వామన మహా పురాణము
అధ్యాయము 24
సనత్కుమార ఉవా చ:
1 - అథోవాచమహాదేవో దేవాన్‌బ్రహ్మపురోగమాన్ ।
ఋషీణాంచైవప్రత్యక్షం తీర్థమహాత్మ్యముత్తమమ్ ॥
2 - ఏతత్సాన్నిహితంప్రోక్తం సరఃపుణ్యతమంమహత్ ।
మయోపసేవితంయస్మా త్తస్మాన్ము క్తిప్రదాయకమ్ ॥
3 - ఇహయేపురుషాః కేచి ద్బ్రాహ్మణాః క్షత్రియావిశః ।
లింగస్య దర్శనాదేవ పశ్యంతిపరమంపదమ్ ॥
4 - అహన్యహనితీర్థాని అసముద్రసరాంసిచ ।
స్థాణుతీర్థంసమేష్యంతి మధ్యంప్రాప్తేదివాకరే ॥
5 - స్తోత్రేణానేనచనరో యోమాంస్తోష్యతిభ క్తితః ।
తస్యాహంసులభోనిత్యం భవిష్యామి నసంశయః ॥
6 - ఇత్యుక్త్యాభగవాన్‌రుద్రో హ్యంతర్థానంగతః ప్రభుః ।
దేవాశ్చఋషయస్సర్వే స్వానిస్థానానిభేజిరే ॥
7 - తతోనిరంతరంస్వర్గం మానుషైర్మిశ్రితంకృతమ్ ।
స్థాణులింగస్యమాహాత్మ్యం దర్శనాత్స్వర్గమాప్నుయాత్ ॥
8 - తతోదేవాఃసర్వఏవ బ్రహ్మాణంశరణంయయుః ।
తానువాచతదాబ్రహ్మా కిమర్థమిహచాగతాః ॥
9 - తతోదేవాః సర్వఏవ ఇదంవచనమబ్రువన్ ।
మానుషేభ్యోభయంతీవ్రం రక్షాస్మాకం పితామహ ॥
10 - తానువాచతదాబ్రహ్మా సురాం స్త్రీదశనాయకః ।
పాంశునాపూర్యతాంశీఘ్రం సరఃశక్రేహితంకురు ॥
11 - తతోవవర్షభగవాన్ పాంశునాపాక శాసనః ।
సప్తాహంపూరయామాన సరోదేవై స్తదావృతః ॥
12 - తందృష్ట్వాపాంశువర్షంచ దేవదేవోమహేశ్వరః ।
కరేణధారయామాస లింగతీర్థవటం తదా ॥
సనత్కుమారుడు
అంతట దేవాధిదేవుడైన శంకరుడు ఋషుల సమక్షంలో బ్రహ్మ పురోగాములైన దేవతలతో ఆ ఉత్తమ తీర్థ మహిమ వివరించాడు. ఈ సాన్నిహిత సరస్సు సకల తీర్థాలలో ఉత్తమోత్తమమైనది. ఇది నాకు నివాసం కావడం వల్ల ముక్తిప్రదాయకమైనది. ఇక్కడి నా లింగ దర్శనం చేసినంత మాత్రాన్నే బ్రహ్మ, క్షత్రియ, వైశ్యాదు లందరకు పరమపదం లభిస్తుంది. మధ్యాహ్న సమయాన, ప్రతి రోజూ, సముద్ర నదీ సరోవరాల సమస్త తీర్థాలు యిక్కడ ఈ స్థాణుతీర్థంలో చేరికలుస్తాయి. ఈ స్తోత్రం ఎవరు శ్రద్ధాభక్తులతో యిక్కడ చదివి నన్ను ప్రసన్నుణ్ణి చేసుకుంటారో వారలకు నేనెల్లప్పుడు అందుబాటులో ఉంటాను. సందేహం లేదు. ఆ విధంగా సెలవిచ్చి భగవానుడగు రుద్రుడంతర్ధాన మొందాడు. దేవతలంతా తమతమ నెలవులకు వెళ్ళారు. ఆ స్థాణు లింగ మహిమ వల్ల ఆ లింగ దర్శనం చేసిన మానవులందరకూ స్వర్గప్రాప్తి కలిగి స్వర్గలోకం మనుష్యులతో నిండిపోయింది. దానితో భయమందిన దేవతలు ఆ మానవుల ఉపద్రవాన్నుంచి తమ్ము రక్షింపమని బ్రహ్మకడకు పోయి మొరపెట్టుకున్నారు. ఆ త్రిదశాధిపతి అయిన బ్రహ్మ, అలాగైతే ఆలస్యము చేయక వెంటనే సరోవరాన్ని మట్టితోపూడ్చి యింద్రునకూరట కలిగించండని దేవతలతో చెప్పాడు. అంతట యింద్రుడు వారం రోజులపాటు, ధూళివర్షం కురిపించి ఆ సరస్సును పూడ్చినాడు. అది చూచి మహేశ్వరుడా లింగాన్ని వటవృక్షాన్ని చేతితో ఎత్తిపట్టుకున్నాడు.
13 - తస్మాత్‌పుణ్యతమంతీర్థం మాన్యం యత్రోదకంస్థితమ్ ।
తస్మిన్‌స్నాతః సర్వతీర్థైః స్నాతోభవతిమానవః ॥
14 - యస్తత్రకురుతేశ్రాద్ధం వటలింగస్యచాంతరే ।
తస్యప్రీతస్యపితరో దాస్యంతి భువిదుర్లభమ్ ॥
15 - పూరితంచతతోదృష్ట్వా ఋషయఃసర్వఏవతే ।
పాంశునాసర్వగాత్రాణి స్పృశంతిశ్రద్ధయాయుతాః ॥
16 - తేఽపినిర్ధూతపాపాస్తే పాంశునామున యోగతాః ।
పూజ్యమానాః సురగణైః ప్రయతాబ్రహ్మణఃపదమ్ ॥
17 - యేతుసిద్ధామహాత్మాన స్తేలింగంపూజయంతిచ ।
వ్రజంతి పరమాంసిద్ధిం పునరావృత్తిదుర్లభామ్ ॥
18 - ఏవంజ్ఞాత్వాతదాబ్రహ్మా లింగంశైలమయంతదా ।
ఆద్యలింగం తదాస్థాప్య తస్యోపరిదధారతత్ ॥
19 - తతఃకాలేనమహతా తేజసాయస్యరంజితమ్ ।
తస్యాతిస్పర్శనాత్సిద్ధః పరంపదమవాప్ను యాత్ ॥
20 - తతోదేవైఃపునర్బ్రహ్మా విజ్ఞప్తోద్విజసత్తమ ।
ఏతేయాంతిపరాంసిద్ధిం లింగస్యదర్శనాన్నరాః ॥
21 - తచ్ఛ్రుత్వా భగవాన్‌బ్రహ్మా దేవానాంహితకామ్యయా ।
ఉపర్యుపరిలింగాని సప్తతత్రచకారహ ॥
22 - తతోయేము క్తికామాశ్చ సిద్ధాఃశమపరాయణాః ।
సేవ్యపాంశుంప్రయత్నేన ప్రయాతాః పరమం పదమ్ ॥
23 - పాంశవోఽపికురుక్షేత్రే వాయునానముదీరితాః ।
మహాదుష్కృతకర్మాణం ప్రయాంతిపరమంపదమ్ ॥
24 - అజ్ఞానాజ్ జ్ఞానతోవాపి స్త్రియోవాపురుషస్యవా ।
నశ్యతేదుష్కృతంసర్వం స్థాణుతీర్థప్రభావతః ॥
25 - లింగస్యదర్శనాన్ముక్తిః స్పర్శనాచ్చవటస్యచ ।
తత్సన్నిధౌజలేస్నాత్వా ప్రాప్నోత్యభిమతంఫలమ్ ॥
26 - పితౄణాం తర్పణంయస్తు జలేతస్మిన్‌కరిష్యతి ।
బిందౌబిందౌతుతోయస్య అనంతఫలభాగ్భవేత్ ॥
27 - యస్తుకృష్ణతిలైస్సార్ధం లింగస్యపశ్ఛిమేస్ధితః ।
తర్సయేచ్ఛ్రద్దయాయుక్తః సప్రీణాతియుగత్రయమ్ ॥
28 - యావన్మన్వంతరంప్రోక్తం యావల్లింగస్యసంస్ధితిః ।
తావత్ప్రీతాశ్చపితరః పిబంతిజలముత్తమమ్
29 - కృతయుగేసాన్నిహిత్యం త్రేతాయాంవాయుసంజ్ఞితమ్ ।
కలిద్వాపరయోర్మధ్యే కూపం రుద్రహ్రదంస్మృతమ్ ॥
30 - చైత్రస్యకృష్ణపక్షేచ చతుర్దశ్యాంనరోత్తమః ।
స్నాత్వారుద్రహ్రదేతీర్ధం పరంపదమవాప్నుయాత్ ॥
31 - యస్తువటేస్థితోరాత్రిం ధ్యాయతేపరమేశ్వరమ్ ।
స్ధాణోర్వటప్రసాదేన మనసాచింతితంఫలమ్ ॥
అందుచేత ఆద్యతీర్థంలోని నీరు పుణ్యతమమైనది. అచట స్నానం చేస్తే సర్వతీర్థస్నానఫలంలభిస్తుంది. ఆవట లింగేశ్వర సమీపంలో శ్రాద్ధం చేసినవాని పితరులు సంతోషించి దుర్లభమైన ఫలం యిస్తారు. పూడిపోయిన సరోవరాన్ని చూచి ఋషులక్కడి ధూళిని శ్రద్ధాభక్తులతో తమ శరీరాలకు పూసుకునేవారు. అందువల్ల ఆమునులు కూడా పాపముక్తులై దేవతలకు సైతం పూజ్యులై బ్రహ్మపదానికి వెళ్తారు. సిద్ధమహాత్ములెవరైననూ ఆలింగాన్ని పూజించినచో పరమసిద్ధినిపొంది పునరావృత్తిరహితలోకానికి వెళ్తారు. ఈ విషయం గ్రహించినంతనే బ్రహ్మ అచట ఆద్య లింగాన్ని ప్రతిష్ఠించి దానిమీద శిలాలింగాన్ని పెట్టాడు. తర్వాత చాలా కాలానికి ఆద్యలింగ ప్రభావ స్పర్శతో శిలాలింగం కూడ తనను ముట్టుకున్నవారలకు పరమ పదప్రాప్తికలిగించింది. ఓవిప్రోత్తమలారా! శైలలింగ స్పర్శమాత్రాన్నే మానవులు పరమపదంపొందడం చూచి దేవతలు బ్రహ్మతో ఈ విషయం చెప్పుకున్నారు. అది విని విరించి దేవతలకు మేలు చేయుటకై ఆ శిలాలింగం మీద ఒకదానిపైనొకటిగా ఏడు లింగాలు స్థాపించాడు. అప్పటినుంచి శమదమపరాయణులయిన ముముక్షువులు అక్కడి ధూళిసేవనం వల్లనే పరమ పదాన్ని పొందుతున్నారు. కురుక్షేత్రంలో గాలిలో ఎగిరే ధూళి కణాలుకూడ తమస్పర్శతో మహాపాపులను గూడ పవిత్రులను పరమ పదసంపాదకులను చేయజాలియున్నవి. ఆ స్థాణుతీర్ధంలో ప్రవేశించిన స్త్రీ పురుషాదులకు, వారు తెలిసి ప్రవేశించినా తెలియక ప్రవేశించినా సరే, సర్వ దుష్కృతనాశం కలుగుతుంది. లింగదర్శనంవల్ల వటవృక్షస్పర్శవల్ల ముక్తికలుగుతుంది. అచట సన్నిధి జలాల్లో స్నానమాడిన వారి కోరికలు సిద్ధిస్తాయి. అక్కడ పితృదేవతలకు వదలెడి తర్పణోదకాల బిందుబిందువూ అనంత ఫలం యిస్తుంది. లింగానికి పడమర భాగాన నల్ల నువ్వులతో శ్రద్ధాతర్పణాలుయిచ్చిన వారు మూడుయుగాల పర్యంతం సుఖిస్తారు. మన్వంతర కాలంవరకూ లింగం అక్కడ నిలిచియున్నంతకాలం అలాంటి వారల పితరులు ఉత్తమోదకాలు పానం చేస్తుంటారు. కృతయుగంలో దానికి సాంనిహిత్య తీర్థమనీ, త్రేతాయుగంలో వాయుతీర్థమనీ ద్వాపర కలియుగాలమధ్య రుద్రహ్రదమనీ పేర్లు. చైత్రకృష్ణ చతుర్దశినాడు రుద్రహ్రదంలో స్నానం చేసిన వారలకు పరమపద ప్రాప్తికలుగుతుంది. అచటి వటమూలాన కూర్చుని పరమ శివుని ధ్యానించిన వారల కా స్థాణువటమహిమ వల్ల చింతితమనోరథాలు నెరవేరుతాయి.
అధ్యాయము 24 Complete
Summary of chapter 96 of the Vāmana Mahā Purana is as follows:
The text extols Rāmathīrtha, established by Paraśurāma, where performing ancestral tarpaṇa bestows boundless blessings and fulfills debts owed to ancestors and devas. The narrative reinforces that bathing in Rāmathīrtha and Kapālamochana on auspicious lunar days liberates the pilgrim from fear of lower rebirths, bestowing health, righteous progeny, and ultimate residence in Vaikuṇṭha.