వామన మహా పురాణము
అధ్యాయము 21
ఋషులు
1 - కామ్యకస్యతుపూర్వేణ కుంజందేవైర్నిషేవితమ్ ।
తస్యతీర్థస్యసంభూతిం విస్తరేణ బ్రవీహినః ॥
ఋషులు
కామ్యకవనానికి తూర్పున దేవతలచే సేవింపబడేలతా గృహం ఉంది. ఆ కుంజతీర్థం పుట్టుక వివరాలు తెలియజేయండి.
లోమహర్షణ
2 - శృన్వంతుమునయస్సర్వే తీర్థమాహాత్మ్యముత్తమమ్ ।
ఋషీణాంచరితంశ్రుత్వా ముక్తోభవతికిల్బిషైః
3 - నైమిషేయాశ్చఋషయః కురుక్షేత్రేసమాగతాః ।
సరస్వత్యాస్తుస్నానార్థం ప్రవేశం తేనలేభిరే ॥
4 - తతస్తేకల్పయామాసు స్తీర్థం యజ్ఞోపవీతికమ్ ।
శేషాస్తుమునయస్తత్ర నప్రవేశం హి లేభిరే ॥
5 - రంతుకస్యాశ్రమాత్తావద్ యావత్తీర్థం సచక్రకమ్ ।
బ్రాహ్మనైః పరిపూర్ణం తద్ద్రుష్ట్వా దేవీసరస్వతీ ॥
6 - హితార్థంసర్వవిప్రాణాం కృత్వా కుంజానిసానదీ ।
ప్రయాతాపశ్చిమంమార్గం సర్వభూతహితే స్థితా ॥
7 - పూర్వ ప్రవాహేయఃస్నాతి గంగాస్నానఫలం లభేత్ ।
ప్రజా హేదక్షిణేతస్యా నర్మదాసరితాం వరా ॥
8 - పశ్చిమేతుదిశాభాగే యమునా సంశ్రితానదీ ।
యదా ఉత్తరతోయాతి సిందుర్భవతి సానదీ ॥
9 - ఏవం దిశాప్రవా హేణ యాతిపుణ్యాసరస్వతీ ।
తస్యాం స్నాతః సర్వతీర్థేస్నాతోభవతిమానవః ॥
10 - తతో గచ్చేద్ద్విజశ్రేష్టామదనస్యమహాత్మనః ।
తీర్థంత్రైలోక్య విఖ్యాతం విహారంనామ నామతః ॥
11 - యత్రదేవాః సమాగమ్య శివదర్శనకాంక్షిణః ।
సమగతానచాపశ్యన్ దేవందేవ్యాసమన్వితమ్ ॥
12 - తేస్తువంతోమహాదేవం నందినం గణనాయకమ్ ।
తతః ప్రసన్నో నందీశః కథయామాస చేష్టితమ్ ॥
13 - భవస్య ఉమయాసార్థం విహారేక్రీడితంమహత్ ।
తచ్చ్రుత్వాదేవతా స్తత్రపత్నీ రాహూయక్రీడితాః ॥
14 - తేషాంక్రీడావినోదేన తుష్టః ప్రోవాచశంకరః ।
యో-స్మింస్థీర్తేనరః స్నాతి విహారేశ్రద్దయాన్వితః ॥
లోమహర్షణ
మునులారా! మీరందరూ, దేనిని విన్నంతనే శ్రీ వామనదేవుని కృపవల్ల ముక్తికలుగుతుందో అలాంటి ఉత్తమమైన వామనపురాణాన్ని శ్రద్దగా వినండి. స్థాణువట సమీపాన, వాలఖిల్యాది మునులు బ్రహ్మపుత్రులైన మహానీయులతో ఆసీనుడైనబ్రహ్మ మానసపుత్రుడు సనత్కుమారుని సమీపించి మార్కండేయముని యొకపరి వినయంగా అబివాదనం చేసి, ఆ సరోవరం యొక్క విస్తారం, మహిమలు, ఉనికీ వివరించవలసినదిగా ఆర్థించాడు. సర్వశాస్త్ర కోవిదుడవైన బ్రహ్మకుమారా! సర్వపాపాలు క్షాలనంచేసే సరోవరమహిమ నాకు తెలుపగోరెదను. ఏఏ తీర్థాలు ప్రత్యక్షంగా ఉన్నవి, ఏ తీర్థాలు గుప్తంగా ఉన్నవి ? స్థాణువుకు అతి దగ్గరగా ఉన్న అతిపవత్ర లింగాలు ఎవ్వి? దర్శనమాత్రాన ముక్తి/సదాలైన ఆ లింగాలను గురించీ, పవిత్ర వటవృక్షదర్శన పుణ్యం, దాని ఉత్పత్తీ, తీర్థప్రదక్షిణ స్నానాల ఫలం వివరించండి. అచట ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉండే దేవతలనారాధించిన కలుగుఫలం దేవాదిదేవుడైన స్థాణువు సరోవరం మధ్య ఉండుట, శక్రుడా తీర్థాన్ని మట్టితో పూడ్చుట, ఆస్తాణు తీర్థ మహిమ, చక్రతీర్థ సూర్యతీర్థ సోమతీర్థాల మహిమా విశేషాలు వివరించండి. మహామునీ ! బ్రహ్మ ముఖతః తమరు తెలుసుకున్న వివరాలతో, ఈశ్వరుని గుహ్యస్తానాలు విష్ణుస్థానాలు సరస్వతీ వృత్తాంతం దేవాదిదేవుని మహిమ మొదలగునవన్నియు సవిస్తరంగా తెలుపగలరని మార్కండేయ మహర్షి విన్నవించాడు.
లోమహర్షణ
14 - మార్కండేయవచః శ్రుత్వా బ్రహ్మత్మాసమహామునిః ।
అతిభక్త్యాతుతీర్థస్య ప్రవణీకృతమానసః ॥
15 - పర్యంకంశిథిలీకృత్వా నమస్క్వత్వామహేశ్వరమ్ ।
కథయామాసతత్సర్వం యచ్చ్రుతంబ్రహ్మణఃపురా ॥
లోమహర్షణ
మార్కండేయముని మాటలు విన్న వెంటనే బ్రహ్మత్ముడైన ఆ మహాముని, తీర్థము లందు అతి శ్రద్ధ కలవాడై ఎంతో భక్తితో తనపర్యంకాసనముద్రవీడి పరమశివునకు నమస్కరించి తాను పూర్వం బ్రహ్మ వలన విన్నదంతయు చెప్పనారంభించాడు.
సనత్కుమార
16 - నమస్కృత్యమహాదేవ మీశానంవరదంశివమ్ ।
ఉత్పత్తించ ప్రవక్ష్యామి తీర్థానాంబ్రహ్మబాషితామ్ ॥
17 - పూర్వమేకార్ణవేఘోరే నష్టేస్థావర జంగమే ।
బృహదండమభూదేకం ప్రజానాం బీజసంభవమ్ ॥
18 - తస్మిన్నండేస్థితో బ్రహ్మ శయనాయో పచక్రమే ।
సహస్రయుగపర్యంతం సుప్త్వాసప్రత్యబుద్యత ॥
19 - సుప్తోత్తిత స్తదా బ్రహ్మ శూన్యంలోకమపశ్యత ।
సృష్టించింతయతస్తస్య రజసామోహితస్యచ ॥
20 - రజఃసృష్టిగుణంప్రోక్తం సత్త్వస్థితిగుణంవిదుః ।
ఉపసంహారకాలేచ తమోగుణః ప్రవర్తతే ॥
21 - గుణాతీతః సభాగవాన్వ్యాపకః పురుషః స్మృతః ।
తేనేదంసకలంవ్యాప్తం యత్కించిజ్జీవసంజ్ఞితమ్ ॥
22 - సబ్రహ్మసచగోవింద ఈశ్వరః ససనాతనః ।
యస్తంవేదమహాత్మానం ససర్వంవేదమోక్షవిత్ ॥
23 - కింతేషాంసకలై స్తీర్థై రాశ్రమైర్వాప్రయోజనమ్ ।
యేషామనంతకంచిత్త మాత్మన్యేవవ్యవస్థితమ్ ॥
24 - ఆత్మానదీసంయముపుణ్యతీర్థా సత్యోదకాశీలసమాదియుక్తా ।
తస్యాంస్నాతః పుణ్యకర్మా పునాతినవారిణా శుద్ద్యతి చాంతరాత్మా ॥
25 - ఏతత్ప్రదానం పురుషస్యకర్మయదాత్మ సంబోదసుఖే ప్రవిష్టమ్ ।
జ్ఞేయం తదేవ ప్రవదంతిసంతః తత్ప్రాప్యదేహీవిజహాతికామాన్ ॥
26 - నైతాదృశం బ్రాహ్మణస్యాస్తివిత్తం యథైకతాసమతా సత్యతాచ ।
శీలేస్థితిర్ఖండ విధానవర్జనమ్ అక్రోదనశ్చోపరమః క్రియాభ్యః ॥
27 - ఏతద్బ్రహ్మసమానేన మయోక్తంతేద్విజోత్తమ ।
యజ్ జ్ఞాత్వాబ్రహ్మపరమం ప్రాప్స్యసిత్వం నసంశయః ॥
సనత్కుమార
ఓ మహామునీ! వరదుడు కల్యాణకరుడునగు మహేశ్వరునకు నమస్కరించి మున్ను నేను బ్రహ్మ వలన వినినట్టి తీర్థముల ఉత్పత్తి ప్రకారం వినిపించెదను. పూర్వం భయంకరమైన జల ప్రళయ మేర్పడి స్థావర జంగమాత్మకమైన జగత్తంతా నశించి పోయింది. సకల జీవసృష్టికి మూలమైన పెద్ద అండం (గ్రుడ్డు) ఒకటి పుట్టింది. ఆ అండంలో ఉన్న బ్రహ్మ వేయియుగాలపాటు నిద్రించి మేలుకొన్నాడు. లోకమంతా శూన్యం కావడం చూచి ఆయన రజోగుణ మోహితుడై సృష్టిచేయ నాలోచించాడు. సృష్టి గుణం రజస్సు, స్థితిగుణం లయంకాగా ఉపసంహారకాలంలో తమోగుణం ప్రవర్తిస్తుంది.యిక ఈ సకల జీవులను వ్యాపించియున్న ఆ పరమ పురుషుడగు భాగావానుదో సకలగుణాలకు అతీతుడు. అతడే బ్రహ్మగా ఈశ్వరుడుగా గోవిందుడుగా పిలవబడే సనాతనుడు. ఆ పరతత్వాన్ని గుర్తించినవానికిసకలం తెలిసి ఉంటుంది. అతడే సర్వజ్ఞుడు. అలా ఆత్మతత్వాన్ని తెలిసికొన్న మహనీయులకు ఈ తీర్థాలు ఆశ్రమాలు యేవీఅవసరం లేదు. నాకు ముక్తులు. సంయమమనే పవిత్ర తీర్థాలతో, సత్యం శీలం సమాధులనే పవిత్రోదకాలతో శోభించే ఆత్మయే పవిత్రమైనది. అందులో స్నానం చేసిన పుణ్యుడు పవిత్రుడౌతాడు. అంతేకాని అంతరాత్మ శుద్ధి నీటివల్ల కలుగనేరదు. కనుక ఆత్మజ్ఞాన సుఖంలో నిమగ్నమై ఉండుటే మానవుడొనర్చవలసిన ప్రధానకర్తవ్యం. అదే తెలియవలసిన ఏకైకవస్తువని, దానిని పొందినవాడు సమస్తమైన కోరికలను వదలివేయుననీ పెద్దలగు సాధువులు చెబుతారు. బ్రాహ్మణుడగువానికి సర్వసమతాభావాలు ఏకత్వం శీలం వదలకుండుట హింసాత్యాగం క్రోధరాహిత్యం ఉపరతి (అసంగం) అనే గుణాలే నిజమైన ధనం. దానిని బోలినవిత్తం మరొకటి లేదు. ఓ బ్రాహ్మణోత్తములారా! సంక్షేపంగా మీకు బ్రహ్మస్వరూపాన్ని గురించి చెప్పాను. దీనిని తెలిసుకున్నవాడు నిస్సందేహంగా పరమబ్రహ్మను పొందుతారు.
28 - ఇదానీంశృణుచోత్పత్తిత్తిం బ్రహ్మణః పరమాత్మనః ।
ఇమంచోదాహరంత్యేవ శ్లోకంనారాయణంప్రతి ॥
29 - ఆపోనారావై తనవ ఇత్యేవంనామశుశ్రుమః ।
తాసుశేతేసయస్మాచ్చ తేననారాయణఃస్మృతః ॥
30 - విబుద్దః సలిలేతస్మిన్ విజ్ఞాయాంతర్గతంజగత్ ।
అండంబిభేదభగవాం స్తస్మాదోమిత్యజాయత ॥
31 - తతోభూరభవత్తస్మాద్భువ ఇత్యపరఃస్మృతః ।
స్వఃశబ్దః తృతీయో-భూత్ భూర్భువః స్వేతిసంజ్ఞితః ॥
32 - తస్మాత్తేజఃసమభవత్ తత్సవితుర్వరేణ్యంయత్ ।
ఉదకం శోషయామాస యత్తేజోండవినిఃసృతమ్ ॥
33 - తేజసాశోషితం శేషం కలలత్వముపాగతమ్ ।
కలలాద్భుద్భుదంజ్ఞేయం తతః కాఠిన్యతాంగతమ్ ॥
34 - కాఠిన్యాద్దరణీజ్ఞేయా భూతానాందారిణీహిసా ।
యస్మిన్స్తానేస్థితంహ్యండం తస్మిన్సంనిహితంసరః ॥
35 - యదాద్యంనిఃసృతంతేజ స్తస్మాదాదిత్య ఉచ్యతే ।
అండమధ్యేసముత్పన్నో బ్రహ్మలోకపితామహః ॥
36 - ఉల్బంతస్యాభవన్మేరు ర్జరాయుఃపర్వతాఃస్మృతాః గర్బోదకంసముద్రాశ్చతథాసద్యఃసహస్రశః ॥
37 - నాభిస్థానేయదుదకం బ్రాహ్మణోనిర్మలంమహత్ ।
మహాత్సరస్తేనపూర్ణం విమలేనవరాంభసా ॥
38 - తస్మిన్మధ్యేస్థాణురూపీ వటవృక్షోమహామనః ।
తస్మాద్వినిర్గతావర్ణాబ్రాహ్మణాఃక్షత్రియావిశః ।
శూద్రాశ్చతస్మాదుత్పన్నాః శుశ్రూశార్థంద్విజన్మనామ్
39 - తతశ్చింతయతఃసృష్టిం బ్రాహ్మణో-వ్యక్తజన్మనః ।
మనసామానసాజాతాః సనకాద్యామహర్శయః ॥
40 - పునశ్చింతయతస్తస్య ప్రజాకామస్యధీమతః ।
ఉత్పన్నాఋషయఃసప్త తేప్రజాపతాయో-భవన్ ॥
ఇక పరమాత్మయగు బ్రహ్మ ఉత్పత్తి వినండి. నారాయణుని విషయంలో ఈ శ్లోకాన్ని సాధారణంగా చెబుతూ ఉంటారు. నీళ్ళు “నార” శరీరం కలవి. (నీటికి నారమని పేరు) వాని మీద శయనించినందుకు నారాయణుడని భగవంతునకు పేరు. జగత్తంతా నీటిలో మునిగి ఉన్నదని తెలిసికొన్న ఆ ప్రభువు ఆ పెద్ద గ్రుడ్డును బ్రద్దలు చేయగా అందులో నుంచి ఓంకారం బయలుదేరింది. అందులోనుంచి భూః , భువః, స్వః అనే మూడు భూర్భువస్వః లోకాలు వచ్చినయి. వానినుంచి తేజస్సు, తత్సవితుర్వరేణ్యం, బయటకు వచ్చింది. ఆ తేజస్సానీళ్ళన్నింటిని ఎండింపజేసింది. మిగిలినది పిండం (కలలం)గా మారింది. దానినుంచి బుడగ ఏర్పడి అదిగట్టిపడింది. ఆ గట్టితనం వల్ల దానిని ధరణి అన్నారు. ఆమెయే సకల జీవులను ధరిస్తుంది. ఆ అండం నిలచిన ప్రదేశమే సన్నిహిత సరస్సు. ఆదిలో వచ్చిన తేజస్సును ఆదిత్యుదన్నారు. లోకపితామహుడైన విరించి గ్రుడ్డుమధ్యలో ఉద్భవించాడు. ఆయనకు పిండం మేరువు, యోనిపర్వాతాలు, సప్తసముద్రాలు వేలాది నదులూ గర్భోదకం (ఉమ్మనీరు) బ్రహ్మనాభి ప్రదేశాన ఉన్న నిర్మలమైన ఉత్తమజలమే ఆ మహాత్సరోవరంలో నిండినది. దానికి మధ్యలో స్థాణురూపమైన వటవృక్షం వెలిసింది. ఆ స్థాణువటం నుండి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులుద్భవించారు. విప్రుల కార్యసాధనకు శూద్రులు వెలసారు. అంతట అవ్యక్త జన్ముడైన బ్రహ్మ సృష్టికార్యాన్ని ఆలోచించగా ఆయన మనస్సునుండి సనకాది రుషులుద్భవించారు. ప్రజాసృష్టికాయన మరల సంకల్పించుకోగా సప్తరుషులుత్పన్నమైనారు. వారే ప్రజాపతులు.
41 - పునశ్చింతయతస్తస్య రజసామోహితస్యచ ।
వాలఖిల్యాః సముత్పన్నా స్తపస్స్వాధ్యాయతత్పరాః ॥
42 - తేసదాస్నాననిరతా దేవర్చనపరాయణాః ।
ఉపవాసైర్ర్వతైస్తీవ్రెః శోషయంతి కళేబరమ్ ॥
43 - వానప్రస్థేనవిధినా అగ్నిహోత్రసమన్వితాః ।
తపసా పరమేణేహ శోషయంతికళేబరమ్ ॥
44 - దివ్యంవర్షసహస్రంతేకృశాదమనిసంతతాః ।
ఆరాదయంతిదేవేశం సచతుష్యతిశంకరః ॥
45 - తతఃకాలేనమహతా ఉమయఃసహశంకరః ।
ఆకాశమార్గేణతదా దృష్ట్వాదేవీసుదుఃఖితా ॥
46 - ప్రసాద్యదేవదేవేశం శంకరం ప్రాహసువ్రతా ।
క్లిశ్యంతేతేమునిగణా దేవదారువనాశ్రయాః ॥
47 - తేషాంక్లేశాక్షయందేవ విధేహి కురుమేదయామ్ ।
కింవేదదర్మనిష్ఠాణా మనంతం దేవడుష్క్రుతమ్ ॥
48 - నాద్యాపియేనశుద్ద్యంతి శుష్కస్నాయ్వస్థిశోషితాః ।
తచ్చ్రుత్వావచనందేవ్యాః పినాకీపాతితాందకః ।
ప్రోవాచాప్రహాసన్మూర్ద్ని చారుచంద్రాంశుశోభితః ॥
రజోగుణమోహితుడై బ్రహ్మ మరల ఆలోచించగా తపఃస్వాధ్యాయ నిరతులైన వాలఖిల్యమునులు జన్మించారు. వారు స్నానదేవతార్చన ఉపవాస వ్రతాదులలో మునిగి, వానప్రస్థ పద్దతిలో అగ్నికర్మలు నేరవేర్చుకుంటూ కఠోరమైన తపస్సుతో తమశరీరాలు శుష్కింపజేసుకున్నారు. వేయిదివ్య సంవత్సరాలావిధంగా తపించినందున వారలదేహాల్లోని రక్త మాంసాదులు శుష్కించి కేవలం నాడులు, నరాలు మిగిలిపోయాయి. అలా ఆరాధించినాశంకరుడు ప్రసన్నుడు కాలేదు. తర్వాత చాలాకాలానికి శివపార్వాతులాకాశ మార్గాన పోతుంటే పార్వతి వాళ్ళ ఎండిన దేహాలు చూచి దుఃఖించి భర్తను ప్రసన్నునిగావించి యిలా అన్నది. “ప్రభో! దేవదారువనంలో ఆ మునులావిధంగా కష్టపడుతున్నారు. దయచేసి వారలక్లేశాలు తొలగించండి. ఆస్తికులై వేదధర్మ నిష్ఠతో ఆస్థిశల్య మాత్రావశిష్టులై యింతకాలంగా ఘోరతపస్సు చేసినా యింకా శుద్దులు కాకుండుటకు వీరంతటి దుష్కర్మలు చేశారా ? కనికరించి అనుగ్రహించండి. పార్వతీదేవిమాటలు విని ఆ చంద్రమౌళి, పినాకపాణి, అంధకాంతకుడు చిరునవ్వు నవ్వి యిలా అన్నాడు.
శంకరుడు
49 - నవేత్సిదేవి తత్త్వేన ధర్మస్యగహనాగతిః ।
నైతేదర్మంవిజానంతి నచకామవివర్జితాః ॥
50 - నచక్రోదేననిర్ముక్తాః కేవలం మూఢబుద్దయః ।
ఏత చ్చ్రుత్వా బ్రవీద్దేవీ మామైవంశంసితవ్రతాన్ ॥
51 - దేవప్రదర్శయాత్మానం పరంకౌతూహలంహిమే ।
సయిత్యుక్త ఉవాచేదం దేవీందేవఃస్మితాసనః ॥
52 - తిష్ఠత్వమత్రయాస్యామి యత్రైతే మునిపుంగవాః ।
సాదయంతితపోఘోరం దర్శయిష్యామి చేష్టితమ్ ॥
53 - ఇత్యుక్తాతుతతోదేవీ శంకరేణమహాత్మనా ।
గచ్చస్వేత్యాహముదితా భర్తారంభువనేశ్వరమ్ ॥
54 - యత్రతేమునయః సర్వేకాష్ఠలోష్టసమాఃస్థితాః ।
అధీయానామహాభాగాః కృత్వాగ్నిసదనక్రియాః ॥
55 - తాన్ విలోక్యతతోదేవో నగ్నః సర్వాంగసుందరః ।
వనమాలాకృతాపీడో యువాభిక్షాకపాలభ్రుత్ ॥
56 - ఆశ్రమేపర్యటన్భిక్షాం మునీనాం దర్శనం ప్రతి ।
దేహిభిక్షాంతతశ్చోక్త్వా హ్యాశ్రమాదాశ్రమం యయౌ ॥
శంకరుడు
దేవీ! నీవు ధర్మసూక్ష్మం ఎరుగక యిలా అంటున్నావు. వీరింతగా తపించినా ధర్మమెరుగరు. కామక్రోధాదులు వదలలేని మూఢబుద్దులు; నీవేరుగవు” అందులకాతల్లి ప్రభూ : తపోవ్రతనిష్టులైన వీరిని గురించి అలా అనకండి. అనుగ్రహించి వారలకు దర్శనమొసగి రక్షించండి. నాకు చాలా బాధగా ఉంది. అని వేడుకోగా నా దేవదేవుడు నవ్వుతూ యిలా అన్నాడు. అయితే నీవిక్కడనే ఉండి చూస్తూండు. నేను వెళ్లి వారుచేసే కఠోర తపస్సు అసలు రంగు బైట పెట్టెదను. వారల చేష్టితాలు నీకే అర్థమౌతాయి.” అందుకు సంతోషించి పార్వతి భర్తతో మంచిది, నడవండి అలాగే వెళ్లుదాం, నేను కూడా వస్తానని యిద్దరూ బయలుదేరారు. కట్టెపుల్లలు యినుపఊచల్లాగా ఉండి వేదాధ్యయనాలు అగ్నికర్మలు అదేపనిగా చేస్తున్న ఆ మునులను చూచి పరమేశ్వరుడు సర్వాంగ సుందరమూ, దిగంబరమూ, వనమాలాభూషితమైనయువాకృతి ధరించి చేతిలో కపాలం పట్టుకొని ఆ మున్యాశ్రమాల వెంట భిక్షాటనం చేయసాగాడు.
57 - తంవిలోక్యాశ్రమగతం యోశితో బ్రహ్మవాదినామ్ ।
సకౌతుకస్వభావేన తస్యరూపేణమోహితాః ॥
58 - ప్రోచుఃపరస్పరంనార్య ఏహిపశ్యామభిక్షుకమ్ ।
పరస్పరమితిచోక్త్వా గృహ్యమూలఫలంబహు ॥
59 - గృహాణభిక్షామూచుస్తా స్తందేవంమునియోషితః ।
సతుభిక్షాకపాలంతం ప్రసార్యబహుసాదరమ్ ॥
60 - దేహిదేహిశివంవోస్తు భవతీభ్యస్తపోవనే ।
హసమానస్తు దేవేశ స్తత్రదేవ్యానిరీక్షితః ।
తస్మైదత్వైవతాంభిక్షాం ప్రపచ్చుస్తంస్మరాతురాః ॥
61 - కో-సౌనామవ్రతవిది స్త్వయాతాపససేవ్యతే ।
యత్రనగ్నేనలింగేన వనమాలావిభూషితః ।
భవాన్వైతాపసోహృద్యో హృద్యాఃస్మోయదిమన్యసే ॥
62 - ఇత్యుక్తస్తాపసీభిస్తు ప్రోవాచహసితాననః ।
ఇదమీదృగ్వ్రతంకించిన్నరహస్యంప్రకాశ్యతే ॥
63 - శృన్వంతిబహావోయత్ర తత్ర వ్యాఖ్యానవిద్యతే ।
అస్యవ్రతస్యసుభగా ఇతిమత్వా గమిష్యథ ॥
64 - ఏవముక్తాస్తదాతేనతాః ప్రత్యూచుస్తదా మునిమ్ ।
రహస్యేహిగమిష్యామో మునే నఃకౌతుకం మహత్ ॥
65 - ఇత్యుక్త్వాతాస్తదాతంవై జగృహుఃపాణిపల్లవైః ।
కాచిత్కంటేసకందర్పా బాహుభ్యామపరాస్తథా ॥
66 - జానుభ్యామపరానార్యః కేషేషులలితాపరాః ।
అపరాస్తుకటీరంద్రే అపరాఃపాదయోరపి ॥
67 - క్షోభంవిలోక్యమునయ ఆశ్రమేషుస్వయోషితామ్ ।
హన్యతామితిసంభాష్య కాష్ఠపాషాణపాణయః ॥
68 - పాతయంతిస్మదేవస్య లింగముద్ద్రుత్యభీషణమ్ ।
పాతితేతుతతోలింగే గతోంతర్దానమీశ్వరః ॥
తను ఆశ్రమాల వెంట తిరుగుతున్న ఆ అందమైన యువతపస్విని నగ్నంగా చూచుటతో సహజమైన ఉత్కంటతో ఆ మునుల భార్యలు మోహంలో మునిగిపోయారు. అందరూ ఒకచోటచేరి తమలోతామా సుందరతపస్విని చూచెదమనుచూ కందమూల ఫలాలు తీసికొని భిక్ష పెట్టుటకు బయలు దేరారు. ఆ దేవదేవుడు కూడ “తెండు ! తెండ “ నుచు వారలిచ్చే ఫలాలు స్వీకరించుటకై భిక్షకపలాన్ని చూచి భిక్ష తీసికొంటూ మేలుకలుగుగాక! “ అని నవ్వులొలకబోయసాగెను. ఆయన నవ్వులకు మరింత కామాతిరేకంతో పిచ్చివారై ఆ స్త్రీలు స్వామిని చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. “ఓయీ తాపస యువకుడా! ఈ విధంగా దిగంబరత్వంతో వనమాలికలు ధరించి భిక్షాటనంచేసే వ్రతం ఎలాటిది? దాని విధానం ఎక్కడ ఉంది? నిన్ను చూచి మా హృదయాలు కరిగిపోతున్నాయి. మేము కూడ అందచందాలలో నీకు తీసిపోము.” ఆ కామార్తల ప్రశ్నవిని శివుడు – సుందరులారా! ఇది చాల రహస్యమైన వ్రతం. దీని విదానం ఫలం పదిమందిలో వెల్లడించకూడదు. కాన మీరు వెళ్ళిపోండి.” అనగానాస్త్రీలు “అలాగైతే ఏకాంత స్థలానికి వెళ్దాం పదండి. అక్కడ మాకు అన్ని విషయాలు చెప్పవచ్చు “ నంటూ ఆయన చేయి పట్టుకొనిరి. కొందరు సుందరాంగనలాయన మెడను మోహావేశంతో పెనవేసుకున్నారు. కొందరు కాళ్ళు, పిక్కలు పట్టుకుంటే కొందరాయన నాభిప్రదేశాన్ని చుట్టివేసుకున్నారు. ఈ విధంగా మోహావేశంలో కన్నుగానక ప్రవర్తిస్తున్న తమస్త్రీల వికారచేష్టలకు మునులు ఆగ్రహోదగ్రులై ఈ దుష్టుని హతమార్చుదము రండు రండంటూ కర్రలూ, రాళ్ళూ తీసికొని ఆయనను ప్రహరిస్తూ ఆయన భీషణ లింగాన్ని నేలపై బడవేశారు. తన లింగం ఊడినేలపైబడిన వెంటనే ఆ మహాదేవుడంతర్హితుడై పోయాడు.
69 - దేవ్యాపభగవాన్రుద్రః కైలాసంనగమాశ్రితః ।
పతితేదేవదేవస్య లింగేనష్టే చరాచరే ॥
70 - క్షోభోబభూవసుమహానృషీణాంభావితాత్మనామ్ ।
ఏవందేవేతదాతత్ర వర్తతివ్యాకులీకృతే ॥
71 - ఉవాచైకోమునివర స్తత్ర బుద్దిమతాంవరః ।
నవయంవిద్మః నద్బావం తాపసస్య మహాత్మనః ॥
72 - విరించింశరణంయామః సాహిజ్ఞాస్యతిచేష్టితమ్ ।
ఏవముక్త్వాసర్వఏవ ఋషయోలజ్జితాభ్రుశమ్ ॥
73 - బ్రహ్మణఃసదనం జగ్ముర్దేవైస్సహనిషేవితమ్ ।
ప్రణిపత్యాథదేవేశం లజ్జయా-దోముఖాః స్థితాః ॥
74 - అథతాన్ దుఃఖితాన్ దృష్ట్వా బ్రహ్మ వచనమబ్రవీత్ ।
అహోముగ్దాయదాయూయం క్రోధేనకలుషీకృతాః ॥
75 - నధర్మస్యక్రియాకాచిజ్ జ్ఞాయతే మూఢబుద్దయః ।
శ్రూయతాందర్మసర్వస్వం తాపసాః క్రూరచేష్టితాః ॥
76 - విదిత్వాయద్భుదః క్షిప్రం ధర్మస్య ఫలమాప్నుయాత్ ।
యోసావాత్మనిదేహే-స్మిన్ విభుర్నిత్యోవ్యవస్థితః ॥
77 - సో-నాదిఃసమాహాస్థాణుః పృథక్త్వేపరిసూచితః ।
మణిర్యథోపదానేన ధత్తేవర్నోజ్జ్వలో-పివై ॥
78 - తన్మయోభవతేతద్వ దాత్మా-పిమనసాకృతః ।
మనసోభేదమాశ్రిత్య కర్మభిశ్చోపచీయతే ॥
79 - తతఃకర్మవశాద్భుంక్తే సంభోగాన్ స్వర్గనారకాన్ ।
తన్మనః శోదయేద్దీమాన్ జ్ఞానయోగాద్యుపక్రమైః ॥
80 - తస్మిన్శుద్డేహ్యంతరాత్మా స్వయమేవనిరాకులః ।
నశరీరస్య సంక్లేశై రపినిర్దహనాత్మకైః ॥
81 - శుద్దిమాప్నోతి పురుషః సంశుద్దంయస్యనోమనః ।
క్రియాహినియమార్థాయ పాతకేభ్యః ప్రకీర్తితాః ॥
82 - యస్మాదత్యావిలందేహం నశీఘ్రంశుద్ద్యతేకిల ।
తేనలోకేషుమార్గో-యం సత్పథస్యప్రవర్తితః ॥
83 - వర్ణాశ్రమవిభాగో-యం లోకాధ్యక్షేనకేనచిత్ ।
నిర్మితోమోహమాహాత్మ్యం చిహ్నంచోత్తమభాగినామ్ ॥
84 - భవంతఃక్రోధకామాభ్యా మభిభూతాశ్రమేస్థితాః ।
జ్ఞానినామాశ్రమోవేశ్మ అనాశ్రమమయోగినామ్ ॥
85 - క్వచంయస్తసమస్తేచ్చా క్వచనారీమయోభ్రమః ।
క్వక్రోధమీదృశంఘోరం యేనాత్మానం నజానథ ॥
86 - యత్క్రోధనో యజతియద్దదాతి యద్వాతపస్తపతియజ్జుహోతి ।
నతస్యప్రాప్నోతి ఫలం హిలోకే మోఘంఫలంతస్యహిక్రోధనస్య ॥
పార్వతితో కలిసి రుద్రుడు కైలాసగిరి చేరుకున్నాడు. దేవదేవుని లింగం భూమిపై పడుటతోనే సృష్టి అంతా అతలాకుతలమై పోయింది. భగవానుని వ్యాకులపాటువల్ల ఆత్మజ్ఞానులయిన ఋషుల హృదయాలు క్షోభించాయి. అంతటనా మునులలో బుద్దిమంతుడయిన ఆతడొకడు, మనము ఆ మహాత్ముడైన తపస్వి సద్భావాన్ని గుర్తించలేకపోయాము. ఇపుడందరం వెళ్లి విరించిని శరణు వేడుదాము. ఆయనే యిందులోని రహస్యం తెలిసినవాడు అని సలహా యిచ్చాడు. ఆ ప్రకారం ఆ మునులందరు తమ తొందరపాటుకు, మూర్ఖత్వానికి సిగ్గుపడి, దేవతల చేత పరివేషితుడైన బ్రహ్మ సన్నిధికి వెళ్లి వ్రణతులై తల వంచుకొని నిలబడ్డారు. అలా దుఃఖితులైన ఆ మునులను చూచి బ్రహ్మ యిలా మందలించాడు. “క్రోధం మిమ్ములను కలషాత్ములను గావించింది. దానికి లోబడి పరమ మూర్ఖులై పోయారు. మూఢబుద్దులారా! మీరలు ఏ మాత్రం ధర్మకార్య స్వభావాన్ని ఎరుగక పోయారు. పరమక్రూర కార్యమాచరించారు. ధర్మ స్వరూపం, సారతత్వం యిప్పుడైనావిని తెలుసుకోండి. ధర్మ స్వరూపం గుర్తించిన విజ్ఞుడు శ్రీఘ్రమే ఉత్తమఫలం పొందుతాడు. ఆ పరమేశ్వరుడు మీ శరీరాల్లోనే, ఆత్మలోనే సదా నిలిచి యున్నాడు. మీకంటె భిన్నుడు కాడు. అనాదితత్వమైన ఆ మహాస్థాణువు, పరమ ప్రకాశవంతమైనమణి ఏ విధంగా తాను కప్పబడిన వస్త్రము యొక్క రంగులోనే పైకి కనపడునో, అదే విధంగా ప్రాణుల దేహంలో ఉంటూ వార కర్మ వాసనల అంతరాన్ననుసరించి భిన్న ప్రకృతుల రూపాన కనిపిస్తాడు. ఆయా జీవుల మనోభావాలచేత పరిచ్చిన్నుడై యుంటాడు. అయితే ఆయనకు వారల కర్మ వాసనలేమాత్రము అంటవు. వారల కర్మానుసారమే స్వర్గ నరకాది భోగాలు అనుభవించడం జరుగుతుంది. కనుక ఈ విషయం గుర్తించి బుద్దిమంతులగు వారు జ్ఞాన యోగాది సాధనల ద్వారా తమ మనస్సులను పరిశుద్ధం గావించుకోవాలి. చిత్తశుద్ది అయిన వెంటనే అంతరాత్మ తనంతతానే నిశ్చలంగా ఉండిపోతుంది. ఎలాంటి వ్యాకులానికి లోను కాదు. అలాంటి మానసిక నైర్మల్యం లేనంతవరకు ఎంతకాలం వ్రతోపవాసాలతో శరీరం శుష్కింపజేసుకున్నా ఏమీ ప్రయోజనం ఉండదు. మనస్సును పాపాలనుంచి మరలించేవే సత్క్రియలు. ఈ అనుష్టానాలన్నీ చిత్తశుద్ది కోసమే ఉద్దేశింపబదడినాయి. పాపపంకిలమైన యీ దేహాన్ని శుద్ధి పరచుకొనుటకే లోకంలో ఈ జ్ఞానమార్గం ప్రవర్తితమైనది. అలాంటి సత్ప్రవర్తనకు సాధనభూతంగానే, ఆ పరమేశ్వరుడు వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థ నేర్పరచినాడు. కాగా ఎక్కువమంది అజ్ఞానాన్ని మోహాన్ని గొప్ప విషయంగా భావించి గొప్పవారమనుకుంటున్నారు . ఇక మీ విషమమే చూడండి. మీరుండేది ఆశ్రమాల్లో. మీ మనస్సులో తిష్టవేసికొని ఉన్నవో కామక్రోధాలు! నిజమైన జ్ఞానులకు యిల్లే ఆశ్రమం. జ్ఞానులు కానివారికి ఆశ్రమాలు యింటి కంటె గూడ నికృష్టమైనవిగా ఉంటాయి. స్త్రీ సంబంధమైన భ్రమలకు లోనైన మీరెక్కడ? నిరీహమైన జీవితమెక్కడ? క్రోదానికి దాసులైన మీరెక్కడ? ఆత్మజ్ఞానమెక్కడ? క్రోదాభిభూతుడు చేసే యజ్ఞాలు, యిచ్చే దానాలు, వేల్చే ఆహుతులు, ఆచరించే తపోవ్రతాదులు బూదిలోపోసిన పన్నీరు వలె నిష్ప్రయోజనకరాలు! ఈ జన్మలో అని ఎలాటి ఫలాన్నీ యివ్వవు. కోపిష్టి చేసే పనులన్నీ వ్యర్థ చేష్టితాలు!
అధ్యాయము 22 complete
Summary of chapter 94 of the Vāmana Mahā Purana is as follows:
Maharshi Pulastya highlights the sacred Kamyaka forest and the Saptasārasvata-tīrtha, where Sage Mankanaka resided in deep spiritual meditation. The chapter extols the serene solitude of the forest, where wild animals abandon their natural ferocity and celestial beings sing praises of Bhagavān Nārāyaṇa. Pilgrims who retreat to Kamyaka forest for devotional prayer experience profound peace, mental clarity, and spiritual elevation.