వామన మహా పురాణము
అధ్యాయము 9
నారదుడు
1 - నేత్రహీనః కథం రాజ్యే ప్రహ్లాదేనాంధకో మునే ।
అభిషిక్తో జానతాపి రాజధర్మం సనాతనం ॥
నారదుడు
మహా మునీ! అంధకుడు గ్రుడ్డివాడని తెలిసియు రాజధర్మమునకు విరుద్ధముగా నాతనిని ప్రహ్లాదుడెట్లు రాజ్యాదిపతిని గావించెను?
పులస్త్యుడు
2 - లబ్దచక్షు రసౌ భూయో హిరణ్యాక్షేపి జీవతి ।
తతోభిషిక్తో దైత్యేన ప్రహ్లాదేన నిజే పదే ॥
పులస్త్యుడు
నారదా ! తండ్రి హిరణ్యాక్షుడు జీవించియుండగనే అంధకునకు చూపు తిరిగి వచ్చింది. అందుకే ప్రహ్లాదుడతనిని తన స్థానమున రాజుగా నిలిపెను.
నారదుడు
3 - రాజ్యేంధకోభిషిక్తస్తు కిమాచరత సువ్రత ।
దేవాదిభిః సహా కథం సమాస్తే తద్వదస్వ మే ॥
నారదుడు
మహామునీ! రాజ్యాభిషిక్తుడైన అంధకుడేవిధముగ పాలన మొనర్చెను? దేవతలతో నెట్లు మసలుకొనెను?
పులస్త్యుడు
4 - రాజ్యేభిషిక్తో దైత్యేంద్రో హిరణ్యాక్షసుతోoధకః ।
తపసారాధ్య దేవేశం శూలపాణిం త్రిలోచనమ్ ॥
5 - అజేయత్వ మవధ్యత్వం సురసిద్ధర్షిపన్నగైః ।
ఆదాహ్యత్వం హుతాశేన అక్లేద్యత్వం జలేనచ ॥
6 - ఏవం స వరలబ్దస్తు దైత్యో రాజ్య మపాలయాత్ ।
శుక్రం పురోహితం కృత్వా సమధ్యాస్తే తతోoధకః ॥
పులస్త్యుడు
రాజైన హిరణ్యాక్ష సుతడంధకుడు మహాదేవుడగు శూలపాణిని తపస్సు చేసి ప్రసన్నుని గావించుకొనెను. దేవసిద్ధ ఋషిపన్నగాదుల నుండి అజేయత్వమూ అవధ్యత్వముతో బాటు, అగ్ని, జలముల వలన భయములేకుండునట్లు వరములందుకొనెను. తర్వాత శుక్రాచార్యుని పురోహితుని గావించుకొని రాజ్యము చేయసాగెను.
7 - తాతాశ్చక్రే సముద్యోగం దేవనా మంధకోసురః ।
ఆక్రమ్య వసుధాం సర్వాం మనుజేంద్రాన్ పరాజయత్ ॥
8 – పరాజిత్య మహీపాలాన్ సహాయర్థే నియోజ్యచ ।
తైః సమం మేరు శిఖరం జగామాద్భుత దర్శనం ॥
9 - శక్రోపి సురసైన్యాని సముద్యోజ్య మహాగజమ్ ।
సమరుహ్యామరావత్యాం గుప్తిం కృత్వా వినిర్యయౌ ॥
10 - శక్రస్యాను తథైవాన్యే లోకపాలా మహౌజనః ।
అరుహ్య వాహనం స్వం స్వం సాయుధా నిర్యయు ర్బహిః ॥
11 - దేవసేనాపిచ సమం శక్రేణాద్భుతకర్మణా ।
నిర్జగామాతివేగేనా గజవాజిరతాదిభిః ॥
12 - అగ్రతోద్వాదశాదిత్యాః పృష్టతశ్చ త్రిలోచనః ।
మధ్యేష్టౌవసవో విశ్వే సాధ్యాశ్విమరుతాం గణాః ।
యక్షవిద్యాధరాద్యాశ్చ స్వంస్వం వాహన మాస్థిథాః ॥
అంతట నా రాక్షసుడు దేవతల జయింప నెంచి భూతలాన్నంతను ఆక్రమించుకొని అందలి రాజుల నందరను నిర్జించెను. అట్లు జయించిన భూమీశుల సహాయంతో విక్రమించి మేరుశైల శిఖరమును సమీపించెను. అది చూచినా దేవేంద్రుడు తన బలాలను సమకూర్చుకొని రాజధాని అమరావతి రక్షణకై తగిన ఏర్పాట్లు గావించి, ఇరావత గజాన్ని అధిరోహించి రాక్షసుని పైకి వెడలెను. దేవపతి ననుసరించి యితర దిక్పాలకులు సైతము తమ సైన్యాలతో వాహనారూఢులై బయలుదేరిరి. ఇంద్రుని నాయకత్వంలో రథ గజ తురగాదులతో కూడిన దేవసైన్యం వివిధాయుధాలతో పురోగమించెను. ముందు భాగాన ద్వాదశాదిత్యులు వెనుక రుద్రులు. మధ్యభాగంలో అష్టవసువులు విశ్వేదేవతలు సాధ్యులు మరుత్తులు అశ్వినులు యక్షవిధ్యాధరాదులందరూ తమ తమ వాహనాల మీద బయలుదేరిరి.
నారదుడు
13 - రుద్రాదీనాం వదస్వేహ వాహనానిచ సర్వశః ।
ఏకైకస్యాపి ధర్మజ్ఞ పరం కౌతూహలం మమ ॥
నారదుడు
మహర్షే ! ఏకాదశ రుద్రులు తదితరులూ ఏ ఏ వాహనాలపై వచ్చిరో వివరంగా వినాలని కుతూహలంగా ఉంది.
పులస్త్యుడు
14 - శృణుష్వ కథయిష్యామి సర్వేషామపి నారద ।
వాహనాని సమాసేన ఏకైకస్యాను పూర్వశః ॥
15 – రుద్రహ స్తతలోత్పన్నో మహావీర్యో మహాజవః ।
శ్వేతవర్ణో గజపతి ర్దేవరాజస్య వాహనమ్ ॥
16 - రుద్రోరుసంభవో భీమః కృష్ణ వర్ణో మనోజవః ।
పౌండ్రకో నామ మహిషో ధర్మరాజస్య నారద ॥
17 - రుద్రకర్ణమలోద్భూతః శ్యామో జలధిసంజ్ఞకః ।
శిసుమారో దివ్యగతిర్ వాహనం వరుణస్య చ ॥
18 - రౌద్రః శకటచక్రాక్షః శైలాకారో నరోత్తమః ।
అంబికాపాదసంభూతో వాహనం ధనదస్యతు ॥
19 - ఏకాదశానాం రుద్రాణాం వాహనాని మహామునే ।
గంధర్వాశ్చ మహావీర్యా భుజగేంద్రాశ్చ దారుణాః ॥ ।
శ్వేతాని సౌరభేయాణి వృషాణ్యుగ్రజవానిచ ॥
20 - రథం చoద్రమస శ్చార్ధసహస్రం హంసవాహనమ్ ।
హరయో రథవాహాశ్చ ఆదిత్యా మునిసత్తమ ॥
21 – కుoజరస్థాశ్చ వసవో యక్షాశ్చ నరవాహనాః ।
కిన్నరా భుజగారూఢా హయారూఢౌ తథాశ్వినౌ ॥
22 - సారంగాధిష్ఠితా బ్రహ్మన్ మరుతో ఘోరదర్శనాః ।
శుకారూఢాశ్చ కవయో గంధర్వాశ్చ పదాతినః ॥
23 - ఆరుహ్య వాహనాన్యేవం స్వానిస్వాన్యమరోత్తమాః ।
సంక్షహ్యనిర్యయుర్ హృష్టా యుద్ధాయ సుమహౌజసః ॥
పులస్త్యుడు
నారదా! అంతా వివరంగా చెబుతాను; వినుము. రుద్రుని అరచేతి నుండి పుట్టి అపూర్వ జవసత్వాలు గలిగిన శ్వేతగజం ఐరావతం. ఇంద్రుని వాహనం. రుద్రుని తొడల నుండి పుట్టిన నల్లని భయంకరాకృతితో మనో వేగంతో పయనించే పౌండ్రకమనే మహిషం యముని వాహనం. రుద్రుని కర్ణమలం (గుమిలి) నుంచి పుట్టి చక్కని గమనం కలిగి జలధి అనే పేరు గల నల్లని శిశుమారం (మొసలి వంటిది) వరుణ వాహనం. అంబికాదేవి చరణాల నుండి ఉద్భవించి బండి చక్రాలంతటి కండ్లతో భయంకరమైన శైలాకారం గల నరోత్తముడు కుబేరుని వాహనం. గంధర్వులు మహాశక్తివంతులగు పన్నగులు, సురభి (కామధేనువు) పుత్రులగు శ్వేత వృషభ రాజాదులు ఏకాదశ రుద్రుల వాహనాలు. మునిశ్రేష్టా! చంద్రుని రథాన్ని ఐదు వందల హంసలు, ఆదిత్యుల రథాలను ఉత్తమాశ్వాలు లాగుతున్నవి. వసువులు ఏనుగుల మీద యక్షులు నరుల మీద స్వారీ చేస్తున్నారు. కిన్నరులు భుజంగాలను, అశ్వినులు హయాలను, భయంకరులైన మరుత్తులు లేళ్ళను తమ వాహనాలుగా చేసుకున్నారు. భ్రుగువులు చిలుకలపై బయలుదేరగా గంధర్వులు పాదచారులై నడిచారు. గొప్ప తేజస్సు గల అమరులు తమకు తగిన వాహనాల నధిరోహించి మహోత్సాహంతో బయలుదేరారు.
నారదుడు
24 - గదితాని సురాదీనాం వాహనాని త్వయామునే ।
దైత్యానాం వాహనాన్యేవం యథావద్ వక్తుమర్హసి ॥
నారదుడు
మహామునీ ! దేవతల వాహనాలను వివరించారు. యిక దైత్యుల వాహనాలను గూడ వివరించండి.
పులస్త్యుడు
25 - శృణుష్వ దానవాదీనాo వాహనాని ద్విజోత్తమ ।
కథయిష్యామి తత్త్వేన యథావచ్చ్రోతు మర్హసి ॥
26 - అంధకస్య రథో దివ్యో యుక్తః పరమవాజిభిః ।
కృష్ణ వర్ణైః సహస్రారస్ త్రినల్వపరిమాణవాన్ ॥
27 - ప్రహ్లాదస్య రథోదివ్యశ్చంద్రవర్ణై ర్హయోత్తమైః ।
ఊహ్యమాన స్తథాష్టాభిః శ్వేతరుక్మమయః శుభః ॥
28 - విరోచనస్య చ గజః కుజంభస్య తురంగమః ।
జంభస్య తు రథో దివ్యో హయైః కాంచనసన్నిభైః ॥
29 - శంకుకర్ణస్య తురగో హయగ్రీవస్య కుంజరః ।
రథో మయస్య విఖ్యాతో దుందుభేశ్చ మహోరగః ।
శంబరస్య విమానోభూదయఃశంకో ర్మృగాధిపః ॥
30 - బలవృత్రౌచ బలినౌ గదా ముస్ల ధారిణౌ ।
పద్భ్యాం దైవతసైన్యాని అభిద్రవితు ముద్యతౌ ॥
31 - తతో రణోభూత్ తుములః సంకులో తిభయంకరః ।
రాజసా సంవృతో లోకః పింగవర్ణేన నారద ॥
32 - నాఙ్ఞాసీచ్చ పితా పుత్రం నపుత్రః పితరం యథా ।
స్వానేవాన్యే నిజఘ్నుర్వై పరా నన్యేచ సువ్రత ॥
33 - అభిద్రుతో మహావేగో రథోపరి రథస్తథా ।
గజో మత్తగజేంద్రంచ సాదీ సాదిన మభ్యగాత్ ॥
34 - పదాతిరపి సంక్రుద్ధః పదాతిన మథోల్బణమ్ ।
పరస్పరంతు ప్రత్యఘ్న న్నన్యోన్యజయ కాంక్షిణః ॥
35 - తతస్తు సంకులేతస్మిన్ యుద్ధే దైవాసురే మునే ।
ప్రావర్తత నదీ ఘోరా శమయంతి రణాద్రజః ॥
36 - శోణితోదా రథావర్తా యోధసంఘట్టవాహినీ ।
గజకుంభమహాకూర్మా శరమీనా దురత్యయా ॥
37 - తీక్ష్ణాగ్రప్రాసమకరా మహాసిగ్రాహవాహినీ ।
అంత్రశైవాలసంకీర్ణా పతాకాఫేన మాలినీ ॥
38 - గృధ్రకంకమహా హంసా శ్యేనచక్రాహ్వమండితా ।
వనవాయస కాదంబా గోమాయుశ్వాపదాకులా ॥
39 - పిశాచముసంకీర్ణా దుస్తరా ప్రాకృతై ర్జనైః ।
రథప్లవైః సంతరంతః శూరాస్తాం ప్రజగాహిరే ॥
40 - ఆగుల్ఫా దవమజ్జంతః సూదయంతః పరస్పరమ్ ।
సముత్తరంతో వేగేన యోధా జయధనేప్సవః ॥
41 - తతస్త రౌద్రే సురదైత్య సాదనే మహాహవే భీరుభయంకరేథ ।
రక్షాంసి యక్షాశ్చ సుసంప్రహృష్టాః పిశాచయూథా స్త్వభిరేమిరేచ ॥
42 - పిబంత్యసృగ్గాఢతరం భటానా మాలింగ్య మాంసానిచ భక్షయంతి ।
వసాం విలుంపంతిచ విస్ఫురంతి గర్జంత్యథాన్యోన్య మథోవయాంసి ॥
43 - ముంచంతి ఫేత్కారరవాన్ శివాశ్చ క్రందంతి యోధా భువి వేదనార్తాః ।
శస్త్రప్రతప్తా నిపతంతి చాన్యే యుద్ధం శ్మశాన ప్రతిమం బభూవ ॥
44 - తస్మిన్ శివాఘోరరవే ప్రవృత్తే సురాసురాణాం సుభయంకరే హ ।
యుద్ధం బభౌ ప్రాణప్రణో ప్రవిద్ధం ధ్వంద్వేతిశస్త్రక్షగాతో దురోదరః ॥
పులస్త్యుడు
విప్రోత్తమా! దానవుల వాహనాలేవో వినండి. చెబుతున్నా. అంధకుని దివ్య రథం 1200 మూరల పరిమాణం గలిగి వేయి ఆకులు గల చక్రాలతో నల్లని ఉత్తమాశ్వాలతో నొప్పి యున్నది. ప్రహ్లాదుడెక్కిన రథం, బంగారపు కాంతితో చంద్రునితో సమానమైన తెల్లని కాంతులు వేలార్చే ఎనిమిది ఉత్తమాశ్వాలు పూన్చబడి వెలుగుతోంది. బంగారపు కాంతితో చంద్రునితో సమానమైన తెల్లని కాంతులు వెలార్చే ఎనిమిది ఉత్తమాశ్వాలు పూన్చబడి వెలుగుతోంది. విరోచనుడేనుగెక్కెను. కుజంభుడుతురగారూఢుతు. జంభుడు కాంచన శోభతో వెలిగే గుర్రాలు కట్టిన రథస్థుడు. శంకు కర్ణుడు గుర్రం మీద; హయగ్రీవుడు ఏనుగు మీదనెక్కారు. మయుడు ఉత్తమ రథాన్నీ దుందుభి మహొరగాన్నీ అధిరోహించారు. శంబరుడు విమానం మీద శంకుడు సింహం మీద కూర్చున్నారు. గద, ముసలం ధరించి మహాబలశాలురైన బలుడు వృతుడు పాదచారులై సురసైన్యాన్ని ఎదుర్కునేందుకు విజృంభించారు. నారదా! అప్పుడు జరిగిన భయంకరతుములలో యుద్ధములో రేగిన దుమ్ము ధూళితో భూమ్యాకాశాలు కప్పబడినాయి. ఆరజసాంధకారంలో కనులు కనిపించక తండ్రి కొడుకును, కొడుకు తండ్రిని గుర్తింపలేక పోవడంతో కొందరు వీరులు తమ వారినే సంహరింపసాగిరి. మరికొందరు శత్రువుల దునుమాడిరి. రథాలొకదానికొకటి ప్రచండమైన వేగంతో వెంబడించినవి. ఏనుగులు, ఏనుగులను, అశ్వికులాశ్వికులను, పదాతులు పదాతులను వెంటాడి పరస్పరం జయకాంక్షతో నొకరినొకరు మర్దింపసాగిరి. మునే! ఆ విధంగా జరిగిన దేవాసుర సంగ్రామంలో చెలరేగిన దూళిమేఘాలను శమింప చేస్తూ ఒక భయంకరమైన నది ప్రవహించింది. అందులో నీటికి బదులు రక్త ప్రవాహం, సుడిగుండాలకు బదులు రథ చక్రాలు, వెల్లువలకు బదులు మృతకళేబరాలు, తాబేళ్ళకు బదులు బాణాలు, మొసళ్ళ స్థానంలో ప్రసాయుధాలు. ప్రవాహ రూపాన దీర్ఘకరవాలాలు, నాచుకుప్పలకు బదులు వీరుల ప్రేవుల గుట్టలు, తెట్టెలు గట్టిన నురుల స్థానంలో శ్వేత ధ్వజాలు చక్ర, సారసాలకు బదులు భయంకరమైన డేగలు కంక గృధ్రాలు, రోమహర్షకంగా గోచరించాయి! అడవి కాకులు కాదంబ పక్షులుగా, జంబుకాలు మండూకాలుగా , గుంపు గట్టిన పిశాచాలూ డాకినులే నదీ తీరాన తపస్సు చేసే మునులుగా, ఏర్పడి మామూలు జనులకు దాటుటకు వీలు కాకపోయినది. ఆ భయంకరమైన రణనదిని రథాలనే పడవల మీదదాటుటకు ప్రయత్నించిన వీరులు కొందరు అందులోపడి మోకాళ్ళవరకు మునిగిపోగా, విజయలక్ష్మిని వరించ గోరిన మరికొందరు సునాయాసంగా దాట గలిగిరి. దేవ దానవులకు జరిగిన ఆ ఘోర సంగ్రామం, పిరికిపందలకు భయావహమైనది. యక్షరాక్షసులకు సంతోషకరమైనది. పిశాచ సమూహాలు ఆనందంతో గెంతులు వేశాయి. వాయసాలు మృతవీరుల రక్తం కడుపార ఆరగించాయి. మాంస ఖండములు భక్షించాయి. మజ్జా మేదస్సులు గంతులు వేస్తూ కేకలు పెడుతూ తినేశాయి. ఒకవైపు వీరులు బాధతో ఆర్తనాదాలు చేస్తుంటే మరో వైపు నక్కలుత్సాహంతో ఊళలు పెడుతున్నాయి. రణ నిహతులైన వారి శవాలు చెల్లాచెదురుగా నలువైపులపడి ఉన్నాయి. రణభూమి భయంకరమైన శ్మశానంగా మారిపోయింది. యుద్ధానికి ముందుగా దుర్నిమిత్తాలుగా నక్కల అరుపులు కూతలు వినిపించగా, దేవతలు, రాక్షసులు రాబోయే దుష్పరిణామాన్ని తలచుకొని భయకంపితులయ్యారు. వీరగ్రేసరులైన వారు ప్రాణాలనే పణంగా పెట్టి ఆ మారణ జూడంలోనికి దిగారు.
45 - హిరణ్యచక్షుస్తనయోరణేంధకో రథే స్థితో వాజిసహస్రయోజితే ।
మత్తేభపృష్ఠస్థితముగ్రతేజసం సమేయివాన్ దేవపతిం శత క్రతుమ్ ॥
46 - సమాపతంతంమహిషాధిరూఢం యమంప్రతీచ్చద్ బలవాన్ దితీశః ।
ప్రహ్లాదనామాతురగాష్టయుక్తం రథం సమాస్థాయ సముద్యతాస్త్రః ॥
47 - విరోచానశ్చాపి జలేశ్వరంత్వగా జ్జంభ స్తథాగాద్ ధనదం బలాడ్యమ్ ।
వాయుంసమభ్యేత్యచ శంబరోథ మయోహుతాశం యుయుధే మునీంద్ర ॥
48 - అన్యేహయగ్రీవముఖా మహాబలా దితే న్తనూజాదను పుంగవాశ్చ ।
సురాన్ హుతాశార్కవశూరగేశ్వరాన్ ద్వంద్వంసమాసాద్య మహాబలాన్వితాః ॥
49 - గర్జంత్యథాన్యోన్య ముపేత్యయుద్ధే చాపానికర్షంత్యతివేగితాశ్చ ।
ముంచంతినారాచగణాన్ సహస్రశః ఆగచ్చ హేతిష్ఠసి కింబ్రువంతః ॥
50 - శరస్తు తీక్ష్ణైరతితాపయంతః శస్త్రైరమోఘై రభితాడయంతః ।
మందాకినీ వేగానిభావహంతీం ప్రవర్తయంతోభయదాంనదీంచ ॥
51 - త్రైలోక్యమాకాంక్షిభిరుగ్రవేగైః సురాసురైర్నారదసంప్రయుద్దే ।
పిశాచరక్షోగణపుష్టివర్ధనీ ముత్తర్తుమిచ్చద్భి రాసృగ్నదీబభౌ ॥
52 - వాద్యంతి తూర్యాణి సురాసురాణాం పశ్యంతి ఖస్థా మునిసిద్ధసంఘాః ।
నయంతి తానప్సరసాం గణాగ్ర్యా హతారణే యే_భిముఖాస్తు శూరాః ॥
వేయి గుర్రాలు పూన్చిన రథం మీద నెక్కిహిరణ్యాక్ష పుత్రుడు అంధకుడు, మదించి ఏనుగుపైనున్న మహా తేజస్వి దేవేంద్రుని పైకి లంఘించెను. ఎనిమిది అశ్వాలు కట్టిన రథం మీద కూర్చొని మహా బలశాలి యగు దైత్యపతి ప్రహ్లాదుడు, మహిషాదిరూఢుడై మీదకు వచ్చుచున్న యముని ఎదుర్కొనెను. మహర్షే! అంతట విరోచనుడు వరుణుని, బలశాలి యగు కుబేరుని జంభుడు, శంబరుడు వాయుదేవుని, మయుడు అగ్నిని ఎదుర్కొని యుద్ధము చేసిరి. హయముఖుడు మొదలయిన యితర దైత్య దానవవీరులు, మహాబలశాలులగు సూర్యాగ్ని వసూరగేంద్రులతో ద్వంద్వయుద్ధానికి తల పడ్డారు.”ఊరక నిలుచుంటివేమి? యుద్ధానికి రమ్మ” ని ఒకరినొకరు రెచ్చగొడుతూ, గర్జిస్తూ, ధనస్సులు ఎక్కుపెడుతూ ఒకరిపైనొకరు వేల సంఖ్యలో బాణాలు వదల సాగారు. తీక్ష్ణములైన బాణ పరంపరలతో ఒకరినొకరు నొవ్వజేస్తూ గురి తప్పని శస్త్రాస్త్రాలతో దేహాలు చీల్చుకుంటూ, నా వీరులు మందాకినీ లాంటి రక్తస్రవంతిని ప్రవహింపజేశారు. ఆ నెత్తుటి నది రక్షో పిశాచాలకు సుష్ఠుగా విందు చేసింది. త్రైలోక్య విజిగీషులయిన దేవదానవ వీరులా తరంగిణి నుత్తరించుటకు పోటీపడసాగారు. ఆ సమయాన ఆకాశంలో నిలబడి మునులు సిద్ధులు దుందుభులు మ్రోగిస్తూ ఆ భీకర సమరాన్ని వీక్షించగా అప్సరసాంగనలు శత్రుల కెడురొడ్డి యుద్ధంలో నిహతులైన వీరాగ్రేసరులకు స్వాగతాలు పలుకసాగారు.
అధ్యాయము 9 complete
Summary of chapter 9 of the Vāmana Mahā Purana is as follows:
Following the reign of Prahlāda, the eternal struggle between the forces of light and darkness resumes as new asura commanders seek to usurp the celestial thrones of Swarga. Led by powerful demon generals like Andhaka and his fierce lieutenants, the asura armies launch a massive assault on the heavenly realms, overwhelming the devas with formidable mystical weaponry and dark sorcery. The devas, suffering heavy losses and driven from their heavenly abodes, seek refuge at the feet of the Supreme Divine, realizing that worldly power without righteousness is transient and bound for destruction.