అధ్యాయము 27

సనత్కుమార

1 - అథైవమబ్రవీద్దేవ స్త్రైలోక్యాధిపతిర్భవః

 ఆశ్వాసనకరంచాస్య వాక్యవిద్వాక్యముత్తమమ్

2- అహోతుష్టోఽస్మితే రాజన్ స్తవేనానేనసువ్రత

 బహునాఽత్రకిముక్తేన మత్సమీ పేవసిష్యసి

3 - ఉషిత్వాసుచిరంకాలం మమగాత్రోద్భవంపునః

 అసురోహ్యంధకోనామ భవిష్యసిసురాంతకృత్

4 - హిరణ్యాక్షగృహేజన్మ ప్రాప్యవృద్ధింగమిష్యసి

 పూర్వాధర్మేణ ఘోరేణ వేదనిందా కృతేనచ

5 - సాభిలాషో జగన్మాతు ర్భవిష్యసియదాతదా

 దేహంశూలేనహత్వాహం పావయిష్యామి సమార్బుదమ్

6 - తత్రాప్యకల్మషోభూత్వా స్తుత్వామాంభ క్తితఃపునః

 ఖ్యాతో గణాధిపోభూత్వా నామ్నాభృంగిరిటిః స్మృతః

7 - మత్సన్నిధానేస్థిత్వాతం తతఃసిద్ధిం గమిష్యసి

 వేన ప్రోక్తం స్తవమిమం కీర్తయేద్యఃశృజోతిచ

8 - నాశుభంప్రాప్నుయాత్కించి ద్దీర్ఘమాయుర వాప్నుయాత్

 దేవేషుయథాసర్వేషు విశిష్టోభగవాన్‌శివః

9 - తథాస్తవోపరిష్ఠోఽయం స్తవానాం వేననిర్మితః

 యశోరాజ్యసుఖైశ్వర్యధనమానాయకీర్తితః

10 - శ్రోతవ్యోభ క్తిమాస్థాయవిద్యాకామైశ్చయత్నతః

 వ్యాధితో దుఃఖితోదీనశ్చౌరరాజభయాన్విత:

11 - రాజకార్యవిముక్తోవా ముచ్యతేమహతోభయత్

 అనేనై వతుదేహేన గణానాంశ్రేష్ఠతాంవ్రజేత్

12 - తేజసాయశసాచైవ యుక్తోభవతి నిర్మలః

 నరాక్షసాః పిశాచావా నభూతానవినాయకాః

13 - విఘ్నంకుర్యుర్గృహేతత్ర యత్రాయంపఠ్యతే స్తవః

 శృణుయాద్వా స్తవం నారీ అనుజ్ఞాంప్రాప్యభర్తృతః

14 - మాతృపక్షేపితుఃపక్షే పూజ్యాభవతిదేవవత్

 శృణుయాద్ యః స్తవం దివ్యం కీర్తయేద్వాసమాహితః

15 - తస్యసర్వాణి కర్మాణి సిద్దింగచ్ఛంతి నిత్యశః! మనసాచింతితంయచ్చ యచ్చవాచాను కీర్తితమ్

16 - సర్వంసంపద్యతేతస్య స్తవనస్యానుకీర్తనాత్

 మనసాకర్మణావాచా కృతమేనో వినశ్యతి

 వరంవరయభద్రంతే యత్త్వయామశసేప్సితమ్

సనత్కుమారుడు

అంతట త్రిలోకేశ్వరుడైన శివుడు, వాక్య కోవిదుడు, వేనునకు తృప్తిగొలుపునట్టి ఉత్తమ వాక్యాలు మాటాడాడు- 'భళీ! సువ్రతుడవగు రాజా! నీ స్తోత్రానికి నేను సంతోషించాను. వేయేల నీవెల్లప్పుడు నా సమీపాననే నివసించ గలవు. చాలా కాలం నావద్ద ఉండి, అనంతరం నా శరీరం నుంచియే జన్మించి, అంధకాసురుడనే దేవాంతకుడవు కాగలవు. వెనుక నీవు కావించిన, వేదనిందా పూర్వకమైన అధర్మాచరణం వల్ల హిరణ్యాక్షుని యింట్లో పుట్టి పెద్దవాడవు కాగలవు. ఆ జన్మలో నీవు ఎప్పుడు జగన్మాతపై మరులు చెందుదువో అప్పుడు నేను శూలంతో నీ దేహాన్ని ఛేదించి నిన్ను అర్బుదునివలె పవిత్రుణ్ణి చేస్తాను. అప్పుడు కూడా యీ విధంగా నన్ను స్తోత్రంచేసి మెప్పించి నా శివగణాలలో ప్రథముడుగా భృంగిరిటి అనే పేరుతో ప్రసిద్ధి చెందగలవు. నా సన్నిధిలో ఉంటూ నీపు సిద్ధి పొందెదవు. వేనుడు కావించిన ఈ దివ్య స్తోతాన్ని చదువువారలు, వినువారలు, ఎట్టి అశుభాలు లేకుండా దీర్ఘాయుష్మంతులగుదురు. సర్వదేవతలలో శివునకు వలెనే సర్వస్తోత్రాల్లో ఈ వేనస్తవం విశిష్టతను కలిగిఉంటుంది. యశో రాజ్యసుఖం, ఐశ్వర్య ధన గౌరవాలు ప్రదానం చేసేదిగా ఈ స్తవం కీర్తి గాంచింది. విద్యార్థులు దీనిని భక్తితో వినాలి. వ్యాధి పీడితులు, దుఃఖార్తులు, దీనులు, చోరరాజ భయాన్వితులు ప్రయత్న పూర్వకంగా దీనిని శ్రవణం చేయాలి. రాజ సేవ నుండి తొలగింపబడినవారు సర్వభయాల నుండిముక్తు లౌతారు. ఈ దేహంతోనే గణాలలో శ్రేష్టులౌతారు: యశోతేజః సమన్వితులై పవిత్రులౌతారు. ఈ స్తోత్రం పాఠం జరిగే గృహాలలో రాక్షస పిశాచ భూత వినాయకలెటువంటి విఘ్నాలూ కలుగజేయలేరు. భర్త అనుమతితో ఈస్తవాన్ని గృహిణులు వింటే వారలు అటు మాతృ పక్షాన, ఇటు పితృ వంశాన దేవతలుగా పూజింపబడతారు. ఎవరైతే ఈ స్తవాన్ని రోజూ మానసిక ఏకాగ్రతతో గానం చేస్తారో, అథవా వింటారో వారల సర్వకార్యాలు సిద్ధిస్తాయి. వారలు మనస్సులో సంకల్పించినవీ నోట ఉచ్చరించినవీ అన్నీ సిద్ధిస్తాయి. త్రికరణాల ద్వారా చేసిన పాపాలన్నీ నశిస్తాయి. ఇక నీకు శుభమగుగాక, నీకు కావలసిన వరము కోరుకొనుము.

వేన

17 - అస్యలింగస్యమాహాత్మ్యాత్ తథాలింగస్యదర్శనాత్

 ముక్తోఽహంపాతకైః సర్వై స్తవదర్శనతఃకిల

18 - యదితుష్టోఽసిమేదేవ యదిదేయోవరోమమ

 దేవస్వభక్షణాజ్జాతం శ్వయోనౌతవసేవకమ్

19 - ఏతస్యాపిప్రసాదంత్వం కర్తుమర్హసిశంకర

 ఏతస్యాపిభయాన్మధ్యే సరసోఽహంనిమజ్జతః

20 - దేవైర్నివారితఃపూర్వం తీర్థేఽస్మిన్‌స్నానకారణాత్

 అయంకృతోపకారశ్చ ఏతదర్థేవృణోమ్యహమ్

21 - తస్యైతద్వచనం శ్రుత్వా తుష్టఃప్రోవాచశంకరః

 ఏషోఽసిపాపనిర్ముక్తో భవిష్యతివసంశయః

22 - ప్రసాదాన్మేమహాబాహో శివలోకంగమిష్యతి

 తథా స్తవమిమంశ్రుత్వా ముచ్యతేసర్వపాతకైః

23 - కురుక్షేత్రస్యమాహాత్మ్యం సరసోఽస్యమహీపతే

 మమలింగన్యచోత్పత్తిం శ్రుత్వాపాపైఃప్రముచ్యతే

వేనుడు

"ప్రభో! శంకరా! ఈ లింగ మాహాత్మ్యదర్శనాల వల్ల నీ దివ్య దర్శనం వల్లా నేను సకల పాపాల నుంచి విముక్తుడనైనాను. నీవు నా యెడ ప్రసన్నుడవై వరమివ్వనెంచినచో, దేవద్రవ్య భక్షణం కారణంగా శునక యోనిలో పుట్టిన ఈ నీ సేవకునిగూడ ఆనుగ్రహించుము. ఈ శునకానికి భయపడియే నేనీ సరస్సులో మునుగుట జరిగింది. మొదట నన్నీతీర్థంలో స్నానంచేయవద్దని దేవతలు శాసించారు. ఆ పని నా చేత చేయించి ఈ శునకం నాకు మహోపకారం చేసింది. కనుకనే నేను మిమ్ములనీ వరం అర్థిస్తున్నాను. ఈ కుక్కకు ముక్తినివ్వండి". వేనుని మాటలు విని శంకరుడు సంతోషించి, తప్పకుండా ఈ శునకం కూడ పాపముక్తిని పొందుతుందని చెప్పాడు. "నా అనుగ్రహం వల్ల దీనికి శివలోకప్రాప్తి కలుగుతుంది. నా యీ స్తవం విన్నందున దీని పాపాలన్నీ పోతాయి. ఓ రాజా! ఈ కురుక్షేత్ర మహిమ, ఈ సరస్సు మహాత్మ్యం, నాలింగోత్పత్తి వృత్తాంతం విన్న వారు పాపముక్తులౌతారు. సనత్కుమారుడింకా యిలా అన్నాడు.

సనత్కుమార

24 – ఇత్యేవముక్త్వాభగవాన్ సర్వలోకనమస్కృతః

 పశ్యతాంసర్వలోకానాం తత్రైవాంతరధీయత

25 - సచశ్వాతత్‌క్షణాదేవ స్మృత్వాజన్మపురాతనమ్

 దివ్యమూర్తిధరోభూత్వాతంరాజానముపస్థితః

26 - కృత్వాస్నానంతరోవైన్యః పితృదర్శనలాలనః

 స్థాణుతీర్థేకుటీంశూన్యాం దృష్ట్వాశోకసమన్వితః

27 - దృష్ట్వావేనోఽబ్రవీద్వాక్యం హర్షేణమహతాఽన్వితః

 సత్పుత్రేణత్వయావత్స! త్రాతోఽహంనరకార్ణవాత్

28 - త్వయాభిషించితోనిత్యం తీర్థస్థపురినేస్థితః

 అస్యసాధోఃప్రసాదేన స్థాణోర్దేవస్యదర్శనాత్

29 - ముక్తపాపశ్చస్వర్లోకం యాస్యేయత్రశివఃస్థితః

 ఇత్యేవముక్త్వారాజానం ప్రతిష్ఠాస్యమహేశ్వరమ్

30 - స్థాణుతీర్థేయయౌసిద్ధిం తేనపుత్రేణరాజితః

 న చశ్వా పరమాంసిద్ధిం స్థాణుతీర్థ ప్రభావతః

31 - విముక్తకలుషైః సర్వై ర్జగామభవమందిరమ్

 రాజాపితృఋణైర్ముక్తః పరిపాల్యవసుంధరామ్

32 - పుత్రానుత్పాద్యధర్మేణ కృత్వాయజ్ఞంనిరర్గలమ్

 దత్వాకామాంశ్చ విప్రేభ్యోభుక్త్వాభోగాన్ పృథగ్విధాన్

33 - సుహృదోఽథఋణైర్ముక్త్వా కామైఃసంతర్ప్యచస్త్రియః

 అభిషిచ్యసుతంరాజ్యే కురుక్షేత్రంయుయౌనృపః

34 - తత్రతప్త్వాతపోఘోరం పూజయిత్వాచ శంకరమ్

 అత్మేచ్ఛయాతనుంత్యక్త్వా ప్రయాతఃపరమంపదమ్

35 - ఏతత్ప్రభావంతీర్థస్య స్థాణోర్య: శృణుయాన్నరః

 సర్వపాపవినిర్ముక్తః ప్రయాతిపరమాంగతిమ్

సనత్కుమారుడు

సర్వలోక వంద్యుడైన ఆ పరమ శివుడిలా ఆనతిచ్చి అందరూ చూస్తూండగా అక్కడే అంతర్హితుడైనాడు. ఆ కుక్కకు వెంటనే పూర్వజన్మ స్మృతి కలిగి దివ్యదేహంతో రాజు ఎదుట నిలిచినది. ఇక అక్కడ వేనుని పుత్రుడు తీర్థ స్నానంచేసి తండ్రిని చూచుటకై తిరిగి వచ్చి కుటీరం శూన్యంగా ఉండటంచూచి ఎంతో దుఃఖించాడు. అప్పుడు మహా సంతోషంతో తన ఉత్తమ పుత్రునిచూచి వేనుడిలా అన్నాడు. "వత్సా! నీలాంటి సత్పుత్రుని పొంది నేను నరక సముద్రాన్నిన్చి తప్పించుకున్నాను. నీవు రోజూ నాకు చేసిన తీర్థ జలాభిషేచనం, ఈ మహనీయుని (కుక్క) అనుగ్రహం, ఈ తీర్థ తీర నివాసం, స్థాణుదేవుని ధర్మానుగ్రహాలవల్ల పాపముక్తుడనై స్వర్లోకానికి, శివలోకానికి వెళ్తున్నాను. అట్లు కుమారుని అభినందించి అచట మహేశ్వర ప్రతిష్ఠ గావించి ఆ స్థాణు తీర్థంలో పుత్రునివల్ల నుద్ధరింపబడిన ఆవేనుడు సిద్ధిబొందాడు. ఆ కుక్క కూడా ఆ స్థాణుతీర్థమహిమవల్ల సర్వకల్మషాలు తొలగి శివమందిరాన్ని చేరింది. ఆ రాజుకూడ అలా పితృ ఋణాన్ని తీర్చుకొని, చక్కగా భూమి పాలనం చేసి, ధర్మమార్గాన పుత్రవంతుడై నిర్విఘ్నంగా యజ్ఞంచేసి, బ్రాహ్మణుల కోర్కెలుదీర్చి, సకల విధాల సుఖాలు ఆనుభవించి బంధుమిత్రులను ఋణవిముక్తుల గావించి, భార్యల కోర్కెలన్నియు తీర్చి, తనకుమారునకు రాజ్యాభిషేకం గావించి చివరకు కురుక్షేత్రానికి వెళ్లాడు. ఆ పవిత్రక్షేత్రంలో ఘోరతపస్సు గావించి శంకరుని పూజించి స్వేచ్ఛతో శరీరం వదలి పరమపదాన్ని చేరాడు. ఈస్థాణుతీర్థ ప్రభావం స్థాణ్వీశ్వరుని మహిమను శ్రద్ధగా శ్రవణం గావించిన వారలు సర్వపాపాలు వదలి పరమగతిని చేరుకుంటారు.

అధ్యాయము 27 Complete