అధ్యాయము 3

ఋషులు

1 - దేవానాం బ్రూహి నః కర్మ యద్ వృత్తాస్తే పరాజితాః

 కథం దేవాదిదేవో_సౌ విష్ణుర్వామనతాంగతః 

ఋషులు

మహర్షే పరాజయం పొందిన దేవతలాతర్వాత ఏం చేశారు? దేవాదిదేవుడైన విష్ణువు ఎలా వామన రూపం ధరించాడు?

లోమహర్షణ

2 - బలిసంస్థంచ త్రైలోక్యం దృష్ట్వా దేవః పురందరః

 మేరుప్రస్థం యయౌ శక్రఃస్వమాతు ర్నిలయం శుభమ్

3 - సమీపం ప్రాప్యామాతుశ్చ కథయామాస తాం గిరం

 ఆదిత్యాశ్చయథాయుద్దేదానవేనపరాజితాః

లోమహర్షణ

ముల్లోకాలు బలికి స్వాధీనం కావడంతో ఇంద్రుడు తన మాతృస్థానమైన చక్కని మేరుగిరికి వెళ్లి తన తల్లి అయిన అదితితో సంగ్రామ భూమిలో దానవులచేత ఆదిత్యులంతా నిర్జింపబడిన వృత్తాంతం వివరించాడు.

అదితి

4 - యద్యేవం పుత్రయుష్మాభి ర్నశక్యో హంతు మాహవే

 బలిర్విరోచనసుతః సర్వైశ్చైవ మరుద్గణైః

5 - సహస్రశిరసాశక్యః కేవలం హంతుమాహవే

 తెనైకేనసహస్రాక్ష ! నసహన్యేన శక్యతే

6 - తద్వత్ పృచ్చామి పితరం కశ్యపం బ్రహ్మవాదినమ్

 పరాజయార్థం దైత్యస్య బలేస్తస్య మహాత్మనః

7 - తతో_దిత్యా సహ సురాః సంప్రాప్తాః కశ్యపాంతికమ్

 తత్రాపళ్యాంతమారీచం మునిం దీ ప్తతపోనిధిమ్

8 - ఆద్యందేవగురుం దివ్యం ప్రదీప్తం బ్రహ్మవర్చసా

 తేజసాభాస్కరాకారం స్థితమగ్ని శిఖోపమమ్

9 - న్యస్తదండం తపోయుక్తం బద్ధకృష్ణాజినాంబరమ్

 వల్కలాజిన నంవీతం ప్రదీప్తమివతేజసా

10 - హుతాశమివదీప్యంత మాజ్యగంధపురస్కృతమ్

 స్వాధ్యాయవంతం పితరం వపుష్మంత మివానలమ్

11 - బ్రహ్మవాదిసత్యవాది సురాసురగురుంప్రభుమ్

 బ్రహ్మణ్యా_ప్రతిమం లక్ష్మ్యా కశ్యపందీప్తతేజసమ్

12 - యః స్రష్టాసర్వలోకానాం ప్రజానాంపతిరుత్తమః

 అత్మభావవిశేషేణ తృతీయో యః ప్రజాపతిః

13 - అథప్రణమ్యతేవీరాః సహాదిత్యాసురర్షభాః

 ఊచుఃప్రాంజలయః సర్వే బ్రహ్మాణ మివమానసాః

14 - అజేయో యుధిశక్రేణ బలిర్దైత్యో బలాధికః

 తస్మాద్విధత్తనఃశ్రేయో దేవానాం పుష్టివర్ధనమ్

15 - శ్రుత్వాతువచనంతేషాం పుత్రాణాం కశ్యపఃప్రభుః

 అకరోద్ గమనేబుద్ధిం బ్రహ్మలోకాయ లోకకృత్

అదితి

పుత్రా! మరుద్గణాల సహాయంతో కూడ నీవు విరోచనసుతుడు బలిని జయించలేనంటివి. అట్టిచో విష్ణువొకడు తప్ప వేరెవ్వరూ ఆతనిని జయించలేరు. కనుక మనం మీ తండ్రి బ్రహ్మజ్ఞుడైన కశ్యపుని వద్దకువెళ్లి బలిదైత్యుని పరాభవించునుపాయం అడుగుదము. పద. అంతటనాదేవతలు అదితితో గూడి కశ్యపుడుండు చోటికి వెళ్లి అచట పరమతపోనిధి మరీచ పుత్రుడు ఆద్యదేవ గురుడు దివ్యబ్రాహ్మ వర్చస్వి, రెండవ భాస్కరునివలె, అగ్నిశిఖవలె తేజరిల్లుచూ ఉన్న ఆ మహనీయుని దర్శించారు. ఆ తపస్వి దండం, కృష్ణాజినాంబరం, వల్కలాజినం ధరించి ఆజ్యగంధయుక్తమైన హోమాగ్నిలా స్వాధ్యాయనిరతుడై యున్నాడు. అతడు బ్రహ్మవాదులు సత్యవాదులగు సురాసురులకు గురువు, అప్రతిమానమైన బ్రహ్మతేజంతో వెలిగిపోతున్నాడు. సర్వలోకస్రష్ట ప్రజాపతులలోనుత్తముడు. అలాంటి కశ్యప బ్రహ్మను దర్శించి ఆదిత్యులతో కూడిన ఆ దేవవీరులంతా, బ్రహ్మమానస పుత్రులు బ్రహ్మకువలెనమస్కరించి అంజలి ఘటించి ఇలా విన్నవించారు. యుద్ధంలో బలి దైత్యుడింద్రునకజేయుడై యున్నాడు. ఈ సంకట సమయంలో దేవతల శ్రేయస్సుకు పుష్టివృద్ధికి తగిన ప్రయత్నం చేయండి. తన పుత్రుల దీనవచనాలు విని కశ్యపుడు, విధాతను దర్శించుటకై బ్రహ్మలోకానికి వెళ్ళ నిశ్చయించుకున్నాడు.

కశ్యపుడు

16 - శక్రః ! గచ్చామ సదనం బ్రహ్మణః పరమాద్భుతమ్

 తథా పరాజయం సర్వే బ్రహ్మణః ఖ్యాతుముద్యతాః  ॥

17 - సహాదిత్యా తతోదేవా యాతాః కాశ్యపమాశ్రమమ్

 ప్రస్థితా బ్రహ్మసదనం మహర్షిగణసేవితమ్

18 - తే ముహూర్తేన సంప్రాప్తా బ్రహ్మాలోకం సువర్చనః

 దివ్యైః కామగమైర్యానై ర్యథార్హై స్తేమహాబలాః  ॥ 

19 - బ్రాహ్మణం ద్రష్టుమిచ్చంత స్తపోరాశినమవ్యయం

 ఆధ్యగచ్చంత విస్తీర్ణాం బ్రహ్మణః పరమాం సభామ్

20 - షట్పదోద్గీతమధురాం సామగైః సముదీరితామ్

 శ్రేయస్కరీ మమిత్రఘ్నీం దృష్ట్వా సంజహృషు స్తదా

21 - ఋచో బహ్వృచముఖ్యైశ్చ ప్రోక్తాః క్రమపదాక్షరాః

 శుశ్రువు ర్విబుధవ్యాఘ్రా వితతేషు చకర్మసు    

22 - యజ్ఞవిద్యావేదవిదః పదక్రమవిద స్తథా

 స్వరేణపరమర్షీణాం సా బభూవ ప్రణాదితా

23 - యజ్ఞ సంస్తవ విద్భిశ్చ శిక్షావిద్భి స్తథా ద్విజైః

 ఛందసాంచైవ చార్థఙ్ఞైః సర్వవిద్యావిశారదైః

24 - లోకాయతికముఖ్యైశ్చ శుశ్రువుః స్వరమీరితమ్

 తత్రతత్రచవిప్రేంద్రా నియతాః శంసితవ్రతాః

25 - జపహోమపరా ముఖ్యా దదృశుః కశ్యపాత్మజాః

 తస్యాంసభాయామాస్తేస బ్రహ్మలోకపితామహః

26 - సురాసురగురుః శ్రీమాన్ విద్యయా వేదమాయయా

 ఉపాసంతచతత్రైప ప్రజానాం పతయఃప్రభుః  ॥

27 - దక్షఃప్రచేతాః పులహోమరీచిశ్ప ద్విజోత్తమాః

 భృగురత్రిర్వసిష్ఠశ్చ గౌతమో నారదస్తథా

28 - విద్యాస్తథాంతరిక్షంచ వాయు స్తేజోజలం మహీ

 శబ్దః స్పర్శశ్చరూపంచ రసోగంధస్తథైవచ

29 - ప్రకృతిశ్చ వికారశ్చ యచ్చాన్యత్కారణం మహత్

 సాంగోపాంగాశ్చ చత్వారో వేదాలోకపతి స్తథా 

30 - నయాశ్చక్రతవశ్చైవ సంకల్పః ప్రాణఏవచ

 ఏతేచాన్యే చ బహవః స్వయంభువ ముపాసతే

కశ్యపుడు

దేవరాజా! మనమందరమిప్పుడు పరమాద్భుతమైన బ్రహ్మ సదనానికి వెళ్లి ఆయనకీపరాజయగాథను తెలుపుదము. అంతట కశ్యపాశ్రమమునకువెళ్ళిన దేవతలందరు నచట నుండి మహర్షి గణాల చేత కొలవబడుతున్న బ్రహ్మ నెలవుకు బయలుదేరారు. ఆ మహాబలులందరు కామగమనం కలిగిన దివ్యయానాల మీద నెక్కి త్రుటికాలంలో తేజోమయమైన బ్రహ్మలోకాన్ని చేరుకున్నారు. అవ్యయుడు తపోరాశి అయిన బ్రహ్మను దర్శించే కుతూహలంతో వారు, సువిశాలమైన సామగానంతో, భ్రమరఝుంకారాలతో ప్రతిధ్వనిస్తూ శ్రేయాలొనగూర్చి శత్రునాశనం చేయగల మనోహరమైన ఆ బ్రహ్మ సభను చూచి పరమానందం పొందారు. బహ్వృచ ప్రముఖులచేత, క్రమపాదాక్షర సమన్వితంగా, ఆయా సంబద్ధ క్రతువుల కనుగుణంగా చదువబడే ఋగ్వేద మంత్రములనా విబుధవర్యులు ఆలకించిరి. యజ్ఞప్రశంసతో బాటు శిక్షాస్త్రంలో పారీణులయిన ద్విజులయు, వేదార్థం తెలిసినవారు సర్వవిద్యాకోవిదులు లౌకిక విద్యల్లో గూడ ప్రవీణులగు వారల ప్రవచనాలను ఆ పుణ్యవ్రతులయిన దేవతలు తత్తత్ప్రదేశాలలో వినగాలిగారు. జపహోమనిరతులైన ఆ కశ్యపకుమారులు(దేవతలు) ఆ సభా మధ్యంలో శ్రీమంతుడు సురాసురగురుడు లోకపితామహుడునైన బ్రహ్మను చూచారు. ప్రజాపతులందరు ఆయనను ఉపాసిస్తున్నారు. దక్షుడు, ప్రచేతసులు, పులహమరీచులు, భ్రుగువు, అత్రి, వశిష్టుడు, గౌతమనారదులు మొదలయిన బ్రహ్మణ్యులు, విద్యలు, అంతరిక్షం, వాయువు తేజం నీరు భూమి శబ్ద స్పర్శ రూపరసగంధాలు ప్రకృతి వికృతులు, మహత్తు, కారణం, సాంగోపాంగాలయిన నాలుగువేదాలు, నయ, క్రతు, సంకల్ప ప్రాణాలు అన్నీ దేహం ధరించి ఆ బ్రహ్మనుపాసిస్తున్నారు. వీరేగాక యింకా ఎందరెందరో ఆ మహనీయుని ఆరాధిస్తున్నారు.

31 - అర్థోధర్మశ్చ కామశ్చ క్రోధోహర్షశ్చనిత్యశః

 శుక్రోబృహస్పతిశ్చైవసంవర్తో_థ బుధస్తథా    

32 - శనైశ్చరశ్చ రాహుశ్చగ్రహాః సర్వేవ్యవస్థితాః

 మరుతోవిశ్వకర్మాచవసవశ్చ ద్విజోత్తమాః

33 - దివాకరశ్చసోమశ్చ దివా రాత్రి స్తథైవచ

 అర్ధమాసాశ్చమాసాశ్చ ఋతవః షట్చసంస్థితాః

34 - తాంప్రవిశ్యసభాం దివ్యాం బ్రహ్మణః సర్వకామికామ్

 కశ్యపస్త్రిదశైఃసార్ధః పుత్రై ర్ధర్మభ్రుతాంవరః

35 - సర్వతెజొమయీం దివ్యాం బ్రహ్మర్షిగణసేవితాం

 బ్రాహ్మ్యశ్రియాసేవ్యమానా మచింత్యాం విగతక్లమామ్

36 - బ్రహ్మాణాం ప్రేక్ష్యతే సర్వే పరమానసమాస్థితమ్

 శిరోభిఃప్రణతాదేవం దేవా బ్రహ్మర్షిభిఃసహ

37 - తతఃప్రణమ్యచరణౌనియతాః పరమాత్మనః

 విముక్తాఃసర్వపాపేభ్యః శాంతా విగతకల్మషాః

38 - దృష్ట్వాతుతాన్ సురాన్ సర్వాన్ కశ్యపేనసహాగతాన్

 ఆహబ్రహ్మమహాతేజా దేవానాం ప్రభురీశ్వరః

అర్థధర్మకామాలు, క్రోధహర్షాలు, శుక్రబృహస్పతి సంవర్త బుధశనైశ్చర రాహు మొదలయిన సర్వగ్రహాలు ఆయనను సేవిస్తున్నారు. బ్రహ్మ విదులయిన మరుత్తులు, విశ్వకర్మ, వసువులు, సూర్యచంద్రులు, దివారాత్రులు, పక్షాలు, మాసాలు, షడ్రుతువులు సేవిస్తూ ఉండగా సర్వకామ్యాలు సమకూర్చే ఆ దివ్యసభలోనికి కశ్యపుడు తన సుతులగు దేవతలందరతో కలిసి ప్రవేశించాడు. బ్రహ్మర్షి సమూహంతో సేవించబడుతూ, బ్రాహ్మిశ్రీ (లక్ష్మీ)లు సంభావించగా మనస్సున కాహ్లాదం గొలిపే ఆ పేరోలగంలో ఉత్తమోత్తమమైన ఆసనం మీద కూర్చున్న ఆ బ్రహ్మ దేవునకు బ్రహ్మర్షులతో సహా అందరు తలలు వంచి ప్రణామాలు చేశారు. అలా ఆ పరమాత్మకు నమస్కరించి పాపరహితులు, కల్మషదూరులునైన ఆ సురలు స్వస్థచిత్తులై నిలువబడిరి. దేవా ప్రముఖుడైన కశ్యపునితో కూడి ఏతెంచిన ఆ దేవ సమూహాన్ని చూచి దేవేశ్వరుడగు విరించి యిలా అన్నాడు.

అధ్యాయము 3 complete