణి కేతుసంప్రాప్తే భవానింద్రోభవిష్యతి ।
ఇదానీంభువనం సర్వం దత్తంశక్రాయవైపురా ॥
70 - చతుర్యుగవ్యవస్థాచ సాధికా హ్యేకసప్తతిః ।
నియంతవ్యామయా సర్వే యే తస్యపరిపంథినః ॥
71 - తేనాహంపరయాభక్త్యాపూర్వమారాధితో బలే ! సుతలంనామ పాతాళం సమాసాద్య వచోమమ ॥
72 - వసాసుర మమాదేశం యథావత్పరిపాలయన్ ।
తత్రదేవసుఖోపేతే ప్రాసాదశతసంకులే ॥
73 - ప్రోత్పుల్లపద్మసరసి హ్రదశుద్ధసరిద్వరే ।
సుగంధీ రూపసంపన్నో వరాభరణభూషితః ॥
74 - స్రక్చందనాదిదిగ్దాంగో నృత్యగీతమనోహరాన్ ।
ఉపభుంజన్ మహాభోగాన్వివిధాన్ దానవేశ్వర ॥
75 - మమాజ్ఞయాకాలమిమం తిష్ఠ స్త్రీశతసంవృతః ।
యావత్సురైశ్చ విప్రైశ్చ న విరోధంగమిష్యసి ॥
76 - తావత్త్వం భుంక్ష్వ సంభోగాన్ సర్వకామ సమన్వితాన్ ।
యదాసురైశ్చ విప్రైశ్చ విరోధం త్వం కరిష్యసి ।
బందిష్యంతితదా పాశావారుణా ఘోరదర్శనాః ॥
నిగమాలన్నీ ఆయన శరీరంలో కుక్షిలో ఉన్నాయి. మహాయజ్ఞాలన్నీ యిష్టులు పశువు బ్రాహ్మణ కర్మలు మోకాళ్ళలో నిలిచాయి. మహాత్ముడగు విష్ణువుయొక్క ఆ సర్వదేవాత్మక విశ్వరూపాన్ని చూచి రాక్షసులందరు అగ్ని జ్వాలల్లోదూకే శలభాల్లాగా ఆయన మీదకు లంఘించారు, చిక్షురుడా ప్రభువు బొటన వ్రేలిని తన దంతాలతో పట్టుకోగా ఆ హరి వాని కంటాన్ని ఆ కొన గోటితో త్రుంచి వేశాడు. ఆ విధంగా రాక్షసులందరను తన అరచేతులతో అర కాళ్ళతో నణగ ద్రొక్కి త్రివిక్రమరూపంతో విజ్రుంభించాడు. అడుగుతో భూమిని ఆక్రమించినపుడు సూర్య చంద్రులాయన స్తనాల మధ్య నిలచారు. ఆకాశాన్ని ఆక్రమించగా వారిద్దరు పిరుదుల వద్దకు దిగారు. యింకా పైభాగాన్ని ఆక్రమించగా ఆ సూర్య చంద్రులు మోకాళ్ళ క్రిందకు చేరారు. ఈ విధంగా దేవతల కార్యం సాధించుటకు ఆ విష్ణువు విరాట్ రూపాన్ని ధరించి రాక్షస సంహారంగావించి త్రిలోక రాజ్యాన్ని పురందరునకిచ్చాడు. పరమ ప్రదాతయైన బలిరాజేంద్రునకు భూమికి క్రింద ఉన్న సుతలమనే పాతాళలోకాన్ని ప్రసాదించాడు. అంతట నాదైత్యపతితో యిలా అన్నాడు. ఓ బలి రాజా! నీవిచ్చిన దానజలాన్ని నేను నాచేతితో గ్రహించాను. ఈ కారణంవల్ల నీకు కల్పాయుర్దాయము, ఉత్తమమైనది. చేకూరినది. ఇప్పుడు జరుగుతున్న వైవస్వతమవ్వంతరం గడచిన తర్వాత రాబోవు సావర్ణి మవ్వంతరంలో నీవు యింద్ర పదవి పొందగలవు. ఈ లోపల సంభవించు డెబ్బదియొక్క చతుర్యుగ చక్రాల లోపల యింద్రుని నెదిరించు శత్రువులందరు నాచేత దండింపబడుతారుసుమా! ఎందుకంటే అతడు నన్ను పూర్వం ఎంతో భక్తితో ఆరాధించాడు. కనుక నా ఆదేశానుసారం సుతల లోకానికివెళ్లి అక్కడ సుఖంగా ఉండు. అక్కడ నీకు నూర్లుకొలది ఉత్తుంగసౌధాలు, కమలాకరాలు, ఉపవనాలు, చీనిచీనాంబరాలు రత్నాభరణాదులు స్రక్చందనాది సకల సౌఖ్యాలు సమకూరుతవి. నృత్యగీతాది వినోదాలనుభవిస్తూ శతాధిక సుందరీమణులతో విహరించ గలవు. దేవ బ్రాహ్మణులకు విరోధంగా ప్రవర్తించనంతకాలము నీవు అన్ని భోగాలు అనుభవించగలవు. అలాకాక దేవ బ్రాహ్మణులతో వైరం పెట్టుకొనినచో భయంకరమైన వరుణ పాశాలు నిన్ను బంధించ గలవు.
బలి
77 - తత్రాసతో మే పాతాళే భగవన్ భావదాజ్ఞయా ।
కింభవిష్యత్యుపాదాన ముపభోగోపపాదకమ్ ।
ఆప్యాయితో యేనదేవఃస్మరేయం త్వామహం సదా ॥
బలి
భగవన్, నీ యాజ్ఞప్రకారం పాతాళంలో ఉన్నన్నాళ్ళు నిరంతరం నీ స్మరణ చేస్తూ ఉండుటకు అచట నాకు తగిన భోగాపదార్తములేవి గలవు?
భగవానుడు
78 - దానాన్యవిదిదత్తాని శ్రాద్దస్యశ్రోత్రియాణి చ ।
హుతాన్యశ్రద్దయా యాని తాని దాస్యంతి తేఫలమ్ ॥
79 - అధక్షిణా స్తథా యజ్ఞాః క్రియాశ్చావిధినా కృతాః ।
ఫలానితవదాస్యంతి అధీతన్యవ్రతాని చ ॥
80 - ఉదాకేన వినాపూజా వినాదర్బేణ యాక్రియా ।
ఆజ్యేనచ వినాహోమం ఫలం దాస్యంతి తేబలే ॥
81 - యశ్చేదం స్థానమాశ్రిత్య క్రియాః కాశ్చిత్కరిష్యతి ।
న తత్ర చాసురోభాగో భవిష్యతి కదాచన ॥
82 - జ్యేష్టాశ్రమే మహాపుణ్యే తథా విష్ణుపదేహ్రదే ।
యేచశ్రాద్ధానిదాస్యంతి వ్రతం నియమమేవ చ ॥
83 - క్రియాఃకృత్వాచ యాఃకాచి ద్విదినా-విదినాపి వా ।
సర్వంతదక్షయంతస్య భవిష్యతి నసంశయః ॥
84 - జ్యేష్టేమాసిసితే పక్షే ఏకాదశ్యా ముపోషితః ।
ద్వాదశ్యాం వామనందృష్ట్వా స్నాత్వా విష్ణుపదేహ్రదే ।
దానందత్వాయ థాశక్త్యా ప్రాప్నోతి పరమం పదమ్ ॥
భగవానుడు
“ఓ బలిరాజా! బాగా వినుము. అవిధి పూర్వకంగా చేసిన దానాలు, అవైదికంగా చేసిన శ్రాద్దకర్మలు, శ్రద్దలేకుండా చేసిన హోమాలు, వానిఫలం నీవు పొందగలవు. దక్షిణ యివ్వకుండా చేసిన యజ్ఞాలు, విధివిహితాలు కాని క్రియలు, బ్రహ్మచర్య దీక్ష లేకుండా చేసిన వేదాధ్యయనాలు, ఉదకం లేకుండా చేసిన పూజలు, దర్భ లేకుండా జరిగినకర్మలు , నేయిలేని హోమాలు నీకు కావలసిన ఫలాన్నిస్తాయి. ఈ ప్రదేశాన చేయబడిన ఎలాంటి కర్మలలోనూ అసురులకు హవిర్భాగాలుండవు. పరమపావనమైన జ్యేష్టాశ్రమంలో విష్ణుపద సరోవరంలో, నియమపూర్వకంగా యేయేశ్రాద్దములాచారింపబడునో, విధివిధానంగా గాని, అవిధిపూర్వకంగాగాని చేయబడు సమస్త కర్మలకూ అక్ష్యఫలప్రాప్తి కలుగుతుంది. సందేహంలేదు. జ్యేష్ఠశుద్ధ ఏకాదశినాడుపవసించి ద్వాదశినాడు వామనదర్శనం చేసికొని విష్ణు పదసరోవరంలో స్నానంచేసి తనశక్తి కొలది దానంచేయుచో పరమపదప్రాప్తి లభించగలదు.”
లోమహర్షణ
85 - బలేర్వరమిమం దత్వా శక్రాయచ త్రివిష్టపమ్ ।
వ్యాపినాతేనరూపేణ జగామాదర్శనం హరిః ॥
86 - శశాసచయథాపూర్వం ఇంద్రస్త్రై లోక్యమూర్జితః ।
నిః శేషంచతదాకాలం బలిః పాతాళమాస్థితః ॥
87 - ఇత్యే తత్కథితంతస్య విష్ణోర్మాహత్మ్య ముత్తమమ్ ।
వామనస్యశృణ్వన్యస్తు సర్వపాపైః ప్రముచ్యతే ॥
88 - బలిప్రహ్లాద సంవాదం మంత్రితం బలిశుక్రయోః ।
బలేర్విష్ణోశ్చచరితం యేస్మరిష్యంతి మానవాః ॥
89 - నాథయో వ్యాధయస్తేషాం నచ మోహాకులం మనః ।
భవిష్యతిద్విజశ్రేష్టాః పుంసస్తస్య కదాచన ॥
90 - చ్యుతరాజ్యోనిజం రాజ్యమిష్టప్రాప్తిం వియోగవాన్ ।
సమాప్నోతి మహాభాగా నరః శ్రుత్వా కథామిమామ్ ॥
91 - బ్రాహ్మణో వేదమాప్నోతి క్షత్రియో జయతే మహీమ్ ।
వైశ్యోధనసమృద్దించ శూద్రః సుఖమవాప్నుయాత్ ।
వామనస్యచమాహాత్మ్యం శృణ్వన్ పాపైః ప్రముచ్యతే ॥
లోమహర్షణ
మహర్షులారా! శ్రీహరి ఈ విధంగా బలిరాజేంద్రునకు వరములు, శతకత్రువుకు స్వర్గరాజ్యాన్ని యిచ్చి తనవిశ్వరూపంతో అంతర్దానం పొందాడు. ఇంద్రుడెప్పటివలె దర్పంతో ముల్లోకాలను పాలించాడు. గడువుపూర్తి అగునంతవరకు బలిరాజేంద్రుడు పాతాళంలో ఉండిపోయాడు. ఇలాంటి వామనరూపియగు విష్ణుదేవుని మాహాత్మ్యగాథ విన్నవారల పాపములు తొలగిపోవును. బలి ప్రహ్లాదుల సంవాదం, బలి శుక్రాచార్యుల మంత్రాలోచనము, బలివామన దేవుల చరిత్రము స్మరించిన వారలకెటువంటి ఆధులు వ్యాధులు, మనోవ్యథలు కలుగజాలవు. అధికారం, రాజ్యంకోలుపోయిన వారలకు తత్ప్రాప్తి, వియోగిజనులకు యిష్టజనుల సమాగమము, ఈ కథా శ్రవణంచేయు మానవులకు లభించగలవు; బ్రాహ్మణులకు వేద విద్య, క్షత్రియులకు భూమివిజయం వైశ్యులకు ధనసమృద్ది శూద్రులకు సుఖప్రాప్తి కలుగును. శ్రీవామన దేవుని మాహాత్మ్య శ్రవణంవల్ల సర్వపాపాలు నశించును.
అధ్యాయము 10 complete
Summary of chapter 83 of the Vāmana Mahā Purana is as follows:
The text extols the holy region of Brahmāvarta and Sthanu-tīrtha, where Parameśvara Śiva established His eternal Sthanu-linga form for the protection and spiritual uplifting of all living beings. The narrative explains that worshipping Sthanu-Śiva with lotus flowers, bilva leaves, and holy Sarasvatī water cleanses the devotee of the most severe karmic impurities. Seekers who perform devout circumambulation around Sthanu-tīrtha attain royal prosperity in this life and ultimate liberation in the divine realm of Kailāsa.